Headlines

అబార్షన్లకు ఆమె ఫేమస్‌?

అదే ఆమె వృత్తి?

కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నే సంపాదన?

భ్రూణ హత్యలు నేరమని తెలిసినా గుట్టు చప్పుడు కాకుండా నిత్యం పదులలో అబార్షన్లు?

ఇప్పటికే మూడు సార్లు జైలుకు?

అయినా ఆమె మారలేదు…అబార్షన్లు ఆపడం లేదు?

అధికారికంగా బోర్డు పెట్టుకొని మరీ అబార్షన్లు!

అబార్షన్ల స్పెషలిస్ట్‌ సబిత అంటే తెలంగాణ మొత్తం ఫేమస్‌?

ఆమె రాకెట్‌ నెట్వర్క్‌ మామూలుగా లేదు? 

ఆమె రిఫర్‌ చేసిందంటే డయాగ్నస్టిక్‌ సెంటర్లు లింగ నిర్థారణ చేయాల్సిందే?

అబార్షన్‌ వికటిస్తే సబిత పంపితే ఆసుపత్రులు వైద్యం చేయాల్సిందే?

ప్రాణాలు పోతే పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవాల్సిందే?

అధికార యంత్రాంగానికి ఈ తంతంతా తెలుసు?

అయినా అంతా గప్‌ చుప్‌!

పట్టించుకునే వాళ్లు లేరు…?

బేటీ బచావో…బేటీ పడావో…! అసలు బేటి పుడితే కదా!

పురిట్లోనే చంపేస్తుంటే పుట్టేదెలా?   

రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ భ్రూణ హత్యలు నిత్య కృత్యమయ్యాయి. ప్రభుత్వం దాకా వివరాలు చేరవు. పాలకుల దృష్టికి రావు. అధికారులు ఎక్కడికక్కడే సంఘటనలు తొక్కి పెట్టేస్తుంటారు. ఏం జరిగినా బైటి ప్రపంచానికి తెలియదు. నిత్యం రాష్ట్రంలో భ్రూణ హత్యలు ఆగడం లేదు. వైద్య వృత్తిలో ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు పొత్తిళ్లలలోనే ఆడ పిల్లలను చంపేస్తున్నారు. వైద్య వృత్తిలో అదో భాగంగా మార్చుకొని వ్యాపారం చేసుకుంటున్న వాళ్లు కూడా ఎక్కువైపోయారు. బేటీ బచావో…బేటీ పడావో అని గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందా? ఆడ పిల్ల అసలు పుడితే కదా? పుట్టనిస్తే కదా? బతుకుడో…చదువుడో అన్నది తర్వాత. ముందు పురిటిలోనే చిద్రం చేస్తున్నారు. భూమ్మీదికి చిన్నారి రాకుండా కళ్లు తెరవకముండే చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రాణం తీసేస్తున్నారు. లోకం కూడకుండా చేస్తున్నారు. ఇక ఆడ పిల్ల పుట్టేదెలా? భూమ్మీద పడేదెలా? బతికి బట్ట కట్టేదెలా? కడుపులోనే కత్తెర్లతో ముక్కలు ముక్కలు చేస్తున్నారు. జాలి లేని వైద్యలు చేస్తున్న ఈ కర్కోటకపు పని పైకి అందరూ ఖండిరచేవారే? కాని ఎక్కడా ఆగడం లేదు. ఎలా జరుగతున్నాయి. ఎందుకు జరగుతున్నాయి. వాటిని వెనకేసుకున్నవారు ఎవరు? సమర్ధిస్తున్నవారు ఎవరు? ప్రోత్సహిస్తున్నవారు ఎవరు? భ్రూణ హ్యత్యలు చట్టరిత్యా నేరం. అలాంటి వారు పట్టుబడుతున్నా…ఎందుకు బైటకొస్తున్నారు? మళ్లీ ఎందుకు అవే పనులు చేస్తున్నారు? వాటిని ఆపాలన్న కనీస జ్ఞానం లేకుండా ఎందుకు ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపార సామ్రాజ్యం చేసుకొని కొందరు స్వార్ధపరులైన వైద్యులు ఆడుతున్న వికృత క్రీడ మూలంగా రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తున్నాయి. అలా ఈ మధ్య లోకం చూడని ఓ పసిగడ్డును, ఆడ పిల్లను కడుపులో దాచుకున్నందుకు ఓ తల్లిని ఇద్దరినీ మింగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాని అదంతా ఎక్కడికక్కడ గప్‌చుప్‌గా ముగిసింది…? దీని వెనకు వున్నదెవరు? ఆ పాపానికి ఒడిగట్టిందెవరు? అందుకు సహకరించిందెవరు? అన్నదానిపై నేటిధాత్రి పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఆమె పేరు సబిత…? అబార్షన్లు చేయడంలో ఆమె దిట్ట? చాలా ఫేమస్‌? ఏకంగా ప్రభుత్వ ఆమోదిత కుటుంబ నియంత్రణ కేంద్రం అని బోర్డు పెట్టుకొని మరీ అబార్షన్లు సాగిస్తోంది? ఇలా బోర్టు పెట్టుకోవడం నేరమన్న సంగతి కూడా తెలియకుండానే ఈ వ్యహారం అంతా సాగితస్తోంది. ఇదే ఆమె వృత్తి. పేరుకు వైద్యురాలు. కాని చేసే సేవ మాత్రం పురిట్లోనే ఆడ పిల్ల అని తెలిసిన పిండాలను చిద్రం చేయడం. అందుకు ఆమె చేసే చార్జి కూడా మామూలుగా వుండదు. ఆమె సంపాదన కూడా కార్పోరేట్‌ ఆసుపత్రికి తగ్గదు. అలా సంపాదనకు అలవాటు పడి ఇక వైద్యం చేయడం మానేసింది. రోజుకు పదుల సంఖ్యలో అబార్షన్లు చేయడమే పనిగా పెట్టుకున్నది. ఏదైనా జరక్కూడనిది జరిగితే వెంటేనే హన్మకొండలోని ఏదో ఒక ఆసుపత్రికి పంపించేస్తుంది. అక్కడ వైద్యం అంది బాధితులు బాగుపడితే సరి…? పొత్తిళ్లలో బిడ్డను చిద్రం చేసే క్రమంలో తల్లికి ప్రమాదం జరిగి, ప్రాణాలు పోయినా పరిహారం చేసుకొని మరీ కేసులు లేకుండా చేసుకుంటుంది? అసలు ఆ విషయాలు బైటకు వెల్లడికాకుండా చూసుకుంటుంది. ఈ విషయాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వైద్య శాఖలో పెద్ద తలకాయలందరికీ తెలుసు. కాని ఎవరికీ అవసరం లేదు. ఏం జరుగుతున్నా పట్టింపు లేదు. దాంతో సబిత సాగిస్తున్న అబార్షన్ల వ్యాపారం నిత్యం పది అబార్షన్లు, అప్పుడప్పుడు తల్లుల ప్రాణాలు అన్నట్లు సాగుతోంది. అయినా ఆమెకు క్రేజ్‌ తగ్గడం లేదు. ఇంతలా ఫేమస్‌ కావడానికి ఆమెకువున్న నెట్వర్కే కారణమంటారు.

రాష్ట్రంలో ఏ మూలలో వున్న ఆసుపత్రులకైనా ఆమె గురించి తెలుసు. ఆమెకు రిఫర్‌ చేస్తే చాలు…మన చేతికి మట్టి అంటకుండా పనైపోతుందని అందరూ ఆమెకే కేసులు పంపిస్తుంటారు. ఆమె నిర్వహించే ఆరోగ్య కేంద్రానికి రాలేని వారి కోసం ఆమే ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకు అవసరమైన చార్జి చేస్తుంది. లక్షల్లో కూడా కొన్ని సార్లు ఫీజులు తీసుకుంటుంది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో కూడా ఆమె ఎక్కడికక్కడ గుట్టు చప్పుడు కాకుండా అనేక అప్పార్టుమెంట్లలో ఇలాంటి వ్యవహారం కానిస్తుంటున్నారని తెలుస్తోంది. ఇలా అక్రమ అబార్షన్లు చేస్తున్న క్రమంలో గతంలో మూడుసార్లు పట్టుబడ్డారు కూడా….మూడు సార్లు జైలు జీవితం కూడా అనుభవించారు. ఓసారి సబిత ఓ అబార్షన్‌ చేస్తున్నందన్న సంగతి అధికారులకు ఉప్పందడంతో దాడి చేసిన సందర్భాలున్నాయి. అలా ఓసారి అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలిసి మేడమీదకు వెళ్లి మరీ దాక్కుంటే అధికారులు పట్టుకొచ్చి మరీ కేసులు నమోదు చేశారు. కాని ఆమె మారలేదు. మూడుసార్లు ఇలా కేసులను ఎదుర్కొన్నా ఆమెలో మార్పు లేదు. మారుతుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే భ్రూణ హత్యలపై మరింత కఠినమైన చట్టాలు లేకపోవడం..రాకపోవడమే ఇందుకు కారణం? అధికారం యంత్రాంగం కదలదు. పట్టించుకోదు. ఈ మధ్య సబిత చేసిన పనికి ఓ మహిళ ప్రాణం పోయింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు. సబితను కలిసిన దంపతులకు సేఫ్‌గా అబార్షన్‌ చేస్తానని నమ్మించింది. లింగనిర్ధారణ పరీక్ష చేయించింది. ఆడపిల్ల అని తేలిందని చెప్పి, అబార్షన్‌ మొదలు పెట్టింది. మధ్యలో ఏదో జరిగింది. ఆ మహిళకు రక్త స్రావం జరిగింది. వెంటనే ఆ మహిళను హన్మకొండలోని ఓ ఆసుపత్రికి రిఫర్‌ చేసింది. అక్కడ కూడా సరైన వైద్యం అందకపోవడంతో అక్కడి నుంచి ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా సరైన చికిత్స అందకపోవడంతో ఆ మహిళ చనిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఆనాధలయ్యారు. ఆ కుటుంబం వీధిన పడిరది. ఇద్దరు ఆడపిల్లలను తల్లిలేని బిడ్డలను చేశారు. అందరూ కలిసి చేతులు దులుపుకున్నారు. 

ఈ సంఘటన జరిగిన నుంచి ఆమె జంప్‌…! గతంలో జరిగిన వ్యహారాలు పెద్దగా బైటకు పొక్కకపోయినా, ఈ మధ్య జరిగిన సంఘటనపై పెద్దఎత్తున చర్చ సాగుతుండదంతోపాటు, నేటిధాత్రి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల తన మకాం తాత్కాలికంగా హైదరాబాద్‌కు మార్చినట్లు సమాచారం. అంతా సర్ధుమణిగిన తర్వాత మళ్లీ నిన్ననే తన సొంత క్లినిక్‌ చేరుకొని మళ్లీ కోతలు మొదలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు తన కూతురును కూడా ఎంబిబిఎస్‌ చేయించేందుకు మహారాష్ట్రలో మేనేజ్‌ మెంట్‌ కోటాలో సీటు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత పెద్ద సంఘటన జరిగినా అధికార యంత్రాంగం చలనం లేదు. స్పందన లేదు. వైద్యాధికారులు మాత్రం కదిలినట్లు కదిలారు. తూతూ మంత్రంగా రిపోర్టును తయారు చేశారు. కాని బాధితులనుంచి సరైన పిర్యాధు లేదన్న ఏకైక కారణంతో ఇంత దుర్మార్గమైన పని చేసిన సబిత మీద కేసు లేదు. ఒక మహిళగా ప్రాణాలు పోయాల్సిందిపోయి, నిర్ధయగా ప్రాణాలు తీసేస్తుంటే సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశమే లేదా? అధికారులు సరిగ్గా స్పందించాలనుకుంటే ఓ లెక్కా? ఇంత పెద్ద రాకేట్‌ నడుపుతున్న మహిళను కూడా అధికార యంత్రాంగం కూడా భయపడుతుందా? అన్న సందేహం కలగకమానదు. లేకుంటే జిల్లా వైద్య ఉన్నతాధికారులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకు ఆమెపై కేసులు నమోదు చేయడం లేదు. 

అంతా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం కానిచ్చేశారు. అధికారులు కూడా తూతూ మంత్రంగా పంచనామా చేసి రిపోర్టు క్లోజ్‌ చేశారు. ఫైల్‌ కలెక్టర్‌ టేబుల్‌మీదకు చేర్చేశారు. ఇక ఆ ఫైల్‌ కలెక్టర్‌ చూసేదెప్పుడు, దానిపై సమగ్రమైన వివరాలు తెలుసుకునేదెపఫ్పుడు? ఈ లోపు జరిగిందంతా మాఫ్‌….! ఇలా ఓ మహిళ సాగిస్తున్న అక్రమ అబార్షన్ల వ్యవహారం ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదన్నదానిపై ఎవరూ స్పందించేందుకు సిద్దంగా లేరు. అసలు లింగనిర్ధారణ పరీక్షలు చేయడమే తప్పు. నేరం కూడా. అందులోనూ లింగ నిర్ధారణ పరీక్షలు విచ్చలవిడిగా చేసేస్తున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లు రిపోర్టులు టెస్టులు చేస్తున్నారు. రిపోర్టులు ఇచ్చేస్తున్నారు. సబిత చేతికి అందిస్తున్నారు. ఆమె విచ్చలవిడిగా అబార్షన్ల దందా సాగిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలతో సహా నేటిధాత్రి చేతిలో వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!