ప్రత్యేక తరగతులు పేరిట నిబంధనల అతిక్రమణ
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులోని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాత్రి 7 గంటల వరకు ప్రత్యేక తరగతుల పేరిట నిబంధనలను అతిక్రమిస్తుందని మాదిగ స్టూడెంట్ ఫోరమ్ (ఎం ఎస్ ఎఫ్) జిల్లా అధ్యక్షులు వడ్లకొండ సంజయ్ మాదిగ అన్నారు.గురువారం ఆయన సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ప్రత్యేక తరగతులు రాత్రి వరకు నిర్వహిస్తూ తీవ్రమైన చలిలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ, అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.ప్రభుత్వము నిర్ణయించిన పరీక్ష ఫీజు రూ.125 కాగా,ఇష్టానుసారంగా పెద్ద మొత్తంలో ఆర్థిక దోపిడి చేస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలపై వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎమ్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
