పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటి ధాత్రి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని ఈ రోజు పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో యస్ ఐ దీకొండ రమేష్ అద్వర్యoలో మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా మహిళ పోలీస్ సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యస్ ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా, విద్య, వైద్య ,పారిశ్రామిక, అంతరిక్ష ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమని అన్నారు.అన్ని రంగాల్లోనూ మహిళలదే పోటీ అని, వారికి ఎవరు సాటి రారని కీర్తించారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ, ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు.పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాల్లో, విధుల్లో వారితో సమానంగా మహిళలు పని చేయడం గొప్ప విషయం అని తెలిపారు. పురుషుల కన్నా మహిళకే పట్టుదల ఎక్కువ అని, కృషితో ఉద్యోగాలలో మరియు ఇతర రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతంగా ఆలోచించిన మహిళ తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉందని, ప్రత్యేకంగా పోలీస్ శాఖలో తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.మహిళా సాధికారత తోటే అభివృద్ధి సాధ్యం అని, ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలియజేశారు.
అనంతరం మహిళా పోలీస్ సిబ్బంది ప్రవల్లిక, రజిత, భారతిమ్మని సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏయస్ఐలు సుధాకర్, వీరస్వామి, రత్నాకర్, లక్ష్మి రాజం, హెచ్ సి కిషన్, శ్రీనివాస్, రాము, రాజేందర్, శివ శంకర్, రాజు, హరీష్, సతీష్ పాల్గొనారు.