కాంగ్రెస్‌ కు ఎంత కష్టమొచ్చె!?

`సీనియర్లంతా ఎందుకు వీడుతున్నట్లు?

` రేవంత్‌ మీద అసంతృప్తి మరింత ఎందుకు బలపడుతోంది?

`ఇంతకీ రేవంత్‌ రెడ్డిని ఇంత మంది సీనియర్లు ఎందకు కాదంటున్నారు?

`రేవంత్‌ రెడ్డి తో కలిసిపోతున్న సీనియర్లు ఒక్కరు కూడా ఎందుకు లేరు?

`సీనియర్ల మాట అధిష్టానం వినకపోవడానికి పర్యవసానమా?

`నేతలంతా కలిసి పార్టీని మింగేయడమా?

` కాంగ్రెస్‌ లో కోవర్టులెవరు?

` రేవంత్‌ రెడ్డే అసలు కోవర్టా?

`పార్టీ నుంచి సీనియర్లను దూరం చేస్తున్నాడా?

` రేవంత్‌ రెడ్డి వెనక వున్నదెవరు?

`సీనియర్లు దూరమయ్యేలా పురిగొల్పుతున్నదెవరూ!

`ఎవరికీ సోయి లేదు…పార్టీ మునుగుతోందన్న బాధ లేదు.

` రేవంత్‌ మాట సీనియర్లు వినరు?

`సీనియర్లను రేవంత్‌ లెక్క చేయరు!

` కార్యకర్తలకు సమయమిచ్చే నాయకులే లేరు.

`పార్టీ కోసం ఆలోచించే తీరికే ఎవరికీ లేదు?

`ఎంతసేపు సొంత రాజకీయాలు…ఎజెండాలు.

` రేవంత్‌ రెడ్డి ని మార్చుతారా?

`సీనియర్లను వదులుకుంటారా?

`ఎవరికీ నచ్చని రేవంత్‌ దిగే దాక సీనియర్లు అలక మానరా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నట్లు తయారైంది కాంగ్రెస్‌ పార్టీ పరిస్దితి. ఇంతకీ కాంగ్రెస్‌పార్టీని సీనియర్‌ నాయకులు ఎందుకు వీడుతున్నట్లు అన్నదానికి రేవంత్‌ను బూచిగా చూపిస్తున్నారేమో! అన్న అనుమానం కల్గుతోంది. ఇంత కాలం పార్టీ మారాలంటే కారణం కనిపించని నేతలకు రేవంత్‌ రెడ్డి పిపిసి కావడం నచ్చలేదన్న సాకును ముందుపెట్టి తప్పుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లోనే కాదు, భవిష్యత్తులో కూడా తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్‌ లేచే పరిస్దితి లేదన్నది అర్ధమైనట్లుంది. పైగా పార్టీని నిలబెట్టేంత శక్తి లేదన్నది కూడా అర్ధమైంది. కాకపోతే మాకు పార్టీలో అవమానం జరుగుతోందన్న కుంటి సాకులు తప్ప మరేం కనిపించడం లేదు. అసలు రేవంత్‌రెడ్డిమీ సీనియర్లకు వున్న అభ్యంతరం ఏమిటన్నది ఎవరూ భహింరంగంగా చెప్పరు. కాకపోతే రేవంత్‌ మీద ఎప్పటిక్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే వుంటారు. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అసెంబ్లీ కమిటీ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆఫ్‌ ద రికార్డు చెప్పిన మాటలు మీడియా హైలెట్‌ చేసింది. దాంతో ఆయన అంతర్మధనంలో పడ్డారు. 

  ఓవైపు రేవంత్‌రెడ్డి మీద అగ్గిమీద గుగ్గిలమౌతూనే, మరో వైపు జగ్గారెడ్డి ఒకడుగు వెనక్కి వేస్తున్నాడు. 

ఎందుకంటే జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్షుడు కావాలన్న కోరిక బలంగా వుంది. కాకపోతే రేవంత్‌ మీద అలిగి మళ్లీ బిజేపిలో చేరే అవకాశం లేదు. 2014 ఎన్నికల తర్వాత జగ్గారెడ్డి బిజేపిలో చేరి, మెదక్‌నుంచి ఎంపిగా పోటీ చేశాడు. ఓడిపోయాడు. మళ్లీ తిరిగి బిజేపి గూటికి చేరుకున్నాడు. మళ్లీ బిజేపికి వెళ్లడానికి మొహమాటం అడ్డొస్తోంది. అందుకే పిట్ట బెదిరింపులు చేస్తున్నాడు. ఆఖరుకు ఓ దశలో నేనే ప్రత్యేకంగా ఓపార్టీ పెడతానన్న మాట కూడా మాట్లాడాడు. కాకపోతే సీనియర్లంతా రేవంత్‌ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నదానికి మాత్రం పూర్తి స్ధాయిలో క్లారిటీ లేదు. పైగా కాంగ్రెస్‌లో ఎక్కువ మంది సీనియర్లు రెడ్డీ సామాజిక వర్గ నేతలే. అయినా రేవంత్‌రెడ్డికి సహకరించేందుకు ఇష్టపడడంలేదు. రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలు మాత్రం సీనియర్లకు అసలే నచ్చడం లేదు. 

భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిపిసి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

 రేవంత్‌రూపంలో ఆ కోరిక తీరకుండా పోయింది. వచ్చే ఎన్నికలు రేవంత్‌ నేతృత్వంలోనే జరిగేలా కనిపిస్తున్నాయి. అందువల్ల కోమటిరెడ్డి ఆ ఆశ కూడా వదలుకున్నట్లే కనిపిస్తోంది. పైగా ఆయన ఊగిసలాటలో వున్నాడనే సంకేతాలున్నాయి. గతంలోనే వెంకటరెడ్డి కూడా కమలం గూటికి చేరుతున్నాడనే అనుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే మాత్రం ఇప్పటికే వెంకటరెడ్డి కూడా కాషాయ తీర్ధం పుచ్చుకునేవారు. కాకపోతే కాస్త ఓపికపడుతున్నాడు. ఎన్నికల నాటికి ఎటు వెళ్లాలో అన్నది నిర్ణయించుకునేలా వున్నాడు. రేవంత్‌రెడ్డిని పిపిసి అధ్యక్షుడిని చేయొద్దని సీనియర్లు ఎంతో పట్టుపట్టారు. కాని అధిష్టానం వినిపించుకోలేదు. సీనియర్ల మాట లెక్కలోకి తీసుకోలేదు. ఇదే వారికి వున్న ప్రధానమైన అభ్యంతరం. ఇంత కాలం పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం నచ్చలేదు. ఇలా అటు సీనియర్లు, ఇటు రేవంత్‌ కలిసి పార్టీని మింగేస్తున్నారన్న అపవాదు కూడా వుంది. 

 పార్టీలో వున్న కోవర్టులు వెళ్లిపోవచ్చు అని మాట్లాడిన రేవంత్‌రెడ్డే అసలైన కోవర్టు, కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పనిలో వున్నాడన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.

 అయితే కాంగ్రెస్‌లో సీనియర్ల మాటకు మాత్రమే ఎక్కువ విలువ. అదే రేవంత్‌రెడ్డి కొంప ముంచుతోంది. మీడియా కూడా సీనియర్ల వ్యాఖ్యలను హైలైట్‌ చేస్తుంటాయి. అదే రేవంత్‌ అనుచర వర్గం చెప్పే మాటలను పెద్దగా పట్టించుకోడంలేదు. దాంతో అసలు కాంగ్రెస్‌లో ఎవరున్నారు? ఎవరు వీడుతున్నారు? అన్నదానిపై స్పష్టత ఎక్కడా కనిపించదు. రేవంత్‌రెడ్డి పార్టీలోకి రావడం రావడంతోనే సీనియర్లను దూరం చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారన్న అపవాదు కూడా మోస్తున్నాడు. అయితే రేవంత్‌ రెడ్డి వెనక వున్నదెవరు? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అక్కడి అప్పటి సీనియర్లును తట్టుకొని నిలబడలేకే కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నాడన్నది కొందరి వాదన. చంద్రబాబు ఆదేశాల మేరకే, కాంగ్రెస్‌ను ఖాళీ చేసేందుకే ఆ పార్టీ గూటికి చేరి ఖతం చేసే పని మొదలు పెట్టారనేది మరి కొందరి వాదన. ఇలా ఎవరి వాదనలు ఎలా వున్నా, పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. అసలు ఉనికిలో వున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల దాకా కనీసం కాంగ్రెస్‌ పార్టీని గురించి చర్చించుకునే అవకాశం కనిపించింది. కాని ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంతో బలంగా వున్నా, దాన్ని బలహీన పర్చి ఒట్టిపోయిన గేదేను చేస్తున్నారు. పనికి రానిదాన్ని చేస్తున్నారు. పార్టీకి మూకుమ్మడిగా నేతలంతా కలిసి పాతర పెడుతున్నారు. 

  ఇలాగే కొనసాగితే పార్టీలో సీనియర్లంతా ఎవరి దారి వారు చూసుకుంటే పార్టీకి కొత్త రక్తం వస్తుందా? అన్న ఆశ కూడా ఎక్కడా కనిపించడం లేదు.

 అసలు జిల్లాలో కీలకమైన నేతలెవరు? అన్నదానిపై స్పష్టత లేదు. వారికి సరైన పిలుపులు లేవు. వారు చేస్తున్న పోరాటాలు లేవు. ఉద్యమాలు కూడా లేదు. ఇక రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అది మొదలౌతుందా? లేదా? అన్నది కూడా సందిగ్ధంగానే వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందస్తుకు వెళ్తాడన్న ఊహాగానాల నడుమ పాదయాత్ర చేపట్టినా అర్ధాంతారంగా ముగించుకోవాల్సి వస్తుంది. రేవంత్‌ రెడ్డి పాదయాత్రను ప్రభుత్వం అడుకున్నట్లు కాకుండా రేవంత్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా చేసినట్లౌవుంది. అందుకే రేవంత్‌ రెడ్డి పాదయాత్ర ప్రస్తావన కూడా సరిగ్గా ముందుకు పడడంలేదు. ఆయన కూడా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వడంలేదు. అందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు ప్రచారమే తప్ప, అడుగులు పడతాయన్న గ్యారెంటీ లేదు.

  ఇక తాజగా ఏఐసిసి అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గే దృష్టికి కూడా రేవంత్‌రెడ్డి వ్యవహారం వెళ్లినట్లు తెలుస్తోంది.

 ఒక వ్యక్తి మీద ఇంత మంది ఇన్ని రకాలుగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారన్నదానిని కూడా ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఖర్గే సీనియర్ల మాట విని, రేవంత్‌ను పక్కన పెట్టే అవకాశం కూడా వుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వారి మాటలు వినకుండా రేవంత్‌ రెడ్డిని గో హెడ్‌ అంటే సీనియర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే అవుతుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ తర్వాత బలంగా వున్న పార్టీ కాంగ్రెస్సే… కాకపోతే చేజేతులా కాంగ్రెస్‌ నాయకులు చేతి గుర్తు పార్టీని రాష్ట్రంలో కనుమరుగు చేసుకుంటున్నారు. వారికి ఉనికి లేకుండా చేసుకుంటున్నారు. రాజకీయాలకు దూరమౌతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *