ఝరాసంగం ఎంపీడీవో పోస్ట్ భర్తీ చేసేది ఎప్పుడో..?
◆ -అభివృద్ధి పనులకు ఆటంకాలు
◆ -ఉపాధి హామీ పనులకు పర్యవేక్షణ కరువు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం,జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) పోస్టు ఖాళీ ఏర్పడడంతో ఆ పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు.ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో సుధాకర్ గత వారం క్రితమే బదిలీపై వెళ్లినప్పటికీ ఆస్థానంలో కొత్తగా ఎవరి నియమించలేదు.అయితే ఇక్కడి ఈవో పీఆర్డీకే తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ నూతన ఎంపీడీవో నియాకంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో సుధాకర్ను గత సంవత్సరం డిసెంబర్ 13న ఇక్కడ నియమించి 17 నెలల అనతి కాలంలోనే బదిలీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో ఎంపీడీవోలకు ఆప్షన్స్ ఇవ్వడంతో ఎంపీడీవో సుధాకర్ తన సొంత జిల్లా నల్గొండకు బదిలీపై వెళ్లారు.కానీ ఆయన స్థానంలో కొత్తవారిని నియమించకుండానే బదిలీ చేయడంతో ఇక్కడ ఎంపీడీవో పోస్టు ఖాళీగా ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.మండలంలో ఎంతో ప్రాధాన్యత గల మండల అభివృద్ధి అధికారి పోస్టునే భర్తీ చేయకుండా ప్రభుత్వం తత్సరం చేయడంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.ఎంపీడీవో లేక ఉపాధి హామీ పథకం పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు పర్యవేక్షణ కరువైంది.
అయితే ఎంపీడీవో పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తారోనని,కొత్తగా ఎవరు వస్తారోనని చాలామందికిఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం వెంటనే ఎంపీడీవో పోస్టును భర్తీ చేయాలని ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు,ప్రజలు కోరుతున్నారు.