రేవంత్ మూలంగానే బిజెపికి వలసలు?
కాంగ్రెస్ నుంచి బిజెపికి వలసల పేర్లెందుకు వినిపిస్తున్నాయ్?
బిజెపి నుంచి కాంగ్రెస్ కు రావాల్సిన సమయంలో ఇదేం ట్విస్ట్?
బిజెపిలో చేరతారనే వారిలో కాంగ్రెస్ నాయకుల పేర్లెందుకు వినిపిస్తున్నాయి?
సర్థుకు పోవుడెలాగూ లేదు..భుజ్జగింపులు కూడా లేవా?
బలంగా వున్న కాంగ్రెస్ వైపు కాకుండా ఇతరులు బిజెపి వైపే ఎందుకు చూస్తున్నట్లు?
బిజెపిలో కనిపిస్తున్న భరోసా ఏమిటి?
కాంగ్రెస్ వైపు ఎవరూ కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఏమిటి?
రేవంత్ నాయకత్వం మీద నమ్మకం సన్నగిల్లినట్లేనా?
ఒకరు కాంగ్రెస్ ఖాళీ అవుతుంటే పిసిసి అధ్యక్షుడుగా వున్నంతకాలం దిక్కులు చూశాడు…కోవర్టనే ముద్ర వేసి విపరీత ప్రచారం జరిగినా పట్టించుకోలేదు. ఆఖరుకు ఇక ఆయనకు విసుగొచ్చి వదులుకునేదాకా పార్టీకి జరగాల్సిన డ్యామేజీ జరిగేదాక వున్నారు. నాకు పిసిసి పదవి కావాలని నెలల కొద్ది ప్రయత్నాలు చేసి, ఎదురుచూసి రేవంత్ రెడ్డి పదవి సాధించుకున్నారు. ఇప్పుడూ పరిస్థితి అంతకు భిన్నంగా ఏమీ లేదు. అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ వదలేయపోయినా సమస్య ఎపిసోడ్‌లకు ఎపిసోడ్ సాగింది. ఇప్పుడు మరి కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా బిజెపి లో చేరేందుకు క్యూలు పడుతున్నట్లు బిజెపి లీకులిస్తోంది. ఇదంతా రేవంత్ రెడ్డి వల్లనే జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంటోంది. దీనంతటికీ రేవంత్ రెడ్డి అలసత్వం, ఒంటెద్దు పోకడలే కారణమంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో సీనియర్లుకు ఆయన ప్రాధాన్యత కల్పించడం మర్చిపోయారు. ఆది నుంచి వారితో అంటీ ముట్టనట్లే వుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని రేవంత్ పక్కన పెడుతున్నాడు. పార్టీలో వారి ప్రధాన్యత తగ్గిస్తున్నాడు. ఇతరులను పరోక్షంగా ఉసిగొల్పుతున్నాడు. మొత్తంగా రాష్ట్రం మొత్తం తన అనుచర గణం మాత్రమే వుండేలా చూసుకుంటున్నాడనేది ప్రధాన ఆరోపణ. అందుకే కాంగ్రెస్ ఇక రేవంత్ తమను లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదన్న భావనలో వాళ్లు బిజెపి వైపు చూస్తున్నారంటున్నారు. నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా వుంది. నాయకులు ఉన్నారు.
కానీ వారిని ప్రోత్సాహం చే క్రమంలో పిసిసి అధ్యక్షుడు అందరికీ అందుబాటులో వుండడం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయితే ఆయన పాదయాత్ర చేసి, పార్టీని పటిష్ఠం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇక జరుగుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. సమయం కూడా సరిపోదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తాడని ప్రచారం జరిగిన సమయానికి వైఎస్‌ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల పార్టీ కూడా పురుడుపోసుకోలేదు. ఆమె పార్టీ పెట్టారు. పాదయాత్ర ఆరు నెలలుగా సాగిస్తున్నారు. ఒక బిజెపి రాష్ట్ర ఛీఫ్ బండి సంజయ్ పాదయాత్రలు అన్నవి ముందు అనుకున్నవి కాదు. కానీ బండి సంజయ్ విడతల వారీగా ఇప్పటికే రెండు ప్రజా సంగ్రామ యాత్రలు పూర్తి చేశారు. ఇప్పుడు మూడో యాత్ర యాదాద్రి నుంచి మొదలు పెట్టారు. ఇలా బిజెపిని బలోపేతం చేయడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. యాత్రల మీద యాత్రలు సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం పాదయాత్ర అంశాన్ని పక్కనపడేశారు. ప్రజా ఉద్యమాలైనా అనుకున్న మేర సాగిస్తున్నారా? అదీ లేదు. రాజకీయం తప్ప మరేం చేయడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. గతంలో చేసిన ఉద్యమాలు కూడా రేవంత్ చేయడానికి సుముఖంగా లేరనే అంటున్నారు. రాజకీయాలతో దూసుకొచ్చినంత సులువుగా నిలదొక్కోవడం అందరికీ సాధ్యం కాదు.
కానీ తన రాజకీయ జీవితం జెట్ స్పీడ్ లా ఎదగాలని కోరుకొన్నవారిలో డక్కమొక్కీలు తిన్నవాళ్లు చాలా మందే వున్నారు. అలాంటి వారిలో సక్సెస్ అయిన వాళ్లు వున్నారు. ఆఖరు దాక కొట్లాడినా ఫలితం అందని వారూ వున్నారు. అలాంటి వారిలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ రకమైన భవిష్యత్తు ఆయనను వరిస్తుందో మాత్రం అర్థం కావడం లేదు. టిడిపిలో వున్నంత కాలం అధికారంలో లేడు. అధికారం చూసింది లేదు. చూస్తుండగానే జడ్పీ టిసి అయ్యాడు. ఆ వెంటనే ఎమ్మెల్సీ అయ్యాడు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపిగా వున్నాడు. తెలుగు దేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాంగ్రెస్ లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశాడు. ప్రజాప్రతినిధి అయినా ప్రతి పక్ష పాత్రనే కొనసాగించాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చి కాలం కలిసొచ్చిందో, ఆశల కుంపటి పెరిగిందో ఏమో కాని పిసిసి అధ్యక్షుడు అయ్యే దాక వచ్చింది. గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోయిన తర్వాత ఇక ఆయన పని అయిపోయిందనే అన్నారు. కాకపోతే పార్లమెంటు ఎన్నికలు కలిసొచ్చాయి. గెలుపుకు మార్గం వేశాయి. మళ్ళీ ఆశలు చిగురించాయి. పడినా లేచి నిలబడ్డాడు. కాంగ్రెస్ లో కీలమయ్యాడు. పిసిసి మీద పడ్డాడు…అదిగో…ఇదిగో అన్నారు…కానీ రెండేళ్ళ కాలయాపన జరిగింది. పిసిసి అయితే రేవంత్ పాదయాత్ర అన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన కూడా అవునన్నారు. ఒక రకంగా పాదయాత్ర వుంటుందన్నంత ప్రకటన చేశారు. మధ్యలో రెండు ఉప ఎన్నికలు రావడం పిసిసి వాయిదా పడుతూ వచ్చింది. ఇక రేవంత్ కాంగ్రెస్ వదిలేడం పక్కా అన్న ప్రచారం కూడా మామూలుగా సాగలేదు. అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మరీ అద్వాహ్నంగా వున్నాయి. బిజెపికి పెద్దగా ఆశలు కూడా కనిపించని కాలం. తెలంగాణ లో ప్రాంతీయ పార్టీకి వ్యాక్యూమ్ వుందన్న ప్రచారం జరిగిన సమయం. రేవంత్ పై అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. సహజంగా రేవంత్ స్వభావం దూకుడుగా వుంటుంది. పిసిసి విషయంలో మాత్రం చాలా కాలం పాటు ఎంతో ఓపిగా నిరీక్షిస్తూ వచ్చాడు. అందుకు ప్రతిఫలం దక్కనైతే దక్కింది. పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. అప్పటి వరకు గేమ్ ఒక ఎత్తు…ఇక ఇప్పుడు ఒక ఎత్తు… గేమ్ స్టార్ట్ నౌ…అనుకున్నాడు. గతంలో అందరు పిసిసి ప్రెసిడెంట్ల లాగా సునాయాసంగా వుంటుందనుకున్నాడు. అది కాంగ్రెస్… అందులో పుట్టి పెరిగిన వాళ్లకే మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంటారు. అలాంటి పార్టీని ఏరి కోరి ఎంచుకొని, పిసిసి పదవి తెచ్చుకొని ముళ్ల కుర్చీ మీద, ముళ్ల కిరీటం పెట్టుకున్నాడు…రోజుకో సినిమా చూస్తూనే వున్నాడు. ఇంతా కష్టపడి పిసిసి అయి ఆయన చేస్తున్నదేమీ లేదని, బిజెపి బలపడుతుంటే చేష్టలుడిగి చూస్తున్నాడనే అంటున్నారు. మైకు మాట్లాడుతున్నంత పట్టుదల పార్టీ బలపడడానికి కృషి చేయడం లేదంటున్నారు. అంత దాకా ఎందుకు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో రేవంత్ పట్టించుకున్నట్లు కనిపించలేదు. పార్టీ లోని సీనియర్లంతా రాజగోపాల్ ను కలిసి పార్టీ మారొద్దని ఒత్తిడి చేశారు. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి వారించే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ మాత్రం ఆ పని చేయలేదు. అసలు వెళ్లాల్సింది రేవంత్ రెడ్డి. ఇతర నాయకులందరినీ కలుపుకొని వెళ్లి, మాట్లాడి రావాల్సిన సందర్భం. అది జరగలేదు. ఒక రకంగా రాజగోపాల్ వ్యవహారంపై పెద్దగా స్పందించింది లేదు. పార్టీకి నష్టమన్న భావన ఆయనలో కనిపించినట్లు లేదు.