అన్ని వేళ్లూ బిజేపి వైపే..!

బిజేపి పెద్దలు నోరు తెరిచేదెప్పుడు?
పార్టీ ప్రతిష్ట దిగజారుతుంటే కూడా కనిపించడం లేదా?
గుడి కోసం కొట్లాడాల్సిందిపోయి, కోట్లు తీసుకొని సైలెంటవుతారా?
ఇద్దరు నేతలకు చెరో కోటి ముట్ట జెప్పామని అంటున్నారు…నిజమేనా?
గుడి కోసం గుంటూరు స్వామి తాపత్రయపడుతుంటే, బిజేపి నేతలు కోట్లు మింగేస్తుంటే?
ధర్మం, దైవం కోసం అన్న మాటలు మాట్లాడే అర్హత బిజేపి నేతలకు వున్నట్లేనా?
ఇన్ని ఆరోపణలు వస్తున్నా బిజేపి పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదు?
గుడి కావాలా…కోట్లు కావాలా? బిజేపి నేతలు ఏం చెబుతారు?
తెల్లని కాగితం అగ్రిమెంటుకు చెల్లుతుందా?
తూతూ మంత్రంగా రాసుకుంటే చట్టం ముందు నిలబడుతుందా?
నాలా మీద జాగ ఇస్తామంటే సంతకాలు చేసేస్తారా?
ఎవరివారు బేరాలు మాట్లాడుకుంటే సరిపోయిందా?
ఇప్పటికైనా బిజేపి పెద్దలు కళ్లు తెరవకుంటే, పార్టీకే తీవ్ర నష్టం?
వచ్చేది మేమే…గెలిచేది మేమే అనుకుంటూ ఇలాంటి పనులు చేస్తే జనం నమ్ముతారా?
దేవుడికే దిక్కులేకుండా చేస్తుంటే, మా బతుకులు బాగు చేస్తారని అనుకుంటారా?
వచ్చేది మేమే…గెలిచేది మేమే అనుకుంటూ పై స్ధాయి నేతలు బడాయిలకు పోతుంటే, అందిన కాడికి నొక్కుతూ, జేబులు నింపుకుంటూ, కింది స్ధాయిలో పార్టీకి బొక్కలు పెడుతున్నారు. ఇదీ బిజేపిలో సాగుతున్న పైన పటారాం..లోన లొటారం ముచ్చట. దైవం, హైందవం, హిందుత్వం, ధర్మం, దేశం అంటూ మాటలు చెప్పుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టు కూడా నాయకులు ప్రవర్తించాలి. త్యాగాలు చేయాలి. అంతే కాని ధర్మం ముసుగేసుకొని, అందిన కాడికి దోచుకుంటాం…దేవుడికైనా శఠగోపం పెట్టేస్తామంటే ఇలాగే వుంటుంది. జూబ్లీహిల్స్‌ అభయాంజనేయ స్వామికి జరిగిన అన్యాయమే రేపు మాకు జరుగుతుంది? అని ప్రజలు అనుకుంటున్నారు. హైందవం ప్రకారం ధర్మం అంటే గుడి, దేవుడు. ఎందుకంటే ధర్మ పరిరక్షకుడు దేవుడు. ఆయన వుండేది గుడిలో…మరి ఆ పరిరక్షకుడైన దేవుడి కోసం, ధర్మనిరతిని అనుసరించాల్సిన బిజేపి నేతలు ఏం చేస్తున్నారు. ధర్మాన్ని పాటిస్తున్నారా? బిజేపి నేతలమని చెప్పుకోగానే సరిపోతుందా? వాళ్లు, ఓట్ల నాడు పనిచేస్తే చాలనకుంటుందా? ఇంకేం అక్కర్లేదా? ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత వారి మీదలేదా? ఒక వేళ వాళ్లు తప్పు చేస్తే పార్టీ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోదా? మీరు చేయాల్సింది మీరు చేసుకోండి? మేం చూసుకుంటామని పార్టీ ఏమైనా భరోసా కల్పిస్తోందా? ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం బిజేపి నేతలపై వుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్‌ గుడి వివాదమేమీ చిన్నది కాదు. దేవుడు ఎక్కడైనా దేవుడే…గుడి చిన్నది కదా? అని దేవుడు చిన్న దేవుడౌతాడా? ఇదెక్కడి చోద్యం. పెద్ద గుళ్లలోని దేవుళ్లను తొలగిస్తే, గుళ్లు కూల్చేస్తేనే తప్పా…చిన్న చిన్న గుళ్లు మింగేసినా బిజేపి రాష్ట్ర నాయకులకు పట్టదా? కింది స్ధాయి నేతలంతా కలిసి గుడిని, గుట్టను మింగేవాళ్లకు సహకరిస్తూ, వాళ్లు కూడా మింగుడులో పాలు పంచుకుంటుంటే కూడా తప్పని అనిపించడం లేదా? జూబ్లీహిల్స్‌ గుడి వివాదం ఏమైనా కొత్తదా? ఆరు నెలలుగా రగులుతున్నదే… రాష్ట్రంలో ఏ మారు మూల ఏం జరిగినా తెలిసే ఈ రోజుల్లో జూబ్లీహిల్స్‌ కొండ మామjైు, గుడి మాయమై, దేవుడికే దిక్కులేకుండాపోతుంటే బిజేపి రాష్ట్ర నాయకత్వానికి తెలియంకుండా వుంటుందని ఎవరైనా అనుకుంటారా? రాష్ట్ర పార్టీ చిత్తశుద్ది ఎంత గొప్పదో తెలుసుకోలేరా? మేమే హిందుత్వానికి ప్రతీకలమంటే ఇదేనా? గుడి వున్న స్ధలాన్ని మాయం చేసేవారికి సాయం చేయడమే ధర్మపరిరక్షణ అని కూడా బిజేపి నేతలు అనుకుంటున్నారా?
గుడి వున్న స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే బిజేపి చూస్తూ ఎలా ఊరుకున్నది. ఇదేనా హైందరపరిరక్షణ కోసం పాటుపడుతున్న బిజేపి అన్న అనుమానం ప్రజలకు రాదా? ఉత్తర ప్రదేశ్‌లో రామ మందిర నిర్మాణం గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందా? జూబ్లీహిల్స్‌లో అంజన్న గుడి కూల్చినా ఫరావాలేదా? దాని ఆనవాలు లేకుండా చేస్తున్నా బిజేపి పెద్దలు కదలరా? లేకపోతే….అవును మేం…గుడికన్నా, దేవుడికన్నా, వ్యాపారులకే సపోర్టు చేస్తామని చెప్పండి? కనీసం అప్పుడైనా జనం నిజం చెప్పారని అనుకుంటారు. అంతే కాని ఆగం, ఆగం చేసి, హడావుడి, హడావుడి చేసి, గుడిని కదలనీయం…గుట్ట తొలవనీయం అని పెద్దపెద్ద మాటలు చెప్పిన బిజేపి నేతలు ముడుపులు తీసుకొని నోరు మూసుకున్నారని సాక్ష్యాత్తు బిల్టర్లే చెబుతుంటే ఆ పార్టీ పెద్దలకు వినిపించడం లేదా? గుడి కడితే మాకేం వస్తుంది, కనీసం ఆపినట్లు నటిస్తే నాలుగు రూపాయలు వస్తాయని అనుకున్నారా? అన్నది కూడా స్పష్టం చేయాలి.
గుంటూరు స్వామి చాలా స్పష్టంగా, సూటిగా బిజేపి నేతలకు ఎంతెంత ముట్టజెప్పారన్న మాటను చెప్పారు. పల్లపు గోవర్ధన్‌ అనే నాయకుడికి రూ.కోటి…విహెచ్‌పికి చెందిన నేత రామరాజుకు రూ. కోటి. ఇచ్చినట్లు గుంటూరు స్వామి ప్రజల సమక్షంలో చెప్పేశారు. మరి అలాంటప్పుడు అటు భజరంగదళ్‌ ఏం చేస్తున్నట్లు? ఇటు విశ్వహిందూ పరిషత్‌ ఏం చేస్తున్నట్లు? మరో మాజీ బిజేపి ఎమ్మెల్యేకు ముట్టాల్సినంత ముట్టినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక స్ధానిక కార్పోరేటర్‌ వెంకటేశ్‌కు లక్షల్లో రూకలు ముట్టినట్లు, కొంత పని కాంట్రాక్టు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇది నిజామా కాదా? అన్నది వాళ్లే చెప్పాలి. ముందు గుంటూరు స్వామి మీద కేసు నమోదు చేసినట్లు చెప్పిన బిజేపి నేతలు ఆ కేసును ఎందుకు ఉపసంహరించుకున్నట్లు. కోట్ల రూపాయలు తీసుకుంటే చాలు, గుడి కడితే మాకేంటి…కట్టకపోతే మాకేంటి అనుకునేంత కుత్సిత స్వభావ నేతలను బిజేపి ప్రోత్సహిస్తున్నట్లు అనుకోవచ్చా? అనే ప్రశ్నలకు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు, విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్రపెద్దలు కూడా నోరు విప్పాల్సిందే…వివరణివ్వాల్సిందే…లేకుంటే దేవుడితోనే ఆడుకుంటారా? దైవం, ధర్మం అనుకుంటూ రాజకీయాలు చేస్తూ, వచ్చేది మమే…వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పుకుంటూ చేయాల్సినపనులు ఇవేనా? ఇప్పుడే ఇలా చేస్తుంటే, రేపు అధికారంలో కూర్చుండబెడితే, గట్టలు, గుళ్లు మేమే మింగేస్తామని పరోక్షంగా చెప్పినట్లు కాదా? పార్టీకి ఇలాంటి నేతలు తీరని నష్టం చేస్తున్నట్లు కాదా? భవిష్యత్‌ రాజకీయ నిర్మాణం, పార్టీ కోసం పని చేయాల్సిన నేతలు, త్యాగాలు చేయాల్సిన నేతలే ఇలా ధర్మం తప్పితే పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా ఆదరిస్తారు? హైదరాబాద్‌ నడిబొడ్డునే ఇలాంటి దుర్చర్యలకు బిజేపి నేతల ముసుగులో దేవుడికే నీడ లేకుండా చేయడానికి సహకరించడం న్యాయమేనా? పంచుకోవాడాలలో పాలు పంచుకుంటుంటే, వాటాలతో జేబులు నింపుకుంటుంటే పార్టీ ఎలా ఉపేక్షిస్తోంది. ఇలాంటివారిని ప్రోత్సహించడం ఒక భాగమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవు.
జూబ్లీహిల్స్‌ గుట్ట, గుడి విషయంలో అన్ని వేళ్లు బిజేపి వైపే చూపిస్తుంటే బిజేపి నేతలు ఏమని సమాధానం చెప్పుకుంటారు? సహజంగా నాయకులు ఏ రియలెస్టేట్‌ వ్యాపారమో చేసుకుంటూ గడిరచిన సొమ్మును రాజకీయాల్లో ఖర్చు చేసి, ప్రజలకు చేరువౌతున్న రోజులు. కాని గుడి పేరు చెప్పుకొని వ్యాపారులకు కొమ్ము కాస్తూ, గుడికే శఠగోపం పెడుతూ, ప్రజలకు ఎలా చేరువౌతారు. నిజానికి ఇలాంటి సంఘటనల్లో, సందర్భాలలో అధికార పార్టీకి చెందిన నేతలు, నాయకులు వత్తాసు పలుకడం చూస్తుంటాము. కాని ఇక్కడ టిఆర్‌ఎస్‌కు చెందిన నేతలు ఎవ్వరూ అటు వైపు తొంగిచూడలేదు. అందులో పాలు పంచుకోలేదు. ఏ పాలు కోరలేదు. ఎవరితో లాలూచీ పడలేదు. దాన్ని రాజకీయం చేయలేదు. గుడి అడ్డుకుంటున్నామని అడ్డదారులు తొక్కలేదు. కాంగ్రెస్‌నేతలు కూడా అక్కడికి చేరింది లేదు. ఆపే ప్రయత్నం చేసింది లేదు. మొత్తంగా వచ్చింది బిజేపి నేతలు. దాని అనుబంధ సంస్ధలైన విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ సంస్ధలు. ఇక్కడ మరో చమత్కారమేమింటే భజరంగదళ్‌ అంటేనే హనుమంతుడు. అలాంటిది అభయాంజనేయ స్వామి గుడికే దిక్కులేకుండా చేస్తున్నవారి పంచన చేరి, జేబులు నింపుకునే ప్రయత్నం భావ్యమా? ఆ సంస్ధ నేతలు ఇలాంటి యవ్యారాలు చేయడం పద్దతేనా? వీళ్లా ధర్మం కాపాడేదన్న అనుమానం రాకుండా వుండదా? ఎవరిని మోసం చేయడానికి ధర్మం కోసం, దైవం కోసం, దేశం కోసమంటూ పైకి మాయ మాటలు చెప్పి మూటలు దోచుకెళ్లడం అన్నదానికి ఈ ఒక్క సందర్భం చాలదా? ఎక్కడికక్కడ నియోజవర్గ స్ధాయి నాయకుల నుంచి మొదలు, కార్పోరేటర్‌ దాకా అందినకాడికి దండుకొని మింగేసి, నీతి వాఖ్యాలు వల్లిస్తే జనం వింటారా? నమ్ముతారా? ఇప్పటికైనా బిజేపి పెద్దలు ఆలోచించుకోవాలి. గట్ట లేకుండా చేసి, గుడి ఆనవాలు కనిపించకుండా చేసి, నాలాలో భాగమైన స్ధలం ఇస్తామంటే స్ధానిక కార్పోరేటర్‌ ఎలా సంతం చేస్తాడు? ప్రభుత్వ భూమిని రాసిచ్చే అధికారం ఎవరికైనా వుంటుందా? ఏదో ఒక కాగితం మీద రాతలు రాసుకుంటే అవి అగ్రిమెంట్లు అవుతాయా? చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా? దానికి ఎలాంటి చట్టబద్దత అవసరం లేదా? ఇలా బిజేపికే శఠగోపం పెట్టే నాయకులు అందిన కాడికి దోచుకుంటూ, పార్టీప్రతిష్టను బజారు పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చర్యలు ఏమైనా తీసుకుంటారా? అసలు ఏం జరిగిందన్నదానిపై పార్టీపరమైన కమిటీ ఏదైనా ఏర్పాటు చేస్తారా? దోషులని తేలితే వాళ్లను పార్టీనుంచి తప్పిస్తారా? భవిష్యత్తులో ఇలాంటి పనులు ఏ నాయకుడు చేయకుండా గట్టిగుణపాఠంచెబుతారా? అన్నది పార్టీ నుంచి స్పష్టత కావాలి. ఇవ్వాలి…గుడి నిర్మాణ బాధ్యత కూడా తీసుకోవాలి. ఇంత జరిగాక తప్పుకుంటామంటే చాలదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!