కాంగ్రెస్‌ లో రెండు లెక్కలు!

 

`నా ఇంటికి రెండు!

`కుదరదు ఇంటికి ఒకటే!

`కాంగ్రెస్‌ లో మొదలైన కొత్త పంచాయతి.

`పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలి.

`పదేళ్లుగా పార్టీని పట్టుకొని వెళాడుతున్నాం.

`పదవుల కోసం ఆశ పడలేదు.

`పార్టీ మారలేదు.

`మాకు రెండు ఇవ్వాల్సిందే

` రేవంత్‌ రెడ్డి పెత్తనంపై సీనియర్లు గరం.

`పది మంది సీనియర్లు రెండు సీట్ల కోసం పట్టు.

`కొత్త, పాత నేతల సిగపట్లు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చాలా విచిత్రంగా వుంటాయి. ఎప్పుడు ఎలా మారుతాయో? అన్నది ఎవరూ చెప్పలేకుండా వుంటుంది. కాంగ్రెస్‌లో బలమైన నాయకులు వుండరు. అలా అని బలహీనమైన నాయకులు కూడా వుండరు. అందరూ తమకు తామే గొప్ప అనుకునే నాయకులు మాత్రం వుంటారు. ఎన్నికల్లో ఓడినా వాళ్లదే పై చేయి అనుకుంటేగాని రాజకీయాలు చేయలేని నాయకులు కాంగ్రెస్‌లో మాత్రమే వుంటారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య పార్టీలో నలిగితే గాని పార్టీ మనుగడలో వుండదని అంటుంటారు. కాంగ్రెస్‌ అంటేనే నిత్య కుంపటి. అది ఎప్పుడూ రగులుతూనే వుండాలి. పొగ కనిపిస్తూనే వుండాలి. వచ్చేవారు వస్తూ వుండాలి. వెళ్లేవారు వెళ్తూనే వుండాలి. మళ్లీ వచ్చినా ఆదరిస్తూనే వుండాలి. ఇది అత్యంత సహజమైన ప్రక్రియ. ఇప్పుడు తాజాగా పార్టీలో టికెట్ల సీజన్‌ నడుస్తోంది. అధికార బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించింది. బిఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు వస్తారు. కాంగ్రెస్‌ పార్టీ నిండుతుంది? అనుకున్నారు. కాని అది జరగలేదు. ఇక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి కూడా నాయకులు చూపిస్తున్నట్లు లేదు. కాని సీనియర్ల లొల్లి మాత్రం ఆగడం లేదు. అలా కాంగ్రెస్‌లో మాదే గుత్తాదిపత్యం అనుకునే కొందరు నేతలు తమకు ఈ ఎన్నికల్లో అడిగినన్ని సీట్లు ఇవ్వాలని పేచీపెడుతున్నట్లు సమాచారం. మా కుటుంబానికి రెండు సీట్లు కావాలంటున్న సీనియర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరే ముందు చెప్పిన మాటలు అందరికీ గుర్తున్నాయి. తన అనుచరులకు సీట్లు ఎవరిస్తే వారి పార్టీలోకి వెళ్తా అన్నారు. దాంతో అటు కాంగ్రెస్‌, ఇటు బిజేపి సంప్రదింపులు జరిపారు. ఆఖరుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సరే ముందు నుంచి చెబుతున్నట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లు కాకపోయినా, కనీసం రెండు, మూడు సీట్లైనా ఇస్తామన్న భరోసా లేకుండా ఆయన చేరి వుండరు. అదలా వుంటే తాజాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బిఆర్‌ఎస్‌పై ఒక రకంగా తిరుగుబాటు చేసినట్లే లెక్క. ఆయనకు ఇప్పటికే మల్కాజిగిరి సీట్లు ప్రకటన కూడా జరిగిపోయింది. కాని ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వున్నారు. మరో వైపు కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు చేస్తూనే వున్నారన్న వార్తలు వస్తూనే వున్నాయి. ఒక వేళ మైనం పల్లి కాంగ్రెస్‌లో చేరితే తనకు మల్కాజిగిరితోపాటు, మెదక్‌ నుంచి తన కుమారుడు రోహిత్‌ రెడ్డికి కూడా టికెట్‌ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక ఇటీవల బిఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌పొందని రేఖానాయక్‌ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ కూడా తన భర్తకు టికెట్‌ ఇస్తేనే..అన్న పేచీ పెడుతున్నట్లు కాంగ్రెస్‌వర్గాలు చెబుతున్నాయి. మరి అలా కొత్త వాళ్లు ఇన్నిన్ని సీట్లు అడుగుతుంటే, పార్టీని ఇంత కాలం కాపాడిన నేతలుగా మాకూ రెండు సీట్లు కావాలని కోరుతున్న వారి సంఖ్య కాంగ్రెస్‌లో పెరుగుతోంది. అందులో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ తనతోపాటు తన కూతురుకు కూడా టిక్కెట్‌ కావాలని అడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో దామోదర రాజనర్సింహ డిల్లీకి నివేదికలు తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించారు. తెలంగాణ రావడంలో ఆయన పాత్ర కూడా వుందనే చెప్పాలి. కాని అనూహ్యంగా ఆయన 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పటి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూ మోహన్‌ చేతుల్లో ఓటమిపాలయ్యారు. గత 2018 ఎన్నికల్లో చంటి క్రాంతి కిరణ్‌ చేతుల్లో ఓటమిపాలయ్యారు. కానీ ఆయన పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

పక్క చూపులు చూడలేదు. కాకపోతే ఆయనకు టికెట్‌ ఇవ్వడమే గగనమనేది రేవంత్‌ వర్గం చేస్తున్న ప్రచారం. దానికి తోడు తన కూతురుకు కూడా టికెట్‌ అడగడమేమిటన్నది కొందరు లేవనెత్తున్న ప్రశ్న. అసలు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక సమయంలో రాజనర్సింహ తన అనుచరులకు ఓటు రాలేదని గాంధీభవన్‌ ముందు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అలాంటి నాయకుడికి రెండు టెక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదన్నది పార్టీ వాదన. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన నేతకు టికెట్‌ అంటేనే ఆలోచించాలన్నది కొందరి మాట. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ తన కుటుంబానికి మూడు టిక్కెట్లు కావాలని కోరుతున్నారు. ఒకప్పుడు వరంగల్‌ రాజకీయాల్లో బలమైన నేతగా వున్న ఆమె, తర్వాత జరిగిన పరిణామాలలో వారి ప్రతిష్టను వారే దిగజార్చుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కొండా దంపతులు తీసుకున్న నిర్ణయాలు ఆశనిపాతమయ్యాయి. వారి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేశాయి. అయినా ఒక దశలో మళ్లీ పూర్వ వైభవం వచ్చే సందర్భంలో మళ్లీ చేజేతులా తమ రాజకీయాన్ని చెడగొట్టుకున్నారు. దివంగత రాజశేఖరెడ్డి మరణం తర్వాత జగన్‌కు ముఖ్యమంత్రిని చేయపోవడాన్ని తప్పుపడుతూ ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. జగన్‌ పార్టీలోకి వెళ్లారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్‌ చేసిన మోసం తెలుసుకొని పశ్చాత్తాపపడ్డారు. బిఆర్‌ఎస్‌లో చేరారు. అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ పదవులు తీసకొని కూడా సంతృప్తి పొందలేకపోయారు. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ రాకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌ గూటికిచేరుకున్నారు. ఇప్పుడు మూడు సీట్లు అడుగుతున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఎక్కువ కాలం పాటు మంత్రి పదవి నిర్వహించిన జానారెడ్డి, కూడా రెండు సీట్లు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో ఇదే తనకు ఆఖరు ఎన్నిక అని చెప్పుకున్నారు. అయితే తన ఇద్దరు కుమారులకు టికెట్‌ ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్నట్లు చెబుతున్నారు. జానారెడ్డి సిఎల్పీ లీడర్‌గా పనిచేయడం మూలంగానే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ప్రరాభం చూసిందని కొందరు చెప్పే లెక్క. అడుగడుగునా జానారెడ్డి తెలిసో తెలియకో ప్రభుత్వానికి మేలు చేశారన్నది కొందరివాదన. ఎందుకంటే 2014 తర్వాత సరిగ్గా జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరుగుతున్న వేళ ఐదు రూపాయల భోజనం తెప్పించుకొని సిఎల్పీ కార్యాలయంలో భేష్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సీట్లు రాకుండా చేశారు. అంతే కాకుండా మిషన్‌భగీరధ ద్వారా ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తే నేను బిఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటానని చెప్పి, పరోక్షంగా బిఆర్‌ఎస్‌కు లాభం చేకూర్చారు. అలాంటి నేత ఇప్పుడు రెండు సీట్లు కోరడాన్ని పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. జనగామ సీటు వస్తుందో రాదో కూడా తెలియని డైలమాలో వున్న పొన్నాల లక్ష్మయ్య కూడా తనకు రెండు సీట్లు కావాలని కోతున్నట్లు సమాచారం. గతంలోనే ఓసారి చేర్యాల నియోజకవర్గం నుంచి పొన్నాల కోడలు వైశాలి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఆమెకు కూడా టికెట్‌ ఇవ్వాలని గత పదేళ్లగా కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం కోసం పని చేస్తున్నానని పొన్నాల చెబుతున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా రెండు సీట్లు కావాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతోపాటు, ఆమె కుమారుడు సూర్యం కూడా పినపాక నియోజకవర్గంలో విసృతంగా తిరుగుతున్నాడు. అందువల్ల ములుగుతోపాటు, పినపాక కూడా ఇస్తే రెండు సీట్లు గెలిపించుకొస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ కూడా తన కుటుంబానికి రెండు సీట్లు కావాలని కోరుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక రేవంత్‌ రెడ్డికి పిసిసి అధ్యక్షుడి పగ్గాలు దగ్గరుండి కట్టబెట్టిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి ఈసారి రెండు టిక్కెట్టు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో ఆయన హుజూర్‌నగర్‌నుంచి గెలిచారు. ఆయన సతీమణి కోదాడ నుంచి గెలిచారు. 2018 ఎన్నికల్లో ఉత్తమ్‌ పద్మావతి ఓటమిపాలాయ్యారు. అయితే ఈసారి కూడా రెండు టెక్కెట్లు కావాలని వారు పట్టుబడుతున్నారు. ఇలా రెండు రెండు సీట్లకు ఎసరు పెట్టిన నేతలుకు ఎన్ని టిక్కెట్లు వస్తాయన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *