ఆ మంత్రుల పనితనం కనిపించలే!

పేరుకే ఆ మంత్రులది దూకుడు. మాటలు కోటలు దాటిస్తారు. మునుగోడు విషయంలో ముగ్గురు మంత్రుల ప్రచారంలో వార్తల్లో వ్యక్తులయ్యారు. ఫలితాల నాడు వారి పని తనమేమిటో తెలిసి అలా కూడా విమర్శల పాలయ్యారు. వారు ప్రచారం చేసిన గ్రామాలలో బిజేపికి ఓట్లు పడేలా అతి చేశారు. ఎన్నికల ప్రచారంలో మరీ ఓవర్ యాక్షన్ చేసిన మంత్రులలో మల్లారెడ్డి ముందు వరుసలో వున్నారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన తొలి రోజే మందు విందు ఏర్పాటు చేశారు. వివాదాలు మూటగట్డుకున్నారు. తాను ప్రచారం చేసిన గ్రామంలో బంధువులున్నారంటూ అసత్యాలు చెప్పారు‌. తర్వాత మల్లారెడ్డి ఇచ్చిన దావత్ లో కూర్చున్న వాళ్లే ఆయనతో బంధుత్వం లేదన్నారు. ఒక మంత్రి స్థాయిలో వుండి, మద్య సేవనంలో కూర్చోవడమే పొరపాటు. దానిని సమర్థించుకోవడం గ్రహపాటు. అంతిమంగా టిఆర్ఎస్ పార్టీకి పోటు…కారుకు పాడాల్సింది కమలానికి పడింది ఓటు. మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన మందు విందు ఫోటోలు బైట పెట్టింది… టిఆర్ఎస్ వాళ్లే…ప్రతిపక్షాలను తిట్డి మళ్ళీ మల్లారెడ్డి తప్పు చేశారు. ప్రచారం చేసి రమ్మంటే మల్లారెడ్డి వివాదాలు మూటగట్టుకొని వచ్చారు. ఓటు బ్యాంకుకు తూట్లు పొడిచారు…పోటుగాడు ప్రచారం చేసే పోటీయే వుండదన్నంత రేంజ్ లో మాటలు చెప్పి, తుస్సుమనిపించాడు. ఇళ్లిళ్లు తిరిగి ప్రజలను ఒప్పించి, మెప్పించి ఓట్లు సంపాదించాల్సింది పోయి, మీడియాలో ప్రచారంలో కనిపించి అదే గొప్ప అన్నట్లు చేశారు. ఆఖరుకు టిఆర్ఎస్ కు ఓట్లు లేకుండా చేశారు. ఇది పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్. అటు తన నియోజకవర్గంలో వివాదాలే…మునుగోడు ప్రచారంలో ఆయనతో లాభం జరగకపాయే. ఆయన ప్రచారం చేసిన గ్రామాల్లో బిజేపి ఓట్లు కొల్లగొట్టుకుపోయింది. మునుగోడు ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం ఓట్లను శ్రీనివాస్ గౌడ్ ఎంతో చాకచక్యంగా టిఆర్ఎస్ వైపు మళ్లిస్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఏం ప్రచారం చేశాడో, ఎంత తీవ్రంగా ప్రయత్నం చేశాడో ఇక్కడే అర్థమౌతుంది. ఇక మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆయన ప్రచారం చేసిన గ్రామంలో కూడా బిజేపికి ఓట్లు పడ్డాయి. అంటే మంత్రుల స్థాయిలో వుండి, ఒకటి రెండు గ్రామ ప్రజలను వాళ్లు ఒప్పించలేకపోయారు. మెప్పించలేకపోయారు. టిఆర్ఎస్ కు ఓట్లేయించలేకపోయారు. సుమారు నెలన్నర కాలం పాటు ప్రచారం చేసిన మంత్రులు తమకు అప్పగించిన పనిని తూతూ మంత్రంగానే నిర్వర్తించారనేది స్పష్టమైంది. ఇలాంటి మంత్రులతో టిఆర్ఎస్ భవిష్యత్తును ఊహించుకోవడం ఎంత నష్టదాయకమో పార్టీ ఆలోచించుకోవాలి. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించలేకపోయారు. కనీసం లబ్ది దారులందరి చేత ఓట్లు వేయించలేకపోయారు. ఇది ముమ్మాటికీ ఆ మంత్రుల వైఫల్యమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!