కాంగ్రెస్‌ లో కరంటు ముసలం!

 

` రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలతో అయోమయం!

`ఒక్క మాటతో రైతుల్లో ఆగ్రహం.

`కాంగ్రెస్‌ దిష్టి బొమ్మలు తెలంగాణ వ్యాప్తంగా దగ్థం.

`కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మధనం!`బిఆర్‌ఎస్‌ కు దొరికిన అస్త్రం?

`కాంగ్రెస్‌ ను బిఆర్‌ఎస్‌ ఆటాడుకుంటున్న వైనం?

`అమెరికాలో వుండి, తెలంగాణ కాంగ్రెస్‌ ను ఇరికించాడు?

`నేనే కాంగ్రెస్‌… కాంగ్రెస్‌ అంటే నేనే! అన్న రేవంత్‌.

`మొన్న సీతక్క సీఎం. అన్నాడు?

`నేడు ఎకరాకు మూడు గంటల కరంటు చాలని ప్లగ్‌ లో వేలుపెట్టాడు.

`మైండ్‌ గేమ్‌ ఆడాడు!

`గేమ్‌ చెయింజర్‌ కావాలనుకున్నాడు?

`బోల్తా పడ్డాడు!

`అసలు రేవంత్‌ రెడ్డి ఎవరు? అని కోమటి రెడ్డి ప్రశ్నించారు.

`రేవంత్‌ రెడ్డి మాట చెల్లదన్న కోమటి రెడ్డి.

` అదును కోసం ఎదురు చూస్తున్న కోమటి రెడ్డి.

`దొరికిన అవకాశంతో రేవంత్‌ పై కోమటి రెడ్డి ఎదురుదాడి.

`నేను స్టార్‌ కాంపెయినర్‌ ని నాకంటే రేవంత్‌ రెడ్డి గొప్ప కాదు.

`కలహాల కాంగ్రెస్‌ తెలంగాణ లో ఖతం.

హైదరబాద్‌,నేటిధాత్రి:                                                   

అక్కడ అమెరికాలో రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ మీద అగ్గిరవ్వలు రాజేస్తే, నిప్పురవ్వలై తెలంగాణ కాంగ్రెస్‌లో కరంటు మంటలు రేగాయి. సమయం సందర్భంలేని మాటలు అనేక తంటాలు తెచ్చిపెడుతుంటాయి. అయినా నాయకులు ఈశ్వరుడు నోరిచ్చారు కదా! అని మాట్లాడడం మానుకోరు. వివాదాలు ముసురుకోకుండా జాగ్రత్త పడరు. ఎంత వివాదాలు సృష్టిస్తే అంత గొప్ప పబ్లిసిటీ వస్తుందన్న దీమా కొన్ని సార్లు కొంప ముంచుతుందంటే ఇదే..ఇంత కాలం కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చినా, ఎన్ని విమర్శలు జడివానలు చూసినా, నోటి దూల తెచ్చే తుఫాను నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఉన్నతాన వుండకుండా ఉప్పును నిప్పుమీద వేసి ఎట్లా చిటపటలాడుతుందో చూద్దామనుకుంటే, ఎగిరొచ్చి కళ్ల మీద పడితే మంటే పుడుతుంది. హాయిగా వుండదు. ఇంత కాలం కాంగ్రెస్‌ను నడి భజారులో నిలుపుదామా? అని ఎదురుచూస్తున్న బిర్‌ఎస్‌కు రేవంత్‌ వ్యాఖ్యల రూపంలో మంచి ఆయుధం దొరికింది. మొన్నటిదాక ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందనుకుంటే, కర్నాటక ఫలితాలతో జోష్‌ నిండినట్లు ఓవర్‌ యాక్షన్‌ చేసింది. ఏమైంది రేవంత్‌ చేసిన ఒక్క ముక్కతో అంతా తుడిచిపెట్టుకుపోయింది. రైతులు దూరం చేసేలా చేసింది. అసలు రేవంత్‌రెడ్డి వెళ్లిన పనేమిటి? చేసిన వ్యాఖ్యలేమిటి? అన్నది ఒకసారి నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయంలో సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్లే. 

రేవంత్‌రెడ్డి అమెరికాలో ఆటా సభలువెళ్లాడు. 

ఇంత వరకు బాగానే వుంది. మేధావులు, విద్యావంతులు వేదికలను పంచుకున్నట్లు, నేనెందుకు లెక్చర్లు ఇవ్వొద్దనుకున్నాడో ఏమో? అధికార పార్టీ నాయకులేనా? విదేశీ గడ్డమీద మాట్లాడేది?నేనెందుకు మాట్లాడకూడదు…అనుకున్నాడో ఏమో? కాని అక్కడి ప్రజలతో కలిసి సమావేశమయ్యాడు. అక్కడ కూడా రాజకీయ ప్రచారం చేసుకున్నా తప్పు లేదు. కాని అక్కడ తన ప్రతాపం అవసరం లేదు. తాను గొప్ప అని చెప్పుకోవడం అవసరమే కాని, తానే గొప్ప అన్నది చెప్పుకోవడం ఎవరికీ మంచిది కాదు. సోమవారం అవసరమైతే సీతక్కను సిఎం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలే వివాదం రేపాయి. పార్టీలో చర్చకు దారి తీశాయి. దానిపై పెద్దఎత్తున రేవంత్‌ మీద ఎదురుదాడి మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీలో ఇక సీనియర్లు లేరా? ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఇంకా లేరా? రేవంత్‌రెడ్డి ఎలా అలా అంటారు? ఆయనకు ఏం హక్కుంది? అంటూ ఇప్పటికే అనేక మంది సీనియర్‌ నాయకులు మీడియాతో తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే వున్నారు. 

 సీతక్క ఏమైనా తెలంగాణ కోసం కొట్లాడిరదా? 

రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అన్నాడా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌! తెలంగాణ కోసం కూడా అధికారంలో వుండి కొట్లాడిరది కాంగ్రెస్‌. అప్పుడు కాంగ్రెస్‌లో రేవంత్‌ లేడు. సీతక్క లేదు. రెండు కళ్ల సిద్దాంతంతో తెలంగాణను నిండా ముంచిన చంద్రబాబుతో వున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్నారు. అంత మాత్రాన పదవులు ఎవరికి వారు డిసైడ్‌ చేసుకునే వెలుసుబాటు కాంగ్రెస్‌లో వుండదు. ఈ విషయం మీద వివాదం ముదురుతుందని గమనించే రేవంత్‌ రెడ్డి మరో వ్యాఖ్యానం కూడాచేశారు. రేవంత్‌ అంటే కాంగ్రెస్‌..కాంగ్రెస్‌ అంటే రేవంత్‌? అని చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మరింత కోపంగా వున్నారు. అది చల్లారకముందే తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సాగుకు ఇరవై నాలుగు గంటలు అవసరం లేదని రేవంత్‌రెడ్డి చెప్పడం తన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. పైగా ఎకరా పొలం తడిచేందుకు గంట సమయం చాలు…అని భాష్యం చెప్పడం అంతకన్నా భావ దారిద్య్రం. తెలంగాణలో 80శాతం మంది రైతులు మూడెకరాల రైతులే వున్నారంటూ కొత్త కితాబిచ్చాడు. వారికి మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలన్నాడు? తెలంగాణలో వుండే భూముల రకాలు ఎన్ని వుంటాయన్నదానిపై ఏనాడైనా అధ్యయం చేశాడా? ఇసుక నెలల్లో జరిగే సాగుకు ఎంత నీరు అవసరమౌతుందో తెలిసే చెప్పాడా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. అంతే కాకుండా ఈ వివాదం మొత్తం కాంగ్రెస్‌ మెడకు చుట్టుకునేలా చేశాడు. 

అటు కాంగ్రెస్‌ నేతలు, ఇటు అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 

ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. కరంటుపై కాంగ్రెస్‌ అసలు విధానం బైట పడిరదని ప్రచారం చేసింది. కాంగ్రెస్‌వస్తే మళ్లీ చీకటి రోజులే అని రైతులకు వివరించింది. గత పరిస్ధితులు ఎలా వుండేవో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. పేరుకే ఉచిత విద్యుత్‌ అయినా ఉదయం వేళ మూడు గంటలు, రాత్రిళ్లు మూడు గంటలు ఇచ్చేవారు. అందులోనూ నాణ్యమైన విద్యుత్‌ సరిగ్గా అందేది కాదు. రైతులు రాత్రుళ్లు బావుల వద్ద నిద్ర పోవాల్సివచ్చేది. ఎండనక, వానన కూడా బావుల వద్ద జీవితాలు గడిచేవి. రాత్రిళ్లు బావుల వద్దకు వెళ్తూ అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన సందర్భం వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పరిస్దితి లేదు. రైతు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు కరంటు వినియోగించుకునే అవకాశం ఏర్పడిరది. నిరంతరంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో పెరిగిన భూగర్భ జలాలతో సమృద్దిగా పంటలు పండుతున్నాయి. ఇవన్నీ తెలిసినా, రేవంత్‌రెడ్డి లేనిపోని వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టారు. 

రేవంత్‌ రెడ్డి చేసిన సీతక్క సిఎం? 

 ఉచిత విద్యుత్‌ అవసరం లేదన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అంతర్మధనం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన భువనగరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదును దొరికింది కదా? అని రేవంత్‌ను తూర్పార పట్టేశాడు. అసలు రేవంత్‌ ఎవరు? రేవంత్‌ రెడ్డి మాట కాంగ్రెస్‌లో చెల్లదు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయం కోసం ఎదరుచూస్తున్న కోమటిరెడ్డికి రేవంత్‌ను అధిష్టానం వద్ద దోషిని చేయడానికి మంచి అస్త్రం దొరికినట్లైందనుకున్నాడు. పనిలో పనిగా సీతక్క సిఎం? అన్నదానిపై కూడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగానే స్పందించారు. అసలు కాంగ్రెస్‌ దళిత సిఎం నిర్ణయం తీసుకోవాలని మంచిర్యాల సభలో మొదట చెప్పిందే నేనంటూ చెప్పుకొచ్చారు. పైగా కాంగ్రెస్‌లో పార్టీ కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న వారు అనేక మంది వున్నారని, కొత్తగా వచ్చిన వారు ఎవరికి వారు, సిఎంలమనుకోవద్దని సూచించారు. ఒక రకంగా అటు రేవంత్‌కు చురకలు అంటించాడు. అటు కాంగ్రెస్‌లో ముసురుకుంటున్న తుఫాను ఎప్పుడు ఆగిపోతుందేమో? కాని తెలంగాణ రైతుల ఆగ్రహం మాత్రం ఇప్పట్లో చల్లారకపోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు క్షమించకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!