చంద్రబాబు బాణం- కాంగ్రెస్‌ ఖతం?

`హుజూరాబాద్‌ హుళక్కి- మునుగోడు మునుక్కి.

`పైకి కాంగీయం- లోన కాషాయం?

` ఆ కషాయం నచ్చని కాంగ్రెస్‌ సీనియర్‌ జనం.

`కోడలి అవతారంలో కొత్త కోణం!

`తనకు తానుగానే ఒప్పుకున్న రేవంత్‌.

`ఇళ్లు తగలబెట్టేందుకే ఈ కోడలు అవతారం?

`రేవంత్‌ను కాంగ్రెస్‌ కు పంపి బీజేపీతో చంద్రబాబు రాజకీయం.

`కాంగ్రెస్‌ను ఖాళీ చేయడంలో రేవంత్‌ నిమగ్నం?

`తెలంగాణలో తెలుగుదేశం శ్రేణులతో కాంగ్రెస్‌ నింపాలి.

`సీనియర్లను బయటకు తరమాలి.

`గుండుగుత్తగా తెలంగాణ చంద్రబాబు చేతిలో పెట్టాలి.

`గురు దక్షిణ కోసం తెలంగాణ తాకట్టు!

`చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ ప్రజలకు రేవంత్‌ కనికట్టు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తనను తాను నమ్ముకోవడం ఆత్మాభిమానం… తనమీద తనకు వుండే అచెంచలమైన విశ్వాసం నమ్మకం. తను మరొకరిని నమ్ముకొని ప్రయాణం చేయడం ఎక్కడో దాగి వున్న స్వార్ధం. మొత్తంగా ఇతరుల కోసం త్యాగం చేస్తూ, పైకి ఆత్మాభిమానాన్ని ప్రదిర్శించడం తనను తాను మోసం చేసుకోవడం.తన కోసం తానున నిచ్చెన తయారు చేసుకోవడం. తనను నమ్మేవారిని గందరగోళంలోకి నేట్టేయడం… ఏది నిజమో! ఏది అబద్దమో!! తన వాళ్లు కూడా అర్ధం చేసుకోలేని తనాన్ని సృష్టించడం. ఇవన్నీ ఒక వ్యక్తిలో కనిపిస్తే మాత్రం అది పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌ స్వభావం అని అంటున్నారు. ఆయనను చూస్తే రాజకీయశక్తిగా కనిపిస్తారు. కాని వెనకాల చంద్రబాబు కనిపిస్తాడు. అది నిజమే అని రేవంత్‌ కూడా ఒప్పుకుంటాడు. ఆనక ఈ మధ్యే మరోసారి చంద్రబాబు వదిలిన బాణాన్ని అని ఒప్పుకున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన నాడు రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలకు,నేడు చెబుతున్న మాటలకు పొంతన లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడుచుకుపెట్టుకుపోతున్న సమయంలో రేవంత్‌ రాజకీయ భవిష్యత్తును లెక్కలేసుకున్నాడు. అయితే తెలుగుదేశంలోని సీనియర్లు రేవంత్‌ను దూరం పెడుతూ వచ్చారు. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ అధ్యక్షుడు కావాలనుకున్నాడు. కాని చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నాడు. ఎల్‌. రమణనను అధ్యక్షుడిని చేశారు. దాంతో ఇక తెలుగుదేశంలో వుండడం కన్నా, మరో పార్టీని చూసుకుంటేనే బెటర్‌ అని రేవంత్‌ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నాడు. అయితే తన రాజీనామాను అమరావతికి వెళ్లి, చంద్రబాబుకు ఇచ్చి, ఇంత కాలం తనకు సమున్నతమైన స్దానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడేమో తనకు తానుగానే పార్టీని వదిలిపెట్టానని చెప్పాడు. ఇప్పుడు తాను కాంగ్రెస్‌లోకి చంద్రబాబు పంపిస్తేనే వచ్చానంటున్నాడు. ఇందులో మొదటిది తప్పని తనే ఒప్పుకున్నట్లైంది. తన నిజస్వరూపం మరోసారి రేవంత్‌ నిరూపించినట్లైంది. అందుకే కాంగ్రెస్‌ సీనియర్లు రేవంత్‌ను నమ్మకుండా దూరంపెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్నామ్నాయంగానే తెలుగుదేశంపార్టీ నిర్మాణంజరిగింది. అలాంటి కాంగ్రెస్‌ పార్టీలోకి తెలుగుదేశం నుంచి వచ్చి, పార్టీపగ్గాలు చేపట్టేంతదాకా తెచ్చుకున్న రేవంత్‌ ఏదైనా చేయగలగడు…అనే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు రేవంత్‌ను దూరం పెడుతున్నారు. . ఇల్లు పీకి పందిరేయగల సమర్ధుడు రేవంత్‌ అన్నది మొదటినుంచి సీనియర్లు చెబుతున్నదే. అదే నిజమౌతుందా? అని సీనియర్లు మధనపడుతున్నారు. స్వయంగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డే తాజాగా చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు బాగా అర్ధం చేసుకుంటే రేవంత్‌ రెడ్డి రాజకీయంలో కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే ఎత్తుగడే కనిపిస్తోంది.

మునుగోడులో ఈ మధ్య జరిగిన ప్రచార సభలో తెలుగుదేశం శ్రేణుల గురించి ప్రస్తావించారు. మరి తెలుగుదేశం పార్టీనుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరి, పిపిసి అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి తెలుగుదేశం శ్రేణులను ఎందుకు ఆహ్వానించడం లేదు. వారిని కాంగ్రెస్‌లోకి ఎందుకు కలుపుకోవడం లేదు. తెలంగాణలో ఇంకా తెలుగుదేశం బతికి బట్టకట్టేందుకు పరోక్షంగా రేవంతే పనిచేస్తున్నాడా? అన్న అనుమానం రాకమానదు. అయితే రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి పంపిన చంద్రబాబు, తాను మాత్రం బిజేపి వైపు చూస్తున్నాడు. బిజేపికి స్నేహ హస్తం చాస్తున్నాడు. మరి రేపటి రోజున తెలంగాణ కాంగ్రెస్‌ను బిజేపిలో కలిపే పూచీ నాది అని ఏమైనా చంద్రబాబుకు మాటిచ్చి రేవంత్‌ రాజకీయం చేస్తున్నాడా? అన్నది కూడా చర్చనీయాంశమైపోయింది. రేవంత్‌ పిపిసి అధ్యక్షుడు అయ్యే దాకా ఎంతో ఓపికను ప్రదర్శించాడు. ఒక రకంగాచెప్పాలంటే నవ్వుతూ నటించాడు. ఇప్పుడు తనలోని మరో నటుడిని చూపిస్తున్నాడు. పిపిసి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాడే కోవర్టులు వెళ్లిపోవచ్చు…అంటూ కొత్తరాగం అందుకున్నాడు. పరోక్షంగా సీనియర్లకు చుకలంటించాడు. వారికి హెచ్చరిక జారీ చేశాడు. అప్పటి నుంచి సీనియర్లకు, రేవంత్‌కు మధ్య టామ్‌ అండ్‌ జెర్రీలొల్లి సాగుతూనే వుంది. గిల్లికజ్జాలు ఆగడం లేదు. అడుగడుడునా రేవంత్‌ తననోటికి పనిచెప్పడం, సీనియర్లు విభేధించడం…చూస్తూ వున్నదే.ఆ మధ్య బిజేపి నాయకుడు ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో చూద్దాం?అన్నాడు. అయితే రాజేందర్‌ టిఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత కలిసి చర్చలు జరిపిన అతి కొద్ది మంది నాయకుల్లో రేవంత్‌ రెడ్డి వున్నారు. వాళ్లు బిజేపిలో వున్నారు. ఒక్క రేవంత్‌ మాత్రమే కాంగ్రెస్‌లో వున్నాడు. అందుకే రేవంత్‌ పైకి కాంగ్రెస్‌ నాయుకుడిగా కనిపించినా లోన తన రాజకీయ గురువు చంద్రబాబు అడుగు జాడలే కనిపిస్తున్నాయంటున్నారు. ఏదో ఒకనాడు మొత్తం కాంగ్రెస్‌ను ఖాళీ చేయడమో! లేక కాంగ్రెస్‌లో తెలుగుదేశం నాయకులతో నింపి, మరో షిండే అవతారమెత్తడమో చేసే అవకాశంలేకపోలేదంటున్నారు. ఎందుకంటే ఒక వేళ తెలంగానలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా, రేవంత్‌ రెడ్డే సిఎం కావాలని లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్‌ పార్టీ. అధికారంలో వున్నంత కాలం ఆపార్టీ రాజకీయాలు ఓ పట్టాన ఎవరికీ అర్ధం కావు. అసలే సీనియర్లంటే రేవంత్‌ రెడ్డికి అసలే గిట్టడం లేదు. 

ఆయనంటే సీనియర్లకు నిమిషం పడడం లేదు. ఆయన ముందు కూర్చోవడానికి సీనియర్లకు మింగుడు పడడం లేదు. ఇదిలా వుంటే గతం నుంచి ఓసారి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు పదే పదే కాంగ్రెస్‌లో దుమారాన్ని రేపుతూనే వున్నాయి. కలతలు సృష్టిస్తూనే వున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో రేవంత్‌ ఒక స్టాండ్‌ తీసుకుంటే బాగుండేది. కాని మళ్లీ యూటర్న్‌ తీసుకున్నాడు. అయినా వెంకటరెడ్డి మార్పు రాలేదు. రాదని కూడా వెంకటరెడ్డే స్పష్టం చేశారు. మునుగోడు ప్రచారానికి రానని తెగేసిచెప్పాడు. ఆ సమయంలోనే ఐపిఎస్‌ ఆఫీసర్లు, హోంగార్డుల లెక్క బెడిసికొట్టింది. మునుగోడు ఉప ఎన్నికల కమిటిని ప్రకటించి, మధుయాష్కిని లెక్క చేయకపోవడంతో అక్కడా తేడా కొట్టింది. తాజాగా రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గంలో మాట్లాడుతూ ఎవరికైనా నేనే టిక్కెట్లు ఇవ్వాలి..నేను సంతకం పెడితే తప్ప టిక్కెట్లు రావన్నారు. ఇది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తగిలినట్లుంది. వెంటనే ఆయన ఆ మాటలపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఇలా కాంగ్రెస్‌లో సీనియర్లందరినీ కెలుక్కుంటూ, పార్టీని ఖాళీ చేసి, తర్వాత తన అనుచరులతో, తెలుగుదేశం నేతలతో నింపాలన్నదే రేవంత్‌ లక్ష్యం. అప్పుడే రేవంత్‌ ఆడిరది ఆట, పాడిరదిపాట అవుతుంది. సీనియర్లు అడ్డు వున్నంత కాలం తాను ఏం చేయాలన్నా ముందర కాళ్లకు బంధం పడుతూనే వుంటుంది. తాజాగా మునుగోడు విషయంలోనూ రేవంత్‌ లెక్కలు చెల్లలేదు. ఆయన టిక్కెట్టు ఇవ్వాలనుకున్నది ఒకరికి. టిక్కెట్టు ఇచ్చింది మరొకరికి. అయినా చెల్లని ఓటు ఎటు పడితేంది? అన్నట్లు మరోసారి నాకు టిక్కెట్టు ఇవ్వాలని పాల్వాయి స్రవంతి కోరకుండా చేశాడు. ఇలా కాంగ్రెస్‌లో తన రాజకీయమే గెలిచే పరిస్దితి తీసుకొస్తున్నాడు. తర్వాత తన ఎత్తుగడలు అమలు చేసేందుకు కాపు కాచుకొని కూర్చుంటున్నాడు. ఒక వేళ తన నాయకత్వంలో అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, క్రెడిట్‌ అంతా నాదే అనొచ్చు…లేకుంటే తన వర్గాన్ని తీసుకొని బిజేపిలో చేరొచ్చు. తన గురువు చంద్రబాబుకు గురు దక్షిణ తీర్చుకోవడం కోసం చీల్చిన ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ రాజకీయాలను క్రియాశీలం చేయొచ్చు. మళ్లీ తెలుగుదేశం పార్టీకి నీరు పోయొచ్చు…ఇదీ రేవంత్‌ రెడ్డి అనుసరిస్తున్న తీరు తెన్నులు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ముగుగోడులో మునిగితే ఓ లెక్క…ఓడిపోతే ఓ లెక్క…ఇప్పటికైతే ఎప్పుడో కాంగ్రెస్‌ లెక్క తప్పించాడు…మునుగోడును మరో హుజూరాబాద్‌ను చేసి, కాంగ్రెస్‌ను ఖతం పట్టిస్తాడని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!