
ఘన నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు
బోయినిపల్లి,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాపన్న గౌడ్ కు పూలమాలలు వేసి ఘన నివాలర్పించారు.
ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ
మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపన చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాదారు. పాపన్న విజయగాథను చరిత్ర మరిచిందని వాపోయారు. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందారులు, జాకిల్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడికి దక్కాల్సిన కీర్తి దక్కలేదని గుర్తుచేశారు. సామాన్యుడు కావడం వల్లే పాపన్న ప్రతిభ కాలగర్భంలో కలిసిపోతోందని ఆవేదన చెందారు. ఖిలాషాపూర్ కేంద్రంగా చేసుకొని మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనుడు సర్వాయి పాపన్న అని అన్నారు. ఒక సామాన్యుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని రాజ్యాధినేతలనే ఎదిరించిన ఘనత పాపన్న దక్కించుకున్నారని తెలిపారు. గోల్కొండ కోటపై విజయ బావుటా ఎగురవేసిన కీర్తిని చరిత్ర పుటల్లో లెక్కించడానికి వారికి చేతులు రాలేవని అన్నారు. పాపన్న ఆనవాళ్లు సాక్ష్యంగా నిలిచిన కోటలు, బురుజులు, శిథిలమైపోతున్నప్పటికీ పట్టించుకునే నాధుడు లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.