అర్హులందరికీ సంక్షేమ పథకాలు…
కోరం కనకయ్య ఇల్లందు శాసన సభ్యులు…
నేటి ధాత్రి -గార్ల :-
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.బుధవారం మండల పరిధిలోని చిన్నకిష్ణాపురం గ్రామపంచాయతీ,దేశ్యతండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా పాలనాలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలు నిరంతర ప్రక్రియ అని, ఎవ్వరు ఆందోళన చెందకూడదని ప్రజలకు స్పష్టం చేశారు. అర్హులైన వారిని గుర్తించి అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన ప్రజల వద్దకే వెళ్లి వారి మేలు కోరుతూ సంక్షేమాన్ని అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, సంక్షేమ పథకాలను అమలు చేసే చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత పది ఏళ్లు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు.గత ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు గాని, రేషన్ కార్డులు గానీ ఇవ్వలేదని అన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
అనంతరం గార్ల పట్టణ శివారు కృష్ణా తార ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, తహసిల్దార్ శారద, ఎంపీడీవో మంగమ్మ, వ్యవసాయ అధికారి రామారావు, తెలంగాణ ఉద్యమకారులు భూక్య నాగేశ్వరరావు, శీలంశెట్టి ప్రవీణ్ కుమార్, మాలోతు సురేష్, మాజీ జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి, గుండా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాలోత్ వెంకట్ లాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు, గూగులోతు ఉమా భద్రు నాయక్, బాను చందర్ తదితరులు పాల్గొన్నారు.