`అందమైన గూ(ఇ)ళ్లు సులువే…
`నేటిధాత్రికి కొందరు సంధించిన ప్రశ్నలకు సమాధానాలివే…
`కామారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డి ఒక్కరే వందల ఇండ్ల నిర్మాణానికి చేయూతనిచ్చాడు.
`గుజరాత్ భూకంపం అప్పుడు దాతలే వేల మందికి ఇండ్లు నిర్మించారు.
`లాతూర్లో అలాగే నిర్మించారు… ఆ ప్రోత్సాహంతోనే అనేక మంది కదిలారు.
`ఈ మధ్య ఓ అమ్మాయు తన పెళ్ళి ఖర్చుతో పేదవారికి ఇండ్లు నిర్మించిన సంఘటన
వెలుగులోకి వచ్చింది.
`ప్రభుత్వం ఎప్పుడు పిలుపునిచ్చినా రెడీ అనే శ్రీమంతులున్నారు.
` కాదనుంకుంటే ఏదీ కాదు….
`అసాధ్యమని కూర్చుంటే ఏదీ చేయలేము…
`సంకల్పం వుంటే సాధ్యమే….తెలంగాణ మలి తరం వైభోగమే.
`అందరూ కలిస్తేనే అది సమాజం…
`తలా ఓ చేయి వేస్తేనే ప్రగతి రథం పరుగులు.
`అందుకు ఆసక్తి కనబర్చుతున్న వాళ్లు మన కళ్ల ముందే వున్నారు…
`గీరమ్మని పిలవండి…వారి చేయూతను రాష్ట్రానికి అందివ్వమనండి.
`బంగారు తెలంగాణలో మరో నవశకానికి శ్రీకారం జరుగుతుంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
సంకల్ప సిద్ధి ఎంతటి కార్యమైనా నెరవేర్చుతుంది. పట్టుదల వుంటే ఎంతటి పనైనా పూర్తి చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలోనూ పేదలకు ఇండ్ల నిర్మాణం అన్నది కూడా పూర్తి చేయొచ్చు. దేశం మనకేమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏమిచ్చామన్నది ముఖ్యమనే సూక్తిని గుర్తించుకున్న వాళ్ల్లు చాలా మంది వున్నారు. కన్న ఊరు, తమ జిల్లా, తన రాష్ట్రం అన్న మమకారం చాలా మందిలో వుంటుంది. అలాంటి వారికి ప్రజలకు సేవ చేయాలన్న తలంపు కూడా వుంటుంది. కాకపోతే వారికి సరైన వేధిక అవసరం. కొందరు ముందుకొచ్చి స్వతాహాగా పేదలకు చేయూతనిస్తుంటారు. కొందరు సమాజానికి దూరంగా వుంటారు. కాని వారికి కూడా సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచన కూడా వుంటుంది. అలాంటి వారందరినీ ఏకం చేస్తే, ఒకచోటకు చేర్చి వారు చేయాల్సిన సేవ గురించి వివరిస్తే తప్పకుండా ముందుకొస్తారు. ఎంతో కొంత సామాజిక సృహ వున్న చాలా మంది తాము ముందుకొస్తామని కూడా చెబుతున్నారు. అలాంటివారంతా కలిస్తే ఎలాంటి విజయం సిద్ధిస్తుందో చూద్దాం.
కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మానవతావాది అయిన సుబాష్రెడ్డి గురించి ముందు చర్చిద్దాం.
ఆయన రియలెస్టేట్ వ్యాపారి. ఆయన సంపాదించే ప్రతి రూపాయిలో కొంత పేదల కోసం ఎప్పుడూ ఖర్చు చేస్తుంటారు. ఇప్పటి వరకు కోట్లలో వితరణలు చేశాడు. కొంత కాలం పాటు గుప్తదానాలు చేసేవారు. తర్వాత కాలంలో ఆయన చేసే సేవ గురించి ఆనోట, ఈనోట విని చుట్టపక్కల గ్రామాల వాళ్లు వారి వారి గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలు చేపట్టినప్పుడు విరాళాల కోసం రావడం మొదలుపెట్టారు. అలా వచ్చిన వారిని ఎవరినీ కాదనకుండా తన వంతు చేయూతనిందిస్తుండేవారు. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు గదలు పథకం( డబుల్ బెడ్ రూం) అమలుకు శ్రీకారం చుట్టింది. దాంతో ఆయన పుట్టిపెరిగిన గ్రామమైన బీబీపేటలో ప్రభుత్వం మంజూరుచేసిన డబుల్ బెడ్లలో ప్రతి ఇంటికి తన సొంత సొమ్ము అదనంగా లక్ష రూపాయలకు పైగా చేర్చారు. ఒక సర్వాంగ సుందరమైన కాలనీగా మార్చేశారు. ఆ గ్రామంలో వాటిని ప్రభుత్వం నిర్మించి ఇచ్చే డబుల్ బెడ్రూంల్లా కాకుండా విల్లాలను తలపించేలా నిర్మాణం చేసి ఇచ్చాడు. అలా కోట్ల రూపాయల వితరణతో కొత్త కాలనీ ఏర్పాటు చేశారు. ఇలా ముందుకు వచ్చేందుకు చాలా మంది మన రాష్ట్రంలో వున్నారు. మన రాష్ట్రం నుంచి వెళ్లి విదేశాల్లో స్ధిరపడిన వాళ్లు కూడా తమ ప్రాంతం మీద మమకారంతో చేయూతనిందిచేందుకు సిద్ధంగా వున్నారు.
తాజాగా ప్రభుత్వం స్ధలం వున్న ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఇచ్చేందుకు సమ్మతించింది.
ఓ వైపు డబుల్ బెడ్రూం పథకం సాగుతుండగానే మరో బృహత్తరమైన ఈ పధకం ద్వారా స్ధలం వున్న వారెందరికో మేలు జరగనున్నది. పాత ఇంటి స్ధానంలో కొత్తది నిర్మాణం జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించబడుతుంది. అయితే ఈ పథకంలో చేయూతనిందించేందుకు కొంత మంది ముందుకొస్తున్నారు. ఇలాంటి ఇండ్ల నిర్మాణం సహజంగా గ్రామాలలో ఒక పది నుంచి ఇరవై మంది నిర్మించుకునే అవకాశం వుంది. వాటి నిర్మాణానికి అవసరమైన అదనపు సొమ్మును కలిపి, పేదలకు ఇండ్లు నిర్మించడం పెద్ద సమస్య కాదు. అందువల్ల శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఊరు మొత్తం దత్తత తీసుకున్నట్లు ఎంతో మంది సేవ చేయాలన్న ఆలోచన వున్నవారు వున్నారు. వారికి ఒక అవకాశం ఇచ్చినట్లుంటుంది. ప్రజలకు సేవ చేశామన్న తృప్తిని వారికి మిగిల్చినట్లుంది. తరతరాలు వారి గురించి ఆయా గ్రామాల్లో గుర్తుంచుకునేందుకు అవకాశం వుంటుంది. వారి కీర్తి తరతరాల చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఇక్కడ కొన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుంటే విపత్తుల సమయంలో చేయూత నివ్వడం మనం ఎప్పుడూ చూస్తున్నదే.
2008 జనవరి 26ప గుజరాత్లో భూకంపం వచ్చింది. దేశం మొత్తం చేయూతనందించింది. అందులో భాగంగా రామోజీరావు పెద్దఎత్తున విరాళాలు సేకరించి, ఓ గ్రామ నిర్మాణం పూర్తి చేశారు. కొన్ని వందల ఇండ్లు నిర్మించి ఇచ్చారు. అలా రామోజీరావు ఇచ్చిన పిలుపు మేరకు కొన్ని వేల మంది తెలుగు దాతలు ముందుకొచ్చారు. కొన్ని వేల మంది సాయంతో ఏడాది కాలంలో భూకంపం వచ్చిన ప్రాంత రూపురేఖలే మర్చారు. కొత్త ప్రాంతాలను సృష్టించారు. మళ్లీ ఆ గ్రామాలకు జీవం పోశారు. ఇప్పుడు కూడా తెలంగాణలో ప్రభుత్వం ఒక్క పిలుపునిస్తే ఎంతో మంది ముందుకొచ్చే అవకాశం వుంది. ఏఏ నియోజకవర్గంలో ఆయా సంపన్నులను ముందుకు రమ్మంటే వారికి చేతనైనంత సాయం అందరూ చేస్తే, ఆ నియోజక వర్గంలో ఇండ్ల నిర్మాణం అన్నది పెద్ద సమస్యే కాదు. ఇలా మొత్తం తెలంగాణను ఏడాదిలోగా తీర్చిదిద్దొచ్చు. తెలంగాణలో ఇళ్లు లేదని అనేవారు లేకుండా చేయొచ్చు.
1992 లో మహారాష్ట్రంలోని లాతూర్ భూకంపంలో కూడా ఇదే విధంగా సర్వం కోల్పోయిన వారు కొన్ని లక్షల్లో వున్నారు.
వారందరికీ దేశమంతా చేయూతనిచ్చింది. ఒకప్పుడు భూకంపంతో స్మశానాన్ని తలపించిన లాతూర్ ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది. పునరుజ్జీం పోసుకొని మళ్లీ సరికొత్త ప్రాంతంగా విరాజిల్లుతుంది. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఎంతో ఆసక్తికరంగా కూడా వుంది. ఓ తండ్రి తన కూతురు పెళ్లి కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి, అంగరంగ వైభవంగా చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో ఆ కూతురు తన పెళ్లికి చేయాలనుకున్న ఖర్చుతో పేదలకు ఇండ్లు నిర్మించి ఇద్దామని సూచించిందట. ఈ విషయంపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. ఇక గుళ్లకు గోపురాలకు అంటే విరాళాలు ఇచ్చేవారు ఎంతో మంది వున్నారు. తెలంగాణలో ఈ మధ్య చినజీర్ స్వామి ఏర్పాటు చేసిన ఓ ఆశ్రమానికి కొన్ని వేల కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పిలుపునిస్తే ఎంత మంది సేవ భావం వున్నవాళ్లు ముందుకొస్తారో అర్ధం చేసుకోవచ్చు.
సామాన్యులే కాదు పారిశ్రామిక వేత్తలు, ఐటి రంగ వ్యవస్ధాపకులు కొద్దిగా చేయూతనిస్తేనే కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం వుంది.
అలా అందరి సహాకారంతో రాష్ట్రంలో పేదలకు ఇండ్లు నిర్మాణం చేయడం పెద్ద సమస్యే కాదన్నది నిపుణులు కూడా చెబుతున్న మాట. అందువల్ల ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ విషయంపై ఒక్కసారి దృష్టిపెడితే బాగుంటుందని ముందుకు రావడానికి సిద్దంగా వున్నవారే చెబుతున్నారు. ఒక్కసారితో చర్చిస్తే పూర్తి స్ధాయిలో సాధ్యాసాధ్యాలు కూడా చర్చించొచ్చు. నూతన కలల నిర్మాణమే కాదు, భావి తెలంగాణ పల్లెల రూపురేఖలు మార్చొచ్చు.