` కష్టాలతో పోరాడలేక కన్నవారికి ,కట్టుకున్న భార్యలకు దూరమైన హోంగార్డులు
` ఆఖరి క్షణాల్లోనూ కొలువునే కలవరిస్తూనే కానరాని లోకాలకు
` ఒకే ఏడాదిలో కుటుంబం నలుగురిని కోల్పోయింది
` అందరూ కరోనా భారిన పడే కాలం చేశారు
` ఇల్లూ, వాకిలి , అర ఎకరం అమ్మినా తీరని అప్పులు
` పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరిన జ్యోతి
` నిలువ నీడలేక ఇద్దరు పిల్లలతో అరిగోస
` కొడుకులు పోయారు…కోడళ్లు మిగిలారు…
` కన్నీటితో కాలం వెల్లదీస్తూ పస్తులతో దోస్తీ
` పిసిపిల్లల జీవితాల కోసం కుమిలిపోతోంది జ్యోతి.
` వాళ్ల భవిష్యత్తుకోసం విగత జీవిగా బతుకీడిస్తోంది
హైదరాబాద్ , నేటిధాత్రి :
పగవాడికి కూడా ఇలాంటి కష్టం రావొద్దని పెద్దలు ఎందుకున్నారో…కొలువులు కోల్పోయిన హోంగార్డులను చూస్తే అర్ధమౌతుంది. ఇక్కడ ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. ఆ కుటుంబాల పరిస్థితి వింటే విలపించుకుండా ఎవరూ వుండలేరు. కన్నీరు కార్చకుండా ఆపుకోలేరు. అంతటి దయనీయమైన గాధలు కొందరివి. సరే బతికున్నవారు ఎన్నటికైనా మా కొలువులు రాకపోతయా? అన్న ఆశతో బతుకుతున్నారు. అందరినీ కలిసి వేడుకుంటున్నారు. నేడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండన్న ఆశల్లోనైనా వాళ్లు ఆకలి చంపుకుంటూ బతుకుతున్నారు. కన్నీళ్లతో దాహం తీర్చుకుంటున్నారు. అలాంటి వారితోపాటు ఆఖరి శ్వాస వరకు కొలువును కలవరించి ప్రాణాలు విడిచిన వారు కూడా వున్నారంటే ఇక ఆ కుటుంబ సభ్యుల బాధలు వర్ణణాతీతం…అలాంటి వారిలో కోదాడకు చెందిన రమేశ్ అనే హోంగార్డు గత ఏడాది కరోనా కాటుకు బలయ్యాడు. అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఆ కుటుంబం వీధినపడిరది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయింది. పోషించే కుటుంబ పెద్ద రమేశ్ కాలం చేశాడు. ఆ కుటుంబానికి భవిష్యత్తు శూన్యమైంది. వారి జీవితాలను నల్లమబ్బు కమ్మేసింది. కాలం కాటేసింది. కానరాని లోకాలకు ఇంటి యజమానికి తీసుకెళ్లింది. వారి బాధ ఎవరు తీర్చుతారు? ఎవరు ఆదుకుంటారు? సానుభూతి చూపినా అయ్యో! అంటారే గాని అంతకు మించి ఏం చేయగలరు. అది కూడా ఒకరోజు,రెండు రోజులు పరామర్శిస్తారు. అంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. ఆ తర్వాత నాలుగుసార్లు ఎదురుబడితే పక్కకు తిరిగిపోతారు. అది వాళ్ల తప్పు కాదు. వ్యవస్ధ అలాగే తయారైంది. ఒకరికి ఎల్లకాలం సేవ చేసేంత స్ధోమత ఐనవారికి కూడా లేకుండాపోయింది. అది కూడా ఒక కారణం. ఇలాంటి పరిస్ధితిని ప్రత్యక్ష్య నరకంగా అనుభవిస్తున్న రమేష్ భార్య తన దీన స్ధితిని నేటిధాత్రితో చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది….ఆమె మాటల్లోనే బతుకంటే ఎంత బరువైందో…ప్రాణమంటే ఎంత నరకమైందో…జీవితం ఎంత దుర్భరంగా వుంటుందో విందాం…ప్రభుత్వం దృష్టికి ఆమె మాటలు వెళ్లి, ఆ కుటుంబంలో వెలుగు నిండాలన్నదే అందరి ఆశ….` జ్యోతి
జీవితం జ్యోతిలా జీవితాంతం వెలుగాలని ఆమె తల్లిదండ్రులు కోరికోరి ఆ పేరు పెట్టుకున్నారు. కాని ఆ వెలుగు మధ్యలోనే ఆరిపోయింది. జీవితం అంధకారమైంది. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, మంగళవాయిద్యాల మధ్య బాగస్వామిని చేసుకున్న భర్త, ప్రమాణం మర్చిపోయాడు. జ్యోతిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. కాలం మాటను కనుమరుగైపోయాడు. పోతూ పోతూ ఇద్దరు పిల్లల్ని కూడా చేతిలో పెట్టి తన రుణం తీరిపోయిందన్నాడు. కారణం ఎవరు? సమాధానం ఎవరు చెప్పాలి? కాలం చెప్పాలా? దేవుడు చెప్పాలా? ఈ సమాజం చెప్పాలా? కొలువిచ్చిన వ్యవస్ధ చెప్పాలా? ఆ జ్యోతి ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిందించాలి? తన జీవితం ఇలా ఎందుకయ్యిందని ఎవరికి మొరపెట్టుకోవాలి? ఓ కుటుంబంలో ఎవరికైనా జ్వరం వస్తేనే అందరూ విలవిలలాడిపోతారు. అలాంటిది మనిషే దూరమైతే…మనుషులే కానరాని లోకాలకు వెళ్లిపోతే ఆ నరకం మాటల్లో వర్ణించలేదనిది. వారి బాధ తీరలేనిది. ఆ ఇంటికి రమేష్ కుటుంబ పోషకుడు. తల్లి, తండ్రి..అన్న, వదిన. పిల్లలు. తన చిన్న కుంటుంబం. హాయిగా కాలం సాగతున్న వేళ కాలానికి కన్నుకుట్టింది. ఉన్న ఫలంగా ఉద్యోగం పోయింది. ఎందుకు పోయిందో అర్ధం కాదు. ఉద్యోగం వచ్చి హోంగార్డు కొలువు వచ్చి ఏడెనమిదేళ్లకు రమేశ్ పెళ్లి చేసుకున్నాడు. జ్యోతి కూడా రమేశ్‌కు కొలువుందని కోటి ఆశలతో పెళ్లి చేసుకున్నది. పెళ్లయిన నాటి నుంచి జీతం చిన్నదైనా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. జ్యోతికాలు బైట పెట్టకుండా పోషించుకున్నాడు. ఉన్నదానిలో సంతృప్తి పడాలని, భవిష్యత్తు బంగారంగా వుంటుందన్న ఆశలు కల్పించాడు. కాని విధి కాటేసింది…కాలం రమ్మని లాక్కెల్లింది. జ్యోతి జీవిత ప్రయాణం చీకటైంది. ఇదే పెద్ద నరకమనుకుంటే, అదే ఏడాది అత్త, మామ, హోంగార్డు రమేశ్ సోదరుడు కూడా చనిపోయారు. ఇదేంటి కాలం పగబట్టినట్టే కుటుంబాన్నంతా పట్టుకెళ్లింది. జ్యోతిని ఒంటరిని చేసింది. ఆ కుటుంబంలో ఇద్దరు కోడళ్లు మిగిలారు. కొడుకులు పోయారు. ఏం జరుగుతుందో అర్ధయ్యేలోపే అందరూ దూరమయ్యారు. ఇల్లు చీకటైంది. కుంటంబం బారమైనరకాన్ని ఇలలోనే చూపిస్తోంది.
` ఆఖరి శ్వాస వరకు నా కొలువు…అంటూ…తనువు చాలించాడు?
జ్యోతి చెప్పిన కొన్ని విషయాలు వింటుంటే గుండె తరక్కు పోక మానదు. ఎప్పుడైతే కొలువు పోయిందో అప్పటినుంచి రమేశ్ ఇటు కూలీ పనులు చేశాడు. దాంతో పాటు పోయిన కొలువు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. పదేళ్లు కడుపు నిండా తిన్నది లేదు. కంటినిండా నిద్రపోయింది లేదు. నిద్రలోనూ కొలువు గురించే కలవంతరింతలు. ఎన్నటికైనా ముఖ్యమంత్రి కేసిఆర్ తమ కొలువులు తమకు ఇస్తాడన్న మాటలే చెప్పేవాడు. ఇదే సమయంలో వచ్చిన కరోనా మహామ్మారి బారిన పడి మరణించాడు. అతని వైద్యం కోసం వున్న అర ఎకరం అమ్మేసింది. రమేశ్ వైద్యం కోసం అందిన కాడల్లా చేసిన అప్పులు ఇప్పుడు చెల్లించాల్సివుంది. ఇదిలా వుంటే వరుసగా కుటుంబంలోని పెద్దలంతా వరుస కట్టి ఏడాదిలో అందరూ తనవు చాలించారు. కరోనా కాటుకు బలయ్యారు. వారి వైద్యం కోసం కూడా అనేక చోట్ల అప్పులు చేయాల్సివచ్చింది. జ్యోతికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి. అబ్బాయి. కరోనా తీవ్రంగా బాధపడుతున్న సమయంలోనూ తనకు ఏం కాదని, ఆరోగ్యం కుదుటపడి, కొలువుతోనే పోతాననేవాడు రమేశ్. ఆ మాట నిత్యం కలవరిస్తుండేవాడు. ఈ మాటలు జ్యోతి చెబుతుంటే హృదయం ద్రవించిపోయింది. ఇలాంటి పరిస్ధితి ఎదుర్కొంటున్న మరో మూడు కుటుంబాల బాధలు ఇలాగే వున్నాయి. వారిలో హోంగార్డులు ఎన్. శ్రీను. ఎన్. నాగరాజు. డి. యాకూబ్‌నాయక్‌లున్నారు. ఆఖరి క్షణాల్లో కూడా కొలువు కోసం కలవరిస్తూనే ప్రాణాలొదిలారంటే ఆ ఉద్యోగాల మీద వారికున్న మక్కువ ఎలాంటిదో తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, పోలీసు డిపార్టుమెంటు ఈ హోంగార్డులపై మానవతా దృక్పధతంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.