కొసరు నేతలే కోవర్టులా!

 

`అసలు కన్నా కొసరుకే విలువెక్కువ…

`ఉన్నట్టుండి బిజేపిలో గందరగోళానికి కారణం ఏమిటి?

`అద్దెకొచ్చిన నేతలే అతలాకుతలం చేస్తున్నారా!

`తనకెదురు లేకుండా చేసుకునేందుకే బండి సంజయ్‌ రాజకీయం చేస్తున్నాడా?

`ఇంతకీ కోవర్టులెవరు? ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు!

`ఎవరికి వారు మధనపడితే సమస్య తీరుతుందా?

` బండి సంజయ్‌ ని కొనసాగిస్తారా?

` కేంద్ర మంత్రిని చేస్తారా?

`బండి కొనసాగితే కొసరు నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా?

`కొసరు నేతలకు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని నిర్ణయానికొచ్చారా?

` కొత్తగా చేరిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటే బిజేపి మళ్ళీ మొదటికే రాదా?

`బిజేపిని గట్టెక్కించే నాయకులున్నారా?

` కనిపించే నలుగురు నాయకుల్లోనే సఖ్యత లేదు!

` తెలంగాణలో బిజేపిలో అసంతృప్తి ఆగదు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్ర బిజేపిలో అసలు నేతలెవరు? కొసరు నేతలెవరు? అసలు కోవర్టు నేతలెవరు? కోవర్టులను ప్రోత్సాహిస్తున్నదెవరు? కోవర్టుల గురించి ప్రస్తావిస్తున్నదెవరు? చర్చకు పెట్డిందెవరు? దానిని విపరీతంగా ప్రచారం చేస్తున్నదెవరు? బిజేపిని ముంచుతున్నదెవరు? తమకు తాము మునుగుతున్నదెవరు? పార్టీకి దిక్కులేకుండా చేస్తున్నదెవరు? ఎవరి వారు మేమే గొప్ప ప్రచారం చేసుకుంటున్నదెవరు? బండి సంజయ్‌ ని ఈసారి మార్చుతున్నారని ప్రచారం మొదలుపెట్టిందెవరు? బండి సంజయ్‌ ని కేంద్ర మంత్రిని చేస్తారని చెప్పిందెవరు? ఎన్నికల దాకా నేనే వుంటా! అని బండి ఎలా ఎవరితో చెప్పారు? నాకు అధ్యక పదవి కావాలని అడుగుతుందెవరు? అడిగి చిన్న బుచ్చుకున్నదెవరు? ఇటీవల పార్టీకి దూరంగా వుంటున్నదెవరు? అసమ్మతి రాగం ఆలపిస్తున్నదెరు? ఆ చిచ్చు రాజేసిందెవరు? నాకిచ్చిన మాట ప్రకారం అధ్యక్షుడిని చేయండని అడిగిన నేత ఎవరు? ఏం …పీకారని ఆయన అధ్యక్ష పదవి కావాలని కోరుతున్నాడని అసలైన బిజేపి నేతలతో అన్నదెవరు? నా వెంట నలభైమంది ఎమ్మెల్యేలున్నారని చెప్పిందెవరు? ఒక్కరిని కూడా తీసుకురాలేకపోయావ్‌? అని మొహం మీదే అడిగిన నేత ఎవరు? నీతో వచ్చే వాళ్లు కార్పోరేటర్లుగా కూడా గెలుస్తారా? అని సందేహం వ్యక్తం చేసిన జాతీయ నేత ఎవరు? వాళ్ల రాజకీయ అవసరాల కోసం వచ్చే వాళ్లే తప్ప, పార్టీ కోసం వచ్చే వాళ్లేరి అని ఎందుకు విసుక్కున్నాడు? మీరు కూడా ఊగిసలాడి, కేంద్రంలో అధికారంలో వుండడం వల్ల చేరిందే కాని, అభిమానంతో కాదని ముఖం మీదే అన్నదెవరిని? కోవర్టులు, కోవర్టులు అని పదే, పదే పలవరించడం ఎందుకు? పేర్లు చెప్పలేనప్పుడు చెప్పుడెందుకు? అంత ధైర్యం లేనప్పుడు పార్టీ కోసం ఏం త్యాగం చేస్తావని నిలదీసిందెవరు? ఈ వివాదాలన్నింటికీ కేంద్ర బిందువెవరు? అసలు సూత్రదారులెవరు? పాత్ర దారులెవరు? ఎవరిని పారద్రోలేందుకు ఇదంతా చేస్తున్నదెవరు? ఏ చెట్టు మీద వాలాలని దీనికి ఆజ్యం పోస్తున్నదెవరు? అసలు నేతలతో బిజేపి బలపడిరదెంత? వలస నేతల మూలంగా పెరిగిన బలమెంత? బండి సంజయ్‌ ఇలాకాలో బిజేపి ఎదురులేకుండా ఎదిగిందా? హుజూరాబాద్‌ లో బిజేపిలో హుషారు నిండిరదెంత? దుబ్బాకలో ఎదురులేకుండా బిజేపి పెరిగిందా? బిజేపి ఈ మాత్రం పుంజుకోవడానికి కారణం బండి సంజయా? వలస నేతలు తెచ్చిన ఊపా? వాళ్లు వెళ్లిపోతే బిజేపిని కాపాడుకునే సత్తా బండికి వుందా? అసలు నేతలను నమ్మి జనం కలిసొస్తారా? బిజేపిని నెత్తిన పెట్టుకుంటారా? కోవర్టు నేతలు సాధిస్తున్న విజమేమిటి? అసలు నేతలు కాపాడుతున్నదేమిటి? ఒకటే పార్టీలో అసలు, కొసరు అన్న తేడాలేమిటి? ఎన్ని రోజులైనా వలస నేతలకు అంతంత ప్రాధాన్యతేనా? వారికి బాధ్యతలు అప్పగించేదేమైనా వుందా? వారిని గుర్తించే అవకాశం వుందా? వలస నేతలు కొత్త దారి ఎంచుకుంటే బిజేపి పేక మేడౌతుందా? కేంద్ర పెద్దలు పెట్టుకున్న అవకాశాలు అడియాసలౌతాయా? కొత్తగా చేరిన నేతలకు అసలే గుర్తింపు లేకుండా పోతోందా? వారిని పట్టించుకోకపోవడం వల్లనే దాసోజు శ్రవణ్‌, స్వామి గౌడ్‌ లాంటి వాళ్లు సొంత గూటికి చేరారా? అసలు నేతల వ్యవహారశైలి వల్లనే వాళ్లు వెళ్లిపోయారా? ఇప్పుడు ఈటెల రాజేందర్‌ కు అదే పరిస్థితి తెస్తున్నారా? పొమ్మనలేక ఈటెలకు పొగబెడుతున్నారా? కొత్త కొత్త ఎపిసోడ్లు తెరమీదకు తెచ్చి ఈటెల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా ఈటెల రాజేందర్‌ అసంతృప్తితో వున్నారా? ఈటెలను అసంతృప్తికి గురిచేస్తున్నారా? ఈటెల ఏది చేసినా తప్పు పడుతున్నారా? ఈటెలను ఒంటరి చేసే కుట్ర జరుగుతోందా? ఈటెల రాజేందర్‌ వేరే దారి చూసుకుంటాడన్న ప్రచారం ఎందుకొస్తోంది? ఎవరు మొదలు పెట్టారు? దాని వెనుక వున్నదెవరు? మొత్తంగా బిజేపిని ముందట పడకుండా చేస్తున్నదెవరు? బిజేపిలో బండి సంజయ్‌ కు, ఈటెల రాజేందర్‌ కు పొసగడం లేదన్న దాంట్లో నిజమెంత? ఈటెల మద్దతుదారులు బండికి వ్యతిరేకమా? కోవర్టుల పేరుతో ఈటెల రాజేందర్‌ ఒక వేలు చూపితే, ఆయన వైపు నాలుగు వేళ్లు చూపుతున్నదెవరయ? ఇదే ఇప్పుడు బిజేపిని అయోమయంలో పడేస్తున్న అంశాలు…ఇందుకు అందరికీ కారణాలు తెలుసు! ఎవరు బాధ్యులో తెలుసు!! కానీ అందరూ రాజకీయమే చేస్తున్నారు…బిజేపిని నిండా ముంచే పనిలో పడ్డారు.  

అసలు కన్నా కొసరుకే విలువెక్కువ…

అని ఏ వర్గం విపరీతమైన ప్రచారం చేస్తోందన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మేం ఆ పార్టీలో గండరగండులం…మేం వేరు..మా స్థాయి వేరు…మాకిక్కడ సరైన ప్రాధాన్యత లేదు…అని ఇప్పుడు అనుకోవడం ఎందుకు? ఏదో ఆశించే బిజేపిలో చేరిన నేతలే అందరు? చేరిన నాడు ఎలాంటి షరతులు లేవని చెప్పినా ఎవరూ నమ్మే సంగతులు కాదు…ఏదీ అవసరం లేదనుకున్నప్పుడు రాజకీయంగా పుట్టి పెరిగిన పార్టీలను వదిలేసుడెందుకు? ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? అసంతృప్తులుగా ముద్ర వేసుకోవడం ఎందుకు? ఎంత కాదన్నా బిజేపి కేంద్రంలో అధికారంలో వుంది. ఏ నాయకుడిని బిజేపి భుజ్జగించే పని పెట్టుకోదు…వెళ్తామంటే ఆపేందుకు కూడా ఆలోచించదు…తన దొడ్లో కట్టిపెట్టుకునేందుకు కాదనదు…అలా అని కొత్త నేతలకు అన్ని విషయాలు కూడా బిజేపి వివరించదు…ఎంత నమ్మకంతో వచ్చిన నేతలనైనా అంత తొందరగా ఏ పార్టీ నమ్మదు…అదే బిజేపి కూడా అనుసరించేదే! రాత్రికి రాత్రే కిరీటం పెట్టమంటే బిజేపిలో అసలే సాధ్యం కాదు. అయినా ఆశలు పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ అత్యాశ పడడమే అసలుకే మోసం తెస్తుంది. ఎటూ కాని రాజకీయ సుడిగుండంలోకి నెట్టేయబడుతుంది. 

ఉన్నట్టుండి బిజేపిలో గందరగోళానికి కారణం ఏమిటి? అనేది ఎవరికి ఒక పట్టాన అంతుపట్టడం లేదు.  

ఒక్కసారిగా విజయశాంతి లాంటి వాళ్లు కూడా తెరమీదకు వచ్చారు. కోవర్టుల అంశం మీద స్పందించారు. కానీ ఈటెల చెప్పిన విషయంపై కొంత విభేదించారు. పార్టీ మీద నిజంగా ప్రేమ వున్న వాళ్లు పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లు బైట పెట్టాలని ఈటెలకే విజయశాంతి హితవు పలికారు. ఏదో చీకట్లో రాయి విసిరి నాకేం సంబంధం అనకూడదని సూచించారు. ఒకవేళ కోవర్టుల పేరు ఈటెల రాజేందర్‌ బైట పెడితే పార్టీ వారిని బైటకు పంపే అవకాశం వుందన్నారు. ఎందుకంటే విజయశాంతి లాంటి వాళ్లు రాజకీయంగా ఎలాంటి ఆశలు లేకుండా సేవచేస్తారు. కేవలం తెలంగాణ కోసమే ఉజ్వలమైన సినీ భవిష్యత్తును వదులుకొని, కన్న తల్లి లాంటి ప్రాంతం మీద మమకారం పెంచుకున్నారు. సొంతగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆస్థులు కోల్పోయారు. తెలంగాణ కోసం నిలబడ్డారు. అంతే కాకుండా ఇక సినిమాలు చేయనని చెప్పి అదే మాట మీద నిలబడ్డారు. తెలంగాణ ఇచ్చిందనే విశ్వాసంతో కాంగ్రెస్‌ లో చేరినా, అక్కడ పరిస్థితులు ఆమెను కొనసాగనివ్వలేదు. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఏనాడు బిజేపి మీద అసంతృప్తి వ్యక్తం చేయలేదు. తనకు ప్రాధాన్యత కరువైందనలేదు. పదవుల కోసం పాకులాడలేదు. తన శక్తి మేరకు పార్టీకి సేవ చేస్తూవస్తున్నారు. కోవర్టుల అంశం తెరమీదకు రావడంతో పార్టీకి నష్టం జరగొద్దని సూచిస్తున్నారు. కోవర్టుల నుంచి పార్టీని రక్షించుకోవాలంటున్నారు. 

అద్దెకొచ్చిన నేతలే అతలాకుతలం చేస్తున్నారా! అన్నదే బైట ఎందుకు చెవులు కొరుక్కుంటున్నారు.

తనకెదురు లేకుండా చేసుకునేందుకే బండి సంజయ్‌ రాజకీయం చేస్తున్నాడా? అని కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు. ఇంతకీ కోవర్టులెవరు? ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు! ఈ మధ్య జరుగుతున్న ప్రచారంలో ఈటెల రాజేందర్‌ కోవర్టుల ప్రస్తావన తేవడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈటెల రాజేందర్‌ అన్న మాటలకు, మీడియా తెచ్చిన హైప్‌ కు సంబంధం లేదు. ఎవరికి వారు మధనపడితే సమస్య తీరుతుందా? నిజంగా పార్టీకి నష్టం చేసే కుట్ర ఎవరు చేసినా తప్పే… బండి సంజయ్‌ ని కొనసాగిస్తారా?

 కేంద్ర మంత్రిని చేస్తారా? బండి సంజయ్‌ కి మరో సారి అధ్యక్షుడుగా అవకాశం ఇస్తారా? మార్చితో అతని పదవీ కాలం పూర్తి కానున్నది. ఈ లోపే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా సరిగ్గా పని చేయని కొందరిని పక్కనపెట్టే అవకాశం వుంది. దానికి తోడు త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకత వుంది. గతంలో కూడా ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించారు. ఈసారి తెలంగాణలో పాగా వేయాలని బిజేపి చూస్తోంది. దాంతో తెలంగాణకు మంత్రి వర్గంలో చోటు కల్పించవచ్చు. బండికి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చు. ఈ మధ్య ప్రధాని మోడీ బండి సంజయ్‌ ని పలుమార్లు మెచ్చుకున్న సందర్భాలున్నాయి. అవి మంత్రిని చేసేందుకా లేక అధ్యక్షుడుగా కొనసాగించేందుకా? అన్నది తేలాల్సివుంది. బండి సంజయ్‌ కు మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా వుండడానికే మొగ్గు చూపుతున్నాడట. కాకపోతే బండికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కితే మాత్రం మరొకరికి అధ్యక్షుడు అయ్యే అవకాశం దొరుకుతుంది. బండిని ఎన్నికల దాకా కదిలించొద్దని కేంద్ర పెద్దలు నిర్ణయానికి వస్తే కొనసాస్తారు. అదే జరిగితే బండి అధ్యక్షుడుగా కొనసాగితే కొసరు నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా? అన్నదానిపై కూడా పార్టీలో బాగానే చర్చ జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే కొసరు నేతలకు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చరనే నిర్ణయానికి వచ్చి కొత్త దారి చూసుకుంటారా? అన్న చర్చ కూడా కొనసాగుతోంది. కొత్తగా చేరిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటే బిజేపి మళ్ళీ మొదటికే రాదా? బిజేపిని గట్టెక్కించే నాయకులున్నారా? పైకి కనిపించే నలుగురు నాయకుల్లోనే సరైన సఖ్యత లేదు! తెలంగాణలో బిజేపిలో అసంతృప్తి ఆగదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!