`భవిష్యత్తు బిఆర్‌ఎస్ దే అని మర్చిపోకండి!
`నియోజకవర్గాల వారిగా నేతల తీరు ఎప్పటి నుంచో చెబుతోన్న ‘‘నేటిధాత్రి’’.
`ఎంత చెప్పినా అప్పుడు మారలేదు?
`దిద్దుకోలేని తప్పులు చేశారు?
`ద్వితీయ శ్రేణి ని పట్టించుకోలేదు?
`ప్రజల్లో పలుచనయ్యారు?
`ప్రజలకు చేరువ కాలేదు?
`సిఎం కేసిఆర్ తో విభేదించి రాజకీయంగా ఎదిగిన వారు ఎవరూ లేరు..గుర్తుంచుకోండి!
`మార్పు తప్పదని ఇప్పుడు తెలిసి దిగులు?
`అయినా ఆరు నెలలు గడువుంది?
`మారితే చాలా మంచిది?
`ప్రజల మన్ననలు పొందితే మరీ మంచిది?
`లేకుంటే హుందాగా తప్పుకుంటేనే ఎంతో మంచిది?
`పక్క చూపులు చూస్తే వున్న పరువు పోతుంది?
`పార్టీ పరువు తీస్తూ వచ్చారు?
`సమస్యలు చెప్పిన వారిని టార్గెట్ చేశారు?
`అయినా వినకపోతిరి!
`పార్టీకి సేవ చేసే టైమొచ్చింది.
`కనీసం ఆ పనైనా చేయండి.
`అలిగినా తప్పు లేదు..కాని..అహానికి వెళ్ళి మొదటికే మోసం తెచ్చుకోకండి?
హైదరబాద్,నేటిధాత్రి:
ఎంత మంచి తేనెనైనా చెడగొట్టడానికి ఒక్క నీటి చుక్క చాలు. అలాగే ఎంతో బ్రహ్మాండమైన పార్టీ అయినా, ఎంతో సమర్ధవంతమైన నాయకుడున్న రాజకీయ పార్టీ అయినా నేతల వైఖరి మూలంగా అపవాదులు మూటగట్టుకోవచ్చు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి ఉదాత్తమైన, ఉన్నతమైన ఆశయాలు, సంకల్ప సిద్ది వున్న కేసిఆర్ నాయకత్వంలో ఎంతో జాగ్రత్తగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాల్సిన కొంత మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మూలంగా పార్టీ ప్రతిష్ట మసకబారేలా కనిపిస్తోంది. బిఆర్‌ఎస్‌ను కనీసం కన్నెత్తి చూడడానికైనా, పళ్లెత్తు మాటలు మాట్లాడడానికైనా, ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన ప్రతిపక్షాలకు కొందరు నేతలు అలుసుగా మారారంటే వారి వ్యవహారం ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు అంటే అద్దాల మేడలో వుండేవారున్నంత జాగ్రత్తగా వుండాలి. ఇప్పుడున్నవి పాతతరం రోజులు కాదు. అప్పటి రాజకీయాలు కాదు. ఎవరు చూస్తారు లే అనుకున్నా, మాకు ఎదురేముందులే అనుకున్నా, మాకంటే గొప్పవాళ్లు ఎవరున్నారని విర్రవీగినా కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ఆరోపణలు గుప్పించడానికి, ప్రజల్లో పలుచన చేయడానికి ప్రతిపక్షాలు సైతం రెడీగా వుంటాయి. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన రోజుల్లో తమ ఇష్టాను రీతిన పనిచేస్తాం అంటే చెల్లకపోవచ్చు. నిజానికి బిఆర్‌ఎస్‌లో ఇప్పుడు అపవాదులెదుర్కొంటున్నవారంతా ఒకప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లే..తెలంగాణ ఆకాంక్ష కోసం పనిచేసిసన వాళ్లే. తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసిన వాళ్లే. కేసులు ఎదుర్కొన్నవాళ్లే. అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నవాల్లే. ఉద్యమ కాలంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వాళ్లే. కాని వారిలో ఇప్పుడు ఆ చిత్తశుద్ది కొరవడిరదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న అపవాదులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుకుంటున్నారు. అవి ఏ రకమైనా ప్రజల్లో పలుచనయ్యేవే.. ఉద్య మకాలం నాడున్న మంచి తనం వారిలో ఇప్పుడేమైందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమౌతున్నాయి. సుధీర్ఘ కాలం పాటు వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకొని కూడా ప్రజలు ఎందుకు ఫలాన ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా పార్టీలో బాగానే జరుగుతోంది. ఆ నేతల మూలంగా మొత్తం పార్టీ వివాదాలను మూటగటట్టుకుంటోందంటున్నారు. కొందరు ఎమ్మెల్యేల తీరు, అభ్యంతరకమైన నిర్ణయాలు, పార్టీ ఇతర నేతల భాగస్వామ్యంలేని ప్రాతినిద్యాలు, ఏకపక్ష నిర్ణయాలతో ఎమ్మెల్యేలు వివాదాలు మూట గుట్టకుంటున్నారు. అవి వ్యక్తిగతంగా కొన్ని, పార్టీ పరమైన కొన్ని ఇబ్బందికరమైన పరస్ధితులు ఎదుర్కొంటున్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చిపెడుతున్నాయి. శకునాలు చెప్పే బల్లి కుడిలో పడ్డట్టు కొంత మంది ఎమ్మెల్యేల నిర్వాకం పార్టీకి నష్టం చేకూర్చుతోందని నేటిధాత్రి ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే వుంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసిఆర్ బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో కొంత మంది ఎమ్మెల్యేలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు అలాంటి ఎమ్మెల్యేలలో గుబులు మొదలైనట్లు సమాచారం.
నేటిధాత్రి దిన పత్రిక ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే వుంది.
అనేక సార్లు వివాదాస్పద ఎమ్మెల్యే తీరును ఎండగడుతూనే వచ్చింది. వారికి సూచలను చేస్తూనే వచ్చింది. కాని వారి తీరులో మార్పు రాలేదు. పార్టీకి ఇబ్బందికరమైన చేష్టలు ఫలాన ఎమ్మెల్యేలు చేస్తున్నారన్న కథనాలు వచ్చినా వారిలో స్పందన లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని సంక్షేమకార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని అనేక ఫథకాల ప్రకటించారు. ఎన్నికల సమయంలో కొన్ని, తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన పథకాలు ప్రజల్లో ఎంతో సంతోషాన్ని భరోసాని నింపాయి. అయితే వాటి అమలు పర్యవేక్షన చేపట్టాల్సిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదు. అదే సమయంలో చిన్నతనం చూపిస్తున్నారన్న అపవాదులున్నాయి. అవి ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి వెళ్లాయి. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు తాము చేస్తున్న పనులు ముఖ్యమంత్రి దాకా వెళ్తాయా? అనుకున్నారో? ఏమో కాని అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. వ్యక్తిగత మైన చిక్కుల్లో కూడా చాలా మంది వున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచినా, తర్వాత ప్రజల్లో ఆదరణ లేని ఓ ఐదురుగు ఎమ్మెల్యేలను 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ పక్కన పెట్టారు. వారికి టిక్కెట్లు ఇవ్వలేదు. కాని అందరికీ టిక్కెట్లు ఇచ్చాడు. అయినా జనం ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. పార్టీని బంపర్ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ మీద ప్రజలకు వున్న నమ్మకం అందుకు తార్కాణం. అయితే ఇప్పుడు ప్రజల ఆలోచనా తీరు, సరళిలో కూడా కొంత మార్పు వచ్చింది. ఎంత ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వాన్ని నమ్మినా, ఎమ్మెల్యేలు వారే కావడంతో వారిలో మార్పు రాకపోవడాన్ని ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారు. అందుకే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక సార్లు హెచ్చరించారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనపై మరింత బాధ్యత పెరిగిందని గుర్తుచేశారు. మరింత ఒళ్లుదగ్గర పెట్టుకొని పనిచేయాలని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా అనేక విషయాల్లో ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలను గుర్తు చేశారు. మారండని కూడా సూచిస్తూ వచ్చారు. అయినా కొంత మంది ఎమ్మెల్యేలలో మార్పు రాలేదు. అలాంటి ఎమ్మెల్యేలను ఈసారి ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే అన్న డిమాండ్లు కూడా పార్టీనుంచే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఎవరైతే తమ వ్యవహార శైలి గురించి తెలిసిన ఎమ్మెల్యేలు పక్క చూపులు చూసేందుకు కూడా వెనకాడడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిపట్ల కూడా పార్టీ అధిష్టానం సీరియస్‌గానే వుంది. ఎందుకంటే ఆరు నెలల సమయం వుంది. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తే ఎంతో మంచిదని కూడా నాయకులు అంటున్నారు. మా ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు వస్తే బాగుండని కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కోరుకుంటున్నారు. పార్టీ బలంగా వున్న చోట నాయకుల వ్యవహాశైలి మూలంగా సీటు కోల్పోవడం నాయకులకు ఇష్టం లేదు. అలాంటి స్ధానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వండిన కూడా బలంగా కోరుతున్నారు. లేని పక్షంలో తమ ఎమ్మెల్యేలు తీరు మారితే చాలని కూడా అంటున్నారు. లేదా వారే హుందాగా తప్పుకుంటే కూడా ఎంతో గౌరవంగా వుంటుందంటున్నారు. లేని పోని వివాదాలు సృష్టించేందుకు ఎమ్యెల్యేలు పాల్పొడద్దని నాయకులు కోరుతున్నారు. ఎందుకంటే దిద్దుకోలేని తప్పులు కొంత మంది ఎమ్మెల్యేలు చేశారు. అలాంటివారు స్వచ్చందంగా తప్పుకోని, యువ నాయకులు అవకాశం ఇవ్వడమే మేలు. పార్టీ పరువును తీస్తూ, ద్వితీయ శ్రేణిని పట్టించుకోకుండా, ఏకపక్షంగా వ్యవహరించిన వాళ్లెవరో అందరికీ తెలిసిందే. అలాంటి వారిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఆ నాయకులు ఇప్పటివరకు ప్రజలకు చేరువ కాలేదు. తమ పదవిని మాత్రమే వినియోగిస్తూ వచ్చారు. వ్యాపారాలకు అలవాటు పడ్డారు. సంపాదనకు ఎగబడ్డారు. ప్రభుత్వ పధకాల్లో చేతి వాటం చూపిస్తూ వచ్చారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో కొందరు ప్రజలను కూడా టార్గెట్ చేసి, ప్రజల్లో పలుచనయ్యారు. అలాంటి వారిని పక్కన పెడితే మళ్లీ బిఆర్‌ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరు. బిఆర్‌ఎస్‌కు ఎదరు లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వానికి తిరుగులేదు.