జనవరి 18 నుంచి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభం ఈ నెల 12 లోగా జిల్లా ఇంఛార్జి మంత్రి సమక్షంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం.
వంద పని దినాలలో నిర్దేశిత తేదీలలో ప్రతి గ్రామం,
వార్డుల వారీగా కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలి
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా కేంద్రంలో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు, అధికారులతో వీడియో సమావేశంలో దిశా నిర్దేశం చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి నిర్వహించు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , సి.ఎస్. సోమేష్ కుమార్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు, సంభందిత జిల్లా అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ,
ప్రజల కంటి సమస్యలు తొలగించుటకు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని, ఇందులో భాగంగా రెండవ విడత కార్యక్రమం ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నందున షెడ్యూల్ రూపొందించుకొని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల్లో, వార్డులలో ప్రజలంతా కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించు అతి పెద్ద కమ్యూనిటీ స్క్రినింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు సాధించాలని మంత్రి తెలిపారు.
కంటి వెలుగు శిబిరాల్లో సమాచారం నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబులను అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పని చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు, జిల్లాలో గల జనాభాకు అనుగుణంగా వంద పని దినాలలో నిర్దేశిత తేదీలలో నిర్వహించే విధంగా శిభిరాలు నిర్వహించాలి అన్నారు.
ప్రతి కంటి వెలుగు బృందంలో 1 మెడికల్ అధికారి, 1 అప్తామాలజిస్టు, 2 ఎఎన్ఎం, 3 ఆశా,1 డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని, వీరికి కార్, అవసరమైన కంటి పరీక్షల యంత్రాలు సిద్దం చేసామని అన్నారు. వైద్య బృందంలో రోజుకు 1500 రూపాయల చోప్పున భోజనవసతి సౌకర్యం కోసం అందించడం జరుగుతుందని, బృందం సభ్యులు స్థానికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ లు చేయాలని మంత్రి సూచించారు.
కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడానికి ప్రతి రోజూ వెయ్యి రూపాయల చోప్పున పంచాయతీలకు, మున్సిపాల్టీలకు ముందుగానే విడుదల చేయడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కలెక్టర్ లకు సూచించారు.
జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేస్తూ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలని, మండల పరిషత్, మున్సిపల్ సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ అందజేయాలని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో, మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ప్రజలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గోనేలా ముందస్తు సమాచారం అందించాలని, స్వశక్తి మహిళా సంఘాలు, మెప్మా బృందాల సహకారంతో ప్రజలను మొబిలైజ్ చేయాలని సూచించారు.
కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని, రీడింగ్ కళ్ళద్దాలను జిల్లాలకు పంపుతామని, వాటిని పి.హెచ్.సి ద్వారా బృందాలకు పంపిణీ చేయాలని తెలిపారు.
సాధారణ వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా 927 డాక్టర్ లను నియమించడం జరిగిందని, ప్రజలకు అందుబాటులో, అనువైన స్థలాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే జిల్లాలో కంటి వెలుగుకు అవసరమగు ఆఫ్తామాలజిస్టుల, డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు శిక్షణ కల్పించడం జరిగిందని, రీడింగ్ కళ్లద్దాలు పరీక్ష చేసిన అదే రోజు, డిస్టెన్స్ స్పెసిఫిక్ కళ్ళద్దాలు నెల రోజుల్లో ప్రజలకు అందజేయనున్నట్లు తెలిపారు.
కంటి వెలుగు శిబిరాల నాణ్యత పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10 బృందాలను, ప్రతి జిల్లాలో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో విస్తృతమైన ప్రచారం కల్పించడంతో పాటు ఏ రోజు ఏ గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే విషయం ప్రజలకు ముందుగా తెలియజేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు కంటి వెలుగు దోహద పడుతుందని , దానిని విజయవంతం చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అధికారులు, డి.ఆర్. డి. ఏ విభాగం వాళ్ళు కలిసి పని చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు అందుబాటులో ఉంటూ కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని అన్నారు.
కంటి వెలుగులో అందిస్తున్న అద్దాలు కూడా చాలా బాగున్నాయని, అవసరం ఉన్న అందరికీ ఇవి అందేలా మనం కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు.
సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, కంటి వెలుగు పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో సిద్ధం చేసుకున్న షెడ్యూల్ కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. పంచాయతీ, మున్సిపాలిటీలో ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని, ప్రజలు అడిగే వివిధ సందేహాలు నివృత్తి కోసం ఎఫ్.ఎక్యు తయారు చేసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మునిసిపల్ శాఖ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ, కంటి వెలుగు అమలు చేసేందుకు మున్సిపల్ శాఖ ఉత్తర్వు సంఖ్య 779 జారీ చేసిందని, క్యాంపులో ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అనువైన ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలలో ఉన్న మెప్మా, మహిళా సంఘాలు, రిసోర్స్ పర్సన్స్ వినియోగిస్తూ క్యాంపులో నిర్వహణపై విస్తృత ప్రచారం కల్పించి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి
జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఐటీడీఏ పిఓ అంకిత్, డిఎంఅండ్ హెచ్ ఓ అప్పయ్య, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, జెడ్పిసిఈఓ ప్రసూన రాణి, డిపిఓ వెంకయ్య, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.