కొకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యు వాత.
పెద్ద సంఖ్యలో చనిపోయి, నీటిపై తేలిన చేపలు
గణేష్ విగ్రహాల నిమజ్జనమే కారణమని సొసైటీ సభ్యుల ఆందోళన.
విషపూరిత రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనమే తమకు జీవనాధారం లేకుండా చేసిందని వారి ఆవేదన.
నిమజ్జనం అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని సొసైటీ సభ్యులకు పోలీసుల హెచ్చరికలు.
తమను ఆదుకోవాలని సొసైటీ సభ్యుల వేడుకోలు.
అది కోకాపేట కొత్త చెరువు. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ఆ చెరువులో చేపలన్నీ మృత్యు వాత పడ్డాయి. కొన్ని వేల చేపలు చనిపోయాయి. చెరువులో చేపల పెంపకమే జీవనాధారమైన కుటుంబాలకు కష్టం, నష్టం ఎదురైంది. ఒక్కసారిగా కొన్ని వేల చేపలు చనిపోవడంతో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ ఆ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగలేదు. మొదటి సారి నిర్వహించారు. అప్పటికీ చెరువులో చేపల పెంపకం దారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు అధికారులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వానికి చెప్పుకోండి అని దురుసు సమాధానం చెప్పినట్లు చేపల పెంపకం దారులు చెబుతున్నారు. రకరకాల రసాయనాలు, విషపూరిత రంగులతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల చేపలన్ని మరణించాయి. నీటిపై తేలాయి. అలా విషపూరిత రసాయనాలతో నిండిన చెరువులో మళ్ళీ చేప పిల్లలు వేసినా బతుకుతాయన్న నమ్మకం లేదు. చెరువులో చేపల పెంపకం మీద ఆధారపడి సుమారు 60 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కేవలం చేపలు పట్టే వృత్తి తో జీవితాలు గడిపే తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నష్ట పరిహారం చెల్లించాలంటున్నారు. భవిష్యత్తులో ఈ చెరువులో విగ్రహాల నిమజ్జనం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చెరువులోని చేపలన్నీ ఓ వైపు ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ గురించి ఎంత చెబుతున్నా, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచిస్తున్నా ప్రజలు పట్టించుకోకపోవడానికి నిదర్శనం ఇది.
కేసులు నమోదు చేస్తాం: పోలీసుల హెచ్చరికలు.
కోకా పేట కొత్త చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు మత్స్య సొసైటీ అధ్యక్షుడు గణపురం సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని సొసైటీ ఇతర ముఖ్యులైన రమేష్, అనిల్ కోరారు.