కడియమే ఆదుకుంటాడని ఆశ!

 

`తొలగింపబడిన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగుల ఆవేదన.

`ఆయన మీదే భరోసా.

`ఆది నుంచి ఎక్కువగా అండగా వున్నది కడియమే…

`వాళ్ల కొలువులు ఓ కొలిక్కి వచ్చేదాకా శ్రమించింది ఆయనే…

`తమ జీవితాలను నిలబెట్టేది కడియమే అని నమ్మకం.

`మంత్రి కేటిఆర్‌ దృష్టికి మరోసారి తీసుకెళ్లాలని బాధితుల విజ్ఞప్తి.

`పెద్దన్న పాత్ర పోషించి ఆదుకోవాలని వేడుకోలు.

`స్టేషను ఘనపూర్‌ బాధితులే వారిలో ఎక్కువ.

`51 మందిలో 17 మంది స్టేషను ఘనపూర్‌ వాసులే…

`కరుణించి కణికరించండని కోరుతున్నారు.

`తమ జీవితాలను నిలబెట్టాలని ప్రాదేయపడుతున్నారు. 

`ఒక్కసారి ప్రయత్నించి చూడండి…

`నేటిధాత్రి తో బాధితులు.

వాళ్లు కొలువులు పోయిన బాదితులు…ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకంతో బతుకుతున్న అభాగ్యులు…ఆరేళ్లుగా చకోర పక్షుల్లా తమ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్యులు…వారిని ఆదుకోవాలన్న మనసు అందరికీ వున్నా, ఎక్కడో తేడా కొడుతోంది…అందరూ సానుభూతి చూపించినా ఇంత వరకు వారికి న్యాయం జరగలేదు. కొలువులు రాలేదు. వాళ్లు చేసింది చిన్నాచితకా ప్రయత్నం కాదు…పెద్ద స్ధాయిలో కూడా చేయాల్సినంత ప్రయత్నం చేశారు. అందరి చేత అయ్యో అనిపించుకున్నారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఇంత కాలం వేచి చూస్తున్నారు. రోజులు గడిచే కొద్ది వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎదురు చూసి, ఎదురు చూసి కాలం కరిగిపోతోంది… వయసు పెరిగిపోతోంది…కొలువులు వస్తాయన్న నమ్మకంతో మరో అదే ప్రయత్నంలో ఏకంగా ఆరేళ్లు గడిచిపోతున్నాయి. పదేళ్లపాటు చేసిన ప్రభుత్వానికి చేసిన సేవలు వృధాగాపోయాయి…ఇప్పటికైనా దయతలచండి…కరుణించికాపాడండి…మా జీవితాలను నిలబెట్టండని అంటూ వేడుకుంటున్నారు…నేటిధాత్రితో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు…

 ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖలో పదేళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఉద్యోగులు వాళ్లు…అప్పటికి వాళ్లది ఒప్పంద ఉద్యోగాలైనా, ప్రభుత్వ కొలువు కావడం వల్ల జాబ్‌ గ్యారెంటీ వుంటుందని ఆశ పడ్డారు.

 చాలీ చాలని జీతమైనా అడ్జస్టు అయ్యారు. జీతాలు పెంచమని ఏనాడు కోరింది లేదు. వచ్చిన జీతంలో అన్నీ సర్ధుకొని బతికారు. కాని ఒక్కసారిగా తమ జీవితాలు తల కిందులౌతాయని ఊహించలేదు. కలలో కూడా అలాంటి పరిస్దితులు వస్తాయన్న ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు మరింతగా బాగుపడతాయని అనుకున్నారు. జీతాలు పెరుగుతాయనుకున్నారు. పర్మనెంటు కూడా కావొచ్చన్న నమ్మకం బలపడిరది. కాని అంతా తలకిందులైంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అప్పటికే నిండా అవినీతి మయమైన గృహనిర్మాణ శాఖను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో వీరి జీవితాలు వీధినపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖలో జరిగిన అవినీతికి ఈ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. కాకపోతే కొన్నిసార్లు జరిగే పరిణామాలలో ఎలాంటి సంబంధం లేకపోయినా నష్టం జరగొచ్చు. అయినా నష్టనివారణ చర్యలు కూడా చేపట్టొచ్చు. ఇదే ఇక్కడ కూడా జరిగింది. కొలువులు కోల్పోయిన వాళ్లంతా తమ తప్పేం లేదన్న సంగతి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ప్రభుత్వ పెద్దలనుంచి కూడా సానుభూతిని పొందారు. తమ కొలువులు ఇతర ఏ శాఖలోనైనా కల్పించమని వేడుకున్నారు. అందుకు ప్రభుత్వ వర్గాలు కూడా అంగీకరించాయి. అక్కడి నుంచి వారికి ఆశలు ఎంత పెరిగినా, ఎన్ని మలుపులు తిరిగినా, ఇంత వరకు కొలువులు రాలేదు. వారి ఆశలు తీరలేదు.

అండగా ఆది నుంచి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి , ఎమ్మెల్సీ కడియం శ్రీహరివారి తోడుగా వుంటూ వచ్చారు.

 వారి గురించి అనేక సార్లు పట్టించుకున్నారు. ఒకదారైతే చూపారు. కాని ఆయన కూడా పూర్తిగా వీరి సమస్యనే పట్టించుకుంటూ వుండలేరు. ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేశారు… ఇప్పటికే ఆయన కూడా చేయాల్సినంత సాయం చేసినప్పటికీ ఉద్యోగుల అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దేవుళ్ల చుట్టూ తిరిగారు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కాని పని కాలేదు. ఆఖరుకు మున్సిపల్‌ శాఖ మంత్రి దృష్టికికూడా కడియం శ్రీహరే వీళ్ల విషయం తీసుకెళ్లారు. దాంతో ఆయన కూడా వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని సూచించారు. దాంతో ఒకటికి రెండుసార్లు వరంగల్‌ మహానగర పాలక సంస్దలో తీర్మానాలు కూడ చేశారు. వారికి ఉద్యోగం ఇస్తున్నట్లే చేశారు. కాని ఇవ్వలేదు. ఆ మధ్య కొత్తగా మున్సిపల్‌ కార్పోరేషన్‌లో 450 మందికి చోటు కల్పించారు. ఆ ఉద్యోగాలలో వీరికి చోటు కల్పిస్తామని చెప్పారు. కాని ఎందుకో వారికి న్యాయం చేయలేదు. అటు ఉద్యోగ సంఘాల నాయకులు, ఇటు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ తలా ఓ చేయి వేసినా పని కాలేదు. కాని ఉప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కడియం శ్రీహరి చూపిన దారి మూలంగానే ఇంత దూరం వచ్చింది. వారికి ఓ ఆ భరోసా కల్గింది. ఇప్పుడు కూడా మంత్రి కేటిఆర్‌కు అసలు విషయం మరోసారి చెప్పాలంటే అది శ్రీహరి వల్లనే అవుతుందనేది ఆ భాధితుల ఆశ…వారి ఆశలను శ్రీహరి నిలబెడతాడని అనుకుంటున్నారు. అయితే ఈ 51 మందిలో 17 మంది స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన వారు కావడం గమనార్హం. దాంతో వాళ్లంతా కడియం శ్రీహరిని నమ్ముకున్నారు. ఎలాగైనా దారి చూపిస్తారన్న విశ్వాసంతో వున్నారు. ఎలాగైనా మంత్రి కేటిఆర్‌ దృష్టికి తమ విషయం తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నేటిధాత్రితో వారి గోడు వెళ్లబోసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!