
లక్షేట్టిపేట్ ( మంచిర్యాల) నేటిధాత్రి :
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ వేడుకలను తెలుగు విభాగంలో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన తెలుగు కవయిత్రి సుబ్బయమ్మ మాట్లాడుతూ…. అమ్మ భాష ఎంతో గొప్పదని మన భావాలను మాతృ భాషలో మాత్రమే స్పష్టంగా వ్యక్తం చేస్తామన్నారు. మనకు చిన్నతనం నుంచి మాధుర్యాన్ని పంచిన మాతృ భాషను మరువకూడదన్నారు. అదే విధంగా ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ తమ తమ మాతృ భాషను మాట్లాడుతూ భాష పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పిల్లలకు మాతృ భాష గొప్పతనం తెలియజేయాలని కోరారు. ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషలను నేర్చుకోవాలన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను మరువకూడదన్నారు. అంతకుముందు తెలుగు విభాగం అధిపతి డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ విద్యార్థులకు మాతృ భాష విలువలు తెలియజేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు పలు రాష్ట్రాల భాషలలో తమ నాటికలను, నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ సురేష్, డాక్టర్ హరీష్,అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.