పాటకెందుకు కన్నీళ్లు?
కళాకారుల వేదనలెన్నేళ్లు?
ప్రభుత్వ పథకాల మీద పాటలెవ్వి?
పాట లేని తెలంగాణ లేదు.
పాటకు తెలంగాణ కట్టిన పట్టం మరెక్కడా లేదు
ఆ పాటేమైంది? దాని జాడేమైంది?
ప్రభుత్వ పధకాలమీద పాటెందుకు మూగబోయింది?
తెలంగాణ పాట గొంతు నులుములుతున్నదెవరు?
కళాకారుల ఉసురు పోసుకుంటున్నదెవరు?
తెర వెనుక శక్తులెవ్వరు? ఆ వ్యక్తులెవ్వరు?
కళకారులను బతకనివ్వరా?
అధికారులకు కళాకారులు బానిసలకంటే హీనమయ్యారా?
హైదరాబాద్ ,నేటిధాత్రి: ఎక్కడైతే కళలు వర్ధిల్లుతాయో అక్కడ రాజ్యం, ప్రజలు సుభిక్షంగా, సుఖశాంతులతో వర్ధిల్లుతారంటారు. కళాకారుల సంతోషాలే కనిపించాలి. అందుకే పూర్వం రాజులు కవులు, కళాకారులకు పోషకులగా వుండేవారు. కళాకారులు కన్నీళ్లు పెట్టొద్దు. ఆకలితో అలమటించొద్దు. వారి ఆటపాటలతో సమాజంలో ఆనందం వెల్లివిరియాలి. ఆ కారణంతోనే అనాధిగా కళారూపాలు మన దేశంలో సంస్కృతిలో భాగమయ్యాయి. జీవన విధానమయ్యాయి. సంతోషాలకు సంకేతమయ్యాయి. మనసు నిర్మలానికి వేధికలయ్యాయి. పోరాటలకు చేయూతలయ్యాయి. ఎలుగెత్తే గొంతులయ్యాయి. ఎత్తిన పెడికిళ్లయ్యాయి. రణ నినాదాలయ్యాయి. సమాజ చైతన్యానికి దిక్సూచీలయ్యాయి. తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్ధేశమయ్యాయి. దూంధాంల రూపంలో తెలంగాణ సాకారానికి కారణమయ్యాయి.
దుఃఖాన్ని అదుముకొని ఖర్చీప్ అడ్డం పెట్టుకొని కళాకారులు కన్నీళ్లు తుడుచుకొని పైకి నవ్వుతున్నారు. కడుపు రగిలిపోతూ కుమిలిపోతున్నారు. క్షణక్షణం నలిగిపోతున్నారు. పాట కన్నీరు పెడుతోంది. గొంత గోస పడుతోంది. కలం కదల్లేకపోతోంది. అడ్డంకులతో ఆగమాగమౌతోంది. అవమానాలతో తలెత్తుకోలేకపోతోంది. విలువ లేకుండా వెలితికి గురౌతోంది. నిన్నటి దాకా చప్పట్లు కొట్టిన వాళ్లు, ముఖం దాచుకుంటున్నారు. గౌరవించిన వాళ్లే చులకనగా చూస్తున్నారు. సమయానికి జీతాలివ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కళాకారులు అలమటిస్తున్నారు. మలమల మాడుతున్నారు. చిన్నచూపుకు గురౌతున్నారు. ఇంకా చెప్పాలంటే చీధరించుకుంటుంటుంటే కూడా భరిస్తున్నారు. మహిళా కళాకారులను కొందరు వేధిస్తున్నారు? వేధనలకు గురిచేస్తున్నారు? పచ్చిగా చెప్పాలంటే కొందరు దుర్మార్గులు పాటను మంచానికి కట్టేస్తున్నారు. గొంతును నులిమేస్తున్నారు. దాంతో వాళ్లు దిశకన్నా కుమిలిపోతూ బతుకులీడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునేవారు ఎవరు? తోడేళ్లలాంటి సమాజాన్ని ప్రశ్నించిన పాట వలువలొలుస్తున్నారు? పాటకు పట్టం కట్టాల్సినచోట , తనువును పడుపుగా మార్చుతున్నారు. కళాకారుల కన్నీటికి కారణమౌతున్నారు. పరుపులెక్కిస్తున్నారు? పరువులు తీస్తున్నారు? వారు భయంకరమైన బతుకులీడుస్తున్నారు. పాడే గొంతులతో రోధనలు విని కొందరు సంబరపడుతున్నారు. కళాకారులు కాపాడండని అడగలేకపోతున్నారు. తమ బాధలన కైగట్టి పాడలేకపోతున్నారు. పాట లేకపోయినా పరవాలేదు. పాచి పని చేసుకున్నా బతుకినా భద్రంగా వుంటామనుకుంటున్నారు కళాకారులు. కన్నీళ్లు కడుపులో దిగమింగుకుంటున్నారు. ఇంతకన్నా ఏం చెప్పలేక, కాన రాని మంటల్లో మాడిపోతూ, బతికుండగానే బూడిదౌతున్నారు.
ఇది తెలంగాణలో జై కొట్టి, గొంతెత్తి పాడి, ఆడిన కళాకారుల దుస్ధితి. దీన స్ధితి. వారి పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న వ్యధలు వింటుంటే కన్నీరాగదు. తెలంగాణ ఉద్యమ కాలంలో కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. ఎండననక, వాననక, చలిని కూడా తరిమి ఆడి పాడారు. కాళ్లకు ఆనెలొచ్చి ప్రాణాలుపోయింతన పనైతున్నా, తెలంగాణ పాటలో బాధను మర్చిపోయారు. ఆకలి చంపుకున్నారు. నిద్ర వదులుకున్నారు. జీవితమే తెలంగాణ అని ముందుకుసాగారు. తెలంగాణానే జీవితం చేసుకొని బతికారు.
కళాకారులంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రాణం. పాటంటే కేసిఆర్‌కు ఎంతో ఇష్టం. తెలంగాణను కదిలించిందే కళాకారులని బలంగా నమ్ముతారు. ఓ సందర్భంలో సీమాంధ్రకు పది చానళ్లున్నా, తెలంగాణలో ఐదు వందల చానళ్లకు మించిన గొంతులున్నాయన్నారు. ఒక్కొక్క గొంతు ఒక్కో ఛానల్‌తో సమానమన్నారు. అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ కళాకారులకు ఎంతటి విలువలను అందించారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ వచ్చాక కళాకారులకు స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే గౌరవం కల్పించారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారిని గౌరవించారు. వారిని సమున్నతంగా చూడాలనకున్నారు. ప్రత్కేకంగా తెలంగాణ సాంస్కృతికి శాఖను కూడా ఏర్పాటు చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంత వరకు బాగానే వుంది. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. కళాకారులకు పని లేకుండా చేస్తున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వకుండా వేదిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుల చేత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అనేక పాటలు రాయించొచ్చు. కళారూపాలు ప్రదర్శించొచ్చు. కాని ఆపని అధికారులు చేయడం లేదు. ప్రపంచమే అబ్బురపడే అనేక రకాలైన పధకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. రైతు బంధు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. సాగునీటి ప్రాజెక్టులు. రిజర్వాయర్లు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా. మేకలు, గొర్రెల పంపిణీ, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ. చెరువుల్లో చేపల పెంపకం. కులవృత్తులకు ఆదాయాలకు చూపిన మార్గాలపై ఇప్పటికే అనేక పాటలు రావాల్సివుండే… కాని రాలేదు. ఇక ఆసరా, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే ఫించన్లపై కూడా ఎంతో ప్రచారం సాగాలి. కళాకారులకు చేతినిండా పని కల్పించాలి. కాని అదేదీ జరడంలేదు. కారణం ఎవరు? దాని వెనక వున్న వ్యక్తులెవరు? అదృష్యశక్తులెవరు? ప్రభుత్వం వెంటనే తెలుసుకోవాలి. కళాకరుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపాలి.
ఇంతకీ కళాకారులు ఉసురుపోసుకుంటున్నారో అందరకీ తెలుసు. కాని కళాకారులు చెప్పుకోలేక మధనపడుతున్నారు. సమాచార శాఖ అధికారుల ఆగడాలు. సాంస్కృతిక శాఖ డైరక్టర్ అనుసరిస్తున్న విధానాలు. జిల్లాస్ధాయిల్లో డిపిఆర్వోలు కళాకారుల కన్నీళ్లకు కారణమౌతున్నారని అంటున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వక వేధిస్తున్నారని అంటున్నారు. పైగా మహిళా కాళాకారుల చేత చెప్పుకోలేని పనులు చేసేందుకు ఒత్తిళ్లు చేస్తున్నారట. అందుకు జీతాలు ఆపుతూ వారిని వేధిస్తున్నారట. ఇలా ప్రభుత్వ ఉన్నతాధికారులు కళాకారులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సాంస్కృతిక శాఖలో ఏం జరగుతోంది. కళాకారుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న అధికారులెవ్వరో గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కళాకారులు కోరుతున్నారు. కళాకారులంటే ఆడమన్నట్లు ఆడే కోతులు కాదు. పోతు రాజులు. వాళ్లే రంగమెక్కారంటే అధికారుల బతుకులు తలకిందులే!!