బేతి వెనకాల బొంతు తీస్తున్న గోతులు?
సొంత పార్టీకే వెన్నుపోట్లు?
పార్టీ బలంగా వున్న చోట లుకలుకలు?
కారు జోరుకు వేస్తున్న బ్రేకులు?
సజావుగా సాగాల్సిన చోట సృష్టించుకుంటున్న సమస్యలు?
బేతిని బద్నాం చేస్తూ, టిక్కెట్టుపై బొంతు ఆశలు?
ఎదరులేని చోట తిరుగులేని కారుకు తూట్లు?
ప్రతి పక్షాలకు అనుకూలం కానున్న నాయకుల తీరు?
ఏం జరుగుతుందో అని కలవరపడుతున్న కార్యకర్తలు?
ఎటు వైపు నిలబడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు?
బలం లేని చోట బలం పెంచుకునేందుకు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. పార్టీ బలంగా వుంటే చాలు మనం బలంగా వున్నట్లే అనుకోవాలి. అంతే కాని బలంగా వున్న చోట పార్టీని బలహీనపర్చే పనులు కూడ చేయొచ్చని అక్కడక్కడ టిఆర్ఎస్ నాయకులే నిరూపిస్తున్నారనడంలో సందేహం లేదు. అలాంటి నియోజకవర్గాలలో ఉప్పల్ ఒకటి. తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోట. ఎన్నికలు ఏవైనా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిఆర్ఎస్ తప్ప మరొక పార్టీకి విజయావకాశాలు లేని నియోజకవర్గం. అలా పార్టీ వేళ్లూనుకోవడానికి నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చేసిన కృషి సామాన్యమైంది కాదు. జై తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమం మొదలు పెట్టి జెండా ఎత్తుకున్న నాడు ఉప్పల్‌లో గులాబి జెండాకు జై కొట్టింది బేతి సుభాష్‌రెడ్డి. గులాబీ జెండాను మోసిన నాయకుడు బేతి సుభాష్‌రెడ్డి. అప్పటి రాజకీయ పరిస్ధితులను సైతం ఎదిరించుకంటూ, జై తెలంగాణ నినాదం చేశాడు. జెండా పట్టుకొని వీది వీధి తిరిగారు. ప్రజలను చైతన్యం చేశారు. 2004 ఎన్నికల వరకు ఉప్పల్‌లో తెలుగుదేశం పార్టీదే హవా…ఆ తర్వాత కాంగ్రెస్…వామపక్షాలు బలంగా వుండేవి. 2001లో టిఆర్ఎస్ పురుడుపోసుకున్నప్పటి నుంచి బేతిసుభాష్‌రెడ్డి ఎత్తిన జెండాను, ఎత్తిన పిడికిలి దించలేదు. పార్టీని పెంచారు. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాడు.
2014 ఎన్నికల్లో కూడా బిజేపి తెలుగుదేశం కూటమి మూలంగా కారు గెలుపు చేజారిందే గాని, ఆ ఎన్నికల్లో కూడా బేతి సుభాష్ రెడ్డి గెలిచేవారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో తిరిగి 2018 టిక్కెట్ తెచ్చుకొని, ఎన్నికల్లో గెలిచి నిలిచారు. తన సుధీర్ఘ ప్రస్ధానాన్ని ప్రజలు గుర్తించేలా చేసుకున్నారు. 2001 నుంచి, 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చేవరకు కూడా హైదరాబాద్‌లో టిఆర్ఎస్ బలంగా లేదు. కాని నగర శివారు ప్రాంతాలుగా వున్న ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో టిఆర్ఎస్ బలంగానే వుంది. అందుకు ఆది నుంచి జెండాలు మోసిన వారి కృషి కూడా కారణం. అలాంటి ఉప్పల్ టిఆర్ఎస్లో ఇప్పుడు ఆధిపత్య పోరు మొదలైంది. 2014 ఎన్నికల సమయంలో తన రాజకీయ జీవితం ఏమిటో…తన ప్రస్ధానమేమిటో కూడా తెలియని బొంతు రామ్మోహన్ , జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పోరేటర్‌గా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మంత్రి కేటిఆర్ చొరవ మూలంగా మేయర్ పదవి బొంతు రామ్మోహన్‌కు కట్టబెట్టారు. ఐదేళ్లపాటు జిహెచ్ఎంసి మేయర్‌గా పనిచేశారు. 2018 ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ ఉప్పల్ నుంచి పోటీ చేయాలని ఉబలాటపడ్డాడు. 2001 నుంచి పార్టీ పట్టుకొని, నాయకులను వేలు పట్టుకొని నడిపించుకుంటూ, ఉద్యమాలు చేసుకుంటూ, పోరాటాలలో ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ సాగిన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని టిక్కెట్టు ఇవ్వాలని బొంతు రామ్మోహన్ పట్టుపట్డాడు.
ఒక దశలో సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్లారన్న ప్రచారం కూడా జరిగింది. తర్వాత మంత్రి కేటిఆర్ భుజ్జగింపులతో తన ఆలోచన ఉపసంహరించుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో బేతి సుభాష్‌రెడ్డికి మనస్పూర్తిగా పనిచేయలన్నది జగమెరిగిన సత్యమే అని పార్టీ నాయకులే అంటున్నారు. ఎప్పుడైతే తనకు టిక్కెట్ దక్కలేదో అప్పటినుంచి బొంతు రామ్మోహన్ కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొంటూ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో రికార్డు స్ధాయిలో వర్షాలు కురిశాయి. జన జీవనం అస్ధవ్యస్ధమైన సందర్భం చూసిందే…అలాంటి సమయంలో కాలన్నీల్లో నీరు చేరడం, అవి ఇళ్లలోకి చేరుకోవడం జరిగింది. కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్భందనంలో చిక్కుకున్నవి. ఆ సమయంలో ఎమ్మెల్యే బేతి సుబాష్‌రెడ్డి ఎంతో చొరవతో, ప్రజలకు అండగా వుండే ప్రయత్నం చేశారు. ఆదుకునే ప్రయత్నం చేశారు. కాలనీలలో బోట్లు వేసుకొని మరీ తిరిగారు. ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేశారు. ఆ నీళల్లో ఎలాంటి విష పురుగులైనా వుండొచ్చు. అయినా ఆయన వెరవలేదు. ప్రజలు ముఖ్యమనుకున్నాడు. బోట్లు వేసుకొని, అధికారులను వెంట బెట్టుకొని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు క్షేత్ర స్ధాయి పర్యటనలు చేశారు.
ఇలాంటి సందర్భాలను ఎవరైనా సహజంగా ప్రశంసించాలి. కాని సహాయం చేసేందుకు ముందుకొచ్చిన బేతిని అభాసుపాలు చేయడానికి ఇది కూడా అదునే అనుకొని రాజకీయం చేశారు. సహజంగా అలాంటి సమయంలో ప్రజలనుంచి కొంత వ్యతిరేకత ఎదురౌతుంది. అయినా బేతి సుభాష్‌రెడ్డి ప్రజల్లోనే వున్నాడు. వారికి సహాయ సహకారాలు అందించాడు. మరి ఆ సమయంలో బొంతు రామ్మోహన్ ఎక్కడున్నాడన్నదానిపై కూడా పెద్ద చర్చే జరిగింది. అప్పార్టుమెంట్లులోని మహిళలు మాట్లాడిన మాటలను పెద్దఎత్తున వైరల్ చేసిందెవరో తెలిసిందే..? అలా ఎమ్మెల్యేను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చిన సంగతి చూసిందే. ఇదిలా వుంటే బొంతు రామ్మోహన్ సతీమణి కార్పోరేటర్ శ్రీదేవి సైతం అడుగడుగునా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే వస్తున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఇక తాజాగా ఈసారి ఉప్పల్ టిక్కెట్టు నాదే అంటూ, తనకు పార్టీనుంచి ఆదేశాలు అందాయంటూ ప్రచారం చేసుకుంటూ ఉప్పల్ నాయకులను, కార్యకర్తలను బొంతు రామ్మోషన్ గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ. గత కార్పోరేటర్లను ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఎంత ప్రోత్సహించినా, వారిలో కొందరికి ఎమ్మెల్యే మీద కొంత అసంతృప్తి వుంది. దాన్ని ఆసరాగా చేసుకొని వారితో ఉప్పల్ రాజకీయంలో బొంతు వేలు పెడుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఏ ఎన్నిక కనిపించినా వాటిని గురించి ఆశించడం బొంతు రామ్మోహన్‌కు బాగా అలవాటైందని కూడా పార్టీలో చెప్పుకుంటున్నారు. మొదట ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించాడు. కాని నెరవేరలేదు. దాంతో ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్నాడు. అదీ కుదరలేదు. ఇక జిల్లాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల పదవులు పంపకాలు జరిగాయి. అప్పుడు కూడా మేడ్చల్ జిల్లా అధ్యక్ష పదవి ఆశించాడు. అక్కడా ఆశ నెరవేరలేదు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడై అక్కడినుంచే పోటీ చేస్తే ఎలా వుంటుందన్న దానిపై కొంత కాలం కసరత్తు చేశాడు. కాని కుదలేదు. ఇక మళ్లీ ఉప్పల్ మీద పడ్డాడు. ప్రతిపక్షాలను ఏగేస్తూ కూడా రాజకీయం చేస్తున్నాడని పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారట. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం చేసే స్ధాయిలో వుండి, బొంతు రామ్మోహన్ పార్టీని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదంటున్నారు. దక్కితే టిక్కెట్టు తనకే దక్కాలి…లేకుంటే బేతికి దక్కకూదడదు…దక్కినా గెలవకూడదన్నంత ధోరణిలో బొంతు రామ్మోహన్ రాజకీయాలు చేస్తున్నాడని సమాచారం. ఉప్పల్‌లో ఇలా బొంతు రామ్మోహన్ చర్యల మూలంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ప్రతిపక్షాలకు బలం చేకూరే పరిస్ధితి లేకుండా పోదు…? ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వెంటనే స్పందించకపోతే, పార్టీకి తీవ్రనష్టం తప్పదంటున్నారు.