`అవినీతి ప్రోత్సాహించడమే ఆ సారు డ్యూటీ?
`ఎంతో కొంత ఇచ్చేసి, బిల్లు తీసుకుపో? అని చెప్పడమే ఆయన దృష్టిలో నీతి.
`ప్రతి పనికి రేటు, రిబేటు విధిలో భాగమది?
`గతంలో కలెక్టర్ గా వున్నప్పుడే ఓ ఐఏఎస్ అధికారి చెప్పిన మాట?
`ఓ బాధితుడు చెప్పిన విషయం వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే?
డెస్క్,నేటిధాత్రి:
ఈ మధ్య నేటిధాత్రి ఓ అవినీతి అధికారి గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచురిస్తోంది. అయినా పై స్థాయి అధికారుల స్పందన లేదు. జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా అసలు అవినీతి అధికారి గురించి పట్టించుకున్న వారు లేరు. పుంకానుపుంకాలుగా వస్తున్న ఆరోపణలు రాసి, రాసి జర్నలిస్టులు అలసిపోతున్నారు. కానీ అధికారులలో చలనం లేదు. సంబంధిత అధికారి మీద చర్యలు లేవు. ఒక అధికారి తన ఉద్యోగ పర్యంతం ఇన్ని అన్యాయాలు చేశాడా? ఇంత అవినీతికి పాల్పడ్డాడా? అని ప్రజలు చర్చించుకుంటున్నారే గాని, అధికారులు పట్టించుకోవడం లేదు…కారణం ఎవరకీ బోధపడడం లేదు. సమస్య అంతు చిక్కడం లేదు…ఇంతలో ఓ రోజు అర్థరాత్రి అమెరికా నుంచి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు కు ఫోన్ కాల్ వచ్చింది… తననహ తాను పరిచయం చేసుకున్నాడు. కొంత కాలంగా రోజూ నేను నేటిధాత్రి దినపత్రికను చదువుతున్నాను. ఓ అవినీతి అధికారి గురించి నిత్యం వస్తున్న వార్తలు చూస్తూనే వున్నాను. మీరు ఎంత కాలం వార్తలు రాసినా, ఆ అవినీతి అధికారి మీద ఎలాంటి చర్యలు వుండవని ఆ వ్యక్తి అన్నాడు…అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేశారు…? అని కట్టా రాఘవేంద్రరావు అడిగారు…అదంతే…అన్నారు అవతలి వ్యక్తి… ఎందుకో చెప్పగలరా? అని రాఘవేంద్రరావు అడిగారు…నా స్వీయ అనుభవం చెబుతాను వినండి అన్నారు….మాది ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లా. ఆ జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారి కలెక్టర్ గా వుండేవారు. ఆయనే ఇప్పుడు మీరు రాసే శాఖలో కీలక స్థానంలో, పై స్థాయిలో వున్నారు. ఆ అధికారి ఆశీస్సులు ఎంతో మంది అధికారులకు వున్నాయి. ఆయన చెప్పింది చేయడానికి, దోచుకున్న దానిలో వాటాలు పంపడానికి అనేక మంది అధికారులున్నారు. ఎంత చిన్న పని అయినా సరే…ఎంతో కొంత ఇచ్చి పని కానిచ్చేసుకో…అంటారే గాని అధికారులను మాత్రం ఎప్పుడూ మందలించరు అని చెప్పాడు. గతంలో తనకు ఓ ప్రభుత్వ కార్యాలయం ముందు జిరాక్స్ సెంటర్ వుండేది.
ఆ సమయంలో ప్రభుత్వానికి చెందిన అనేక జిరాక్స్ పనులు చేసేవాడిని. అందుకోసం బిల్లులు మంజూరు చేసేవారు. నాకు రూ.10వేలు బిల్లు రావాల్సివుంది. నాకు రావాల్సిన బిల్లు కోసం ప్రభుత్వ కార్యాలయంలో అధికారిని సంప్రదించాను. రూ.4 వేలు ఇస్తే బిల్లు మంజూరు చేస్తానన్నాడు. నాకు ఒక్క సారిగా దిమ్మ తిరిగి పోయింది. జిరాక్స్ బిల్లులు ఇవ్వడానికి లంచమా? ఇంత దుర్మార్గమా? ఎంత విడ్డూరం? అనుకున్నాను. రూ.4 వేలు అధికారికే ఇస్తే ఇక నాకు లాభం ఏముంది? నష్టమే మిగులుతుంది. ఎలాగైనా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని నిర్ణయించుకున్నాను. విషయం ముందుగా మా గ్రామ ఎంపిటీసి చెవిలో వేశాను. అతన్ని తీసుకొని కలెక్టర్ వద్దకు ఓ రోజు వెళ్లడం జరిగింది. జరిగిన విషయం చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయం విన్న కలెక్టర్ ఈ సంగతి చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోక, పిర్యాదు చేసేందుకొచ్చావా? వెళ్లు అని కలెక్టర్ పంపించేశాడు. ప్రతిదానికి అధికారుల మీద ఏదొ ఒక పిర్యాదు…ఏదో ఇచ్చి నచ్చజెప్పుకొని పని కానిచ్చుకోక ఇబ్బంది పడడం ఎందుకు? మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకన్నాడు. కలెక్టర్ నోటి నుంచి అటువంటి మాటలు విన్నాక, బిల్లు గురించి మర్చిపోయాను. లంచమిచ్చి బిల్లు తెచ్చుకోవడం కన్నా వదిలేసుకోవడం మేలనుకున్నాను. కలెక్టర్ అండ చూసుకొనే అప్పుడు అధికారులంతా ప్రజలను పీడిరచుకునేవారు. కలెక్టర్ కు వాటాలు పంపేవారు…ఇదీ అప్పుడు అందరూ చర్చించుకున్న మాట…మీ నేటిధాత్రి లో కథనాలు వస్తున్న అధికారికి కూడా అప్పటి కలెక్టర్, ఉన్నత స్థానంలో వున్న అధికారి ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి…ఇదీ అమెరికా నుంచి ఓ పాఠకుడు కం బాదితుడు చెప్పిన మాట…అది విని విస్తుపోవడం రాఘవేంద్రరావు వంతైంది.అవినీతి అధికారుల బాగోతాలు ఒక రోజు రాసి వదిలేస్తే మీడియా మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఫాలోఅప్ వార్తలేవని పాఠకులే ప్రశ్నిస్తుంటారు. మరి ఇలాంటి అధికారులు, పై స్థాయి అధికారుల ఆశీస్సులతో అవినీతి చేస్తుంటే ఆపేవారుంటారా? మీడియా రాస్తూ పోయినా పట్టించుకుంటారా? అందుకే ప్రజల్లో ముందు చైతన్యం రావాలి. అవినీతిని ప్రజలే ప్రశ్నించాలి. అవినీతిపై పోరాడుతున్న మీడియా కు తోడ్పాటు కావాలి. అప్పుడు గాని అవినీతి అంతం కాదు. అధికారుల్లో భయం పుట్టదు.