`అవినీతి చేయాలే- రాజకీయాల్లో చేరాలే!
`ఉద్యోగిగా దోచుకున్నది సరిపోక…
`అవినీతి సంపాదనకు ఎగబడిన వారికి రాజకీయాల మీద మోజు.
`ఈ రోజుల్లో రాజకీయాలంటే మాటలు కాదు…నోట్ల కట్టలు!
`అంతంత సంపాదన అధికారులకు ఎక్కడిది?
`ఎంతటి రాజకీయ నాయకుడైనా రియలెస్టేట్ చేయాల్సిందే…సంపాదించి రాజకీయాలలో ఖర్చు చేయాల్సిందే!
`మరి అధికారులు ఏం చేసి కూడబెట్టారో కూడా చెప్పాలి.
`వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీకి 15 మంది అధికారులు రెడీ!
`ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ రాజకీయాలలోకి…
`ఉద్యోగంలోనే ప్రజలకు సేవ చేయని వాళ్లు రాజకీయాలకొచ్చి ఉద్దరిస్తారా?
`ఉద్యోగం వెలగబెట్టిన నాడు ప్రజలను చీదరించుకొని…ఇప్పుడు అక్కున చేర్చుకుంటారా?
`ప్రజలను నమ్మమంటారా?
`గతంలో నిజాయితీకి మారుపేరైన అధికారులను పార్టీలు ఆహ్వానించేవి?
`ఇప్పుడు ఖర్చుకు సిద్ధమని అధికారులే పార్టీల ప్రదక్షిణాలు చేస్తున్నారు?
`అయితే కారు…అందిస్తామంటే చేయి.
`ఈ రెండూ కాదంటే కమలం…
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయం…ఈ పదం ప్రపంచంలో ఏ మూలననున్న దేశమైనా అనుసరించాల్సిందే…ఏ గ్రామంలోనైనా వినాల్సిందే…రాజరికమైనా అమలు చేయాల్సిందే…అంతే…అదేదాని గొప్పదనం… ప్రజలకు చేరువుగా వుండేది…ప్రజలను పీడిరచుకు తినేది…ప్రజలతో ప్రతిక్షణం ముడిపడి వుండేది రాజకీయమే…అది లేకుండా ప్రజా సమూహాన్ని ఊహించుకోలేము…! అది గొప్పదో….నీతి మాలిందో ఇప్పటికీ అర్ధం కాదు…అదే రాజకీయం…దాని పరిధిని గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ అవతారులు, తనువు చాలించేదాకా తమకే, తమదే అధికారం అన్నట్లు, మాదే రాజకీయం అన్నట్లు సాగుతున్నారు. రాజకీయాన్ని రొంపి రొంపి అంటూనే తరతరాలు రాజకీయ రంగు వేసుకుంటూనే వున్నారు. సమాజంలో ఒక మెట్టు పైనే బతుకుతున్నారు. తాము ప్రత్యేకం అన్నట్లు పెత్తనం చెలాయిస్తున్నారు. ముందు సేవా ముసుగులో అడుగులు మొదలు పెడతారు…తర్వాత పెత్తనం అడుగులు ప్రజల నెత్తిన పెడతారు…ఇదే నేటి రాజకీయం…ఇదే మన సమాజంలో సమ సమాజామని చెబుతూనే, మేం కాస్త ఎక్కువ సమాజం అనుకునే లోకం…రాజకీయ కులం…! ఆ కులం వాసన చూసిన వారు ఎప్పుడూ వదిలేయలేరు.
పదవికి అలవాటు పడిన వారు ఎప్పుడూ దాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఆస్ధులమ్ముకొనైనా సరే..వున్నదంతా ఊడ్చిపెట్టుకొనైనా సరే పోటీకి దిగుతారు..గెలిచే వరకు గజనీ దండయాత్రలు చేస్తూనే వుంటారు..ఒక్కసారి గెలిచి కుర్చీలో కూర్చున్నాక, ఆ కుర్చీ వైపు ఎవరూ చూడకుండా సర్వం, సకలం తనకే సొంతమని భావిస్తుంటాడు…అది రాజకీయ మాయో.. మందో, మర్మమో గాని ఒక్కసారి రాజకీయం ఒంట బడితే వదలలేరు… అది వరమో…వదిలిపోని జబ్బో కాని, అనుక్షణం రాజకీయంలోనే మునిగి తేలుతుంటారు…ప్రజల్లో ఒక మెట్టు పైన వుంటూ, ఆనందంలో గడుపుతుంటారు..ఎన్ని కష్టాలైనా ప్రజా నాయకుడినన్న ధైర్యంలో బతుకుంటారు.. ఇదంతా దగ్గరుండి చూసే అధికారుల్లో కూడా ఈ మధ్య నేనుందుకు రాజకీయాల్లో చేరకూడదనే ఆశ పెరుగుతోంది…! రాజకీయమంటే పైకి కనిపించే హంగూ ఆర్భాటమే చూసి, నాలుగు రూపాయలు పడేసి పార్టీ టిక్కెట్టు తెచ్చుకొని, ఓటర్లు కొనేసి గెలుద్దామనుకునే వారు తెలంగాణలో ఓ పది హేను మంది తయారైతున్నట్లు సమాచారం… రాజకీయ నాయకుల హంగూ ఆర్భాటం, దర్పం చూసి రాజకీయమంటే ఇంతేనా…అని తొందరపడి అడుగులు వేయడానికి కొందరు అవినీతి అధికారుల సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
కాని ఇక్కడో విషయం చెప్పుకోవాలి. రాజకీయ నాయకుడి కష్టం పగోడికి కూడా రాకూడదు. ఎందుకంటే పదవి లేకుండా పది నిమిషాలు వుండలేడు. పది మంది కనిపించకుంటే అడుగు బైట పెట్టలేడు. పది మందితో కలిసి తినలేకపోతే ఆకలే వద్దనుకుంటాడు…పది మందిలో సంతోషంగా కనిపించినా, లోలోన పడే మధనం పైకి కనిపించనీయని వాడు..ప్రతి క్షణం, మరుక్షణం కోసం ఆలోచించే వారే రాజకీయ నాయకులు. మనసు, శరీరం రెండూ ఎప్పుడూ పరుగెత్తుతూనే వుండాలి. ఎవరు వచ్చి, ఏదడిగినా లేదనకూడదు…నా వల్ల కాదనకూడదు…నేను చేయలేననొద్దు…ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం నాయకుడికి పురిటినొప్పులే…ఆ తిప్పలే ఎంతో ఆనందం..సంతోషం…బిపిలు పెరిగినా సరే…షుగర్లు వచ్చినాసరే…పోలీసు కేసులైనా సరే…జిందాబాద్ పదం వినకపోతే నిద్ర పట్టదు..! మరి నిన్నటి దాకా అధికారులుగా ప్రజలకు దూరంగా అధికారంచెలాయించిన ఉద్యోగులు ఒక్కసారిగా రాజకీయ అవతారం ఎత్తితే సరిపోతుందా? ఈ రోజుల్లో రాజకీయం అంటే నోట్ల కట్టలు..
ఎన్ని కట్టలైనా సరే…అప్పులు చేసైనా సరే…ఒక్క ఓటు ఎక్కువ సంపాదించేందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా పెట్టాల్సిందే…వున్నదంతా ఊడ్చిపెట్టుకోవాల్సిందే…గెలిస్తే సరి..ఒక వేళ ఓడిపోయినా మళ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూడాల్సిందే…రాత్రనక, పగలనక ప్రజల కోసం పనిచేయాలి. తన సొంత పనులు చూసుకోవాలి. ఆస్ధులు సంపాదించాలి. వ్యాపారాలు చేయాలి. రియలెస్టేట్‌లో ఆరి తేరాలి. ప్రజలకు ఎప్పటికప్పుడూ చేరువౌతూ వుండాలి. ఇంత కష్టపడితే గాని రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో సాధ్యం కాని పని…ఒక కార్పోరేటర్‌గా పోటీ చేయాలంటేనే కోట్లు కావాలి. అప్పులు చేయాలి…! మరి ఉద్యోగం వెలగబెట్టిన వాళ్లు ఎలా రాజకీయం చేస్తారు..? ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? ఆ సంపాదన అధికారులకెక్కడిది? వచ్చే జీతం ఇల్లు గడవడానికి, ఓ ఇల్లు కొనుక్కొవడానికి, ఓ రెండు కార్లకు, చిన్న చిన్న విలాసాలకు మాత్రమే సరిపోతుంది. మరి ఎన్నికల్లో నిలబడి రోజుకు వేలాది రూపాయలు ఖర్చు చేసి, ఎన్నికల నాడు కోట్లు కుమ్మరించేంత ఆదాయం ఎక్కడిది? అంత సంపాదన రాత్రికి రాత్రి వచ్చేది కాదు…? వ్యాపారాలు సాగిస్తే తప్ప కూడబెట్టలేరు…? మరి ఎంత అవినీతి చేస్తే అంత సంపాదన పోగౌతుంది. అంతంత సొమ్ముకూడబెట్టాలంటే ఎంత మందిని నుంచి వసూలు చేసి వుండాలి. ఎంత మంది ప్రజలను వంచించి వుండాలి. అవినీతి ఏ రేంజ్‌లో చేస్తే కూడేది…! అధికారిగా కుర్చీలో కూర్చున్న నాడు పని కోసం సామాన్యుడు కార్యాలయాలకు వస్తే కనీసం అప్పాయింటు మెంటు ఇవ్వని అధికారులు అనేక మంది వుంటారు.
నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా కనికరించని అధికారులున్నారు. ఇక పెద్ద స్ధాయిలో ఉద్యోగం చేసేవారు సామాన్యుల వంక చూడడానికి కూడ ఇష్టపడని వారున్నారు. మరి అలాంటి వ్యవహార శైలి వున్నవారు రాజకీయాలలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తారా? ప్రజలను దగ్గరికి రానిస్తారా? ఒళ్లో కూర్చోబెట్టుకున్నంత పని చేస్తారా? కనీసం వారిని దగ్గరకు రానిస్తారా? ఎన్నికల నాడు జనం మందుకు చొచ్చుకొని వచ్చినా, గెలిచినా ప్రజలకు కనిపిస్తారా? ఇక జనానికి దూరంగా ఉద్యోగం వెలగబెట్టిన వారు కూడా రాజకీయాల్లోకి వస్తే ప్రజా సమస్యలు ఎప్పుడు తెలుస్తాయి? ప్రజలకు సేవ ఎలా చేస్తారు? అంతే కాదు ఉద్యోగ ధర్మంలో ప్రజా సేవ చేయలేని వారు, దానికి రాజీనామా చేసి వచ్చి, ప్రజలను ఉద్దరిస్తారా? అలాంటి వారిని ప్రజలు నమ్ముతారా? నిత్యం ప్రజల్లో వుంటూ, ప్రజల కోసం పనిచేస్తూ, కేసులు ఎదుర్కొంటూ, కొట్లాడుతూ, ఐదేళ్ల నాడు వచ్చే ఎన్నికల కోసం నిత్యం కాపు కాచుకొని కూర్చునే నేతలనే జనం నమ్మడం లేదు. అలాంటిది రాత్రికి రాత్రి వచ్చి నాయకులౌతాం…ఎన్నికల్లో పోటీ చేస్తాం…మీకు సేవ చేస్తామంటే నమ్ముతారా? ఓట్లేస్తారా? గెలిపిస్తారా? గతంలో ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా పని చేసిన వారిని పార్టీలే రాజకీయాల్లోకి ఆహ్వానించేవి. ముఖ్యంగా సమాజ నిర్మాణంలో భాగమైన ఉపాధ్యాయులు రాజకీయాలపై ఆసక్తి కనబర్చేవారు. కాని ఇప్పుడు ఉపాధ్యాయులు రాజకీయాలు మాట్లాడేందుకు భయపడుతున్నారు. రాజకీయాలంటే ఆమడ దూరం పరుగెత్తుతున్నారు. కాని ఇతర శాఖలల్లో అవినీతి సంపాదనకు అలవాటు పడి, రోజూ జేబు నిండనిదే కార్యాలయం గడప దాటని అధికారులు, రిటైర్మెంటుకు దగ్గరగా వున్న సమయంలో రాజకీయాల అవకాశాల కోసం వెంపర్లాడుతున్నారు. పార్టీల పంచన చేరుతున్నారు. నాయకుల దృష్టిలో పడి, వారికి ఊడిగం చేసి, ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు..ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామంటున్నారు…టిక్కెట్ల కోసం వేట అప్పుడే మొదలుపెట్టారు…ఎంచుకున్న నియోజకవర్గాలలో ప్రతి చిన్న శుభకార్యామైనా పాలు పంచుకుంటున్నారు. ప్రజలకు చేరువౌతున్నారు. ప్రజలల్లో మంచి పేరు కోసం పాకులాడుతున్నారు. ఆయా నియోజకవర్గాలలో తమ వర్గాలను ఏర్పాటు చేసుకొని వాటిని పోషిస్తున్నారు. నెల నెల లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రచారానికి వాడుకుంటున్నారు. వారి చేత జేజేలు పలికించుకుంటున్నారు..జిందాబాద్‌లు కొట్టించుకుంటున్నారు… నాయకులు కావాలని కలలు గంటున్నారు… ప్రజా ప్రతినిధులమైపోయినట్లు రేపటిని ఊహించుకుంటున్నారు. అయితే ,,,,,కారు..లేకపోతే కాంగ్రెస్సు…అక్కడా సీటు లేదంటే కమలంతో దోస్తీకి….పోటీకి సై అంటున్నారు… వారి వివరాలు మీ నేటిధాత్రిలో వరసగా….త్వరలో…!