` అటు ముప్పెట దాడి…
` ప్రభుత్వాన్ని అస్థిర పర్చడమేనా బిజేపి పని?
`ఇప్పుడు తప్పితే తెలంగాణ ను వశం చేసుకోవడం కుదరదని కుయుక్తులు?
` కేటిఆర్ సీఎం అయితే మరో పదేళ్ళ పాటు బిజేపి పాగా వేయడం కష్టం!
` అందుకే ఈ తొందరపాటు గందరగోళం…
`ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే పన్నాగం…
`ఎనిమిదేళ్ళలో ఏమిచ్చారని ఆదరించాలి?
`ఐటిఐఆర్ ఎందుకు లాక్కెల్లారు?
`కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు ఎందుకు తరలించారు.
`వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణను అవహేళన చేస్తూనే వుంటారు.
`తెలంగాణ లో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూనే వున్నారు.
`ఉత్తరాదికి మూటలు….దక్షిణాదికి మాటలు…
` అక్కడ కోట్ల పెట్టుడులు..
`ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు…
`మభ్యపెట్టడం,మాయ చేయడం తప్ప తెలంగాణను ఇచ్చిందేమీ లేదు.
`తెలంగాణ సంపద ప్రైవేటు వ్యక్తుల వశం చేసేందుకే కపట నాటకాలు?
`అధికారంలో వుంటే అమ్మకాలకు అడ్డుందనే ఈ వేషాలు?
హైదరాబాద్,నేటిధాత్రి:
పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. అరవైఏళ్ల గోసలో మగ్గిన తెలంగాణ. ఆత్మగౌరవం కోసం ఆరాటపడిన తెలంగాణ. అస్దిత్వం కోసం ఎదురు చూసిన తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణీ పౌరులుగా బతికిన తెలంగాణ. అలాంటి పరిస్దితుల నుంచి విముక్తి కోసం, స్వపరి పాలన కోసం, ప్రగతి కోసం మలి దశలో పద్నాలుగేళ్ల కొట్లాతో వచ్చిన తెలంగాణ. తెలంగాణ వచ్చి పట్టుమని పదేళ్లుకాలం కూడా కాలేదు. తెలంగాణ వచ్చిన నాటి నుంచే గద్దల్లా మళ్లీ తెలంగాణను అన్యాయం చేసేందుకు చూసిన చరిత్ర మన కళ్ల ముందే వుంది. తెలంగాణ వచ్చాక ఉద్యమ పార్టీని టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అయ్యారు. అలా ప్రభుత్వం ఏర్పాటైందో లేదో తెలంగాణను ఎలా ఆగం చేయాలని చూసిన సందర్భాలు తెలియంది కాదు. తెలంగాణ ప్రజలు 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఇచ్చిన సీట్లు 63. ఆ మెజార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం చేశారు. అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నేటి టిపిసిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డితో నోట్లకట్టలు పంపారు. కేసు ఇంకా కొనసాగుతూనేవుంది. దాంతో అప్పడు తెలంగాణ వచ్చినా, టిఆర్‌ఎస్ గెటిచినా, ఎదురు దెబ్బలు ఎన్ని తిన్నా నిలబడిన తెలంగాణ కావాలి అన్నదే కేసిఆర్ ఆశయం ప్రగతి సాధించిన తెలంగాణ ఆవిష్కారం కావాలని ఇతర పార్టీల నాయకులను టిఆర్‌ఎస్ పార్టీ వారి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని అక్కున చేర్చుకున్నది.అదే సమయంలో తెలంగాణ నిలబడానికి ఉపయోగపడిరది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లోనూ తెలంగాణను అన్యాయం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ బయలుదేరాయి. ఇవన్నీ కేంద్రంలో వున్న బిజేపికి తెలుసు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణను కాపాడేది, అభివృద్ధి చేసేది, ఆత్మగౌరవం నింపేది కేసిఆరే అని టిఆర్‌ఎస్‌కు ఎవరూ ఊహించని మెజార్టీ వచ్చింది. ఆ ఎన్నికల్లో 88 సీట్లు టిఆర్‌ఎస్ గెలిచింది. అయినా తెలంగాణను ఆగం చేద్దామని చూసే వాళ్లు చూస్తూనేవున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం బిజేపి ఒక అడుగు ముందుకేసి దించేస్తామన్నంత దోరణి వ్యక్తం చేస్తోంది. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి నేరేంద్ర మోడీ ఇందుకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలు కూడా టిఆర్‌ఎస్ చేస్తూనే వుంది. తెలంగాణ ప్రగతి చూసి ఓర్వులేని రాజకీయ పార్టీలు ఎలాగైనా తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారు. పొత్తిళ్లకాలం దాటకముందే తెలంగాణను మింగేద్దామని చూస్తున్నారు. రాజకీయ రాబంధులు కాచుకొని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాయి. అదును చూసి తెలంగాణ గొంతును నులిమేయాలని చూస్తున్నాయి. తెలంగాణ ఉనికి కూడా సరిగ్గా తెలియని బిజేపి నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ మీద పెత్తనం కోసం పాకులాడుతున్నారు.
నిజానికి ఏ రకంగా చూసిన రాష్ట్ర బిజేపి నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న సమయంలో ఆనాడు కేంద్రంలోవున్నది ఎన్డీయే( బిజేపి) ప్రభుత్వం. ఆనాటి ఉప ప్రధాని ఎల్‌కే. అద్వానీ తెలంగాణ ఉద్యమాన్ని ఎద్దేవా చేశాడు. ఇప్పుడు ఆయన శిష్యుడైన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటునే ఎగతాళి చేస్తున్నాడు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నాడు. తల్లిని చంపి బిడ్డను రక్షించారన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రధానికి తెలంగాణ అంటే ప్రేమ వుంటుందని ఎవరైనా అనుకుంటారా? ఎనమిదేళ్ల బిజేపి కేంద్ర పాలనలో తెలంగాణకు ఇంత వరకు ఒక్క ప్రాజెక్టు ఇచ్చింది లేదు. కనీసం విజభన హామీలు అమలు చేసింది. లేదు. కాని తెలంగాణ మీద పెత్తనం కావాలి. అధికారం కావాలి. అది కూడా ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని దింపి, బిజేపి ప్రభుత్వం ఏర్పాటుచేయాలి? ఇదేనే ప్రజాస్వామ్య స్పూర్తి. ఇదిలా వుంటే రాజ్‌భవన్ కూడా రాజకీయాలకు వేధిక చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా రాజ్‌భవన్‌ను రాజకీయ వేధిక చేసిన సందర్భాలున్నాయి. ఎన్టీఆర్‌ను దించేసేందుక రాంలాల్ ఏం చేశాడో తెలుసు. ఆ తర్వాత వచ్చిన కుముద్‌బిన్ జోషి కూడా ఆనాడు ఎన్టీఆర్ ఫ్రభుత్వానికి ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర కూడా వుంది. ఇప్పుడూ అదే జరుగుతోందనేది టిఆర్‌ఎస్ ప్రధాన ఆరోపణ.. ఇదిలా వుంటే ఈ మధ్య టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అంశం ఎంత సంచలనం సృష్టించింది.
దేశంలోనే రెండో బలమైన ప్రభుత్వంగా వున్న టిఆర్‌ఎస్‌ను గద్దెదించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా?
మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్దిరపర్చుదామనుకున్నారు. కాని ప్రజలు బిజేపిని పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు తప్పితే తెలంగాణను వశం చేసుకోవడం తర్వాత కాలంలో కలిసిరాకపోవచ్చు. అదును దొరక్కపోవచ్చు. కేంద్రంలో మళ్లీ బిజేపి అధికారంలోకి రాకపోవచ్చు. అప్పుడు మళ్లీ కష్టపడి ప్రజల మెప్పు పొందడం కష్టం కావొచ్చు. ప్రజలు బిజేపిని ఆదరిస్తారన్న నమ్మకం లేదు. ఇక మళ్లీ వచ్చే ఎన్నికల దాకా ఆగితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి, కేటిఆర్ సిఎం అయితే ఇక బిజేపి తెలంగాణలో భవిష్యత్తుఅన్నది వుండదు. కనీసం ఓ దశాబ్ధం పాటు బిజేపికి పని వుండదు. ప్రజల్లో వుండదు. అందుకే ఈ తొందరపాటు గందరగోళం. నిజానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆగం చేద్దామన్న ఆలోచనలో తామే దిగజారిపోతున్నామన్న సంగతి మర్చిపోతున్నారు. పైగా నిండా మునిగినవారికి చలేం చేస్తుందన్నట్లు ప్రజల మద్దతు లేకుండానే కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దుర్మార్గపు ఘనతను బిజేపి సొంతం చేసుకున్నది. అదే ఎత్తుగడ ఇక్కడా వేయాలనిచూసింది. బొక్కాబోర్లా పడిరది.
ఇప్పుడు తాజాగా పిల్లపుట్టి పెరిగిపెద్దదైనంక బార సాల చేసినట్లు, రామంగుడం ఎరువుల ఫ్యాకర్టీని జాతికి అంకితం చేసే పని పెట్టుకొని ప్రధాని తెలంగాణకు వస్తున్నారు.
పైకి కనిపించే పని ఎరువుల ఫ్యాక్టరీ అయినా, తెలంగాణలో పాగా వేయడమే ఇందులో ఆంతర్యమన్నది కనిపిస్తోంది. తెలంగాణకు ఈ ఎనమిదేళ్లకాలంలో కేంద్రం చేసిన అన్యాయాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సివుంది. తెలంగాణకు విభజన చట్టంలో అప్పటి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ఇప్పటికీ నదీ జలాల వాటాల లెక్కలు కూడా తేల్చలేదు. ఐటిఐఆర్ అనేది తెలంగాణకు విభజన చట్టంలో భాగంగా ఇచ్చారు. దాన్ని పునరుద్దరించమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు అడిగినా చడీ చప్పుడులేదు. తెలంగాణలో గత కొంత కాలంగా కోరుతున్న తెలంగాణ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు కేటాయించడం లేదు. ఇప్పటికే ఐటిలో దూసుకుపోతున్న తెలంగాణకు సాఫ్ట్‌వేర్ పార్కులతో బలపడడం బిజేపికి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజీలు లేవు. నవోదయ పాఠశాలలు లేవు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులోనూ కిరికిరే. ఉత్తరాధికి మూటలు, దక్షిణాదికి మాటలు చెప్పడం బిజేపి అలవాటు చేసుకున్నది. దానికి తోడు రెచ్చగొట్టే ప్రసంగాలుచేయడం నేర్చుకున్నారు. మభ్యపెట్టడం , మాయ చేయడం, ప్రజలను తమ మాటలతో సానుభూతి పొందాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేసి, ప్రజల దృష్టిని మళ్లించాని పదేపదే చూస్తున్నారు. ఎందుకంటే ఒక అబద్దాన్ని పది సార్లు చెబితే అదే నిజమని నమ్మే ప్రమాదముంది. అలా తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే వున్నారు. ఇవన్నీ తెలంగాణ మీద ప్రేమతోకాదు. తెలంగాణలో వున్న ఆర్ధిక వనరులను కొల్లగొట్టడం కోసం, ఉత్తరాధికి చెందిన వ్యాపారులకు కట్టబెట్టడం కోసమే తప్ప, ప్రజా శ్రేయస్సు కోసం కాదు…అందుకే టిఆర్‌ఎస్ మోడీ గో బ్యాక్ అంటోంది….తెలంగాణకు రావొద్దంటోంది!!