ఖమ్మం కారుదే : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

– బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయమే

-జనమంతా చెప్పుకుంటున్న మాటే.

`అవకాశవాదులకు బిఆర్‌ఎస్‌ లో చోటు లేదంటున్న ‘‘రవిచంద్ర తో ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు’’ ముఖాముఖి.

-ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ తప్ప మరో పార్టీకి తావులేదు.

-ఆ పార్టీలకు లీడర్‌ లేడు.

-క్యాడర్‌ అసలే లేదు.

-పొంగులేటి పొంకనాలు ప్రచారం కోసమే?

-ప్రజల గుండెల్లో వున్నది కేసిఆరే

-ఉమ్మడి ఖమ్మం కళకళలాడుతుందంటే కారణం కేసిఆరే.

-తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు?

-పొంగులేటిని నమ్మకనే ఏ పార్టీ ముందుకు రావడం లేదు?

-అసలు పొంగులేటి జనం నాయకుడు కాదు?

-జనంలో వున్నది లేదు?

-బలం, బలగం వున్నది ఒక్క బిఆర్‌ఎస్‌ కే

-పొంగులేటి రాజకీయం అడవికాచిన వెన్నెలే?

-పొంగులేటి తొందరపాటు తప్పటడుగు?

-పొంగులేటి మాటలు నమ్మి ఆయన వెంట నడిచేవారే లేరు?

-బిఆర్‌ఎస్‌ కు ఎదురులేదు

– కారుకు తిరుగులేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

ఏమీ చేయని వాళ్లకు ఏతులెక్కువ..చెల్లని కాసుకు గీతలెక్కువ అని సామెత. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్‌ర్‌రెడ్డి రాజకీయం అచ్చంగా అలాగే వుంది. నిజానికి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ చేరడం మూలంగా ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లో పలుకుబడి పెరిగింది. కాని ఆయన బిఆర్‌ఎస్‌కు చేసిందేమీ లేదు? ఉద్దరించింది అంతకన్నా లేదు. ఏడాది కాలంగా సాగిస్తున్న బ్లాక్‌ మొయిల్‌ రాజకీయాలకు కొదువలేదు. రెండేళ్ల నుంచి నన్ను గుర్తించండి? నన్ను చూసుకోండి? నాకేదైనా పదవి ఇవ్వండన్న రాజకీయాలు తప్ప, నేపు పార్టీకి సేవ చేస్తాను. పార్టీకి బలం చేకూర్చే పనులు చేస్తాను. సామాజిక సేవ చేస్తానని చెప్పింది లేదు. చేసింది లేదు. పదవుల గోల తప్ప మరొకటి లేదు. కాని గొప్పలు చెప్పుకోవడంలో పొంగులేటి ఆరితేరాడు. రెండేళ్లుగా గోడ మీది పిల్లి వాటం రాజకీయాలు చేస్తూ, అదిగో పులి, ఇదిగో తోక అన్నట్లు నేను వెళ్తున్నా…నేను వెళ్తున్నా.. సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సభల మీద సభలు పెట్టి సాధించిందేమిటి? ఇంత కాలమైనా ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు. ఏ పార్టీలో చేరితే ఏం లాభం చేకూరుతుందన్న ఆలోచన తప్ప, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఏ పార్టీ అయినా ఒక్కటే. కాని పొంగులేటికి పదవులమీద ఆశ తప్ప, పరపతి మీద యావ తప్ప మరొకటి లేదు. అందుకే బిఆర్‌ఎస్‌లోవున్నా, ఎక్కడున్నా రాజకీయం శూన్యమే. అసలే చేతకాని స్ధితిలో వున్న ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బిజేపిలకు బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరు వచ్చిన కళ్లకు అద్దుకోవడానికి, దొడ్లో కట్టేసుకోవడానికి తప్ప మరెందుకు ఉపయోగం వుండదు. అందులో చేరేవారికి ప్రాధాన్యత వుండదు. అసలు విలువే వుండదు. కాకపోతే ఎట్లాడు ఎదురుచూసే ప్రతిపక్షాలున్నాయన్న ఆలోచనతో తలకు మించిన భారమైనా మోస్తానని లేనిపోనివి పొంగులేటి చెబుతుండడంతో ప్రతిపక్షాలు నమ్ముతున్నట్లు నటిస్తున్నాయి. ఎందుకంటే పొంగులేటి బేరసారాలు అందరూ చూస్తున్నదే. అటు బిజేపితో మంతనాలు, ఇటు కాంగ్రెస్‌తో సంప్రదింపులు చేస్తూ రెంటికి చెడ్డ రేవడి కావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జోస్యం చెబుతున్నారు. పొంగులేటి అత్యాశ రాజకీయాలను ఎండగడుతున్నారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో వద్దిరాజు మాట్లాడుతూ పొంగులేటి రాజకీయం అంతా కపట నాటమని అన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

ఖమ్మం జిల్లాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్ధానాలు గెలిచేది బిఆర్‌స్సే.

ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చి, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రజలు మరోసారి బ్రహ్మరధం పట్టనున్నారు. ప్రతిపక్ష నియోజకవర్గాలను సైతం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, దళిత బంధు లాంటి పధకాన్ని ఉమ్మడి ఖమ్మంలో అమలు చేశారు. ఖమ్మం జిల్లా విషయంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి ఎంతో సానుకూత చూపిస్తూ వస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. ఖమ్మం జిల్లాలో అటు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం, ఇటు చెరువుల మరమ్మత్తులతో జలసిరులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. అలాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. ఖమ్మం ప్రగతికి బాటలు పడిరది. తెలంగాణలో ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఖమ్మంకు ప్రత్యేక స్ధానమిస్తూ, ప్రోత్సహిస్తున్నారు. అభివృద్ధికి సహకరిస్తున్నారు. గతంలో ఖమ్మం ప్రజల ఆలోచనలకు, ఇప్పటి ఆలోచనలకు చాల తేడా వుందని, తమ కళ్ల ముందు వున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఎంతో మురిపిపోతున్నారు. కళ్లముందు ఇంత అభివృద్ధిని పెట్టుకొని, కేవలం తన రాజకీయ పబ్బం గడవడం లేదన్న అక్కసుతోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అభివృద్ది చేస్తున్న బిఆర్‌ఎస్‌ను వదిలి, ప్రజల కోసం కాకుండా, తన స్వప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయాలు చేసే పొంగులేటి వంటి వారికి ప్రజల ఆదరణ ఎప్పుడూ వుండదు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ఉద్యమాలకు పురిటి గడ్డ. అది మర్చిపోయి వ్యక్తిగత స్వార్ధం కోసం రాజకీయాలను వాడుకునే పొంగులేటి వంటి వారిని ప్రజలు ఆదరించే సమస్యే లేదు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో ఆ పార్టీలకు లీడర్‌ షిప్‌ లేదు. క్యాడర్‌ లేదు. ఆకాశంలో మబ్బును చూసి ముంత ఒలకబోసుకోవడం తప్ప, ఆ పార్టీకి పనిచేసే వాళ్లు లేరు. ఎందుకుంటే ఆ పార్టీలు ప్రజల్లో లేవు. ఆ పార్టీలతో ప్రజలకు అవసరం కూడా లేదు. మాకు ఇది కావాలని ప్రజలు ఏది కోరుకోక ముందే అన్నీ సమకూర్చుతున్న పాలకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకే ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. వయసు మళ్లిన వారిని ఆసరా పించన్‌ ఇచ్చి ఆదుకుంటున్నాడు. వారి జీవితంలో సంతోషాలు నింపుతున్నాడు. ఒకప్పుడు వయసు మళ్లిన వారు , పెద్దలు తమ కొడుకుల మీద ఆధారపడి రూపాయికి కూడా ఇబ్బందులు పడేవారు. కనీసం వారు కడుపు నిండా తినడానికి కూడా కన్నీళ్లు పెట్టుకునేవారు. కాని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పించన్‌తో హాయిగా జీవిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా వున్నారు. రైతులు రైతు బంధు అందుకుంటున్నారు. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు వాడుకుంటున్నారు. చెరువులు నిండడంతో పెరిగిన భూగర్భ జలాలతో పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. దేశానికి అన్నం పెడుతున్నారు. పండిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజవరకు కొని వారికి ఆదాయం సమకూర్చుతున్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ప్రజల సంక్షేమం కోసం , తెలంగాణ సాధన ద్వారానే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన మూలంగానే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కాని కాళేశ్వరం వంటి వినూత్నమైన, విప్లవాత్మకమైన ప్రాజెక్టును మొదలుపెట్టి, యజ్ఞంలా పూర్తి చేశారు. ఎండిన తెలంగాణలో పన్నీరు చిలికించారు. చుక్క నీరు కానరాని భూములు సస్యశ్యామలం చేశాడు. ఒకనాడు తొండలు గుడ్డు పెట్టడానికికూడా తెలంగాణ భూములు పనికి రావని హేళన చేసిన వారి కళ్ల కుళ్లుకునేలా చేశాడు. ప్రజా శ్రేయస్సు కాంక్షించే నాయకుడంటే కేసిఆర్‌లా వుండాలని కొనియాడేలా చేస్తున్నాడు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశమంతా కావాలని ప్రజలు కోరుకునేలా చేశాడు. బిఆర్‌ఎస్‌తో దేశమంతా వికాసవంతమైన సమాజ నిర్మాణం కోసం భయలుదేరాడు. దేశానికి కొత్త దిశ, దశ చూపించేందుకు కేసిఆర్‌ మరో ఉద్యమం మొదలుపెట్టారు. రైతును రాజును చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. రైతురాజ్యం స్ధాపించే పయనంలో వున్నారు. దేశంలో కొత్త రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించనున్నాడు. అదీ కేసిఆర్‌ అంటే.. కాని కేంద్రంలో వున్న బిజేపి బియ్యం కొనుగోలులో కొర్రీలు పెడుతోంది. అలాంటి బిజేపి రాష్ట్రంలో ఎదో ఉద్దరిస్తుందని ప్రజలు ఆశపడడం లేదు. కాకపోతే రాజకీయ స్వార్ధ పరమైన నాయకులు పొంగులేటి లాంటి వారు ఆశ్రయం పొందడానికి మాత్రం పనికొస్తాయి. అంతే కాని ప్రతిపక్షాలు ప్రజాసేవ చేయడానికి మాత్రంపనికిరాదు. ఇది సాక్ష్యాత్తు ప్రజలు చెబుతున్నమాట. అందుకే తెలంగాణలో వచ్చేది మళ్లీ బిఆర్‌ఎస్సే…ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!