గుడి ఏది?…ఆ ఒక్కటీ అడక్కు!?

 


అయితే నాకేమిస్తావో ఒక్క ముక్కలో చెప్పు?
ఇచ్చేవాడు లటుక్కు… మింగే వాడు మిటుక్కు…?
అంతేనా…గుంటూరు శివ స్వామి?
కరి మింగిన వెలగ పండు జూబ్లిహిల్స్‌ కొండ
ఊర్లు పంచుకున్నంత పని చేశారు?
గుట్ట మాయం, గుడికి శఠగోపం?
గుంటూరు స్వామి చెప్పిన నిజాలు?
వాటాలు పంచుకున్నట్లేనా.. నాయకులు?
స్వామి చెప్పినవన్నీ ఒప్పుకున్నట్లేనా?
దేవుడినే మాయం చేసిన ఘనులు?
నిలదీయాల్సిన వాళ్లు నిలువు దోపిడీ చేస్తున్నారు?
దేవుడికే నీడ లేకుండా చేస్తున్నారు?
అడిగిన వాళ్లకు, అడినట్టు కోట్లుకు కోట్లు పప్పు బెల్లం పంచినట్లు ఎందుకు పంచుతున్నట్లు? అసలు ప్రసాదం అందిరికీ అందకుండా గుడి కట్టరెందుకు? ఇంత మందికి ఇన్నేసి కోట్లు ఇచ్చే బదులు వాటితోనే గుడిని గొప్పగా కట్టొచ్చు..కదా???.యాదాద్రిలో కొత్త గుడిలా చరిత్రలో నిలిచిపోతుంది కదా!! అమ్మమ్మా…ఆ…ఒక్కటీ అడక్కు…నిజంగా అక్కడ గుడి కడితే మాకు మిగిలేది ప్రసాదమే…అందులో కారం కారం మిరియాలే…!! చేదు…చేదు ఆవాలే!!! ఈ మాత్రం తెలియకుండానే వ్యాపారం చేస్తున్నామా? అడిగినోళ్లు అడిగినట్లు ఎంత పంచుకుంటూ పోయినా సరే…మిగిలేది ఎంత లేదన్నా…ఇంకో పది కొండలు కొనేంత? అమ్మా…గుడి కట్టేయడమే…అదే చేయాలనకుంటే ఇంతెందకు? ఈ తంతంతా ఎందుకు? అందుకే అడగిన వారికి అడిగినట్లు సమర్పించుకుంటూనే వుంటాం…కాని … ఆ గుడి అంటూ…ఆ ఒక్కటీ అడక్కు….!!! గుడి అంటూ మళ్లో సారి మాట్లాడొద్దు…సరేనా…అంతే కదా…! ఇదే కదా..!! జరుగుతోంది గుంటూరు స్వామి!!! ఇక్కడ అడిగేవారు అడుగుతున్నారా? లేక ఇచ్చేవారు ఇచ్చేస్తున్నారా? అన్న దాని గుట్టు కూడా పూర్తిగా గుంటూరు శివ స్వామి మాత్రమే విప్పాలి. సర్వసంగ పరిత్యాగులైన వాళ్లే అసలు బండారం బైట పెట్టాలి. అక్కడ గుడి వుంటుందా? వుండదా? తేల్చి చెప్పాలి. ఈ దాగుడు మూతలకు తెరదించాలి…!
కరిమింగిన వెలగ పండులో కనీసం పెంకైనా మిగులుతుందేమో! కాని గుట్ట మింగిన వాళ్లు ఇసుక రాయి ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారు. సహకరించిన వాళ్లకు వాటాలకు వాటాలు పంచుకుంటూ పోతూ, నోర్లు మూయిస్తున్నారు? ఇసుక రేణువు కూడా ఆనవాలు కనిపించకుండా. చదును చేసి, దేవుణ్ణి ఖాళీ చేయించి, నివాసాలకు అనువు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ కొండ, గుడి అని చెప్పుకునేందుకు కూడా వీలు లేకుండా ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నారు. కొబ్బరి కాయ కొడితే చాలు పక్కన పడి వుంటాడు…అని దేవుణ్ణి ఓ మూలన పడేశారు. ఇంకే ముంది? నోరెత్తినవాళ్లందరినీ నోట్ల కట్టలతో మూయించారట? కోట్లకు కోట్లు విసిరేస్తున్నారట. ఈ మాట స్పష్టంగా గుంటూరు స్వామి, మీడియా సమక్షంలో, భక్తుల సందోహంలో చెప్పిన మాట. ఆయన ఏ ఒక్కరినీ వదల్లేదు. ఎవరినీ విడిచిపెట్టలేదు. ఎవరు ఎంతెంత తీసుకున్నారన్నదానిని పూస గుచ్చినట్లు చెప్పారు. మాటల తూటాలు పేల్చారు. అయినా ఏ ఒక్కరి నుంచి స్పందన లేదు? మేం తీసుకోలేదని చెప్పిన వాళ్లు లేరు? అంటే మౌనం అర్ధాంగికారమా? పూర్ణాంగీకారమా? అన్నది తెలియాల్సివుంది. కోట్లు జేబులో వచ్చి చేరాయి…దేవుడు పేరుతో జేబులు నిండాయి. గుడి ఎటు పోతే మాకేంటి? గుట్ట మాయమైతే మాకేంటి? దేవుడు ఎటు వెళ్లిపోతే మాకేంటి అనుకుంటున్నారా?
అసలేం జరిగింది?: రెడ్‌ఫోర్ట్‌ అక్భర్‌ పేరిట ఓ వెంచర్‌ ఏర్పాటుకు రాత్రికి రాత్రికి జూబ్లిహిల్స్‌లోని ఓ గుట్ట చుట్టూ రేకులు కట్టేశారు. ఒక రకంగా చెప్పాంటే గుట్టను చుట్టేశారు. దాని మీద రాతలు రాసేశారు. ఆ స్ధలం విస్తీర్ణం కూడా రాసేశారు. అక్కడో గుడి వుంది. ఆ గుడిలో అభయాంజనేయ స్వామి దేవుడున్నాడు. కాని స్వామిని భక్తులకు కనిపించకుండా చేశారు. భక్తులు వెళ్లేందుకు దారి లేకుండా చేసేశారు. పూజలు బంద్‌ చేశారు. భక్తులకు దూరం చేశారు. ఈ ముచ్చట, ఆనోట ఈనోట జనానికి తెలిసిపోయింది. ఒక్కొక్కరు వస్తూ వెళ్తున్నారు. ఇదేం చోద్యమనుకుంటున్నారు. ఈ వార్త భజరంగల్‌, విశ్వహిందూ పరిషత్‌ వాళ్లకు సమాచారం అందింది. ఇంకేముంది హడావుడి మొదలైంది. బిజేపి శ్రేణులు కదిలారు. ఏదో పెద్ద కథే జరిగేలా వుందని అందరూ అనుకున్నారు. ఆ సంస్ధ ప్రతినిధులు కూడా అనుకున్నారు. ఆ స్ధలం చుట్టూ ఏర్పాటు చేసిన రేకులు మాయం చేశారు. రాతలు తుడిపేశారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలు పెట్టారు. అధికారులు రంగంలోకి దిగారు. అందరూ కలిసి సంస్ధ యాజమాన్యానికి కొమ్ము కాశారు. మళ్లీ రేకులతో చుట్టేశారు. గట్టు మీద వున్న గుడి కూల్చేశారు. దేవుణ్ని కిందికి దించేశారు. అయినా ఎవరూ కదల్లేదు. దేవుడికే దిక్కులేకుండాపోతే మేం చేస్తామని సామాన్యులు అనుకున్నా, బిజేపి మాత్రం మేమున్నామన్నట్లు నమ్మించింది. నటించింది. ఇదీ అక్కడి ప్రజలు అంటున్నమాట. చాలా కాలం పాటు ఏ వివాదం లేకుండా పోయింది. ఆదాయ మార్గం కరువైందనుకున్న సందర్భంలో గుట్ట, గుడి బిజేపి నేతలకు ఓ వరంగా మారింది. స్ధానిక ప్రజా ప్రతినిధులకు ఓ కల్ప వృక్షంగా కనిపించింది. ఆఖరుకు బిజేపిలోని కొందరు పెద్దలకు, ఆరెస్సెస్‌, భజరంగదళ్‌ ముఖ్యులకు కూడా వరంగా మారింది. ఈ మాట గుంటూరు స్వామి చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎవరైతే గుడి విషయంలో ముడుపులు తీసుకున్నారో వాళ్లను ఆయా హిందూ సంస్ధలైన, బిజేపి అనుబంధ సంస్ధలనుంచి తొలగించాలని కూడా గంటూరు స్వామి డిమాండ్‌ చేశారు. అయినా ఉలుకూ , పలుకూ లేదు. కారణం ఏమైవుంటుంది? అన్నదానిపై ఎవరూ స్పందించకపోవడమంటేనే తేలు కుట్టిన దొంగలు కావడం కాదా?
దేవుడినే మాయం చేసి, వాటాలు పంచుకొని?: ఇది నిజంగా ఏ నీతో నాయకులే చెప్పాలి. అది ప్రభుత్వ స్థలమని అందిరికీ తెలుసు. ఆ స్ధలం ఎలాంటి ఆక్షన్‌ లేకుండా, రెడ్‌ ఫోర్డ్‌ అక్భర్‌ అనే సంస్ధకు అత్తసొమ్ము, అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వం కట్టబెట్టిందని తెలుసు. అసలే ప్రభుత్వం భూముల అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న ఈ తరుణంలో హైదరాబాద్‌కు గుండెకాయా లాంటి ప్రదేశంలో అంత స్ధలం అప్పనంగా ఎలా అప్పగించారు? అందుకు ఎవరెవరికి ఎంత ముట్టాయన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి?. ఎక్కడికక్కడ భూములు వేలం వేసి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతుంటే, ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ సిఎస్‌ స్పెషల్‌ జీవో ఇచ్చి, ఎలా దారాధత్తం చేశారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులంతా ఎలా సహకరించారు? అసలు అక్కడ గుడే లేదని ఓ తహసిల్ధార్‌ ఎలా రిపోర్టు ఇస్తాడు? అదే తహసిల్ధార్‌ ప్రభుత్వ స్థలమన్న బోర్డు గతంలో ఎందుకు పెట్టించాడు? అక్కడ గుడే లేకపోతే, 2016లో కార్పోరేటర్‌ విజయారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఎలా పిర్యాధు చేశారు? అన్నదానిపై ఎవరు క్లారిటీ ఇవ్వాలి.
ఇన్ని ఆరోపణలు ఎక్కడా వినలేదు?: ఏ గుడి అయినా ఎక్కడైనా గతంలో ప్రైవేటు స్థలాలలో వెలిసినట్లు చరిత్రలో లేదు. అలాగే జూబ్లిహిల్స్‌లోని ఈ అభయాంజనేయ స్వామి గుడి కూడా ప్రభుత్వ స్థలంలోనే వుంది. పూజలు కూడా జరుగుతున్నాయి. ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి గుట్ట మొత్తం ఓ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ప్రభుత్వం, గుడిని కూల్చేసుకోండి అని ఏమైనా ప్రత్యేక అనుమతినిచ్చిందా? స్ధానిక ఎమ్మెల్యే గుడి కూల్చేందుకు ఎలా సహకరిస్తాడు? ఏకంగా గుడి కోసం నాలా కబ్జా చేసిన బిల్డర్ల్‌కు సహకరిస్తూ, ఎలా కొబ్బరి కాయ కొడతారు? నాలా స్థలంలో గుడి నిర్మాణం సాధ్యమయ్యేదేనా? అలా నిర్మాణం చేయొచ్చా? గుడి ప్రాంతాన్ని కాదని, కొండను తవ్వి, గుడిని, దేవుణ్ణి దూరంగా విరిరేస్తామంటే ఎమ్మెల్యే ఎలా ఒప్పుకున్నారు? గుంటూరు స్వామి చెప్పినట్లు అందరకీ వాటాలు వెళ్లాయన్నట్లు…ఇక్కడ కూడా జరిగిందా? అన్న అనుమానం ప్రజలకు రాకమానదు. స్ధానిక ప్రజా ప్రతినిధిగా వున్న ఎమ్మెల్యే ఎవరికి రక్షణ కోసం వున్నట్లు? ఎవరికి కొమ్ము కాస్తున్నట్లు? ఇదే వరుసలో అసలు గుడిని అడ్డుకోవాల్సిన స్ధానిక కార్పోరేటర్‌ కు కూడా తులాభారం అందినట్లు చెబుతున్నారు. నిజమేనా? అన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇక దీనిపై మొదటినుంచి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్న మరో బిజేపి నాయకుడు పల్లపు గోవర్ధన్‌కు ఓ హోటల్‌లో కోటి రూపాయుల తీసుకున్నట్టు గుంటూరు స్వామి వెల్లడిరచారు. ఇది నిజమేనా? ఇక మాజీ ఎమ్మెల్యే బిజేపి నాయకుడికి కూడా పెద్దఎత్తున ముడుపులు అందాయన్న మాట వినిపిస్తోంది? నిజమేనా? భజరంగ్‌ దళ్‌, ఆరెస్సెస్‌ నాయకులకు కూడా అమ్యామ్యాలు అందుకున్నట్లు గుంటూరు స్వామి వాళ్లు ఆ సంస్థలకే చీడ పురుగులు అన్నంత మాట మాట్లాడారు? అయినా వారిపై ఆయా సంస్ధలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముడుపుల విషయంలో నోరెందుకు తెరవడం లేదు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిపై వుంది.
బిల్డర్లు ఎంతో చాకచక్యంగా?: సమస్యను పక్క దోవ పట్టించడంతో ఆ సంస్ధ ప్రతినిధులు ఆడుతున్న చదరంగం ఎంతో చాకచక్యమైంది. వారు వేస్తున్న పాచికులు ఎంతో చాణక్యమైనవి. అసలు వివాదం పైకి కనిపించకుండా, నోరు తెరిచిన వారందరినీ నోట్లకట్టలతో కొనేసి, తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు, ఒకరి మీద, మరొకరిని ఉసిగొల్పి, అసలు రాజకీయం నెరిపి, గుట్టను ఇప్పటికే సగం తరలించారు. ఇంకా వున్నా…చూస్తున్నంతలో అంతా మాయమౌతుంది. టిఆర్‌ఎస్‌ రాలేదు. బిజేపి వచ్చినా…ఇక గుంటూరు స్వామి అసలేం జరిగిందో చెప్పేశాడు. కాంగ్రెస్‌ ఎప్పుడొచ్చిందో…ఎప్పుడు మౌనాన్ని ఆశ్రయించిందో తెలిసిందే…చిన్న చిన్న విషయాలను పెద్దది చేసే రేవంత్‌ రెడ్డి, ఇంత పెద్ద విషయాన్ని వందల కోట్ల ప్రాపర్టీ కొల్లగొడుతుంటే కళ్లు మూసుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడంలేదు. కొన్నవారిని గురించి వివరాలు వెల్లడిరచలేదు. ఇక పిపిసి అధికార ప్రతినిధిగా దాసోసు శ్రవన్‌ ఒక్కసారి మీడియా సమావేశం… ఆ తర్వాత దాన్ని నిద్రలోనే మర్చిపోవడం చేసేశారు…ఒక రకంగా అందరూ మర్చిపొమ్మని చెప్పేశారు…! ఇదీ సంగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!