`అసలు కోవర్టు లెవరు?

`పనిచేద్దామన్న సోయి ఒక్కరిలో లేదు!

`ఎంత సేపు ఆధిపత్యమేనా!

`లేని అవమానాల గురించేనా!

`సర్దుకుపోలేరా?

`పార్టీ పటిష్ఠం కోసం ఆలోచించరా!

`రాజకీయం తప్ప, పార్టీ పట్టదా!

`కోవర్టు రాజకీయమంతా రేవంత్‌ కోసమేనా?

`అందరూ కోవర్టులైనప్పుడు రాజకీయమెందుకు?

`పార్టీలో కొనసాగుడెందుకు?

`ఎవరి దారి వారు చూసుకోగా వద్దన్న వారు ఎవరు?

`సీనియర్లు పని చేయరు?

`చేసే వారిని ముందటపడనీయరు?

`మొత్తానికి సీనియర్లు అనిపించుకుంటున్నారు?

`పార్టీ గెలిచినా తమ పరిస్థితి మారదని వారికి తెలుసు?

`ఇలా వుంటేనే సీనియర్ల పెత్తనానికి అడ్డుండదు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఇంతకీ కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులున్నారా? వుంటే ఎవరు? అన్నదానిపై ఎడతెగని వాదనలు ఎప్పుడూ వినిపిస్తూనే వున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి వింటున్న మాటే. అయినా వారిలో మార్పు రాదు. లేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, తప్ప ఇంత వరకు సాధించిందేమీ లేదు. ప్రజల్లోకి వెళ్లింది లేదు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిపిసి పదవిలో వున్నంత కాలం ఆయనను మార్చితే తప్ప పార్టీ బాగుపడదు అన్నారు. ఆ చర్చే పార్టీలో విసృతంగా సాగింది. అయినా అధిష్టానం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని చాలా కాలం పాటు ఆ పదవిలోనే వుంచింది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ అంటే ఎంతో కొంత ఇష్టమున్నవారి దగ్గరనుంచి మొదలుపెడితే, అందరూ ఉత్తమ్‌ ను నిందించించిన వారే. ఇప్పుడు ఉత్తమ్‌కాలమే నమన్నట్లు కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది.  

అసలు కోవర్టులు అన్న పదం వదిలేసి అందరం కలిసి పనిచేద్దామన్న ఆలోచనే ఎవరికీ లేదు.

 రేవంత్‌ రెడ్డి పిపిసి అధ్యక్షుడయ్యాక పార్టీ పరుగులు పెడుతుందని అందరూ ఆశించారు. కాని అప్పటికే సీనియర్లు ఒక బలమైన నిర్ణయంతో ముందుకు సాగారు. అందరూ కలిసి కట్టుగానే వున్నారు. రేవంత్‌ను వ్యతిరేకించడంలో అందరూ ఏకతాటిపైనే వున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తప్పించి, రేవంత్‌ రెడ్డిని అధ్యక్షుడిని చేస్తున్నారన్న వార్తలు వచ్చిన ప్రతిసందర్భంలోనూ ఏదో ఒక వివాదం ముసురుకుంటూనే వుండేది. అది కొంత కాలం పార్టీ శ్రేణులకు కూడా అలవాటైంది. ఇక కాలం గడుస్తున్న కొద్ది కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం మరింత పెరిగే క్రమంలో ఏఐసిసి రేవంత్‌ను ప్రకటించింది. అంతే అప్పటినుంచి పార్టీలో అల్లకల్లోలం మొదలైంది. రేవంత్‌రెడ్డిని ఇప్పటి వరకు ఒక్కనాడు కూడా స్ధిమితంగా లేకుండా పోయింది. రేవంత్‌ పిసిసి అధ్యక్షుడయ్యాక రూ.50 కోట్లు పెట్టి కొనుక్కుంటే వచ్చిన పదవి అంటూ ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక అక్కడితో మొదలైన విమర్శల జడివాన ఇక ఎక్కడా ఆగలేదు. ఆగుతుందన్న నమ్మకం కూడా పార్టీ శ్రేణులకు లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదు. అయితే జగ్గారెడ్డి, లేకుంటే కోమటిరెడ్డి, ఇక వాతావరణం చల్లబడుతుందనుకుంటున్న సందర్భంలో హనుమంతరావు..ఇలా ఎవరికి వారు పార్టీని భ్రష్టుపట్టించడంలో పోటీ పడ్డారనే చెప్పాలి. ఇక పార్టీని నాయకులు వీడడం అన్నది కూడా ఒక ప్రహసనంగా మారింది. దాసోజు శ్రవణ్‌ వెళ్లిపోయారు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోయారు. తమ్ముడు మునుగోడులో మళ్లీ గెలిస్తే వెంకటరెడ్డికూడా ఇప్పటికే పార్టీ వీడేవారు. కాని ఆగిపోయారు. అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు బిజేపిలోనూ కర్చీఫ్‌ వేసుకునే ప్రయత్నంలోనే వున్నాడు. తాజాగా ఆయనకు వున్న స్టార్‌కాంపెయినింగ్‌ పదవికాస్త ఊడిరది. ఆ పదవిని చాలా సార్లు వెంకటరెడ్డి చులకనగా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఆ మధ్య మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ వీడారు. ఎలాంటి షరతులు లేకుండా బిజేపిలో చేరారు. అంటే అక్కడ ఎలాంటి హమీ లేకుండా చేరినప్పుడు, అక్కడ ఎలాంటి పదువులు ఆశించనప్పుడు, పార్టీ మారడంలో ఆంతర్యమేమిటో అన్నది ఎవరికీ అంతుపట్టనిది. ఇక తాజాగా తనకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని కొండా సురేఖ రాజీనామా చేశారు. అంటే అందరికీ ఆధిపత్యమే కావాలి. పదవులు కావాలి. కాని పని చేయడానికి మాత్రం ఎవరికీ తీరిక లేదు. తెలంగాణ వచ్చి ఎనమిది సంవత్సరాలౌతున్నా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది లేదు. ప్రజలను ప్రసన్నం చేసుకున్నది లేదు. ఎంత సేపు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నాడన్న మాట మాత్రం పదే పదే మాట్లాడుతున్నారు. ఆయన తమకు సహకరించడం లేదంటున్నారు. పిసిసి అధ్యక్షుడు అన్న తర్వాత పార్టీని ఎలా ముందుకు నడపాలన్నదానిపై ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం వుంటుంది. దాన్ని కాదనే హక్కు ఇతరులకు లేదు. అయినా కాళ్లలో కట్టెలు పెట్టే పనులు మాత్రం సీనియర్లు మానుకోవడం లేదు. అసలు సర్ధుకుపోవడం అన్నది లేనే లేదు. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆ మధ్య ఏఐసిసి అధ్యక్షుడి ఎన్నిక సమయంలోనూ దామోదర రాజనర్సింహ గాంధీ భవన్‌ముందు ధర్నా నిర్వహించారు. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా తన అసంతృప్తిని వెల్లగక్కుతూనేవున్నాడు. ఇంత మంది సీనియర్లు రేవంత్‌ను ఒక ఆట ఆడుకుంటున్నా, ఏసిసిసి మాత్రం రేవంత్‌ను పక్కన పెట్టే పరిస్ధితి కనిపించడం లేదు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్‌నేతల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. 

నిజంగా సీనియర్లకు చిత్త శుద్ది వుందా? 

అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మొత్తానికి మొత్తం సీనియర్లు రేవంత్‌ నాయకత్వాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న వాళ్లే..? గతంలో ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదు. రేవంత్‌రెడ్డి పార్టీని దారిలో పెడతాడని, పార్టీని బలోపేతం చేస్తాడని పార్టీ శ్రేణులు బలంగానే నమ్మాయి. కాని అనుకన్నంతగా పార్టీకి పేరు వచ్చింది లేదు. క్యాడర్‌ పెరిగింది లేదు. ఎప్పటికప్పుడు రేవంత్‌రెడ్డి ఎంత హడావుడి చేసినా, ఆయన ఎన్ని సభలు పెట్టినా లాభం లేకపోతోంది. మునుగోడు ఎన్నికల ముందు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయగానే సభ ఏర్పాటు చేశారు. నిజానికి అంతపెద్ద సభ ఏర్పాటులో కాంగ్రెస్‌లో జోష్‌ నిండాలి. కాని ఎవరినడిగి సభ ఏర్పాటు చేశారు. తనకు సరైన సమాచారం లేదని ఒకరు. తనను ఆ సభలో ఇష్టానును సారం మాట్లాడారని వెంకటరెడ్డి, నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదని మధుయాష్కి గౌడ్‌లు మాట్లాడడం విన్నదే. అంటే రేవంత్‌ వేసే ప్రతి అడుగును సీనియర్లు అడ్డుకుంటున్నారనేది సుస్పష్టం. 

ఎన్నికలకు ఇంకా సరిగ్గా ఏడాది మాత్రమే వుంది. 

 అయినా కాంగ్రెస్‌ కలవరం ఆగడంలేదు. కల్లోలం ఆగడం లేదు. పిపిసి అధ్యక్షుడి మీద అలకలు ఆగడం లేదు. ఆయన మీద వ్యతిరేకత తగ్గడం లేదు. ఇప్పటికైనా రేవంత్‌ను మార్చండన్న మాటలు ఆగడం లేదు. మొత్తానికి సీనియర్లు రేవంత్‌ను ముందట పడకుండా చేయడంలో సక్సెస్‌ అవుతున్నారన్నది మాత్రం నూరు నూరుపాళ్లు నిజం. ఏఐసిసి ఎంత చెప్పినా సీనియర్లు వినడం లేన్నది కూడా నిజం. ఈ వయసులో వారికి పదవులకన్నా, ఆత్మగౌరవం ముఖ్యమనుకునే వాళ్లు కొందరైతే, పిసిసి ఒక్కసారైనా కావాలనుకుంటున్న వాళ్లు కొందరున్నారు. దాంతో ఈ కల్లోలం రేవంత్‌ ను పక్కన పెట్టేదాకా ఆగదు. ఒకరినొకరుకోవర్టులున్న మాటలు మాట్లాడుకోకుండా మానరు. ఇది టి కప్పులో తుఫాను అనుకోవడానికి వీలులేదు. కలిసున్నట్లే నటిస్తారు…పక్కకు జరగ్గానే ఎవరి రాజకీయం వారు ఆడుతారు. అదంతే! కాంగ్రెస్‌కథంతే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!