అంతా వాళ్లే చేస్తున్నారు?

`అయిన వాళ్లే ఆగం చేస్తున్నారు!

` తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు?

`అటు వారసులు,ఇటు బంధువులు?

`మధ్యలో బావమర్థులు…లేకుంటే వియ్యంకులు!

` ఎమ్మెల్యేలకు బంధుగణం..మిత్రగణం…రాజకీయ గ్రహణం.

` నిండా మునుగుతున్న నాయక గణం?

` ఇవే ఎమ్మెల్యేలకు టిక్కెట్ల గండం!

` పని మంతులకు కూడా పదవీ గండమే?

`మింగలేక, కక్కలేకపోతున్న ఎమ్మెల్యేలు?

` సిఎం. సీరియస్‌ అవుతున్నా మారలేకపోతున్నారు?

` టిక్కెట్‌ కట్‌ అవుతుందని తెలిసినా చేష్టలుడిగి చూస్తున్నారు?

`అంతా ఐన వారి వల్లే అని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు?

` బయటి వాళ్ల మీదే ఎమ్మెల్యేల ప్రతాపం!

` పదవీ గండమని తెలిసినా అయిన వారిని పక్కనపెట్టుకోలేకపోతున్నారు!

`కార్యకర్తలను పట్టించుకోలేకపోతున్నారు! 

`బంధువుల చేతిలో ఎమ్మెల్యేలు రిమోట్లౌతున్నారు?

` బందువులు చెప్పినట్లు వింటున్నారు?

`ప్రజలే మార్పు కోరుతున్నారు!

`ఇక ఎమ్మెల్యేలు మారరు…వాళ్లను మార్చితే తప్ప మనుగడ లేదు!       

కొన్ని సందర్బాలు మింగలేక, కక్కలేని పరిస్దితిని సృష్టిస్తాయంటే ఇదే మరి. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కొంత మంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే వుండి. అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. వారి ప్రమేయంతో కొన్ని, వారి ప్రమేయం లేకుండా కొన్ని పనులు వారి మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు ఎన్నికల వేళ టిక్కెట్లు అందుతాయా లేదా? అన్న గందరగోళంలోకి నేట్టివేయబడుతున్నాయి. మొత్తంగా కొంత మంది ఎమ్మెల్యేల పరిస్థితి రాజకీయంగా ఆగమ్యగోచరంగా తయారైంది. అలా వారి రాజకీయం త్రిశంకు స్వర్గంలోకి నెట్టివేయబడడానికి వారి స్వయం కృతాపరాధమనే చెప్పాలి. చాలా చోట్ల ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులుగా, వారి కార్యాకలాపాలు చక్కదిద్దుతున్నవారిలో వారసులు, బంధువులు, మిత్రులు వారికి పదవీ గండాలను తెచ్చిపెడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. గతంలో తెలంగాణ తొలి స్పీకర్‌గా పనిచేసిన మధుసూధనా చారి విషయంలో ఇదే జరిగింది. ఆయన కుమారుల పేరు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి మధుసూధనా చారి అంటే భూపాలపల్లిలో మంచి పేరుంది. అయినా ఏం లాభం? ఆయన వారసులు చేసిన హంగామా వల్ల, అక్రమ రియలెస్టేట్‌ వ్యాపారాల మూలంగా ఆయనకు మంచిపేరు పోయి, చెడ్డపేరు వచ్చిందని అందరూ అనుకుంటున్నదే. నిప్పులేనిదే పొగ రాదన్నట్లు, ఎంత సమర్ధించుకున్నా, జనంలో నానిదానిని మసిబూసి మారేడు కాయ చేయడం ఎవరి వల్లా కాదు. అసలు ఇంటిలోని పోరును చల్లార్చుకోవాల్సిన తరుణంలో, తమ పార్టీకి చెందిన వాళ్లే మోసం చేశారనో, మరెవరి మీదనో నెపాలు నెట్టివేయడం బాగా అలవాటైంది. అదే నాయకుల కొంప ముంచుతోంది. 

ఇక జనగామ లాంటి నియోజకవర్గంలో ఇప్పుడే కాదు, గతంలో కూడ ఇదే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు జనగామలో మరో కొత్త చర్చ కూడా సాగుతోంది. గతంలో పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా వున్నంత కాలం ఆయన కోడలు, బావమర్ధిల పెత్తనం సాగేది. ఏ పని జరగాలన్నా ముందు ఆయన బావమర్ధిని దాటుకొని వెళ్లాల్సిన అవసరం ఏర్పడేది. ఇది పార్టీ నాయకులకు నచ్చేది కాదు. అయినా ఆగలేదు. పొన్నాల లక్ష్యయ్య సుమారు పదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో నాయకులు ఎంతోవిసిగిపోయారు. దాంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా ఆయనకు సహకరించలేదు. ఆ సమయంలో ఆయన పిపిసి. అధ్యక్షుడుగా వున్నాడు. నిజానికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి జనగామలో గెలిచే అవకాశమే లేదు? ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినా, జనగామలో ఆయన గెవడం అన్నది కేవలం పొన్నాల మీద వున్న వ్యతిరేకతే ఉపయోగపడిరదని చెప్పడంలో సందేహం లేదు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఐదేళ్లలో అనేక వివాదాలు మూటగట్టుకున్నారు. భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి కలెక్టర్‌తో పేచీ పెద్ద వివాదమైంది. అయినా ప్రజలు రెండోసారి కూడా ఆయనను ఎన్నుకోవడానికి ఈసారి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌. కేవలం కేసిఆర్‌ చేసిన అభివృద్ధి మీదనే ముత్తిరెడ్డిని గెలిపించారేనేదే జరిగే ప్రచారం. నిజానికి 2014లో పిపిసి. అధ్యక్షుడిగా వున్న పొన్నాల లక్ష్మయ్య గెలుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణ తెచ్చిన పేరు బిఆర్‌ఎస్‌కు వచ్చినా, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పొన్నాల గెలుస్తాడన్న నమ్మకం అందరికంటే పొన్నాలకే ఎక్కువ వుండేది. కాని తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు, తాను గెలుస్తానన్న పొన్నాల అతి విశ్వాసం, మొదటికే మోసం తెచ్చిపెట్టింది. అందులోనూ ఆయన బావమర్ధి జోక్యం నిండా ముంచింది. పొన్నాల తెలంగాణ మొత్తం ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం శ్రమించారు. పార్టీ భీ.ఫామ్‌లన్నీ ఆయన చేతుల మీదుగా ఇచ్చారు. కాని ఆయన ఓడిపోయారు. జనగామ అభివృద్ధ్గి ఎంతో కొంత అప్పట్లో అభివృద్ధి జరిగిందంటే అది పొన్నాల మూలంగానే చెప్పాలి. కాని ఆయన వెనుకు షాడోలాగా, ఆయనను ప్రజలకు దూరం చేసింది మాత్రం ఆయన బావమర్ధి వల్లనే అన్నది ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. 

ఇక ఇప్పుడు అదే దారిలో నేడు ముత్తిరెడ్డి కూడా ప్రయాణం చేస్తున్నాడు. అడుగుడుగునా ముత్తిరెడ్డి బావమర్ధి చేసే తప్పులు, నాయకులను పెడుతున్న ఇబ్బందుల మూలంగా ముత్తిరెడ్డికి టిక్కెట్‌ కష్టమే అన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముత్తిరెడ్డిని కాదని, ఒక వేళ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్‌ ఇస్తే, ఆయనకు దగ్గరి బందువుల వస్తారా? ఇక్కడ పెత్తనం చేస్తారా? ఆయనకు బావమర్ధులున్నారా? వాళ్లు ఆయన వెంటే వుంటారా? అన్న చర్చ జనగాంలో జోరుగా సాగుతోందంటేనే అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు ఎన్నుకున్న, ప్రజల చేత ఎన్నికైన నాయకులు ప్రజలను నేరుగా కలవకపోవడానికి కారణం ఇలాంటి బంధుగణమే అంటున్నారు. ఇక ఖైరతాబాద్‌ నియోకజవర్గంలో కూడా ఇదే జరుగుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చేయాల్సిన పనులన్నీ ఆయన పిఏ. కమ్‌ దగ్గరి బంధువే అన్నీ చక్కదిద్దుతాడని సమాచారం. ఎంత దాకా అంటే ఓ వైపు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు చెందిన పార్టీపరమైన సమ్మేళనాలు జరుగుతున్నాయి. దానికి తోడు రాష్ట్రమంతా గ్రామ జ్యోతి, పట్టణ ప్రగతి ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రజల్లో వుండడం లేదు. ఆయన అసలు హైదరాబాద్‌లోనే లేరని సమాచారం. దుబాయ్‌లో వున్నాడని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎమ్మెల్యే ప్రజల్లో వుండాల్సిందిపోయి, దుబాయ్‌లో వుండడం గమనార్హం. ఇదిలా వుంటే పట్టణ ప్రగతి కార్యక్రమాలను చక్కదిద్దుతున్న దానం బంధువు, ప్రజలను పిర్యాధులు స్వీకరిస్తున్నారు. సమస్యలేమైనా వుంటే నాకు చెప్పమని చెబుతుండడాన్ని పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. దానం బందువులు చేస్తున్న భూకబ్జాలు పార్టీమీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నాయకులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్దితే వుంది. ఎమ్మెల్యే వారసుల మూలంగా పార్టీ ఇబ్బందులకు గురి కావడమే కాకుండా, ఎమ్మెల్యే గ్రాఫ్‌ అమాంతం పడిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ నాయకుడి తమ్ముడు మూలంగా కూడా అన్న ఇబ్బందులు పాలౌతున్నాడు. విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అటు అన్నగారి నైపుణ్యం, ఇటు తమ్ముడి రాజకీయం వెరసి, ఆ నియోజకవర్గం అంతా గందరగోళం… అయినా వారు మారడంలేదు. బంధువులను వారించడం లేదు. ఆగడాలు కట్టడి చేయడం లేదు. వారసులను అదుపులో పెట్టుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంత హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. భవిష్యత్తు గురించి దిగులు కూడా పెద్దగా లేనట్టే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!