ఆ డీలరే.. ఈ డాన్‌!

`డీలర్‌ ముదిరి.. డాన్‌ అవతారం!

`షరభ…షరభ ఇసుకాసుర..!

`ఇసుక మేటల పేరుతో మొదలైన యవ్వారం…

` రైతులకు తెలియకుండానే పట్టాలు సృష్టించుకున్న వైనం..

`అధికారుల పూర్తి సహకారం.

` ఇసుక మేటల తొలగింపు పేరుతో గోదావరి నదినే కొల్లగొట్టాడు.

` వేల కోట్లకు పడగలెత్తాడు…

`ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్లు ఎగ్గొట్టాడు.

`విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగి 5 ఏళ్లైంది.

`అధికారులకు పట్టింపు లేదు…

`డాన్‌ తన వ్యాపారం ఆప లేదు.

` ప్రభుత్వం సీజ్‌ చేసిన ఇసుక కూడా అమ్ముకున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు.

`మంచిర్యాల జిల్లాలో ఆ డానే సూపర్‌ పవర్‌…

`జైపూర్‌ మండలంలో అతను ఎంత చెబితే అంత! జిల్లాలోనూ అంతే!

`కలెక్టర్‌ నుంచి మొదలు కింది స్థాయి ఉద్యోగులంతా అతను ఏది చెబుతే అది!

`ఈ విషయంలో గత ఆర్డీవో సంచలన వ్యాఖ్యలు.

`డాన్‌ వెనక అధికార గణం…ప్రజాధనం మంగళం. 

      హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఆ ఒక్కటీ అడక్కు.. అనే సినిమాలో ఒక డైలాగ్‌ వుంటుంది. గాలం పట్టుకొచ్చాడు సముద్రాన్ని నమ్ముకున్నాడు అని ఓ డైలాగ్‌ వుంటుంది. అచ్చు ఇక్కడ డీలర్‌ కూడా అంతే…! కాకపోతే అక్కడ కష్టాన్ని నమ్ముకున్న పాత్ర కనిపిస్తుంది. ఇక్కడ సామాన్యులను దోచుకున్నది తెలుస్తుంది. అధికారుల అండదండలతో ఎలా ఎదిగాడన్నది కనిపిస్తుంది. ఎంత మందిని మోసం చేశాడన్న విషయం తెలుస్తుంది. ఎంత కాలం ఈ కాంట పెట్టి బియ్యం జోకి, వచ్చే కమీషన్‌ తో ఏం బతుకుతామనుకున్నాడో ఏమో! డీలర్‌ శ్రీను. గోదావరి గట్టు దాకా వెళ్లాడు…పొలాలలో ఇసుక మేటలు చూశాడు. ఇటు తిరిగి గోదావరి నదిలో వున్న ఇసుకను చూశాడు. పొలాలలో మేట వేసిన ఇసుకకు, గోదావరి నది ఇసుకలో కలిపితే పాయే… రెండూ కలిపి తోడితే అయిపాయే…అది తడిదే…ఇదీ తడిదే…రెండూ కలిపితే లారీలకు లారీలు నిండే…ఎస్కవేటర్లు తెచ్చి పనికానిస్తే ఇసుక మనదేనాయే…అమ్ముకొని సొమ్ము చేసుకుంటే అయిపాయే! పేరు పెరుమాళ్లది…ఆరగింపు అయ్యవారిది. తన భూమిలో ఇసుక తోడేస్తే మహా అయితే ఎంతొస్తుంది. నది పొడవునా వున్న జాగలనీ వశం చేసుకుంటే పోలే…అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా కార్యచరణ మొదలుపెట్టాడు. ఇంకే ముంది లారీలకు లారీలు తోడుతున్నాడు…అమ్ముతున్నాడు. సొమ్ము చేసుకుంటున్నాడు. ఎదురొచ్చిన వాళ్లందరి నోళ్లు నోట్ల కట్టలతో మూయిస్తున్నాడు. అందరికీ నోట్లిచ్చి కనికట్టు చేస్తున్నాడు. అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాళ్లను మరమనుషులను చేసి ఆడిస్తున్నాడు. తన పనులు కానిచ్చేసుకుంటున్నాడు. ఎంత దాకా అంటే మంచిర్యాల జిల్లా మొత్తం విభాగం డీలర్‌(డాన్‌) చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది జనం చెబుతున్న మాట. జిల్లా అంతటా చెప్పుకుంటున్న మాట. 

సహజంగా తొండ ముదిరు ఊసరవెళ్లి అయ్యిందనేది మనం ఎప్పుడూ వినే సామెత.

 కాని ఇది నిజం. డీలర్‌ శ్రీను ముదిరి.. డాన్‌ అవతారం ఎత్తాడు. అక్రమాలకు అడ్డాగా మారాడు. కోట్ల సంపాదనకు ఎగబడ్డాడు. ఎలా సంపాదించామన్నది కాదు. ఎంత సంపాదించామన్నది ముఖ్యమనుకున్నాడు. నాలుగు తరాలు తిన్నా తరగనంత సంపాదించాలనుకున్నాడు. అవకాశాలను అడ్డదారిలో అందుకున్నాడు. ఎదురొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్లాడు. కలిసొచ్చే వాళ్లను నోట్లతో నోరు మూయిస్తూ వస్తున్నాడు. మొత్తానికి అక్రమ సంపాదనకు ఎగబడ్డాడు. అక్రమంగా ఎలా సంపాదించాలో నేర్చుకున్నాడు. వ్యవస్థను వంచన చేస్తూ, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఆడిరది ఆటగా, పాడిరది పాటగా సొమ్ముల వేట సాగిస్తున్నాడు. 

షరభ…షరభ ఇసుకాసుర..! 

డాన్‌ ( డీలర్‌) శ్రీను ఎంత చెబితే అంత. ఏంచెబితే అది. అంతే అధికారులు మరో మాట మాట్లాడితే ఒట్టు. శీను హవా వర్షాకాలంలో ఇసుక మేటల పేరుతో వ్యాపార యవ్వారం మొదలైంది. గోదావరికి వరదలు రావడం సహజం. వర్షాకాలంలో ప్రతి యేటా గోదావరికి వరదలు వచ్చి పక్కనున్న పొలాలు మునిగిపోవడం కామన్‌. దాంతో పెద్ద ఎత్తున పొలాలలో ఇసుక చేరుతుంది. పంటలు దెబ్బతింటాయి. పొలాలలో పూర్తిగా ఇసుకతో నిండి మేటలు వేస్తాయి. అలా మునిగిపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఆ ఇసుకను తొలగించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుంది. ఇసుక తొలగించే కార్యక్రమం చేపడుతుంది. ఇది మంచి ఆదాయమార్గం. ఆ ఆదాయంపై శీను కన్నుపడిరది. అంతే అధికారులను మచ్చిగ చేసుకున్నాడు. అడిగినంత ముట్టజెప్పి వారిని బుట్టలో వేసుకున్నాడు. తనది కాని పొలాల మీద కన్నేశాడు. రాత్రికి రాత్రి ఇతర రైతుల పొలాలను వారికి తెలియకుండానే పట్టాలు సృష్టించుకున్నాడు. అధికారుల పూర్తి స్థాయిలో సహకారిస్తారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అక్కడ మొదలైన ఇసుక తోడుడు వ్యవహారం. గోదావరి నదినే కొల్లగొట్టాడు. గడచిన పుష్కరకాలం నుంచి శీను గోదావరిని వశం చేసుకున్నాడు. ఇసుకను సొంత ఇంటికి తరలించినంత సులువుగా, నిత్యం పదుల సంఖ్యలో ఎక్సవేట్లు మోహరించి, వందలాది ఇసుక లారీలు తరలిస్తున్నారు. ఇసుకాసుర అవతారం ఎత్తాడు. అసలు 

 వేల కోట్లకు పడగలెత్తాడు…

 ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్లు ఎగ్గొట్టాడు.

 ఇసుక అక్రమ రవాణే నేరం. అందులోనూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము ఎగ్గొట్టడం ఇంకా పెద నేరం. అది కూడా వందల కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టడమంటే మాటలు కాదు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూడా గద్దలుగా మారితే తప్ప ఇంత విచ్చలవిడి తనానికి తావుండదు. అసలు జిల్లా యంత్రాంగాన్నంతా ఒక్క వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లిపోవడమంటేనే ఆశ్చర్యమనిపిస్తోంది. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయంలోకి అడుగుపెట్టాలంటేనే గగనం. ఒక ఎమ్మార్వో సమయం ఇవ్వడం పెద్ద తతంగం. అలాంటిది జిల్లా స్థాయిలో అధికారులు ఒక వ్యక్తి చెప్పుచేతుల్లోకి వెళ్లిపోయినంత విదేయత ప్రదర్శిస్తున్నట్లు ప్రజలే చెబుతున్నారు. తహసీల్దారు కార్యాలయం అడ్డాగా చేసుకొని, పక్కన కూర్చొని పని చేయించుకుంటూ సామాన్యుల భూములు గుండుగుత్తగా రాయించుకున్నట్లు కూడా అనేక ఆరోపణలున్నాయి. అటు ఇసుక కొల్లగొడుతున్నాడు. ఇటు భూములు ఆక్రమించుకుంటున్నాడు. వందల కోట్లు పన్నులు ఎగ్గొడుతున్నాడు. తన ఇసుక వ్యాపారం పేరుతో రోడ్లు ధ్వంసం చేస్తున్నాడు. ప్రజల జీవితాలలో దుమ్ముకొడుతున్నాడు. వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. వారి బతుకులు ఆగం చేస్తున్నాడు. అటు ప్రకృతి విధ్వంసం… ఇటు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. వారించాల్సిన అధికారులే దగ్గరుండి పనులు కట్టబెడుతున్నారు. శ్రీను కోట్లు కొల్లగొట్టుకునేందుకు దారి చూపిస్తున్నారు. 

విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగి 5 ఏళ్లైంది. 

ప్రభుత్వాదాయానికి పంగనామాలు పెట్టి, వందల కోట్లు ఎగనామం పెట్టి దర్జా వెలగబెతున్న డీలర్‌ శ్రీను అక్రమ సంపాదనపై విజిలెన్స్‌ ఎంక్వైరీ కూడా జరిగింది. అది పూర్తయ్యి 5 సంవత్సరాలు నడుస్తోంది. అయినా అధికారులకు పట్టింపే లేదు. డీలర్‌ శ్రీను తన వ్యాపారం ఆగింది లేదు. పన్నులు కట్టింది లేదు. ఇసుక రవాణా ఆగడం లేదు. భూముల ఆక్రమణ ఆగిందెక్కడా లేదు. నివేదికలలో విస్తుపోయే నిజాలున్నాయి. వందల కోట్ల ఎగవేత ఎలా జరిగిందనేది స్పష్టంగా వుంది. కానీ చర్యలేవి?…ఆ ఒక్కటీ అడక్కు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!