ఉమ్మడి పాలకుల పాపం! హోం గార్డులకు శాపం!!

`ఆర్డర్‌ కాపీ లేకుండా వెట్టి చాకిరీ చేయించుకున్న ఉమ్మడి పాలకులు

`జై తెలంగాణ అన్నందుకే పోయిన హోం గార్డు కొలువులు

`251 మంది తెలంగాణ బిడ్డలకు జరగాలి న్యాయం.

`పోయిన కొలువు రాక! బతకలేక!!బతుకులేక!!!

`ఆ బాధ్యత ను సీఎం కెసిఆర్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు అప్పగించారు.

`ఆనాటి నుంచి మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

` కొవ్వొత్తిలా కరిగిన కాలం!

` కనికరం కోసం నిరీక్షణం.

`ఆశలు మాయం.

`అవకాశాలు శూన్యం.

`కానరాని భవితవ్యం.

`ప్రభుత్వం మీదనే భారం.

` ఎదురుచూపులతో క్షీణిస్తున్న ఆరోగ్యం.

`ఇప్పటికే మంత్రుల భరోసా సాయం.

`ఆ ఆశలే వారికి సజీవం.

`గోడకు వేళాడుతున్న నాటి ఖాకీ దుస్తుల ఆరాటం.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కొందరి కష్టం పగవాడికి కూడా రావొద్దనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు చేసిన అన్యాయం ఎలాంటిదో వీరిని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ యువత అంటే ఉమ్మడి పాలకులకు ఎంత కోపమో! ఎంత నిర్లక్ష్యమో ఈ హోం గార్డులను చూస్తే చాలు. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో అవగతమవుతుంది. సుమారు దశాబ్ద కాలం పాటు తెలంగాణకు చెందిన వారి చేత వెట్టి చాకిరి చేయించుకొన్నారు. ఒక ప్రభుత్వం చేయకూడని పని. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాం. అన్యాయం జరిగితే పోలీసులకు పిర్యాదు చేస్తాం. అలాంటిది పోలీసుల శాఖకు అనుబంధమైన వింగ్‌ హోం గార్డులకే అన్యాయం జరిగింది. అది కూడా పోలీసు శాఖ మూలంగానే జరిగింది. మరి వాళ్లు ఎవరికి మొరపెట్టుకోవాలి. గోడు ఎవరికి వినిపించుకోవాలి. కేవలం తెలంగాణ ఉద్యమం మీద కోపంతో హోం గార్డులను ఉమ్మడి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలిగించింది. అర్థాంతరంగా ఉద్యోగాల నుంచి తీసేసి, వారి జీవితాలను చీకట్లు చేశారు. ముళ్లును ముళ్లుతోనే తీయాలని కుట్ర పన్నిన ఉమ్మడి పాలకులు తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడిరది. తెలంగాణ ఉద్యమ అణచివేతను తెలంగాణ నిరుద్యోగుల చేతనే అమలు చేయాలని చూసింది. అందులో భాగంగా హోం గార్డ్‌ ఉద్యోగాలను తెలంగాణ యువతకు ఎరగా వేసింది. కొలువుల ఆశ చూపింది. తెలంగాణ యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చింది. ఉద్యమ సమయంలో తెలంగాణ హోం గార్డులతో ఉద్యమానికి ఆటంకాలు సృష్టించాలని చూశారు. కానీ తెలంగాణ గడ్డ మీద వున్న ప్రేమతో ఆ హోం గార్డులు ఆ పని చేయలేకపోయారు. అది గమనించిన ఉమ్మడి పాలకులకు గిట్టలేదు. అప్పటి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దాంతో ఆ హోం గార్డులందరినీ తొలగించింది. అయినా ఆ హోం గార్డులు భయపడలేదు. భవిష్యత్తు గురించి ఆ సమయంలో గాభరా పడలేదు. ధైర్యం చెడలేదు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయన్న నమ్మకంతో వున్నారు. న్యాయం ఎప్పటికైనా తమ వైపే వుంటుందని నమ్మారు. ఎలాగైనా తెలంగాణ వస్తుందన్న అచెంచలమైన విశ్వాసం వారిని ముందుకు నడిపింది. మరో వైపు వారి న్యాయ పోరాటం సాగింది. అక్కడ వారికి చుక్కెదురైంది. తెలంగాణ వస్తుంది ఏనాటికైనా మళ్లీ మన కొలువు మనకు వస్తుందన్న నమ్మకం వారిలో ఆనాడే నాటుకుపోయింది. కానీ అది నేటి వరకు తీరక కలగానే మిగిలిపోయింది. పోయిన కొలువులు రాకుండా పోయాయి. ఆశ మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే వుంది. మన తెలంగాణ లో వేసుకుందామనుకున్న ఖాకీ డ్రెస్సు ఇంకా వారి ఇంటి గోడలకు వేలాడుతూనే వుంది. ఆ డ్రెస్సును నిత్యం ఎదురుచూస్తుంటే కాలం కొవ్వొత్తిలా కరిగిపోతూనే వుంది. కన్నీళ్ల వరద ఆగనంటోంది. తరుముతున్న ఆకలి కోసం పరుగులు, పోయిన కొలువుకోసం ఆగని దిగులు, కన్నీళ్లు నిత్యకృత్యమయ్యాయి. కళ్లలో ఒత్తులేసుకొని కొలువు కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

తెలంగాణ లో ఉద్యోగాలు కోల్పోయిన 251 మంది ఉద్యోగుల సమస్యలు 2018లోనే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 

ఆ సమయంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు కూడా తెలుసు. వారికి ఉద్యోగ కల్పన చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇదే సమయంలో అంతకు ముందు వున్న హోం గార్డుల జీతాలు పెంచిన సంగతి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పని చేసి, తొలగింపబడిన హోం గార్డులను తిరిగి వీధుల్లోకి తీసుకుంటామని సిఎం కేసిఆర్‌ మాటిచ్చారు. ఆ బాధ్యతను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు అప్పగిస్తున్నట్లు సిఎం అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఈ హోం గార్డులు కాళ్లరిగేలా తిరుగుతూనే వున్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ను నాటి నుంచి తరుచూ కలుస్తూనే వున్నారు. అంతే కాకుండా ప్రణాళికా సంఘం చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌ ను కూడా కలిశారు. హోం మంత్రి మహమూద్‌ అలీని కలిశారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డికి విజ్ఞాపన చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి సహకరించాల్సింత సహకరిస్తూనే వున్నారు. తెలంగాణ లోని అందరు ఎమ్మెల్యే ల లెటర్లు కూడా ప్రభుత్వానికి అందజేశారు. కాలం గడిచిందే గాని పని కాలేదు. తాజాగా మళ్ళీ వీరి ప్రస్తావన అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మంత్రి కేటిఆర్‌ దృష్టికి వెళ్లింది. ఆ విషయం పరిశీలిస్తానని కేటిఆర్‌ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వీరి విషయాన్ని మంత్రి కేటిఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. 

అప్పటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించేదో, తెలంగాణ యువత జీవితాలతో ఆడుకున్నారో, ఆగం చేశారో అర్థమౌతుంది. 

తెలంగాణ కు ఎలా అన్యాయం చేసే వారో ఈ హోం గార్డులే నిదర్శనం. తెలంగాణ ఉద్యమ అప్పటి ఉద్యమ కారుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో ఉవ్వెత్తున సాగుతున్న సమయం. అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున హోం గార్డులను రిక్రూట్‌ చేసుకున్నది. అందులో ఎక్కువ శాతం సీమాంధ్రుకే ఉద్యోగాల కల్పన జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాదులో సీమాంధ్రులకు హోం వార్డులుగా అవకాశం కల్పించారు. కొంతమంది తెలంగాణ యువతకు కూడా మొక్కుబడిగా అవకాశమిచ్చారు. ఉద్యోగ కల్పన చేశారే గాని ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదు. కేవలం ఐడెంటిటీ కార్డ్‌ లు మాత్రమే జారీ చేశారు. జీతాలిస్తూ పోయారు. వీళ్లను రెగ్యులరైజ్‌ చేయాల్సిన సమయంలో ఉద్యోగాల నుంచి తొలగించేశారు. వీరుతో పాటు అప్పట్లో కొలువుల్లో చేరిన సీమాంధ్రులకు మాత్రమే ఆర్డర్‌ కాపీలు ఇచ్చారు. వారి ఉద్యోగాలు పర్మనెంట్‌ చేశారు. తెలంగాణ హోం గార్డులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తున్నారన్న నెపంతో ఉద్యోగాల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లు న్యాయ పోరాటం చేస్తూనే వున్నారు. ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూనే వున్నారు. ఇప్పుడైనా తమను కనికరించాలని కోరుతున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!