`పోలీసు ఉద్యోగం పవిత్రమైంది.
`పాపపు పనులు చేసేవారిని పట్టుకునేది.
`అన్యాయాలు చేసేవారిని అడ్డుకునేది…
`నేరస్ధులును గుర్తించి సమాజాన్ని రక్షించేది
`ప్రజలకు శాంతి భద్రతలు అందించేంది
`అందరిలో బతుకు భరోసా కల్పించేంది
`ఆపదలో వున్నవారిని కాపాడేది…
`అనుక్షణం ప్రజల యోగక్షేమాల కోసం పనిచేసేది…
`ప్రాణాలకు తెగించి, ఇతరుల ప్రాణాలు రక్షించేది…
`ధైర్య సాహసాలతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేది…
`కీచకులైన వారిని ఉపేక్షిస్తే వ్యవస్ధకే మచ్చది?
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రజల తొలి ప్రభుత్వం పోలీస్ స్టేషన్. ప్రజలకు ధైర్యం పోలీస్ స్టేషన్. ప్రజలకు భరోసా పోలీస్ స్టేషన్. ఇదీ ప్రజల్లో పోలీసు వ్యవస్ధ మీద వుండే నమ్మకం. విశ్వాసం. పోలీసు వ్యవస్ధ వుండడంతోనే ప్రజలు ప్రశాంతంగా వుండగలుగుతున్నారు. హాయిగా జీవిస్తున్నారు. అందుకే పోలీసు వ్యవస్ధ ఎంతో బాధ్యతాయుతమైంది. పోలీసు ఉద్యోగం ఎంతో పవిత్రమైంది. ఖాకీ దుస్తుల మాటున కరుకైన కాఠిణ్యం కనిపించినా, కనికరమనే హృదయం దాగి వుండాలి. పాపపు పనులు చేసేవారిని పట్టుకోవాలి. తప్పులు జరక్కుండా చూసుకోవాలి. సమాజానికి రక్షణగా వుండాలి. సమాజంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తొక్కే తొలి గడప పోలీస్ స్టేషన్. అక్కడ మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. పేద, ధనిక అనే బేధం లేకుండా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్ధది. అన్యాయాలు చేసేవారిని అడ్డుకునేది. నేరస్ధులను గుర్తించేది. వారికి శిక్షలు పడేలా చేసేది. సమాజంలో తప్పులు జరక్కుండా చూసేది. మరి అలాంటి వ్యవస్ధలో కొందరు చేస్తున్న తప్పుల మూలంగా మొత్తం వ్యవస్ధమీదే నమ్మకం పోయేలా చేసుకుంటున్నారు. ఎంతో పవిత్రమైన ఉద్యగం చేస్తూ అపవిత్రమైన పనులు సాగిస్తున్నవారు కూడా వున్నారంటూ నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. ఎక్కడో అక్కడ పోలీసుల వ్యవస్ధలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా వుంటున్నారు. ఇది కూడా నిత్య కృత్యమైపోతోంది. అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు. అమాయకులపై పోలీసుల ప్రతాపం అంటూ ఎప్పుడూ వింటున్నదే…ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, మరోపార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయడం తెలిసిందే..ఇవన్నీ ఉద్యోగ నిర్వహణలో కొన్ని జరిగేవే అనుకోవడం కూడా పరిపాటే…అలాంటిది ఆడ పిల్లల మీద అత్యాచారాలు చేయడం, మహిళలన బెదిరించడం, మోసం చేయడం కూడా అలవాటు చేసుకుంటున్నారా? గతంలో సినిమాల్లో తప్ప పోలీసులు లాకప్‌లో మహిళలను ఇబ్బందులు పెట్టినట్లుగాని, అత్యా చారాలు చేసినట్లు బైట విన్నవి లేవు. కాని తాజాగా కొందరు పోలీసు అధికారుల వ్యవహారం మొత్తం పోలీసు వ్యవస్ధమీదే అనుమానపు చూపులు చూసేదాకా వచ్చింది. సమాజం మొత్తం ఓ ఇద్దరు పోలీసులు చేసిన నీచాన్ని ఎండగుడూతూ పోలీసు వ్యవస్ధను వేలెత్తి చూపిస్తోంది.
పోలీసు అధికారులంటే ఉన్నత విద్యావంతులు
సమాజం చదువున్న వారు. సమాజాన్ని అర్ధం చేసుకున్నవారు. మంచి చెడులు తెలిసిన విజ్జులు. వెలుగు చీకట్లను విశ్లేషణ చేయగలిగేవారు. ఎంతో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని అంకిత భావంతో ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తుంటారు. శిక్షణ అనంతరం తన కర్తవ్య నిర్వహణపై ప్రతిజ్ఞ చేసి వచ్చేవారు. ప్రజలకు మేలు చేస్తానని, అమాయకులకు అండగా నిలుస్తామని, అన్ని వర్గాలకు ఒకే రకమైన న్యాయం అందిలే చేస్తానని శపథం చేసి వస్తారు. రాజ్యాంగం గురించి తెలిసి వాళ్లు, చట్టాల మీద పూర్తి స్ధాయి అవగాహన కల్గినవాళ్లు పోలీసు అధికారులు. పోలీసు ఉద్యోగం చేయాలని కోరుకునేవారిలో కూడా కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు కూడా వుంటాయని ఒక పరిశోధనలో తేలింది. తమకు ఆ వృత్తి పట్ల మమకారం, ప్రజలకు సేవ చేసే అవకాశం, సమాజంలో గౌరవమైన జీవితం ఇలా కొన్ని విషయాల్లో కలలు గని పోలీసు ఉద్యోగం ఎంచుకుంటారని అంటారు. మరి అంతటి ఉన్నత స్ధాయి ఆలోచనలు వుండేవారిలో భరితెగింపు ఎలా ఆవాహిస్తోంది? తప్పులు చేయడం మానవ సహజం అన్నది పోలీసు శాఖలోనూ వుంటుందా? నీచపు పనులు చేయడం మొదలు పెట్టాక, అవివేకులకు, ఎంతో వివేవకవంతులైన విజ్ఞులకు తేడా లేదా? తప్పులు చేసేవారిని పట్టుకొని వారికి ఎలాంటి శిక్షలు వేయాలో కూడా కేసులు నమోదు చేసే పోలీసులు అవే తప్పులు చేయడంలో అర్ధమేమిటి? ఏ తప్పు చేసినా డిపార్టుమెంటు కాపాడుతుందన్న నమ్మకమా? లేక నన్నెవరూ ఏమీ చేయలేరన్న అహాంకారమా? ఖాకీ దుస్తులు వేసుకున్నదే తమకు అన్యాయాలు, అక్రమాలు చేయడానికి లైసెన్సు దొరికినట్లు ఊహించుకోవడమా? ఓ వైపు నీచపు పనులు మరోవైపు, వందల కోట్ల రూపాయలు ఆర్జన అనేది ఒక సిఐకి ఎలా సాధ్యం? ఎంత మందిని ఇబ్బందులకు గురి చేస్తే అన్ని కోట్లు సంపాదిస్తారు…ఓ వైపు అక్రమ సంపాదనలు, మరో వైపు మహిళలపై అత్యాచారాలు చేయడానికి కూడా కొందరు ఎందుకు వెనకాడడం లేదు?
ప్రపంచంలో ఏ దేశంలోనైనా మహిళలకు రక్షణ అన్నది ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం
అందుకు పోలీసు వ్యవస్ధ, న్యాయ వ్యవస్ధలకు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు కూడా వున్నాయి. మహిళా రక్షణ కోసం అనేక చట్టాలున్నాయి. ఆకతాయిగా అమ్మాయిలను టీజ్ చేసినా అది నేరమే…అలాంటిది ఒక సిఐ మహిళ కణతపై సర్వీసు రివాల్వర్ పెట్టి మరీ అత్యాచారం చేయడం అంటే కంచే చేను మేసినట్లు కాదా? అందుకేనా ఆ పోలీసు అధికారి ఉద్యోగం చేస్తున్నది? గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు సదరు సిఐ మీద అనేకం వున్నాయని కూడా అంటున్నారు. సమాజంలో అత్యాచారానికి పాల్పడిన వారిపై అనేక కఠిన చట్టాలు తెచ్చారు. అందుకు ఎవరూ మినహాయింపులు కాదు. గతంలో వరంగల్‌లో ఓ అమ్మాయి మీద ఆసిడ్ దాడి చేసిన యువకులను ఎన్ కౌంటర్ చేశారు. ఈ మధ్య దిశ కేసులోనూ అదే జరిగింది. మరి అలాంటిది ఓ పోలీసు అధికారి పూర్తి సృహతోనే నేరం చేశాడు. కక్ష్య పెంచుకొని ఇబ్బందులకు గురి చేశాడు. భర్తను కేసుల్లో ఇరికిస్తానని బెరించాడు? ఆమె చెప్పినట్లు వినకపోతే బ్రోతల్ కేసు నమోదుచేస్తానని బెరించారని చెబుతున్న తర్వాత కూడా విచారణ పేరుతో కేవలం సస్పెన్షన్ చేయడం అంటే అర్ధమేమిటన్న ప్రశ్న సమాజం నుంచి ఉత్పన్నమౌతోంది. వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలి? అలా చేయకపోవడం మూలంగానే పోలీసుల్లో కూడా విచ్చలవిడి తనం పెరుగుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆ మధ్య అమాయకులైన వారిపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారిని కమీషనర్ కార్యాలయానికి అటాచ్ చేసిన గంటలోనే మరో పోస్టింగ్ ఇచ్చారన్న ఆరోపణలు వుండనే వున్నాయి. ఇక మల్కాజిగిరి స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఓ మహిళను ప్రేమించి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవమే నేరం. అయినా ప్రేమించిన అమ్మాయిని ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు..నా కోసమే వుండాలన్నంత వికృతానికి దిగజారుతుంటే ఎవరు బాధ్యులు. అంటే ఖాకీ దుస్తుల మాటన ఏమైనా చేయొచ్చన్నంత విపరీతం వారిలో ఎందుకు పెరిగిపోతోంది. సమాజానికి రక్షణ కల్పించాల్సిన వ్యవస్ధలోనే ఇన్ని లోపాలు వుంటే, ప్రజల రక్షణ బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తిస్తారన్న భరోసా ఎలా వస్తుంది? ప్రెండ్లీ పోలీసింగ్ అంటే అర్ధం ఇదేనా? అని ప్రశ్నింస్తున్న సమాజానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వమా? పోలీసు వ్యవస్ధా!!