
ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్
కార్మిక సంఘాల మహా ధర్నా వాల్ పోస్టర్లు విడుదల
చేర్యాల నేటిధాత్రి…
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘాల మహాపడావ్ పిలుపులో భాగంగా ఈనెల 10న జరిగే కార్మిక మహాధర్నా వాల్ పోస్టర్లను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు అందే అశోక్ మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వం బరితెగించి ప్రజా, కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నదన్నారు. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అమ్మేస్తున్నదని, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందన్నారు. పార్లమెంట్లో మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకున్నప్పటికీ కార్మిక, కర్షక ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసంహరించుకున్నది. అయినా 2015లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీస మద్దతు ధర హామీ నేటికీ అమలు కాలేదు. 2023-24 కేంద్రం బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, ఆహార ఉత్పత్తులకు సబ్సిడీలకు భారీగా కోతలు విధించింది. జిడిపిలో విద్యా రంగానికి 6 శాతం, వైద్య రంగానికి 2 శాతం కేటాయించకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది. పౌరుల ప్రాథమిక హక్కులను పాతరేస్తున్నది. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను జటిలం చేస్తున్నది. ఈ నేపథ్యంలో 9 ఏళ్ళ మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో మేరకు క్విట్ ఇండియా డే లో భాగంగా చేర్యాలలో ఈనెల 10న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని కార్మికవర్గానికి ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈరి భూమయ్య, వెలుగల యాదగిరి, ఎండి. జహులామద్దీన్, గంగాధరబట్ల రామన్, వనారాసి నర్సింహులు, వానరాసి ఉప్పలమ్మ, ఈరు మల్లయ్య, తిగుల్ల కనకయ్య, గజ్జల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.