అక్షరం చెక్కిన నిజాలు నేటిధాత్రి విశ్లేషణలు!

పాఠకుల కోరిక మేరకు అన్ని నియోజకవర్గాల రాజకీయ సమాచారం?

విశ్లేషణలతో సరికొత్త ప్రమాణాలకు శ్రీకారం

ప్రజల్లో చైతన్యం కోసం` రేపటితరం భవిష్యత్తు కోసం…

నిజం నిర్భయంగా ప్రజల ముందుకు 

నియోజకవర్గాలలో పరిస్ధితులు అక్షరావిష్కారం చేస్తాం….

ప్రజాస్వామ్య మేలుకొలుపుకు వారధులౌతాం…

సమాజంలో నిజం అన్న పదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించకుండా పోతున్న తరుణమిది. ఏది నిజం? ఏది అబద్దం? అన్నది తెలుసుకోవడం కష్టమైపోతోంది. హంస క్షణాల్లో పాలు, నీళ్లను వేరు చేసినా, నిజం, అబద్దం తెలుసుకోవడానికి కొంత కాలం పడుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఏదైనా చెబితే నిజం చెబుతున్నారా? అబద్దం చెబుతున్నారా? అన్నది పసిగట్టేవారు. కాని మహానటులు పెరిగిపోయారు. నిజం అంటే ఎలా ఉంటుందో కూడా కనిపించకుండా చేస్తున్నారు. ఇది వ్యక్తులకు, వ్యవస్ధకు, సమాజానికి మంచిదికాదు. ప్రజలు ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. నిజాన్నే గ్రహించాలి. నిజం వైపే నిలబడాలి. అబద్దాలొచ్చి ఆడాల్సిన ఆటలన్నీ ఆడుతుంటాయి. నిజాన్ని మరుగున పడేస్తుంటాయి. వాటిని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం ప్రపంచంలో ఒక్క అక్షరాలకే వుంది. అందులోనూ మీడియాకే ఉంటుంది. కాకపోతే ఆ మీడియా కూడా అబద్దాల ప్రయాణం చేయడం అలవాటు చేసుకుంటోంది. దాంతో ఏది నిజమో! ఏది అబద్దమో!!తెలియకుండా పోతుంది. 

నిజం చెప్పే మీడియాను కూడా పాఠకులు అనుమానంతో చూడాల్సి వస్తుంది. కాకపోతే నిబద్దత అన్నది ఒక్క రోజులో చెరిగేది కాదు. ఎవరూ చెరిపేస్తే చెరిగిపోదు. అందుకే ఎవరేమనుకున్నా? ఎన్ని అవాంతరాలెదురైనా చెప్పాలనుకున్నదానిని నిజాయితీగా చెప్పడం నేటిధాత్రికి తెలుసు. నికార్సైన అక్షరాలకే నేటిధాత్రిలో స్ధానం. మా వార్తల్లో నిజానికే అగ్రతాంబూలం. నేటిధాత్రి చేసే అక్షర యజ్ఞం పాఠకులకు తెలుసు. అందుకే పాఠకులకు మాత్రమే ఒక్క మాట చెప్పడానికి ముందుకొచ్చాను. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలు ఏమనుకుంటున్నాయి? వాటి ఆలోచనలు ఏమిటి? వాటి అంచనాలు ఏమిటి? ఆ నాయకుల పరిస్ధితి ఏమిటి? పార్టీల పరిస్దితి ఏమిటి? అన్నది ప్రతి ఒక్కరి మదిలోనూ మెదలుతున్న ప్రశ్న. ఏ ఇద్దరు ఒక చోట చేరినా రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి మాట్లాడుకోకుండా వుండని పరిస్ధితి.

ప్రపంచం మన కళ్లముందే కాదు, అరచేతిలో నిక్షిప్తమైవుంది. అందుకే దేశంలో ఏంజరుగుతోంది? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రపంచం ఎటు పోతోందన్నది క్షణాల్లో తెలిసిపోతోంది? అయితే అసలైన బురిడీ ఇక్కడే దాగి వుంది. కన కళ్లకు కనిపించేందంతా నిజం కాదు? మన చెవులకు వినపడేదంతా నిజం కాదు? మరి నిజమేమిటి? నిజమంటే ఎలా వుంటుందన్నది తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా కొన్ని సార్లు అర్ధం చేసుకోకుండాపోతోంది. అందువల్ల నిజం మాత్రమే చెప్పడం నేటిధాత్రి అభిమతం. నేటిధాత్రిలో వచ్చే ప్రతి విశ్లేషణ ప్రజల ఆలోచనల నుంచి వచ్చేవే…. నేటిధాత్రి యాజమాన్యం కాని, యంత్రాంగం వ్యక్తిగత ఆలోచనలు ఎక్కడా పొందరపర్చదు. క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతోందన్నదానిని సునిశితంగా అధ్యయనం చేసిన తర్వాతే ఏ విశ్లేషనైనా చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ఏఏ పార్టీల బలాబలాలు అన్న విషయాలపై కథనాలు మొదలుపెట్టాం. అయిత ే శ్రేయోభిలాషులైన పాఠకులు చాలా మంది ఈ వరుస కథనాలపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 

వరుస కథనాలపై వారి వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. అందులో కేవలం కొన్ని నియోజకవర్గాలే కాకుండా, తెలంగాణ మొత్తం నియోజకవర్గాలలో రాజకీయ పరిస్ధితులపై పూర్తి స్ధాయి విశ్లేషణలు కావాలని కోరుతున్నారు. మేం కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలపై విమర్శలున్నాయో అక్కడే కొంత ఫోకస్‌ చేయాలని అనుకున్నాం. కాని పాఠకుల సూచనల మేరకు మొత్తం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పరిస్ధితులను క్షేత్రస్ధాయి నుంచి అధ్యయనం చేస్తున్నాం. ఇందులో తమ, తర అన్న బేధం లేదు. ప్రజల ఆలోచనలు, జరిగిన అభివృద్ధి, యువత భావాలు, ఆ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు, ఇలా అన్ని రకాల అంశాల మేలవింపుతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. మూడు రోజుల్లో వెలువరించిన మూడు నియోజకవర్గాల పరస్ధితిపై చేసిన విశ్లేషణలు, చెప్పిన క్షేత్రస్ధాయి నిజాలు పాఠకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. నేటిధాత్రి ప్రచురించే విశ్లేషణలు ఎవరి అభిరుచులకు అనుగుణంగావుండవు. పాఠకులకు నిజాలు చేరవేసే అక్షరాలే వుంటాయి. 

ఇందులో రెండో మాటకు తావులేదు. ఏపార్టీకి అనుకూలం ఉండదు. ఏ పార్టీకి వ్యతిరేకం ఉండదు. జనం మాటలు మాత్రమే ఉంటాయి. జరిగిన విషయాలే సూటిగా, స్పష్టంగా ఉంటాయి. ఇవి ఎవరి కోసం సాగవు…ఎవరికీ ఆపాదించబడవు…మొత్తం ప్రజాభిప్రాయం వ్యక్తం చేస్తుంటాయి. నిజాలు మాత్రమే కనిపిస్తుంటాయి. స్పందన చాలా బాగా వుంది…పాఠకుల ఆసక్తి కూడా మరింత పెరిగింది. అందుకు అందరకీ వందనాలు…మా నేటిధాత్రిని ఆదరిస్తున్న పాఠకులకు పేరుపేరునా కృతజ్ఞతలు…ఎప్పుడూ జనహితమే మా అక్షరం…సమాజం కోసం మా ప్రయాణం…సమాజ గతిని మార్చే ప్రగతే మా సంకల్పం…తెలంగాణ సర్వతోముఖాభివృద్దే మా లక్ష్యం…నిప్పు కాలిన తర్వాతే స్పందిస్తారు…? నిజాలు నచ్చని వారే నిందలకు దిగుతారు? నిజం ఎప్పుడూ నిర్భయంగానే వుంటుంది. ధన్యవాదాలు…ఇక తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గాల సమగ్ర విశ్లేషణలు ఇకపై మీ నేటిధాత్రిలో మీ కోసం…సమాజం కోసం…!

                                              ఇట్లు

మీ కట్టారాఘవేంద్రరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *