ఆపన్న హస్తాలేవి!?

`తోటి ప్రజలను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేరా?

`ప్రభుత్వం అర్థిస్తే గాని స్పందించరా?

`వరద బాధితుల సహాయార్ధం ధాత్రి గ్రూప్‌ డైరెక్టర్‌ ‘‘కట్టఫణిధాత్రి’’ రూ. 50 వేలు విరాళం ప్రకటన.

`వరద సహాయక చర్యల్లో పాల్గొన్న జర్నలిస్టుల సహాయార్ధం నేటిధాత్రి దినపత్రిక, టివిల డైరెక్టర్‌ ‘‘కట్టా శివ సుబ్రహ్మణ్యం’’ రూ. 25 వేలు విరాళం.

`ఆంద్రాలో చినుకు పడితే విలవిలలాడే సహృదయులెక్కడ?

`తెలంగాణ వారం రోజులు ఆగమైతే ఆహార పొట్లాలైనా పంచారా?

`దివిసీమ ఉప్పెన నుంచి మొదలు ఆంధ్రాలో తుఫాను అనగానే తెలంగాణ సాయం మర్చిపోయారా?

`హుద్‌ హుద్‌ తుఫాను సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సాయం గుర్తు లేదా?

`తెలంగాణ ప్రభుత్వం వంద కోట్ల సాయం అందించింది?

`వందలాది మంది విద్యుత్‌ సిబ్బంది, పరికరాలు పంపింది?

`మంచినీటి బాటిళ్లు సరఫరా చేసింది?

`గత ఏడాది రాయలసీమ వరదలప్పుడూ తెలంగాణ నుంచి సాయం అందించింది?

`హైదరాబాదు లో వున్న సీమాంధ్రులు స్పందించలేదు?

`సినిమా వాళ్లు తెలంగాణ వరదలతో మాకేంటనుకుంటున్నారా?

`తెలంగాణ ప్రజలు అందించిన సహాకారం మర్చిపోయారా?

`తెలంగాణలో రాజకీయం చేయడం తప్ప తెలుగు దేశం స్పందనేది?

`వైఎస్‌ఆర్‌ టిపి జాడేది?

`అదికారం మాదే అనే కాంగ్రెస్‌ కదిలి చేసిందేముంది?

`బిజేపి శ్రేణులెందుకు కనిపించలేదు?

`కలిసికట్టుగా సహాయక చర్యలు చేపట్టారా?

`ఓ వైపు వానలు కురుస్తుంటే, సినిమా ఫంక్షన్లు చేసుకున్న వారు స్పందించరా?

`సినిమా కోసం వెచ్చించే డబ్బు, వరద బాధితులకు అందించలేరా?

`ఆఖరుకు అమరావతి నిర్మాణం అంటే కూడా స్పందించిన వాళ్లు, తెలంగాణ ప్రజలకు చేయూతనివ్వలేరా?

హైదరబాద్‌,నేటిధాత్రి:                                     

తెలంగాణలో విస్తారమైన వర్షాలు కురిసాయి. ఎడతెరిపి లేకుండా పది రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్ధాయి వర్షాపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇలాంటి పరిస్ధితులు ఎక్కడ ఎదురైనా స్పందించి, మానత్వం చాటుకోవడం గతంలో చూశాం. కాని తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు కురిసి, ప్రజలు నిరాశ్రయులౌతుంటే అధికార పార్టీ బిఆర్‌ఎస్‌ నేతలు, అధికారయంత్రాంగం తప్ప ఎక్కడా ప్రతిపక్షాల జాడ లేదు. ప్రజలు కూడా ఎక్కడా ధైర్యం చెడలేదు. మన ప్రభుత్వం వుంది. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదుకుంటాడనే నమ్మకం వారిలో స్ధిరపడిపోయింది. పంట మునిగిపోయింది. నష్టపోతున్నామన్న భయం కూడా వారిలో లేదు. మన ముఖ్యమంత్రి మళ్లీ దారి చూపిస్తాడనే విశ్వాసం. ప్రజలకు ఇలా నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించే నాయకుడు అందరికీ అవసరం. అందుకే తెలంగాణ ప్రజలు ఇంకెంత కాలమైనా ప్రతిపక్షాలను నమ్మేందుకు సిద్దంగా లేరు. తెలంగాణలో కనీవిని ఎరగని స్ధాయిలో వర్షాలు కురిసినా ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా గతంలో ఎప్పుడూ ఇంతగా చర్యలు తీసుకున్నది లేదు… ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా, వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం కూడా ఒక రికార్డుగానే చెప్పాలి. అయితే ఇన్ని రోజులైనా తెలంగాణలో మానవతా వాదులే లేరా? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. గతంలో ఇలాంటి సందర్బాలలో స్పందించిన వారంతా ఎక్కడికెళ్లారన్న అనుమానం కల్గుతోంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యాక్రమాల కోసం ధాత్రి గ్రూప్‌ సంస్ధ డైరెక్టర్‌. ధాత్రి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50వేల రూపాయలు ప్రకటించింది. అలాగే నేటిధాత్రి డైరెక్టర్‌ కట్టా శివసుబ్రహ్మణ్యం వారం రోజుల పాటు కష్టపడిన జర్నలిస్టులకు కూడా సాయం అందాలన్న లక్ష్యంతో రూ.25వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించడం జరిగింది. 

స్వచ్చంద సేవాసంస్ధలు కదిలింది లేదు. సినిమా ప్రపంచం నుంచి ఎలాంటి సాయం అందింది లేదు. 

అదే గతంలో అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ వరదలు వచ్చినా, తెలుగు ప్రజలు ఎంతో స్పందించేవారు. తెలంగాణ నుంచి ప్రజలు ఎంతో సాయం అందిస్తూ వుండేవారు. కాని తెలంగాణలో మొదటిసారి ఇంత పెద్దఎత్తున వానలు కురిసి, హైదరాబాద్‌తో సహా, ఉత్తర తెలంగాణ జిల్లాలు అతలా కుతలమైనా ప్రతిపక్షాలు ప్రకటనలు చేయడం తప్ప, స్పందించింది లేదు. గతంలో ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే రాజకీయ పార్టీలు ప్రజలకు ముందుండి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించేవారు. రాష్ట్ర స్ధాయి నాయకుల నుంచి మొదలు, కార్యకర్తల వరకు కూడా ప్రతిపక్షాలు కూడా నష్టనివారణ చర్యల్లో పాల్గొనేవారు. కాని మొదటి సారి తెలంగాణలో ఎవరూ స్పందించన వైనాన్ని చూస్తున్నాం. దివిసీమపై ఉప్పెన విరుచుకుపడిన సందర్భం గురించి ఇప్పటికీ చెప్పుకోవడం జరుగుతుంది. ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు దివిసీమ గురించి చెప్పుకోవడం అలవాటుగా మారింది. అలా ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి ఉపద్రవం విచ్చినా చెన్నై నగరంలో వుండే సినిమా పరిశ్రమ ఎంతో స్పందించేది. ప్రజల గురించి ఆలోచించేది. అంతే కాకుండా గత కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్‌ తుఫాన్‌ పెద్దగా నష్టం చేకూర్చింది. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ వెంటనే స్పందించి ప్రభుత్వం తరుపున రూ.100 కోట్లు తక్షణ సాయం అందించారు. దానితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి ఆహార పదార్ధాలు, వాటర్‌ బాటిల్స్‌,తోపాటు అక్కడ విద్యుత్‌ పునరుద్దరణ కోసం ఏకంగా ఉద్యోగులను కూడా పంపించి సాయం అందించేందుకు కృషి చేశారు. దాంతో అంతపెద్ద తుఫాన్‌ను చిరుగురాటులా విలవిలాడిన ఆంధ్రప్రదేశ్‌ లో సహాయక పనులు, పునరుద్దరణ చర్యలు పూర్తి చేసుకోగలిగారు. కాని తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని కనీవినీ ఎరుగని వర్షం విలయం సృష్టిస్తే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించలేదు. కనీసం అక్కడి మంత్రులు కూడా వర్షాల మీద మాట్లాడిరది లేదు. హుద్‌ తుఫాన్‌ సమయంలో సీనీ రంగమంతా కదిలింది. లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఆర్ధిక సాయం కింద అందించారు. అంతే కాకుండా వివిధ సాంసృతిక కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, వచ్చిన డబ్బును ఆంద్రప్రదేశ్‌ అందజేశారు. అలా కూడా తెలంగాణ సాయపడిరది. ఆ తర్వాత కొంత మంది సినీ నటులు అమెరికా లాంటి దేశాల్లో వివిద ప్రదేశాల్లో ఈవెంట్లు చేసి మరీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందించారు. ఇదిలా వుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో కూడా విరాళాలు కోరితే, తెలంగాణలో నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఆర్ధిక సాయం అందించారు. 

అవన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మర్చిపోయారు. అక్కడి ప్రభుత్వం మర్చిపోయింది. 

ఎప్పుడు కావాలంటే అప్పుడు టిక్కెట్లు ధరలు పెంచుకునేందుకు కూడా సహకరిస్తున్నా, కాని ఇలాంటి సమయంలో ఏ ఒక్క సినీ రంగానికి చెందిన పెద్దలకు తెలంగాణకు సాయం చేసేందుకు మనసు రావడం లేదు. గతంలో సినిమా ఫంక్షన్‌లలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు విరాళాలు ప్రకటించిన రోజులున్నాయి. కాని ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ కు చెందిన సినిమా ప్రమోషన్‌ కూడా జరిగింది. ఆనాడు ఎంతో వర్షం కురిస్తూనే వుంది. ఆ వర్షంలో కూడా ఈవెంటును జరిపించారు. పవన్‌ కళ్యాణ్‌ ఈసారి తెలంగాణలో కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. పోటీ చేస్తామని కూడా ప్రకటించాడు. మరి అలాంటి పవన్‌ కళ్యాణ్‌ చేసిందేమిటి? రేపటి రోజున ఎలా ప్రజల ముందుకు వస్తారు? 

కాంగ్రెస్‌ చేసిందేమిటి? 

ఆ పార్టీ పెద్దలు ఎక్కడున్నారు. ఉప్పల్‌ ప్రజలు మా ఎంపి ఎక్కడా? అని ప్రశ్నిస్తే శనివారం తీరిక చేసుకొని ఉప్పల్‌ ప్రాంతాలను సందర్శించడానికి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని మరీ ప్రచారం చేసుకోవడం అలవాటు చేసుకున్న రేవంత్‌ రెడ్డి ప్రజలకు ఏం భరోసా ఇస్తారు. వరదల్లో ప్రజలు వున్నప్పుడు వెళ్లి వారి ఆకలి తీర్చింది లేదు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది లేదు. వర్షాలు పడిన ఈ వారం రోజులు ఎక్కడున్నారో తెలియదు. కాని ఈ రోజు ప్రజలను పరామర్శించి చేసేదేముంటుంది? ప్రభుత్వాన్ని నిందిస్తే సరిపోతుందా? గతంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదు? అన్న వార్తలు వినిపించేవి. కాని ఈసారి ఎక్కడా అలాంటి స్పందన కూడా లేదు. ఎక్కడిక్కడ అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులంతా, అధికారులతో కలిసి, వారం రోజుల పాటు సహాయ కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొన్నారు. ప్రజలకు సేవ లందించారు. డిల్లీలో అధకారంలో వున్నామని గొప్పలు చెప్పుకునే బిజేపి నేతలు ఎక్కడా కనిపించలేదు. కేంద్ర మంత్రిగా వున్న కిషన్‌ రెడ్డి కూడ ఎలాంటి సహాయకార్యక్రమాలలో పాల్గొన్నది లేదు. ఇక అంతా పూర్వస్ధితికి వచ్చేముందు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి మాత్రం అందరూ బయలుదేరుతారు. తాను తెలంగాణ మెట్టినింటికి వచ్చిన కోడలను అని చెప్పుకున్న వైఎస్‌ఆర్సీటీపి పార్టీ అధ్యక్షురాలు ఎక్కడున్నది? ఇలాంటి పరిస్ధితుల్లో ఆమె, ఆ పార్టీ చేసిన సాయం ఏమిటి? తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞులు. ఎవరేమిటో వారికంతా తెలుసు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *