కరోనా కట్టడికే ఇంటింటి జ్వర సర్వే

*వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్ లు*

– *అర్హులందరికీ క్షేత్ర స్థాయిలోనే వాక్సినేషన్ ఇస్తున్నాం*

– *సర్వే కు ప్రజలు సహకరించాలి*

– *కరోనా,ఒమిక్రాన్‌ విషయంలో భయం వద్దు*

– *అధిక ఖర్చు పెట్టుకుని ప్రైవేటు దవాఖానలకు పోవద్దు*

– *ఎంతమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధం*

– *జ్వర సర్వే క్షేత్ర పరిశీలనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు*

— *ఇంటింటికీ వెళ్లి స్వయంగా జ్వర సర్వే చేసిన ఆరోగ్య మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు*

– *టీకా వేసుకున్నారా…!! మాస్క్ ధరించండి.. జ్వరం , జలుబు , దగ్గు లాంటి లక్షణాలు ఉంటే చెప్పండి …!! జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలను ఆత్మీయంగా పలకరింపు*

 

.సిద్ధిపేట 22 జనవరి 2022 :

కరోనా వ్యాధి వ్యాప్తినీ అరికట్టేందుకు ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు.
ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య, పంచాయితీ రాజ్, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నదని ప్రజలంతా ప్రభుత్వం చేస్తున్న ఫీవర్ సర్వేకు సహకరించాలని వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు కోరారు.

రాష్ట్రంలో ఏలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రతీ రోజు లక్షకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు, 2 కోట్ల టెస్ట్ కిట్లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలెవరు గాబరపడొద్దని, ఆందోళన చెందొద్దని.. ప్రయివేటు ఆసుపత్రులకు పోవద్దని ఆరోగ్య మంత్రి ప్రజలకు సూచించారు.

జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ 37వ వార్డు అంబేద్కర్ నగర్ – కరీంనగర్ రోడ్డున శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించి ప్రజల యోగక్షేమాలపై దృష్టి సారించి ముందుగా ఈ వార్డులో ఆశా వర్కర్లు ఎవరినీ.. ఈ ప్రాంతంలో అందరూ రెండో డోస్ వేసుకోవడం పూర్తయ్యిందా అంటూ ఆశాలను ఆరోగ్య మంత్రి ఆరా తీశారు. ఏం అమ్మా రెండు టీకాలు వేసుకోవడం పూర్తయ్యాయా.. మూడో డోస్ టీకాకు మీకు ఇంకా ఎంత కాలం గడువుందని ముచ్చటిస్తూ.. ఒక్కో ఇంటి వారిని ఆప్యాయంగా పలకరింపులు చేస్తూ..
ఓ ఇంట్లో ఏం పోశవ్వ ఏన్ని టీకాలు వేసుకున్నావ్.? ఒకటే సారూ. మరీ మిగతావి ఎందుకెయ్యలేదని ఆరా తీస్తే.. సూదికి భయపడతారట.. అని దూరముందని తెలియగానే సూదికి భయపడతరా.. తల్లీ అంటూ కరోనా రాకుండా ఉండేందుకే టీకాలు అంటూ దగ్గరుండి టీకా వేయించారు.

ఆ తదుపరి ఏం అమ్మా మీ ఇంట్లో అందరూ టీకాలు వేసుకున్నారా.. ఇంటి గేటు దగ్గర నుంచే గ్యాదగోని రేణుకా ఇంట్లో 60 ఏళ్లు నిండిన అవ్వను.. నువ్వు ఎన్ని డోసులు వేసుకున్నావ్ తల్లీ ఆరా తీసి రెండని చెబితే, రెండు కాదు, మూడు టీకాలు పడాలి కదా.. ఆర్ఏంఓ కాశీనాథ్ ఆన్ లైనులో చెక్ చేసి మూడో టీకా బూస్టర్ డోస్ దగ్గరుండి ఇప్పించారు. ఇదే క్రమంలో అంజమ్మను పలకరిస్తూ.. నీకు మాస్కు లేదని, మాస్కు పెట్టుకోవాలని తన వద్దనున్న మరో మాస్క్ ఇచ్చారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికురాలు దేవవ్వతో ముచ్చటిస్తూ కరోనా టీకాలు వేసుకున్నావా.. ఆరోగ్యం బాగుందా అని అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఫీవర్ సర్వే సమయంలో జ్వరం, లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్ కిట్లు పలువురికి అందించారు.

 

*ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.*
*కరోనా కట్టడికి ప్రజలకు సూచనలు చేశారు.*

ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫీవర్ సర్వేలో భాగంగా నిన్న మొదటి రోజు 12 లక్షల 68 వేల మంది ఇళ్లకు మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందితో కలిసి 48 వేల మందికి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించినట్లు, వీరికి ఆరోగ్య కార్యకర్తలు నిత్యం ఫోన్ లేదా స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలు పరిశీలిస్తారని, వ్యాధి తీవ్రత, ఇతర సమస్యలు ఉంటే దగ్గరలోని దవాఖానకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
ఇంకా అవసరమైన వైద్యాన్ని ప్రజలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు.. ఎంత మంది ప్రజలు ఆసుపత్రికి వచ్చినా.. టెస్టింగ్ సెంటర్లు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు తెలిపారు. 5 నుంచి 8 వారాలు ఈ ఫీవర్ సర్వే చేయిస్తారని, కరోనా పరీక్షల కోసం లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లు పెంపు చేస్తామని వెల్లడించారు.

నిన్న ఒక్క రోజే 12 లక్షల మందిని పరీక్షలు చేశారని, హోమ్ ఐసోలేషన్ కిట్ ద్వారా కరోనా లక్షణాలు పోతున్నాయని, ప్రతీ నిత్యం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని, అన్నీ రకాల వైద్యం చేస్తామని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని, వారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. మందుల ద్వారా తగ్గుతుందని, ఆరోగ్య శాఖ చెప్పినప్పటికి ప్రతి రోజు సర్వే చేస్తున్నట్లు, గ్రామ ప్రజా రక్షణకై ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

గతంలో సెకండ్ వేవ్ ఉధృతి సమయంలో జ్వరం సర్వే చేసి 2 కోట్ల 25 లక్షల కిట్లు అందించిందని, ఫీవర్ సర్వే చేయడం పట్ల కేంద్రం, నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి సర్వే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చిందని, గత ఫీవర్ సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడిలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పోరాడుదామని వైద్య మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. పిల్లలు కోసం ప్రత్యేకంగా, పెద్దల కోసం ప్రత్యేక వార్డు లాంఛ్ ఏర్పాట్లు చేసినట్లు, ప్రతీరోజూ కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సర్వేలను జిల్లా కలెక్టర్లు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో ఆక్సిజన్ సామర్థ్యం పెంచినట్లు, గతంలో 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండగా, దాన్ని ఇప్పుడు 370 మెట్రిక్ టన్నుల సామర్థ్యంకు పెంచి ఆక్సిజన్ నిల్వలు సిద్ధంగా పెట్టినట్లు మంత్రి వివరించారు.

ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తుందని, గ్రామ ప్రజల ఆరోగ్య కోసం ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా కూడా వైద్య ఖాళీలు లేకుండా అన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, అన్నీ పోస్టులు భర్తీ చేసినట్లు వైద్య మంత్రి తెలిపారు. ఎక్కడైనా ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయమని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఆశా కార్యకర్తలు సమాచారం అందించే, వారి సేవలు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, దీంతో ప్రాణ ముప్పు ఉండదని, రక్షణ కవచంగా టీకా పని చేస్తుందని వైద్య మంత్రి భరోసా ఇచ్చారు.

సెలవు దినాలలో కూడా వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బందిని అందుబాటులో నిలిపినట్లు, లక్షణాలు ఉంటే ఆరోగ్య కార్యకర్తలకు చెప్పాలని, స్వంత వైద్యం మంచిది కాదని చేసుకోవద్దని, ప్రయివేటు దవాఖానలోకి పోయి మీ డబ్బులు వృథా చేసుకోవద్దని ఆరోగ్య మంత్రి ప్రజలకు సూచించారు.
మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, డీఏంహెచ్ఓ మనోహర్, జిల్లా నోడల్ వైద్యాధికారి కాశీనాథ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!