కేంద్ర రాజకీయాల దిశగా వడివడిగా అడుగులు
` కేంద్రం ఒక మిథ్య…అది ఎన్టీఆర్ మాట
` అదే బాటన కేసిఆక్ రాజకీయ మార్పుకు శ్రీకారం
` థర్డ్ ఫ్రంట్ నిర్మాణ దిశగా ప్రయత్నాలు
` జాతీయ స్ధాయిలో ముమ్మరంగా చర్చలు
` లౌకిక వాద శక్తుల ఏకంతో సరికొత్త సమీకరణాలు
` కాంగ్రెస్‌తో కలవడమా? లేదా? అన్నది తర్వాత
` ముందు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమే అసలు ఎజెండా
` జాతీయ పార్టీలను శాసించడమే అసలు లెక్క
హైదరాబాద్ , నేటిధాత్రి:
చూసే చూపు, వేసే అడుగు, మాటల్లో వాడీ, వేడీ…చిత్తశుద్ది, వాక్‌శుద్ధి వుంటే నాయకుడు అనుకున్నది సాధిస్తాడని చెప్పడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ నిదర్శనం. ఆయన అడుగులు తార్కాణం. ఆయన ఆశయాలు ఆదర్శం. ఆయన నిర్ణయాలు ప్రయత్నం…ఆయన ఎంచుకున్న ఉద్యమం నినాదం…జై తెలంగాణ జెండా ఎగరేయడమే, ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం అనుకున్నారు. సాధించాలనుకున్నారు. పిడికిలెత్తారు. జనాన్ని ఏకం చేశారు. జనమంతా జై తెలంగాణ అనేలా చేశారు. ముక్కొటి మంది తెలంగాణ వాదులు ఏకమయ్యారు. పిల్లా, జెల్లా, ముసలీ, ముతక అందరూ అదే నినాదం…ఎవరి నోట విన్నా ఒకటే విధానం..అదే తెలంగాణ వాదం…తెలంగాణ సాధన కార్యం. అంతే కాలం కరిగిపోయింది. రణం చివరి దాకా నడిచింది. పద్నాలుగేళ్ల ఉద్యమ కళ్లు మూసితెరిచినంత కాలంలో సాగిపోయింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. కేసిఆర్ కలలు గన్న బంగారు తెలంగాణ ఆవిష్కారమౌతోంది. అదీ నాయకుడి చూపుకు వుండే విలువ. అదే నాయకుడి మాటకుండే విలువ. ఒకనాడు ఉద్యమ నాయకుడు కేసిఆర్ సభలైనా, మాటలైనా, టివీలలో చర్చలైనా, సిడీలలో ఆయన ప్రసంగాలైనా సరే…ఎక్కడ విన్నా అవే మాటలు.. ఏ పెళ్లిలోనూ తెలంగాణ పాటలే…అంతే అదంతే…తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర నిర్మాణమే…అలా నాయకుడి మాట మంత్రం కావాలి. ఆయన మాటలే మంత్రోపదేశాలు కావాలి. జనం నమ్మాలి. నరనరాన ఆయన మాటలు జీర్ణించుకోవాలి. అదే 2001లో మొదలైంది. 2014లో ఫలించింది. అందుకే కేసిఆర్ ఇప్పటికీ ఏది మాట్లాడినా, ఏది చెప్పినా ఎంతో ముందు చూపుతో చెబుతారని అంటారు. నమ్ముతారు.
2018 ముందస్తు ఎన్నికల సమయంలో కేసిఆర్ మొదటిసారి మూడో ఫ్రంట్ ముచ్చట చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ మాట కేసిఆర్ మర్చిపోయారు. అని రాజకీయ పార్టీలు, విశ్లేషకులు అనుకున్నారు. కాని ఆయనను నమ్మిన వాళ్లు మాత్రం అమ్ములపొదిలోని అస్త్రాలు ఎప్పుడు పడితే అప్పుడు తీసే రకం కాదు కేసిఆర్ అని అనుకున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. అస్త్రశస్త్రలు తీసే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. జనం ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే సరైన సమయం. ఈ సమయంలో మూడో ఫ్రంట్ అన్న మాట కాకపోయినా, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో చలనం వచ్చిందన్న నమ్మకం ప్రజలకు కలగాలి. బలంగా వున్న ప్రాంతీయ పార్టీలు ఏకమౌతున్నాయని అనిపించాలి. అప్పుడు జాతీయ పార్టీల వైపు ప్రజలు చూడరు. జాతీయ ప్రయోజనాల పేరుతో రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాదికి, బిజేపి ఏతర రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఓ వైపు రైతాంగ సమస్యలు…మరో వైపు నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు…అడ్డూ అదుపు లేకుండా పోతున్న భూముల ధరలు…సామాన్యుడు బతకలేని పరిస్ధితులు.. ప్రెటో, డీజిల్ ధరలు…వంటగ్యాస్ కొనలేని పరిస్ధితులు. ఇవన్నీ బిజేపి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అందుకే ఇదే సరైన సమయం. ఆ మధ్య ముఖ్యమంత్రి కేసిఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవడంతోనే అసలు స్కెచ్ మొదలైంది. దేశంలో వరుసగా బిజేపిపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లడం వంటివి చూస్తూనే వున్నాం. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలవడం, రాజకీయాలపై చర్చలు జరపడం ఒక ఎత్తు. అంతకు ముందే సిపిఎం జాతీయ నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌తో బేటీ కావడం అన్నది అందుకు బలాన్ని చేకూర్చింది. ఉత్తరాధి విషయానికి వస్తే, ఆప్, తృణమూల్ పార్టీలు ఎలాగూ థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేయొచ్చు. ఎలాగైనా రాజకీయ సమీకరణాలు మొదలు కావడం అన్నది ఒక శుభపరిణామం…అది కేసిఆర్ వల్లనే సాధ్యం.
రాష్ట్రాలను చిన్న చూపు చూడడం అన్నది జాతీయ స్ధాయి రాజకీయాలకు అలవాటు. అందులో ఉత్తర భారతంలో బలంగా వున్న జాతీయ పార్టీలు దక్షిణాధి రాష్ట్రాలను పెద్దగా పట్టించకోవన్న ఆరోపణలు ఇప్పటికే వున్నాయి. అందుకు కాంగ్రెస్, బిజేపి ఏం మినహాయింపు కాదు. కాకపోతే కాంగ్రెస్‌కు గతం నుంచైనా దక్షిణాదిలో బలం ఎక్కువే. కాని నాయకత్వం మాత్రం మొత్తం ఉత్తరాధిదే. ఇది కాంగ్రెస్‌లో వున్న ఏకైక అసంతృప్తి. ఇక బిజేపిలో మాత్రం మొత్తం ఉత్తరాధి పెత్తనమే. దక్షిణాదిలో అంత బలమైన నాయకుడు ఎవరూ లేరు. ఎదగనీయరు అన్న విమర్శలు బిజేపిలో వున్నాయి. గతంలో దక్షిణాది నుంచి బంగారు లక్ష్మణ్ అధ్యక్షుడిగా వుండడాన్ని సహించలేని ఉత్తరాధి నాయకత్వం ఆయనను తెహల్కా పేరుతో పార్టీ ఫండ్‌ను కూడా అవినీతిగా చిత్రీకరించి, దించేసింది. మనో వేధనకు గురిచేసింది. పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన బంగారు లక్ష్మణ్ చేసింది తప్పు కాదని తెలుసు. కాని ఆయనపై కక్షపెంచుకున్న కొంత మంది నేతలు చేసిన నిర్వాకం మూలంగానే ఆయన నిష్క్రమణం అలా జరిగిందని అంటుంటారు. అలాగే దక్షిణాదినుంచి మరో బలమైన నేతగా ఉన్నత స్ధాయికి ఎదిగిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కావాలనే ఉత్తరాధి నాయకత్వం పక్కనపెట్టిందన్న అసంతృప్తి దక్షిణాది రాజకీయ నాయకులకెంతోమందికి వుంది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా వుంటే దక్షిణాదికి ఇప్పటికే ఎంతో మేలు జరిగేనే మాట వుండనే వుంది. గత ప్రభుత్వ హయాంలో తొలి నాళ్లలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు అనేక నిధులు అందించిన సంగతి తెలిసిందే. పైగా తనదైన శైలిలో రాజకీయాలు చేసే వెంకయ్య నాయుడును మౌన ముని చేసేశారన్న మాటలు వింటూనే వుంటాం. ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగమే కావచ్చు. కాని కొన్ని ప్రాంతాల బలమైన వాయిస్ వినిపించకుండా చేయడం కూడ సరైంది కాదు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజేపిలు దక్షిణాదిపట్ల కొంత వివపక్షపూరితమైన రాజకీయాలు చేస్తారన్న అపవాదు మాత్రం వుండనే వుంది. కాంగ్రెస్ నుంచి దక్షిణాది ప్రధాన మంత్రిగా పని చేసిన మొదటి ప్రధాని పి.వి. నర్సింహారావుకు చివరి క్షణాలలో ఇచ్చిన మర్యాద ఏమిటో చూసిందే…అందరికీ తెలిసిందే. నాడు కాంగ్రెస్‌ను అందరూ దుమ్మెత్తిపోసింది. ఇప్పటికైనా కాంగ్రెస్‌లో మార్పు వస్తుందనే అనుకుంటున్నారు…థర్డ్ ఫ్రంట్‌తో కలిస్తే తప్ప కాంగ్రెస్‌కు కూడా భవిష్యత్తు లేదనే అనుకుంటున్నారు. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ముందగుడు ఎప్పుడు వేస్తారా! అని ఎదురుచూస్తున్నారు.