మల్లన్న సన్నిధికి రాకుండానే సమీక్షలేల???
మల్లన్న భక్తులు కోరేది ఒక్కటే
సమీక్షలు కార్యాలయాల్లో కాదు…
మల్లన్న సన్నిధిలో జరగాలి.
సమస్యలు కాగితాల్లో కనిపించేవి కావు.కళ్లతో చూసి, కాళ్లతో నడిచి తెలుసుకోవాల్సినవి.
ఇలాంటి సమీక్ష పేషెంట్ దగ్గరికి రాకుండానే ఆపరేషన్ చేసినట్టే!
నేటి ధాత్రి అయినవోలు:-
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కేవలం ఒక జాతర కాదు,లక్షలాది భక్తుల విశ్వాసం, తరతరాల సంప్రదాయం, ఐనవోలు ప్రజల ఆత్మగౌరవం. అలాంటి మహత్తర పర్వదినాల నిర్వహణపై సమీక్షలు జరుగుతున్నాయంటే సంతోషించాల్సిందే. కానీ, సమీక్షల విధానం, స్థలం, ఉద్దేశం పైనే ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గత సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సమీక్షకు ప్రత్యక్షంగా హాజరు కాని మంత్రి,
ఈసారి కూడా మల్లన్న సన్నిధికి రాకుండానే,కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని జాతరపై సమీక్షలు నిర్వహించడం భక్తులను, ఐనవోలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గుడి చూడకుండా గుడి సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రాంగణం చూడకుండా ఏర్పాట్ల లోపాలు ఎలా అర్థమవుతాయి?భక్తుల రద్దీ, క్యూ లైన్ ఏర్పాట్లు, మౌలిక వసతులు ప్రత్యక్షంగా చూడకుండా నిర్ణయాలా?ఇది పేషెంట్ దగ్గరికి వెళ్లకుండానే ఎక్స్‌రే చూడకుండా, నొప్పి అడగకుండాఆపరేషన్ చేసినట్టే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐనవోలు మల్లన్న జాతరకు సంబంధించిన ట్రాఫిక్, భద్రత, తాగునీరు, మహిళలకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, వృద్ధుల సమస్యలు కాగితాల్లో కనిపించేవి కావు.కళ్లతో చూసి, కాళ్లతో నడిచితెలుసుకోవాల్సినవి. అయినా కూడా,గతం నుంచి ఇప్పటి వరకు మంత్రి మల్లన్న ఆలయాన్ని సందర్శించకుండారివ్యూలు మాత్రమే నిర్వహించడం భక్తుల విశ్వాసాన్ని లెక్కచేయనట్టేనా? అనే సందేహాలకు తావిస్తోంది.
అసలు ప్రశ్న ఒక్కటే —
ఇది దేవుడి జాతరా?
లేదా ఫైళ్లలో జరిగే ప్రభుత్వ కార్యక్రమమా???
కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్షలు అవసరమే.కానీ మల్లన్న సన్నిధిలో నిలబడి చేసే సమీక్షకు వచ్చే స్పష్టత, అనుభవం వేరు.మంత్రి ఒకసారి అయినా,ఐనవోలు మల్లన్న ఆలయ ప్రాంగణంలో అడుగుపెడితే
అక్కడి వాస్తవ పరిస్థితులు
ఏ ఫైల్ కన్నా బాగా మాట్లాడతాయి. లేకపోతే ఇలాంటి రివ్యూలుప్రజలకు కాదు,ఫోటోలకే పరిమితం అవుతాయనే విమర్శ తప్పదు.
