`చెప్పుకోవడానికి పాత చరిత్ర తప్ప మిగిలిందేమీ!
`ఇప్పటికీ అదే చరిత్ర-దాన్ని చెప్పుకోకపోతే పూట గడవదు!
`పదే పదే పాత రోజులు చెప్పుకుంటే తప్ప మనుగడ లేదు…
`కాదని పోయినా పాత నీడ ఎక్కడా దొరకడం లేదు.
`కొత్త చోటులో అంత విలువ లేదు…
`గుర్తింపు దేవుడెరుగు…
`అప్పుడు తొందరపడ్డారు….
`ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు….
`అహం మింగిన రాజకీయంలో కొట్టుకుపోతూనే వున్నారు.
`నిలకడ లేని రాజకీయాలు కోరి కోరి తెచ్చుకున్నారు….
`అక్కడే వున్నా బాగుండేది…కనీసం చెప్పుకోవడానికి చరిత్రైనా మిగిలేది!
`ఇప్పుడు అదీ లేదు…ఇదీ లేదు!
`నాలుగు రోజులు పోతే ఈ మాత్రం రాజకీయం కూడా వుండదు!
`అంతే…చే జేతులా చేసుకున్నది…చెడగొట్టేదాకా వదలదు!
`చరిత్ర గతిలో కొత్త భవిష్యత్తుకు చోటే లేదు!
`పాతది గాయమనుకున్నారు…కొత్తది విషమని తెలిసి మింగేశారు!
`మింగలేక కక్కలేక కిక్కురు మనకుండా వున్నారు.
`నోరుకు పని చెప్పిన చోట నుంచి నోటికి కుట్టేయించుకునేదాకా!
తృప్తి లేని రాజకీయ జీవితానికి అన్నీ అసంతృప్తులే అని సామెత. తనకు దక్కాల్సినంత దక్కడం లేదన్నదే నిరంతరం మదిలో తపన పేరుకుపోతుంది. తమకు తాము ఎక్కువగా ఊహించుకునేవారికే ఇది ఎక్కువగా ఎదురౌతుంది. రాజకీయాలో అవకాశాలు కూడా ఓ అధ్భుతమే…అదృష్టమే…అది దక్కకపోతే తమను తాము నిందించుకోవాల్సిందిపోయి, ఎదుటి వారి మీద నిందలేసి ఏదో సాధించిన వారు ఎవరు లేరు? ఎంత సేపు ఇతరుల మీద నెపం నెట్టేయడానికి చేసే ప్రయత్నం తప్ప తమ ప్రయత్న లోపం గుర్తెరగరు. ఇదే చాలా మందికి శాపంగా మారుతోంది. అలా తమను తాము ఎంతో గొప్పగా ఊహించుకొని, ఎవరెస్టు శిఖరమంత ఎత్తనుకొని, ఆగమేఘాల మీద ఆవేశపడి కోరికోరి కష్టాలు తెచ్చుకున్నవారే ఎక్కువ. అలాంటి వారిలో టిఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతల్లో ఈ మనస్తత్వం ప్రస్పుటంగా కనిపిస్తుంది. వాళ్లు ఏదో ఒక పార్టీ పంచన వుంటే తప్ప నిలవలేరు. గెలవలేరు. కాని వారి గెలుపు, నాయకత్వ పటిమ మొత్తం వారి సొంతమనుకుంటారు. అలాంటి వారిలో టిఆర్‌ఎస్‌లో ఎంతో వెలుగు వెలిగి, ఆ పార్టీ నుంచి బైటకు వెళ్లి, గుడ్డిదీపమైన వాళ్లే ఎక్కువ. అలాంటి వారు కొద్దిగా ఓపిక పడితే వారికి ఎంతో రాజకీయ భవిష్యత్తు వుండేది. కాని చేజేతులా చేసుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. చెప్పుకోలేనంత అక్కసు నింపుకున్నారు. దాన్ని వెల్లగక్కుతున్నారే గాని, లోలోన మాత్రం మధనపడాల్సినంత మధనపడుతున్నారు.
టిఆర్‌ఎస్‌లో వున్నప్పటి విలువకు ఇప్పుడున్న విలువను చూసుకుంటూ, కుమిలిపోతున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి సిద్ధిపేట ఎంపిగా తెలుగుదేశం నుంచి గెలిచి, తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌తో కలసి టిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే, మంత్రి అయిన విజయరామారావు రాజకీయం ఇదే కోవకు వస్తుంది. ఎంతో నమ్మకంతో ఆయనపై వున్న విశ్వాసంతో విజయరామారావుకు కేసిఆర్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేయించారు. గెలిపించారు. 2004లో అప్పటి కాంగ్రెస్‌పార్టీ వైఎస్ ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ భాగస్వామ్యమైన సందర్భంలో విజయరామారావును మంత్రిని చేశారు. తెలంగాణ విషయంలో నాడు అప్పటి మంత్రి ఎం. సత్యనారాయణ రావు చేసిన సవాలు ఓ వైపు, కేంద్రం తెలంగాణ విషయంలో చేస్తున్న జాప్యానికి నిరసనగా టిఆర్‌ఎస్ మంత్రులు ప్రభుత్వం నుంచి బైటకు వచ్చారు. కొంత కాలానికి అప్పటి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికల వెళ్లారు. దాదాపు 16 నెలల పాటు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినా, ఉద్యమ పార్టీలో వున్నా విజయరామారావు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో లేని రాజకీయం నెరిపారు. దాంతో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో విజయరామారావు ఓడిపోయారు.
అసంతృప్తిని నిండా నింపుకున్నారు. మళ్లీ ఇక ఎన్నికల్లో గెలిచింది లేదు. తన వ్యక్తిగత నాయకత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే యత్నంలో భాగంగా ఆయన ఉద్యమ నాయకుడైన కేసిఆర్ మీద అనవసర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తనకు ప్రాదాన్యత దక్కడం లేదన్న ఆలోచనతో పార్టీ వీడారు. అంతే తప్ప ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనను పక్కనపెట్టలేదు. ఇక చేయాల్సినంత రాజకీయ విన్యాసం చేస్తూ వచ్చారు. ప్రజల్లో చులకనయ్యారు. తెలంగాణ వాదులంతా నమ్మిన కేసిఆర్ దీక్షను కూడా పలుచన చేసే వ్యాఖ్యలు చేస్తూ, ఇటీవల ఆయనపై వున్న నమ్మకాన్ని కూడా మరింత పోగొట్టుకుంటూ, తనకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ మనసును సంతృప్తిపర్చుకుంటున్నాడు. ఇదే దారిలో మరో నాయకుడు వున్నారు. వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్. ఆయనకు కూడా కేసిఆర్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. కాని ఆయన కూడా దాన్ని నిలుపుకోలేదు. కాకపోతే ఆయనకు టిఆర్‌ఎస్ నుంచి దూరమయ్యాననే బాధ ఇప్పటికీ తొలుస్తున్నట్లే కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడైనా బైట సభల్లో జనాన్ని చూసి చెప్పే మాటలకు, వ్యక్తిగత ఇంటర్యూల సమయంలో చెప్పే విషయాలకు చాలా తేడా చూపిస్తుంటాడు. పైకి ఎన్ని మాట్లాడుకున్నా, లోలోన తన మధనపడుతున్నట్లే కనిపిస్తుంటారు. కాని ఇప్పుడు మధనపడి ప్రయోజనం లేదు. కాలం కరిగిపోయాక ఆలోచించి వృధా! మరో ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్. నిజానికి ఉద్యమ సమయంలో ఒక అధికారిగా ఆయనకు కేసిఆర్ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కల్పించారు. కేసిఆర్ కేంద్ర మంత్రిగా వున్న సమయంలో ఏమేం జరిగాయన్న వాటిని చెబుతూ, తనకు ఇచ్చిన ప్రాదాన్యతను గురించి గొప్పగానే చెప్పుకుంటారు. ఇక ప్రజారాజ్యం పార్టీ విషయంలో జరిగిన సంప్రదింపులకు కూడా తననే ముందు పెట్టాడని కూడా చెప్పుకుంటారు.
అంత ప్రాదాన్యతనిచ్చిన కేసిఆర్‌ను ఎందుకు వీడాల్సివచ్చిందన్నదానికి మాత్రం స్పష్టమైన సమాధానం వారిలో లేదు. అంటే ప్రతీసారి తనకు పదవి ఇవ్వకపోవడమే తనకు జరిగిన అన్యాయమన్నది వారి మనసులో గూడుకట్టుకొని వుందన్నది మాత్రం బైట పెడుతుంటారు. తెలంగాణ ఉద్యమసమయంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియెజవర్గ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచారు. దిలీప్‌కుమార్ దురదృష్టం ఇక్కడ కూడా వెంటాడిరది. నాడు తీసిన లాటరీలో దిలీప్ కుమార్‌కు రెండేళ్ల సమయమే వచ్చింది. అయినా మళ్లీ కేసిఆర్ టిక్కెట్ ఇచ్చారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. గెలిచారు. కాని కొన్ని హద్దులు దాటారు. పార్టీకి దూరమయ్యారు. తన అహానికి బానిసై పార్టీని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడా ప్రాధాన్యత లేక విలవిలలాడుతున్నాడు. ఇక మొన్నటికి మొన్న పార్టీకి దూరమైన వారిలో మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్. ఆయనకు పార్టీలో ఎనలేని ప్రాదాన్యతనిచ్చారు. ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత వెంటనే ఎమ్మెల్సీని చేశారు. ఉద్యమ సమయంలో ఆయనపై ఉమ్మడి ప్రభుత్వం కక్ష్య కట్టిందని తెలిసి, ఎమ్మెల్సీని చేశారు. అప్పటి ప్రభుత్వం నుంచి ముప్పు తప్పించారు. ఇది మాత్రం స్వామి గౌడ్‌కు గుర్తులేదు. ఆయనపై అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు కూడా వున్నాయి. ఉద్యోగుల ఇంటి స్ధలాల గోల్ మాల్ కూడా ఆయన నెత్తిన పడిరది. ఆయన వల్ల నష్టపోయినట్లు ఎంతో మంది ఉద్యోగులు కూడా భహిరంగంగానే విమర్శలు చేశారు. కాని ఉద్యమకారుడిపై ప్రభుత్వం కక్ష్య కట్టిందని గ్రహించి, కేసిఆర్ ఆయనకు 2012లోనే ఎమ్మెల్సీని చేశారు. అంటే ఆయనకు ఎంత ప్రాధాన్యత దిక్కిందో అర్దం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ వచ్చాక, తొలి మండలి చైర్మన్‌గా స్వామీ గౌడ్‌కు అవకాశం కల్పించారు. చరిత్రలో స్దానం కల్పించారు. కాని అది ఆయన నిలుపుకోలేదు. మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదని అసంతృప్తికి లోనయ్యారు. పార్టీనుంచి బైటకు వెళ్లిపోయారు.
బిజేపిలో చేరారు. చేతులు కట్టుకొని కూర్చుకున్నారు. చెప్పుకోవడానికి గతం తప్ప వర్తమానం ఏమీ లేదు. భవిష్యత్తు ఎలా వుంటుందో అన్నది ఇప్పుడేం చెప్పుకునేటట్లు లేదు. ఇక రాములమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ కోసం కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు వదలుకొని తెలంగాణ ఉద్యమంలో చేరింది. తల్లి తెలంగాణ అని రాజకీయ పార్టీ ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమ ఐక్యత కోసం టిఆర్‌ఎస్‌లో తన పార్టీని విలీనం చేసింది. అక్కడ కూడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు పాత్రను పోషించింది. కాని తర్వాత ఏం జరిగిందన్నదానిపై ఆమెకు కూడా పెద్దగా క్లారిటీ లేకుండాపోయింది. తనను పార్టీలో పొగబెడుతున్నారని అనుకున్నారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా ఇమడలేకపోయారు. బిజేపి తీర్ధం పుచ్చుకున్నారు. పుట్టింటికి వెళ్లినంత సంతోషంగా వుందన్నారు. తాజాగా మళ్లీ బిజేపిలో కూడా తన పరిస్ధితి ఏమీ మారలేదన్న సంకేతాలు పంపారు. అంటే భూమి గుండ్రంగానే వుందన్న సంగతి గుర్తుకొచ్చే సరికి పుణ్యకాలం పూర్తయినట్లే కదా? లేడీ అమితాబ్ అని పేరు సంపాదించిన రాములమ్మకు బిజేపిలో కేంద్ర స్ధాయిలో ప్రాధాన్యత కల్పించాలి. కాని అక్కడా గుర్తింపు లేదు. ఇక్కడా గుర్తింపు లేదు. పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో కొంత పార్టీ ప్రాధాన్యత కల్పించినట్లు కనిపించినా, ఇప్పుడు పార్టీలో ఆమెకు పెద్దగా ప్రాదాన్యం లేకుండాపోయిన విషయం ఆమె మీడియాతో పంచుకోవడంతో ఇతర పార్టీలలో వారికి ప్రాధాన్యత అన్నది మేడి పండులాంటిదే అన్నది అర్ధమైపోయిందన్న తెలుస్తోంది.
మరో ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన దాసోజు శ్రమణ్. ఆయనకు టిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం ఎంతో ప్రాధాన్యత వుండేది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమ సమయంలో డిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ దాసోజును వెంటబెట్టుకొని వేళ్లేవారు. కేసిఆర్ ఎంత కాలం డిల్లీలో వుంటే అంత కాలం ఆయనను కూడా డిల్లీలో వుండేవారు. కొన్ని వందల సార్లు డిల్లీ పర్యటనల్లో దాసోజు కేసిఆర్ వెంటే వున్నారు. అంతటి ప్రాధాన్యతనిచ్చారు. అది ఆయన గొప్పదనంగా దాసోజు శ్రమణ్ అనుకున్నారు. తనకు ఎనలేని ప్రాధాన్యత కేసిఆర్ కల్పిస్తున్నారని అనుకోలేదు. దాంతో తనలోని అహాం బైటకు వచ్చింది. నేనింత కొట్లాడిన నాకు టిక్కెట్టు ఇవ్వరా? అని మధిపోరాటం ఆయనలో మొదలైంది. 2014లో అవకాశం రాలేదన్న కోపం ఆయనను పార్టీకి దూరం చేసింది. ఆ సమయంలో కొద్ది ఓపిక ఆయనకు వుంటే ఈ రోజు పార్టీలో ఎంతో క్రియాశీలకపాత్రలో వుండేవారు. ఇదే సమయంలో కర్నె ప్రభాకర్ లాంటి నాయకుడు ఎంతో లౌక్యంతో మొదిలారు. ఆయనకు ఎమ్మెల్సీగా తర్వాత కాలంలో అవకాశం దక్కించుకున్నారు. దాసోజు కూడా కొద్దిగా ఓపిక తెచ్చుకొని కొన్ని రోజులు అసంతృప్తికి కళ్లేమేస్తే పోయింది. గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు. తనను తానుగా పార్టీ నుంచి బైటకు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీకి ఐదారేళ్లు సేవ చేశాడు. అక్కడ కూడా అసంతృప్తిని భరించలేక బిజేపిలో చేరారు. అక్కడేమైనా వుందా? అక్కడ ఆ మాత్రం కూడా గౌరవం లేకుండాపోయింది. ఆయననను పట్టించుకున్నవారు లేకుండాపోయారు. కనీసం కాంగ్రెస్‌లో వున్నా ఏదో ఒక ప్రాధాన్యత వుండేది. ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీదే మాట్లాడితే మరింత ప్రాధాన్యత కల్గుతుందనుకున్నాడు. నాలుగు రోజులు మీడియా హడావుడిలో కనిపించి, ఇప్పుడు కనీసం తన మాటకు విలువ లేకుండా చేసుకున్నాడు. ఇలా ఇంకా చాలా మంది వున్నారు. కేసిఆర్ మీద అలిగి వెళ్లిన వాళ్లు, ఎన్ని పార్టీలు తిరిగినా, టిఆర్‌ఎస్‌లో అనుభవించినంత స్వేచ్ఛ ఎక్కడా లేక, ఇప్పుడు చింతిస్తున్నారు…మళ్లీ టిఆర్‌ఎస్ చెంతకు చేరేందుకు తహతహలాడుతున్నారు. కాని పుణ్యకాలం ఏనాడో వెళ్లిపోయంది. ఎక్కాల్సిన రైలు ఒక జీవితం కాలం లేటు అన్న సామెతను గుర్తు చేసుకునే రాజకీయం జీవితానికి ఎదురెళ్లి కోరి కోరి తెచ్చుకున్నారు…లేని గొప్పదనపు చట్రంలో ఇరుక్కుపోయారు… తమకు తామే పద్మవ్యూహాన్ని పన్నుకొని బైటకు రాలేకపోతున్నారు.