తుమ్మల నీ బలమెంత!

 

తుమ్మితే ఓడిపోయేంత!!

ఆనాడు ఎన్టీఆర్‌ కు ద్రోహం చేస్తివి.

ఇప్పుడు స్నేహనికి మచ్చ తెస్తివి.

తిన్నింటి వాసాలు లెక్కబెడితివి?

స్నేహానికి కేసిఆర్‌ విలువిస్తే, మిత్ర ద్రోహానికి పాల్పడితివి.

తెలంగాణ ఉద్యమంలో లేనే లేకపోతివి.

2014 తెలుగు దేశం నుంచి పోటీ చేసి ఓడిపోతివి.

అనారోగ్యం పాలైతే కేసిఆర్‌ కాపాడే.

ఓడిన నిన్ను తెచ్చి ఎమ్మెల్సిని చేసే.

తర్వాత మంత్రి పదవి ఇచ్చే.

పాలేరు నుంచి టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేసే.

2018 లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో కూడా ఓడిపోతివి.

బలమైన నాయకుడివే అయితే 2004 లో కూడా ఎందుకు ఓడితివి.

సత్తుపల్లి ప్రజలు నెత్తిన పెట్డుకుంటే పని చేయకపోతివి.

ఖమ్మం పారిపోయి పోటీ చేస్తివి.

ఖమ్మం ప్రజలు ఓడిస్తే రిటైర్‌ మెంటు తీసుకుంటా అంటివి.

బీఆర్‌ఎస్‌ దయతలిస్తే ఇంత కాలం రాజకీయంలో వుంటివి.

పదవులిచ్చి అందలమెక్కించినా ప్రజాభిమానం చూడగొనకపోతివి.

ఊపులో బిఆర్‌ఎస్‌ పార్టీ వున్నా ఒక్క ఓటుతోనైనా గెలవకపోతివి.

నమ్మకాన్ని వమ్ము చేస్తివి….స్నేహానికి ద్రోహం చేస్తివి.

హైదరబాద్‌,నేటిధాత్రి:

నమ్మిన వారికి సున్నం పెట్టుడు తుమ్మలకు ఆది నుంచి అలవాటే. ఆది నుంచి తుమ్మల నెరుపుతున్న రాజకీయం అదే. అది గమనించకనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా తుమ్మల విషయంలో తప్పటడుగు వేశారు. ఎవరికైనా జీవితంలో ఆత్మ విమర్శ అనేది వుండాలి. అది లేకపోతే ఎంత ఎత్తుకు ఎదిగినా వృధానే. ఎంత పేరు సంపాదించకున్నా గంగపాలే. ఎవరి వల్ల పేరు వచ్చిందో వారికే సున్నం పెట్టడం అన్నది తుమ్మల లాంటి వారికి వెన్నతోపెట్టిన విద్యే. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలో ముందుంటారు. నమ్మిన వారిని మోసం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ఎవరైనా ఎప్పుడైనా నట్టెట ముంచడానికి వెనుకా ముందు ఆలోచించరు. అసలు తుమ్మలకు ఖమ్మంలో వున్న బలమెంత? ఏం చూసుకొని తుమ్మల తన బలమైన నాయకుడు అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఎందుకంటే నిజంగా తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు. ఆ తదనంతరం ఇక రాజకీయాలకు దూరం కావాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణ రాజకీయాల్లో తనను ప్రజలు నమ్మకపోవచ్చు? అన్న మాట కూడా ఓ దశలో మాట్లాడాడు. భద్రాచల శ్రీరాముని సేవలో తరిస్తానంటూ వేదాంతం మాట్లాడాడు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కొంత కాలానికి అనారోగ్యం చెందారు. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్వయంగా ఆసుపత్రికి తుమ్మలను పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించారు. పైగా ఆయన కోలుకున్న తర్వాత శుభవార్త చెబుతానని చెప్పి ధైర్యం చెప్పారు. తుమ్మల కోలుకున్న తర్వాత ఆయనను మంత్రి పదవిలోకి తీసుకున్నాడు. అనంతరం ఎమ్మెల్సీ చేశాడు. అనుకోకుండా పాలేరుకు ఉప ఎన్నిక వస్తే, తుమ్మలను రంగంలోకి దింపి ముఖ్యమంత్రి కేసిఆర్‌ గెలిపించారు. ఇలా తుమ్మలకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణలో ఎవరికీ ఇవ్వనన్ని డబుల్‌ బెడ్‌ రూంలు తుమ్మలకే ఇచ్చాడు. తొలి డబుల్‌ బెడ్‌ రూంల అందజేసే కార్యక్రమానికి తుమ్మల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రకటనలకు కూడా అనుమతినిచ్చారు. నిజానికి అలాంటి కొత్త కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ హాజరు కావాలి. అయినా మిత్రుని కోసం, ఆయనకు పేరు కోసం తుమ్మలనే ముందుంచారు. అంతటి ప్రాధాన్యతనిచ్చారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. ఉప ఎన్నికలో 48వేల మెజార్టీతో గెలిచిన తుమ్మల, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించింది. కాని తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. అంటే అంతటి బిఆర్‌ఎస్‌ గాలిలో ఓడిన తుమ్మల ఇంకా తనకు అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరం. 2014లోనే తుమ్మల రాజకీయ జీవితానికి పుల్‌ స్టాప్‌ పడేది. కేవలం తుమ్మల స్నేహిడన్న కారణంతో అందలమెక్కిస్తే, తనకు అన్యాయం జరిగిందని తుమ్మల చెప్పడం హాస్యాస్పదం. నిజానికి తుమ్మల ఇలాంటి పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తోడుగా నిలబడాల్సిన సమయం. పార్టీకి అండగా వుండాల్సిన తరుణం. ఖమ్మంను బిఆర్‌ఎస్‌కు కంచుకోట చేయాల్సిన అసవరం. కాని వాటిని తుమ్మల విస్మరించారు. తన భవిష్యత్‌ రాజకీయం కోసం పార్టీ మారుతున్నారు. ఇలాంటి నీతి లేని నాయకులకు ప్రజలు కూడా గుణం పాఠం చెబుతారు.
సొంతంగా బలమైన నాయకుడే అయితే 1983లో ఎందుకు ఓడిపోయినట్లు. 2004లో ఎందుకు ఓడినట్లు. 2014లో ఎందుకు పరాజయం పాలైనట్లు.
తుమ్మల నిజంగానే తన రాజకీయ జీవితంలో ఓటమెరుగని నాయకుడు అంటే అది వేరే విషయం. కాని తెలుగుదేశం 1983లో టికెట్‌ ఇస్తే ఓడిపోయాడు. అయినా ఆనాడు ఎన్టీఆర్‌ మళ్లీ 1985లో టికెట్‌ ఇచ్చాడు. దాంతో ఎన్టీఆర్‌ గాలిలో గెలిచాడు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనా తుమ్మలకు ఎన్టీఆర్‌ మంత్రిని చేశారు. ఆ కృతజ్ఞత మర్చిపోయిన తుమ్మల 1994 తర్వాత జరిగిన పరిణామాలలో చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో సహకారం అందించారు. తర్వాత చంద్రబాబు కూడా ఎంతో ఆత్మీయంగానే చూసుకున్నారు. 1999లో కూడా మళ్లీ మంత్రి పదవి ఇచ్చారు. అలా రాజకీయ బిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వదిలే ప్రసక్తి లేదంటూ భీరాలు పలికారు. అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా, తెలంగాణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ తనకు బిఆర్‌ఎస్‌లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యాడు. అంతే కాదు 2018లో తన ఓటమికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కారణమంటూ పలుసార్లు చెప్పి, ఇప్పుడు అదే పొంగులేటి నేతృత్వంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్దపడడాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తారన్నది కూడా తుమ్మల మర్చిపోతున్నాడు.
పార్టీలను, నాయకులనే కాదు నియోజకవర్గాలకు కూడా తుమ్మల అన్యాయమే చేస్తూ వచ్చాడు.
తుమ్మలకు రాజకీయ జీవితం ఇచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. ఆయనను వరుసగా గెలిపిస్తూ వస్తున్నారు సత్తుపల్లి ప్రజలు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలిలో తుమ్మల ఓటమిపాలయ్యారు. నిజంగా ఖమ్మంలో పార్టీ అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వుంటూ ఓడిపోయారు. పదేళ్లు మంత్రిగా పనిచేసినా ప్రజలు గెలిపించలేదు. నిజంగా ఖమ్మం జిల్లాకు, ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడితే 2004 ఎన్నికల్లో తుమ్మల ఎందుకు ఓడిపోయినట్లు. అంటే తుమ్మల స్వతహాగా ఎప్పుడూ గెలిచిన పరిస్ధితి లేదు. తెలుగుదేశం పార్టీ గాలిలో గెలవడం తప్ప, నిజమైన ప్రజాబలంతో గెలవలేదు. పైగా 2018లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం తెలంగాణ వ్యాప్తంగా సాగితే, తుమ్మల ఓడిపోవడం అంటేనే ఆయన బలమెంతో? అర్ధం చేసుకోవచ్చు. సత్తుపల్లి ప్రజలు తుమ్మితే ఓడిపోయి ఖమ్మం పారిపోయిన తుమ్మల అక్కడి నుంచి తరిమితే పాలేరు దారి పట్టారు. అక్కడ కూడా ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ఇంకా నేను బలమైన నాయకుడిని అని తుమ్మల చెప్పుకోవడం విచిత్రం. ఆయన విడ్డూరం.
నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ తుమ్మల నాగేశ్వరరావుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు.
తనతోపాటు సుధీర్ఘ కాలంపాటు ఉద్యమ సహచరులై, మంత్రులైన వారికంటే కూడా తుమ్మలకు సీనియర్‌ నేతగా ఎంతో గౌరవం ఇచ్చారు. పార్టీలో మంత్రి కేటిఆర్‌తోపాటు, హరీష్‌రావు లాంటి వారికన్నా ఎక్కువ గుర్తింపు తుమ్మలకు కల్పించారు. అయినా అది తుమ్మల నిలుపుకోలేదు. తన ఓటమిని తానే కొని తెచ్చుకొని నీడనిచ్చిన బిఆర్‌ఎస్‌ను కాదనుకొని, అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కాదనుకొని వెళ్లి తుమ్మల సాధించేదేమీ లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. ఎందుకంటే తన జీవితాతంతం కాంగ్రెస్‌ని నిందిస్తూ రాజకీయం చేసిన తుమ్మల అదే కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడం అంటేనే పదవుల కోసం, రాజకీయం అవసరాల కోసం ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోవమే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!