` ఉత్తరాధిన ఉరకలు…దక్షిణాదిన కుదేలు
` తెలంగాణలో వానపాములా పాకుతూ…
` ప్రజలు నమ్మినా….నాయకులు ముంచుతూ…
` రేవంత్ రెడ్డి రాకతో పార్టీలో పెరిగిన జోష్…
` హుజూరాబాద్ ఉప ఎన్నికతో తుస్…
` సీనియర్ల అలక…జూనియర్ల కినుక…
` ఒకరికొకరు దూరం…దూరం…
` అంతర్గత విభేదాలతో ప్రజల్లో వేళ్లలేని దుస్థితి
` ఐకమత్యం మాయమై ప్రజలకు దూరమై
దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్నది నిజం. ఇది పసిగట్టలేకపోవడం కాంగ్రెస్ శ్రేణుల వైఫల్యం. ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు గెలిచింది కాంగ్రెస్. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించింది కాంగ్రెస్‌పార్టీ. ఎక్కడ ఏ ఉప ఎన్నిక జరుగుతున్నా, ఒక్క తెలంగాణలో తప్ప అంతటతా కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. ఇప్పటికీ దేశంలో కనీసం 200 లోక్‌సభ స్ధానాల్లో కాంగ్రెస్ బలంగా వుంది. బిజేపికి ప్రత్నామ్నాయ శక్తిగానే కాంగ్రెస్ వుంది. కాని నాయకులే డీలాగావున్నారు. పార్టీ అధికారంలో వుంటేగాని పార్టీని అంటిపెట్టుకొని వుండలేదు.
హైదరాబాద్ , నేటిధాత్రి :
దేశంలో మార్పు కనిపిస్తుంటున్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయంటున్నారు. ఉత్తరాధిన కాంగ్రెస్ ఉరకలెత్తే స్ధితిలో వుందంటున్నారు. కాని దక్షిణాదిలో ఒకరి కాళ్లు ఒకరు పట్టుకొని లాగేసుకుంటున్నారు. లేని దగ్గర లేనే లేదు..వున్న దగ్గరైనా పుంజుకోనివ్వలేకపోతున్నారు. జనం ఓట్లేస్తున్నా నిలుపుకోలేకపోతున్నారు. గెలిచిన వాళ్లు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. వాళ్లను ఆపిన వాళ్లు లేరు. కొత్తగా పిసిసి రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ అంటున్నా ఎవరూ కనికరించడం లేదు. పెద్దగా స్పందన లేదు. అక్కడోఇక్కడో చేరుతున్నట్లు కనిపించినా స్పూర్తిదాయకమైన చేరికలు లేవు. పెద్ద పెద్ద నేతలు లేరు. ఇటీవల మాజీ పిపిసి. అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఇదిగో చేరే..అదిగో చేరే అన్నారు. ఆఖరుకు ముహూర్తం కూడా చెప్పారు. మళ్లీ వాయిదా అంటున్నారు. అయితే డిఎస్ చేరికతో కొత్తగా ఒరిగేదేమీ వుండకపోవచ్చు. కాకపోతే చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడొచ్చు. గెలిచినోళ్లను గెలిచినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి గుంజుకుపోతుంటే గుడ్లప్పగించి చూశారు. వద్దని వారించలేకపోయారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నట్లే, వచ్చేసారి ప్రజలను మెప్పించి అధికారం తెచ్చుకుందామని నాయకులు ఒకరికొకరు నచ్చజెప్పుకునే ఐక్యత లేదు. పార్టీ మారేది వుంటే రాజీనామా చేసి వెళ్లిపో అని ఎవరూ గట్టిగా మాట్లాడిరది లేదు. ఎంత మంది పోతే అంత మాకు మేలే అన్నట్లు 2014 నుంచి నాయకులు వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీని పాతాలానికి దిగబడిపోయేలా చేసింది. అయినా కార్యకర్తల బలం ఆ పార్టీకి మెండుగానే వుంది. నాయకుల మధ్యే ఐక్యత కొరవడిరది. మాటల యుద్దం మాత్రమే వారి మధ్య ఏళ్లుగా కొనసాగుతోంది.
` రేవంత్‌తో ఉరుకుడే..ఉరుకుడు అనుకున్నరు?:
ఏళ్లుగా ఎదురు చూసిన రేవంత్ రెడ్డి పిపిసి. అధ్యక్షుడయ్యాడు. ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహం కనిపించింది. కార్యకర్తల ఆలోచనలతోపాటు రేవంత్‌రెడ్డి నిజానికి పరుగెత్తాలనే చూశాడు. అంతకు ముందునుంచే ఒక వర్గం ఆయనను ఎలా అడ్డుకోవాలో చూస్తూనే వుంది. అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తూనే వుంది. కదలకుండా కాళ్లలో కట్టెలుపెట్టే పనులు చేస్తూనే వుంది. ఇవన్నీ తెలిసినా రేవంత్ రెడ్డి చాకచాక్యంగా వ్యవహరిస్తారనే అందరూ అనుకున్నారు. కాని సీనియర్ నేతలు ఉచ్చుల్లో పదేపదే రేవంత్ రెడ్డి చిక్కుకొని, ముందుకు వెళ్లలేక, వెనక్కి అడుగేయలేక కూడా ఆలోచనలో పడే కాలం వస్తుందని ఎవరూ ఊహించలేదు. జడ్పీటీసిగా గెలిచిన నాడు రేవంత్‌కు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ఇండిపెండెంటుగా ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఎవరూ తోడు లేరు. తెలుగుదేశంలో పార్టీలో ఆయనకు ఏనాడు ఎదరులేదు. అదేంటోగాని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు అయ్యాక అడుగులు వేయాలంటే ఆచి తూచి వేయాల్సివస్తుంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిదేమో! అనిపిస్తున్నా, హుజూరాబాద్ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఎప్పటికైనా ఇబ్బందికరమే…ఈటెల రాజేందర్‌కు పరోక్షంగా సహకరించారాలేదా? అన్నది పక్కన పెడితే యుద్దానికి ముందే అస్త్రసన్యాసం చేయడం అన్నది రాజకీయాల్లో తగనిది. అందరికంటే ముందు పరుగెత్తాలి. ప్రజల మెప్పు పొందాలి. క్యాండెట్ ప్రకటన జరగాలి. యాంత్రాంగమంతా కదలాలి. కాని పెద్దగా అదేం జరగలేదు. రేవంత్ రోడ్‌షోలు తప్ప మరేం జరగలేదు. సీనియర్లకు హుజూరాబాద్ ప్రచారానికి ఆహ్వానం లేదు. ఇది సాక్ష్యాత్తు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే. ఇక తాజాగా జగ్గారెడ్డి ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా చప్పుడు లేదు. కాంగ్రెస్‌పార్టీ పనులేమీ లేదు. ప్రచారం లేదు. ఉలుకు లేదు. పలుకు లేదు. అప్పుడప్పుడు మీడియా సమావేశం తప్ప, జనంలోకి వెళ్లింది లేదు. జనాన్ని జాగృతం చేసింది లేదు. కొట్లాడిరది లేదు. వరి కొనుగోలు దగ్గరే ఆగిపోయారు…అక్కడినుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. వరి కుప్పల మీద రైతులు చనిపోతే వెళ్లి, వారికి అండగా నిలిచారు. అయినా ఫాయిదా లేకుండా చేసుకున్నారు. ఆ క్రెడిట్ కాస్త బిజేపి తన్నుకుపోతుంటే చూస్తూ నొరెళ్లబెట్టారు. అనవరసరంగా ఏదో… అయ్యామని సీనియర్లు లోలోపల నసిగారు. ఆరంభశూరత్వం తప్ప మరేం లేదని మీడియా ముందే తిట్టుకున్నారు. ముందే మేం చెప్పామని, ఆ కోపమంతా రేవంత్ మీద తీర్చుకుంటున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో వుంది. చాలా రాష్ట్రాల్లో బలంగా వుంది. వచ్చేనెల ఎన్నికలు జరగాల్సిన వున్న రాష్ట్రాలైన పంజాబ్‌లో మళ్లీ కాంగ్రెస్సే ముందంజలో వుందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా కాంగ్రెస్ గాలే వీస్తోందంటున్నారు. ఇక గోవాలో గత ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు గెల్చుకున్నా ఏం జరిగిందో తెలిసిందే… ఈసారి తప్పు చేయకుండా పూర్తి స్ధాయి మెజార్టీ స్ధానాలు సాధించాలన్న కసితోనే పనిచేస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ పరిస్ధితి ఎమిటన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా, ఎంతో కొంత మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం ఏమిటి? ఒకరికొకరిలో ఈ వైరుద్యమేమిటి? కలిసి సాగేందుకు ఇబ్బందేమిటి? తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కసిలేదెందుకని? పైకి చెప్పే మాటలకు, వారు అనుసరిస్తున్న విధానాలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. ఇటీవల 317 జీవో విషయంలో ఆచి తూచి అడుగులేయాలనుకున్నది. కాలయాపన చేసింది. ఉద్యోగులకు అండగా నిలువలేకపోయింది. వారిలో నమ్మకం నింపలేకపోయింది. సందులో దూరి ఇక్కడ కూడా బిజేపి క్రెడిట్ కొట్టుకుపోయింది. కాంగ్రెస్‌ను రాష్ట్ర రాజకీయాల్లో మరింత దూరం చేసింది. అందుకే రాజకీయాల్లో ఒక మాట చెప్పుకుంటారు…నేను గెలిచాను…అనడమే కాదు… నిన్ను ఓడిరచానని పదే పదే గుర్తు చేయాలి. అప్పుడే రాజకీయాల్లో పై చేయి సాధిస్తుంటారు. సరిగ్గా ఇక్కడ బిజేపి అదే ఆట ఆడుతోంది. కాంగ్రెస్‌కు జవసత్వాలు రాకుండా బిజేపి కూడా టిఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తోంది. కాంగ్రెస్ లేస్తే తాము నిలబడలేమని బిజేపికి తెలుసు…అది గమనించలేకే కాంగ్రెస్ ఆపసోపాలు…ఈ మాత్రం అవగాహన వుంటే అది కాంగ్రెస్ ఎందుకౌతుందని విశ్లేషకులు అంటున్నారు.