` సిట్టింగ్ లకే సీట్లు వ్యూహంలో భాగం!
`ఎవరు గోడ దూకేవారో తెలుసుకునే ప్రయత్నం.
`అవకాశవాదులను ఏరివేసే వ్యూహం.
`పక్క పార్టీలలో కర్చీఫ్ వేసుకున్నవారు బైటపడడం కోసం.
`పార్టీ కోసం పని చేసేవారెవరు? పదవుల కోసమే నటిస్తున్నవారిని గుర్తించడం!
`అవకాశాలు వస్తున్నా ఆగలేని అత్యాశపరులను గుర్తించడమే లక్ష్యం.
`అప్పుడే ఆశలు వదులుకోవద్దు…
`నిస్తేజం ఎవరిలో వుందో సులువుగా తెలుసుకోవచ్చు…
`పార్టీ కోసం పని చేసేవాళ్లెవరో తేలిపోవచ్చు…
` రాజకీయాలలో అవకాశాల కోసం ఓపిక అవసరం.
`తొందరపడి నిర్ణయాలు ఆశలు తలకిందులు.
`కొన్ని నియోజకవర్గాలలో వివాదాలున్నాయి?
`అక్కడక్కడ మర్పు ఖాయం!
`ముచ్చటగా మూడోసారి గెలవడం కోసం…
`80 నుంచి90 స్థానాలలో విజయం.
హైదరాబాద్,నేటిధాత్రి:
నిలబడాలంటే కలబడాలి. కలబడాలంటే కాలం కలిసిరావాలి. అందుకు తగిన శక్తి యుక్తులు కూడగట్టుకోవాలి. రాజకీయాలలో ఆరి తేరాలి. అధినేత మనసు చూరగొనాలి. ప్రజల మెప్పు పొందాలి. ప్రజల కోసం పని చేయాలి. వారికి సేవ చేయాలి. వారిలో ఒకడిగా మెలగాలి. వారికి భరోసా కలిగించాలి. ఆ నమ్మకం వారిలో కలగాలి. ఇదంతా జరగడానికి సమయం పట్టొచ్చు. అది ఎంత కాలమన్నది నాయకులు కాదు నిర్ణయించేది. కాలం నిర్ణయించాలి. ఆ సమయం వచ్చేదాకా ఎదురుచూడడం అన్నది నాయకుల లక్షణం. అంతే కాని రాత్రికి రాత్రే నాయకుడు కావాలి. ఎమ్మెల్యే కావాలి. కుర్చీలో కూర్చోవాలి. అసెంబ్లీకి వెళ్లాలి. నా సామ్రాజ్యాన్ని ఏలాలి. అని కలలుగనే వాళ్లు చాలా మంది వుంటారు. అన్ని పార్టీలలో ఆశావహులు బాగానే వున్నారు. అందులోనూ తెలంగాణ రాష్ట్ర సమితిలో మిగతా పార్టీలకన్నా చాలా ఎక్కవ వున్నారు.
ఇప్పుడు ఇదే అసలు సమస్య.
ఇప్పటికే పలు మార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్లు మళ్ళీ అవకాశం కావాలంటున్నారు. కుదిరితే తమ వారసులకు కూడా టిక్కెట్ ఇస్తే ఇంకా మంచిది అంటున్నారు. ఇప్పటికీ పదవులు పట్టుకొని వెళాడుతున్న వాళ్లు ఒకవైపు టిక్కెట్లు ఆశిస్తుంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకునేవాళ్లు కూడా మేం రెడీ అంటున్నారు. కానీ సీనియర్లు తప్పుకునేందుకు సిద్ధంగా లేదు. కొత్త వారికి అవకాశం ఇద్దామన్న త్యాగగుణం వారిలో లేదు. దాంతో దాదాపు ఓ ముప్పై నియోజకవర్గాలలో నాకంటే నాకు, నేనంటే నేను, నాకేం తక్కువ అనే నేతలు వున్నారు.
అలా నువ్వా, నేనా అనే నియోజకవర్గాలలో హుజూరాబాద్, జనగాం, స్టేషను ఘన్ పూర్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఈ ఆధిపత్యాలు ఎక్కువగా వున్నాయి.అలా చెప్పుకుంటూపోతే లిస్ట్ పెద్దదిగానే వుంది.
కానీ నాయకుల మధ్య సరైన అవగాహన లేదు. సయోధ్య అంతకన్నా లేదు. ఖమ్మం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు చాలా సీనియర్ నాయకుడు. ఆయన పార్టీ పెద్దగా వుండడమే ఎంతో శ్రేయస్కరం. కానీ ఆయనకు ఇంకా పోటీ చేయాలని వుంది. నిజానికి 2014 వరకే ఆయన రాజకీయ జీవితం అనుకున్నారు. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయన పార్టీలోకి ఆహ్వానించి మంత్రిని చేశారు. ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్యే గా పాలేరు నుంచి అవకాశం కల్పించారు. ఉప ఎన్నికలో తుమ్మల గెలిచారు. కానీ 2018 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అయినా ఆయన తనకు ప్రాధాన్యత వుండడం లేదని మధనపడుతున్నాడు. ఇక స్టేషను ఘనపూర్ లోనూ ఇదే సాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అసంతృప్తిలో వున్నారు. ఇంకా రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు. కొందరేమో మరిన్ని అవకాశాల కోసం, మరి కొందరేమో ఈ సారి అవకాశం కోసం అన్నట్లు సిగపట్లు పడుతున్నారు.
పార్టీ కోసం పనిచేస్తా…పదవులు ఆశించడం లేదనే నాయకులే లేరు. అదే బిజేపిలో చేరుతున్న వారేమో మాకు ఏ పదవి ఇవ్వకపోయినా ఫరవాలేదని అంటున్నారు. టిఆర్‌ఎస్ లో పదవులు దక్కడం లేదని అంటున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్ళందరికీ ఎమ్మెల్యే టిక్కెట్లు కావాలంటే కుదిరేపని కాదు. అలాంటి నాయకులకే టిక్కెట్లు దక్కడం లేదని అందోళనలో వుంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా క్యూలో వున్నారు. అలాంటి వాళ్లు కొందరు టిఆర్‌ఎస్ లో టిక్కెట్ దక్కకపోతే ఇతర పార్టీలవైపు చూసేవాళ్లున్నారు. అందులోనూ ఇంత కాలం పదవులు అనుభవించిన వారిలో కొందరు కూడా పక్క చూపులు చూస్తున్నారు.
సిట్టింగ్ లకే టిక్కెట్లు అన్న అంశం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తావించడంలో ఓ మతలబు దాగి వుందనేది అర్థమౌతోంది.
అలా చెప్పగానే ఎంత మంది ఎమ్మెల్యేలు రిలాక్స్ అవుతారనేది కూడా పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేపై కొన్ని వివాదాలున్నాయి. పార్టీ శ్రేణులు కూడా తమ నాయకుడు ఎవరు కావాలన్నదానిని కూడా సూచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మొదట జరిగింది అదే…కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్థిష్ట నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేకపోయారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా బలవంతంగా అభ్యర్థులను శ్రేణుల మీద రుద్దకపోవచ్చు. తాను టిక్కెట్ ఇవ్వాలనే అనుకున్నా కానీ పార్టీ శ్రేణుల మెజారిటీ అభిప్రాయం మేరకు ఇతరులకు అవకాశం ఇస్తున్నాని చెప్పే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల అటు సీనియర్లైనా, ఇటు జూనియర్లైనా ప్రజల్లో ఎవరుంటారనేదే ముఖ్యం. వారికే టిక్కెట్ ఇవ్వడంలో ప్రాధాన్యం. తాను సీనియర్ ఎమ్మెల్యేని టిక్కెట్ విషయంలో భీష్మించుకొని కూర్చున్నా గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులదే…అందువల్ల ప్రజల మన్ననలు పొందే నేతలు, పార్టీ శ్రేణుల మనసు చూరగొనే నేతలకే టిక్కెట్లు ఖాయం.
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.
ఆశావహులెవరైనా సరే ముందు ప్రజాక్షేత్రంలో వుండాలి. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో వుండాలి. ప్రజలకు సమయం కేటాయించాలి. గ్రామాలు సందర్శించాలి. గ్రామాల సమస్యలను తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై విసృతంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో, దాదాపు ప్రతి ఇంటిలో ఏదో ఒక పథకం లబ్ధి దారులు వుంటారు. ఉచిత కరంటుతో మొదలు పెడితే, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ల ప్రయోజనం పొందిన వివరాలు సేకరించాలి. వారిని ప్రత్యక్షంగా కలిసి వివరించే ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రజల్లో కూడా స్పందన మొదలౌతుంది. తెలంగాణ రాక ముందు పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసి చెప్పాలి. వారి పిల్లలకు అప్పటి స్థితి గతులు వివరించాలని సూచించాలి. యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి.
బిజేపి పార్టీ ప్రచారానికి, వాస్తవానికి చాలా వ్యత్యాసముంది.
ఇప్పటికీ ఆ పార్టీలో అసెంబ్లీకి పోటీ చేసేంత శక్తి, యుక్తులున్న నేతలు లేరు. అసలు పోటీ చేయాలన్న ఆసక్తి వున్నవాళ్లు కూడా లేరు. అందుకే ఆపరేషన్ ఆకర్ష అనేదానికి, ఈడీ, ఐటి కొరడాలను పట్టుకొని, పనిగట్టుకొని నేతల కోసం వేట మొదలుపెట్టారు. నాయకులను లాక్కునే రాజకీయం చేస్తున్నారు. అద్దె నాయకులు వస్తే తప్ప ఆ పార్టీకి మనుగడ లేదు. పోటీ చేసేందుకు నాయకులు లేరు. మబ్బులను చూసి ముంత ఒలకబోసుకున్నట్లు ప్రజల ఆలోచనలకు దూరంగా వుండే బిజేపిని నమ్ముకొని నిండా మునడమే జరుగుతుంది.
టిఆర్‌ఎస్ తెలంగాణలో బలమైన ఏకైక పార్టీ.
ప్రతిపక్షానికి తావు లేదు. ప్రజలంతా ఉద్యమ పార్టీని, ముఖ్యమంత్రి కేసిఆర్ నే నమ్ముతున్నారు. ఆయన వెంట నడుస్తున్నారు. నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో కొంత నిస్తేజం ఆవహించింది. ఒక రకంగా చెప్పాలంటే మందెక్కువై మజ్జిగ పలుచన అన్నట్లు తయారైంది. రాజుగారి పుట్టిన రోజుకు ఊరంతా పాలు తేవాలంటే, నేనొక్కడినే నీళ్లు పోస్తే తెలుస్తుందా? అని అందరూ నీళ్లే పట్టుకెళ్లారట. ఇప్పుడు టిఆర్‌ఎస్ శ్రేణుల పరిస్థితి అలాగే వుంది. టిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు, కల్వకుంట్ల కవిత మీద ఈ మధ్య ఎంపి. అరవింద్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేయాల్సిన సమయంలో ఎంత మంది నేతలు కదిలారన్నది కూడా ఎంతో ముఖ్యం. జూబ్లీ హిల్స్ కు చెందిన మన్నె గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులు కొందరు కదిలారు. కానీ మిగతావాళ్లు ఎవరూ కదల్లేదు. ప్రతి సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో నమ్మకంతో మా వాళ్లు తలుచుకుంటే నశ్యం నలిపినట్లు నలుస్తారంటారు. కానీ కార్యకర్తలు, నాయకులు కదలడం లేదు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. పార్టీ కోసం పనిచేయండి.