`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి…
`ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి…
` కేసిఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు…
`కేసిఆర్ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు.
`మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల.
` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది…
` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది…
` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది…
`ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు…
` ఉద్యమాన్ని, రాజకీయంతో రంగరించారు.
` తెలంగాణ ఆకాంక్షల వేధిక టిఆర్‌ఎస్సే…
`తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసిఆరే…
`ప్రగతిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోంది కారే…
`చేతికి బలం లేదు?కమలానికి తావులేదు?గులాబీకి ఎదురులేదు?
`తెలంగాణ వాదుల మదిలో మాట, ఉద్యమ కారుల నోటి మాట.
` తెలిసో తెలియకో ప్రతి పక్షాల మాయలో పడిన వాళ్లు మళ్ళీ సొంత గూటికే…
`ఆత్మాభిమానం నూటికి నూరుపాళ్లు టిఆర్‌ఎస్ తోటే…
` నెగ్గడం తెలిసిన కేసిఆర్ కు తగ్గడం కూడా తెలుసు…
`తెలంగాణ సాధనలో గొంగళి పురుగునైనా ముద్దాడానన్న గొప్ప సాధకుడు.
`తెలంగాణ భవితవ్యానికి దిశానిర్దేశకుడు…
`అలిగిన తమ్ముళ్లను అక్కున చేర్చుకునే అన్న అతడు…
`పెద్ద తరానికి పెద్ద కొడుకు…
` మొత్తంగా తెలంగాణ కు రక్షకుడు…
హైదరాబాద్,నేటిధాత్రి:
ముందే ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో సున్నితంగా చెప్పాడు. ఒక దశలో హెచ్చరించి మరీ చెప్పాడు. అయినా బిజేపి వినలేదు. పదే పదే నన్ను గోకాలని చూస్తున్నారు. నా ఓపికను పరీక్షిస్తున్నారు. మరి నేనే గోకడం మొదలు పెడితే, ఇక ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడిదాక గోకుతానో తెలియదు అని సిఎం అన్నాడు. అంతే కాదు. ఒక్కసారి నన్ను గోకి మీరు వదిలేసినా, ఇక నేను వదలేయను. ఏం రాజకీయం నడపాలో అది నడుపుతానన్నాడు. అన్నట్లునే బిజేపిని మునుగోడు ఉప ఎన్నికల వేల కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నలుగురు పార్టీలో చేరారో లేదో..ఇక అంతా అయిపోయినట్లే…ఇక పార్టీ అధికారంలోకి వచ్చే…అన్నంత కలలు గన్న బిజేపికి ఒక్కసారిగా దిమ్మతిరిగి బొమ్మ కనిపించే సన్నివేశం రాష్ట్ర రాజకీయాల్లో కనిపించింది. గతంలో టిఆర్‌ఎస్‌లో కీలక భూమిక పోషించిన ఇద్దరు నేతలు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పరిణామం…గతంలో టిఆర్‌ఎస్ టిక్కెట్టు ఇవ్వలేదని దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌లో చేరాడు. తర్వాత ఈ మధ్య కాలంలోనే బిజేపిలో చేరాడు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పొమ్మన లేకపొగబేట్టే రాజకీయాలను సహించలేని దాసోజ బిజేపిలో చేరాడు. కాని ఆయన మనస్తత్వానికి సరిపోని బిజేపిని వదిలి మళ్లీ టిఆర్‌ఎస్‌లో చేరాడు. ఇక మరో నేత, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆ మధ్య బిజేపిలో చేరాడు. కాని తన స్వభావానికి, బిజేపికి ఎక్కడా సొసగలేదు. దాంతో తిరిగి మళ్లీ ఆయన టిఆర్‌ఎస్‌లో చేరాడు. ఉద్యోగ సంఘ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా పార్టీలో ఆయనకు ఎనలేని గౌరవం వుండేది. బిజేపిలో చేరిన నాడు తప్ప, మళ్లీ ఆయన గురించి అడిగిన వారు లేరు. పిలిచిన వారు లేరు. పేరుకే తప్ప బిసిలకు బిజేపిలో ప్రాధాన్యత లేదన్నది గుర్తించి, మాతృ సంస్ధ టిఆర్‌ఎస్‌కి చేరుకున్నాడు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ బిజేపికి రిటన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల మునుగోడు నామినేషన్ రోజు కూడా టిఆర్‌ఎస్‌తో వున్న మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాత్రికి రాత్రి పార్టీ కండువా మార్చుకున్నాడు. డిల్లీలో మూడు రోజులు మకాం వేసి, బిజేపిలో చేరాడు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పాయింటు మెంటు ఇవ్వడం లేదన్న బూర నర్సయ్య గౌడ్ మూడు రోజుల పాటు బిజేపి పెద్దల ఆశీస్సుల కోసం ఎదరుచూసినప్పుడు ఆత్మగౌరవం ఎటు పోయిందని టిఆర్‌ఎస్ కూడా ప్రశ్నించింది.
ఒక్కసారి కేసిఆర్ మెట్టు దిగితే ఎలా వుంటుందన్నదానిపై నేటిధాత్రి ఆరు నెలల క్రితమే చెప్పింది.
కేసిఆర్ మదిలో వున్న ఆలోచనలు అక్షర బద్దం చేసింది. త్వరలో మళ్లీ ఉద్యమ కారులను తిరిగి సొంత గూటికి తెప్పించేందుకు కేసిఆర్ ఆలోచిస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. అదును కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ చూస్తున్నాడు. నిజానికి ఏ ఉద్యమ కారుడిని కేసిఆర్ వదులుకోలేదు. వదిలేయలేదు. కావాలనే వాళ్లకు వాళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేసుకుంటూ వెళ్లారే…గాని కేసిఆర్ ఎవరినీ వదిలుకోవాలని అనుకోలేదు. వారికి వాళ్లు, ఎవరో చెప్పిన మాటలు విని భ్రమపడి ఇప్పుడు కేసిఆర్‌పక్కన లేకుండా ఇతర పార్టీలలో వున్నారు. ఇప్పటికే వాళ్లు ముఖ్యమంత్రి కేసిఆర్ నుంచి ఒక్క పిలిస్తే చాలు అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్‌తో కలిసి నడిచారు. వాళ్లను కూడా కేసిఆర్ ఎంతో గౌరవించారు. అందరినీ అక్కున చేర్చుకున్నాడు. వారి వారి స్ధాయిని బట్టి పదవులు కూడా ఇచ్చాడు. ఒక దశలో 2004లో మంత్రి పదవులు కూడా అవకాశం కల్పించి, వారి నాయకత్వాలకు భరోసా కల్పించాడు. అయినా వారిలో పదవుల ఆశతోనో, లేక ఎవరో చెప్పిన మాటల వల్లనో కాని వారు టిఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. కేసిఆర్ నాయకత్వం నుంచి దూరంగా జరిగారు. దూరమైన తర్వాత గాని వారికి తత్వంబోధ పడలేదు. ఇప్పటికీ వారిని కదిలిస్తే ఆ జ్ఞాపకాలే చెబుతుంటారు. అవి తప్ప చెప్పుకోవడానికి వారికి ప్రత్యేకంగా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. అంతగా వారి జీవితాలను కేసిఆర్ ప్రభావితం చేశారు. అయినా వారు కేసిఆర్‌ను వదిలి వెళ్లిపోయారు. కాని ఇప్పటికీ వాళ్లు ఎందుకు కేసిఆర్‌ను వదిలి వెళ్లిపోయామన్న అన్న ఆలోచనల్లోనే వున్నారు. కేసిఆర్ నుంచి పిలుపొస్తుందేమో అన్న ఆశతో కూడా ఇంకా వున్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజున మళ్లీ గులాబీ గూటికి చేరాలన్న ఆలోచనలతో , కేసిఆర్ కళ్లలో పడాలన్న తపనతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయనకు దగ్గరవ్వాలని చూశారు. కాని మళ్లీ ఆ ప్రయత్నం వాళ్లు చేయలేదు. కేసిఆర్ కూడా వారి గురించి పట్టించుకోలేదు. కాకపోతే మళ్లీ వారంతట వాళ్లు వస్తామంటే వద్దంటామా? అన్న ఆలోచనలోనే కేసిఆర్ వున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత కేసిఆర్. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన కోపం కూడా అంతే..ఒక్కసారి వద్దనుకున్నాక ఆయన మళ్లీ ముఖం చూసే పరిస్దితి వుండదు. కాని ఆయన ఎవరినీ వద్దనుకోలేదు. వాళ్లే వెళ్లిపోయిన సందర్భాలు. అందుకే ఎవరైతే మళ్లీ సొంత గూటికి రావాలని చూస్తున్నారో! వాళ్లు వస్తే ఆదరించేందుకు సైతం కేసిఆర్ సిద్దంగా వున్నాడు. వారికి తగిన ప్రాదాన్యత కల్పిస్తాడనడంలో సందేహం లేదు.
నిజం చెప్పాలంటే ఒక రకంగా కేసిఆర్ అదృష్ట జాతకుడు.
ఆయన ప్రతి అడుగు ఒక సంచలనమే…ప్రతి మాట ఒక వినూత్నమే…ఆయన ప్రతి నిర్ణయం కొత్తదనమే…ప్రతి ఆచరణ ఆదర్శమే…అందుకే ఆయన రాజకీయాల్లో చేరిన నుంచి వేసిన ప్రతి అడుగు ఒక చారిత్రక సత్యమే కాదు. అవసరంగా కూడా మారింది. కాంగ్రెస్‌నుంచి టిడిపిలో చేరి, ఆయన గురువు మీదనే గెలిచి శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో తనదైన పాత్రతో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఏ చంద్రబాబు అయితే నమ్మించి మోసం చేశాడో..కేసిఆర్ సేవలు తీసుకొని వదిలేశాడో…ఆయనను గద్దెదించిన నాయకుడైన చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చంద్రబాబును తెలంగాణ రాజకీయాలకు పూర్తిగా దూరం చేశాడు. ఇదీ కేసిఆర్ చాణక్యం. చంద్రబాబు లాంటి నాయకుడినే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి, తెలుగుదేశం పార్టీనే తెలంగాణలో లేకుండా చేసిన నాయకుడు కేసిఆర్. అసలు ఏ తరం ఆలోచించలేదు. ఉద్యమ తరం కూడా తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్దితి వస్తుందని ఊహించలేదు. ఎవరూ ఊహించని వాటిని నిజం చేయడమే కేసిఆర్ రాజకీయం.
తనకు ఎదరు లేని, తిరుగులేని నాయకత్వాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయం చేయడం అంటే అందుకు ఎంతో సాహసం కావాలి.
ఎంతో నేర్పు కావాలి. రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్నవారై వుండాలి. అంతే కాని ఎప్పుడొచ్చాం కాదని సినిమా డైలాగు ప్రతిపక్షాలు చెబితే చాలదు. కేసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి సమీప కాలంలో ఎవరికీ లేదు. ఏపార్టీకి ఆ అవకాశం రాదు. ఎందుకంటే రాజకీయ చాణక్యమే కాదు, అభినవ అభిమన్యుడు కూడ ఆయనే… పద్మవ్యూహంలాంటి రాజకీయాలను చేధించి, శాసించగలిగే నాయకుడు కేసిఆర్. వ్యూహాలు సృష్టించడం తెలుసు. పద్మవ్యూహాలు చేదించడం తెలుసు. ఆ పద్మవ్యూహంలో ప్రతిపక్షాలను చిక్కించి ఉక్కిరిబిక్కిరి చేయడం కూడా కేసిఆర్‌కే తెలుసు. మునుగోడు ఉప ఎన్నిక అనగానే చంకలు గుద్దుకున్న బిజేపి ఆశలు ఆవిరైపోతున్నాయి. అందుకే జాతీయరాజకీయాలను కూడా తన కనుసైగలతో శాసించగలిగే స్ధాయిలో వున్నాడు. దేశ రాజకీయాలను ఏలేందుకు అన్ని అర్హతలున్న ఏకైక నాయకుడు. అందుకే ఆయనంటేనే ఉద్యమకారులకు ఒక నమ్మకం. తెలంగాణ నేతలకు ఒక వరం. తెలంగాణ రాజకీయాలే కాదు, ప్రగతి కూడా కేసిఆర్‌తోనే సాధ్యం. ఎందుకంటే జాతీయ స్దాయిలో పాలన సాగిస్తున్న బిజేపి ఏ ఒక్క ప్రాజెక్టు తెలంగాణకు ఇచ్చింది లేదు. తెలంగాణ అభివృద్ధి కాంక్షించింది లేదు. నలుగురు ఎంపిలున్నా ఇచ్చిన నిధులు లేవు. వారు చేసిన అభివృద్ధి లేదు. అలాంటిది రాష్ట్రంలో వారు బలం పెరిగితే తెలంగాణకు వచ్చేది లేదు…మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లినట్లే…అందుకే ఆ పరిస్దితి కేసిఆర్ ఎప్పుడూ రానివ్వడు. తెలంగాణలో మరే పార్టీకి చోటు లేదు. రాష్ట్రం సాధించుకున్న టిఆర్‌ఎస్‌దే ఎప్పటికీ అధికారం…! కేసిఆర్‌దే నాయకత్వం. అదే జనం మాట…ప్రజల నోట…!