ఒక మాట- రెండు నాలుకలు.
క్లారిటీ ప్లీజ్ మంత్రి షెకావత్!?
కాళేశ్వరంపై పార్లమెంటు లో ఇచ్చిన సమాధానం అబద్దమా?
తాజాగా చేసిన వ్యాఖ్యలు నిజమా?
ఆ మాటేదో పార్లమెంటులో ఎందుకు చెప్పలేదు?
మునుగోడు ఉప ఎన్నికలను దృష్టిలో అబద్దాలు చెప్పడం భావ్యమా?
పార్లమెంటు లో చెప్పింది అబద్దమని ప్రకటించండి?
దేనికైనా నిజం ముఖ్యం!
అబద్దాలతో ఎల్లకాలం నమ్మించలేరు!
చెప్పే మాట, వేసే అడుగులో నిజముండాలి. నిజాయితీ వుండాలి. రాజకీయ నాయకులైతే సిద్ధాంతాలను అనుసరించి వుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మ ప్రభోదం కూడా నిజమే చెప్పగలగాలి. కాని ఏ ఎండకాగొడుగు పట్టే రాజకీయాలు ఈ మధ్య నాయకులకు బాగా అలవాటైపోతున్నాయి. గతంలో ఎప్పుడు చెప్పుకున్నా కూడా నాయకులు చెప్పిన మాట మీద నిలబడరు అనే వారే కాని, మభ్యపెట్టే అబద్దాలు ఆడరని అనుకునేవారు. కాని ఈ తరం రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయనే చెప్పాలి. లేకుంటే పార్లమెంటులో చెప్పే మాటలకు, బైట చెప్పే మాటలకు తేడా ఎందుకుంటుంది? తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ మాట్లాడిన మాటలు వింటే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ఎంతో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గతంలో అనేక సార్లు పార్లమెంటులో ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ ఎంపిలు, బిజేపి ఎంపిలు అనేక సార్లు దీనిపై పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రశ్నల రూపంలో కూడా అడిగారు. కేంద్రం ప్రభుత్వం అనేక సార్లు రాత పూర్వక సమాధానం కూడా చెప్పింది. అంతే కాదు తాజాగా కూడా నిజామాబాద్ ఎంపి అరవింద్ ఒకసారి, కాంగ్రెస్ పార్టీ పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికూడా పార్లమెంటులో ఈ ప్రశ్నను లేవదీశారు. అప్పుడు కూడా కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే సమాధనం సూటిగా స్పష్టంగా ఇదే గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం చెప్పారు. దాంతో బిజేపి, కాంగ్రెస్ వాళ్లు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం అని అనేక సార్లు తేలిపోయింది. అదేమిటో గాని తాజాగా అదే కేంద్ర మంత్రి కాళేశ్వరంలో అవకతకలు జరిగాయని అన్నారు. ఇదేం విచిత్రమో ఎవరికీ అర్ధం కాలేదు. గతంలో కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ పాలన భేషుగ్గా వుందని కితాబిచ్చినవాళ్లే అందరూ. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధలను ప్రశంసించిన వాళ్లే…కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను పొగిన వాళ్లే…కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన వాళ్లే…ఇప్పుడు కొత్త రాగం అందుకోవడం వింతగా వుంది. అంటే గతంలో గజేంద్ర సింగ్ షెకావత్‌తోపాటు, ఇతర కేంద్ర మంత్రులందరూ చెప్పిన మాటలు నిజమా? తాజాగా చెబుతున్న మాటలు అబద్దమా? పార్లమెంటులో అధికార సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రులు చెప్పిన మాటలు అబద్దమా? ఇప్పుడు బైట చెబుతున్న మాటలు నిజమా? ఏది నిజం? ఏది అబద్దం? మునుగోడు ఉప ఎన్నికల్లో అలా చెప్పకపోతే మునిగిపోతామని కాళేశ్వరం మీద బాధ్యత కల్గిన కేంద్ర పెద్దలు ఇలా చెప్పడం సబబేనా అన్నది చర్చ రాష్ట్రంలో జరగుతోంది.
కేంద్రంలో కూడా ఈ చర్చకు ఆస్కారమేర్పడిరది. పవిత్రమైన పార్లమెంటులో చెప్పిన మాటలకు, బైట చెప్పిన మాటలకు పొంతన లేకపోతే బిజేపి నాయకులు చెప్పే మాటల్లో ఏది నిజమో! ఏది అబద్దమో!! తెలుసుకోవడం ఆ పార్టీ నేతలకు కూడా ఇబ్బందే అవుతుంది. ఇప్పటికే మునుగోడు విషయంలో బిజేపి పులి మీద స్వారీ చేస్తోంది. అక్కడ బలం లేదని తెలిసినా, పార్టీ బలంగా లేదని తెలిసినా రాజగోపాల్‌ను చేర్చుకొని, నిన్నటిదాకా వచ్చిన క్రెడిట్‌ను చేజేతులా గంగలో కలుపుకునే స్వయంకృతాపరాధం బిజేపినే చేస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇది బిజేపికి ఎప్పటికీ మంచిది కాదు. నిజానికి బిజేపి దక్షిణాదిలో పాగా వేయాలంటే ఆయా రాష్ట్రాల ప్రగతికి తోడ్పాటునందించాలి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. పాలమూరు`రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయాలి. ఈ మధ్య ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. ఆ విషయం గురించి ఆలోచించి సాయం అందిస్తామని చెప్పి, పాజిటివ్ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సిన సమయంలో రాష్ట్ర ప్రాజెక్టులకు మోకాలడ్డుతూ ఎన్నికల్లో గెలవాలని చూస్తే ప్రజలు స్వాగతిస్తారా? ఇప్పటికే దిక్షణాదిపై బిజేపి శీత కన్ను వేసిందన్న వాదన బలంగా వున్నదే. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువు ప్రధానే అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నదే…మరి అలాంటి సమయంలో కూడా రాష్ట్రానికి తాము మేలు చేసే ప్రయత్నంలోనే వున్నామని నిరూపించుకోవాల్సిన తరుణంలో ఇంకా కోడి గుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాలే చేస్తామంటూ తెలంగాణ ప్రజలు అంత తొందరగా బిజేపిని నమ్ముతారని మాత్రం అనుకోలేం…! ఇప్పటికైనా రాష్ట్ర బిజేపి నాయకులు నిజం చెబుతున్నారా? అబద్దాలు చెబుతున్నారా? వారి మాటలను నమ్మి కేంద్ర పెద్దలు ఏం మాట్లాడాలన్నది విశ్లేషించుకొని మాట్లాడితే ఎంతో బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.