‘‘గుట్కా’’ కింగ్‌ ‘‘హీరోలాల్‌’’ ఎవరు!?

`గుట్కా కంపులో గప్పుమంటున్న తెలంగాణ!

`సందు సందులో గుప్పుమంటున్న గుట్కా కంపు!

 

గుట్కా తిను..క్యాన్సర్‌ కొను!

`సందుసందున అమ్మకాలే!

`పట్టించుకుంటున్న నాధుడే లేడాయే!

`అరకొర దాడులు…అరెస్టులు!

`ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గుట్కా వ్యాపారులు!

`నిషేదిత గుట్కా, పొగాకు తయారీలు ఎలా వస్తున్నాయి?

`ఇంత విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నా కళ్లెందుకు మూసుకుంటున్నారు.

`పల్లెల్లో పదుల సంఖ్యలో క్యాన్సర్‌ బారిన పడుతున్నారు!

`రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ రోగులు?

`నిషేదిత గుట్కాలు యదేచ్చగా రాష్ట్రానికి ఎలా చేరుతున్నాయి!?

`జిల్లాలు, మండలాల వారిగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం?

నిత్యం కోట్ల రూపాయలలో గుట్కా, అంబర్‌ ఖైనీల అమ్మకాలు.

`అక్కడక్కడా పట్టుకుంటున్న వార్తలు.

`తెలంగాణ అంతటా విచ్చలవిడిగా అమ్మకాలు!

`గుట్కా తినొద్దని ప్రభుత్వ ప్రకటనలు.

`వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారాలు.

`మరో వైపు గుట్కా కంపనీలకు అనుమతులు!

దేశమంతటా నిషేధం.. తెలంగాణ విచ్చలవిడిగా అమ్మకం

కాన్సర్‌ మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ఒకప్పుడు ఎవరికైనా కాన్సర్‌ వచ్చిందంటే అదే పెద్ద వార్తగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు క్యాన్సర్‌ ఒక సాదాసీతా రోగమైపోయింది. కాని చికిత్సలేక ప్రాణాలను బలిగొంటోంది. అయినా ప్రభుత్వాలు మేలుకున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలు కాన్సర్‌ బారిన పడకుండా వుండాలంటూ వేల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు తయారు చేస్తున్నారు. విసృతంగా ప్రచారం చేస్తున్నారు. మీడియాలో, టెలివిజన్‌లలో, సినిమా ధియేటర్లలో నిత్యం కాన్సర్‌పై అవగాహన ప్రకటనలు విసృతంగా ప్రచారం చేస్తున్నారు. కాని కాన్సర్‌ కారకాలను అరికట్టడంలో ఎందుకు విఫలమౌతున్నారు? కాన్సర్‌ కారకాలను తయరు చేస్తున్న కంపనీలకు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు. మన దేశంలో క్యాన్సర్‌కు ప్రదాన కారకాలలో పొగాకు ఉత్పత్తుల పాత్ర పెద్దది. పొగాకు పంటలను పండుతూనే వుంటాయి. అటు గుట్కాల తయారీ జరుగుతూనే వుంటుంది. కాని మన దేశంలో గుట్కా నిషేదం. ఎలా జనం వద్దకు వస్తోంది. మన దేశంలో గుట్కా వ్యాపారం కొన్ని వేల కోట్లలో సాగుతోంది. నిత్యం దేశ వ్యాప్తంగా వందల కోట్లలో వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా మన తెలంగాణలో గుట్కా పూర్తిగా నిషేదం. కాని గుట్కా దొరకని ప్రాంతం లేదు. ప్రదేశం లేదు. పల్లె నుంచి పట్నం దాక ప్రతి చోట గుట్కా దొరుకుతూనే వుంది. జనం ప్రాణాలను హరిస్తూనేవుంది. అయినా ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఒక్క తెలంగాణలోనే రోజుకు సుమారు రూ.5 కోట్ల రూపాయల గుట్కా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా విచ్చలవిడిగా సాగుతోంది. పటిష్టమైన చెక్‌ పోస్టు వ్యవస్ధలున్నప్పటికీ గుట్కా వ్యాపారులు యదేఛ్చగా ఎలా సరుకును రవాణా చేస్తున్నారన్నది తేలాల్సి వుంది. బియ్యం అక్రమరవాణ, కలప అక్రమ రవాణ, ఆఖరుకు లిక్కర్‌ అక్రమ రవాణాలు కూడా అరికడుతున్నారు. కాని గుట్కా రవాణా మాత్రం ఎక్కడా ఆగినట్లు వార్తలు లేవు. పట్టుకున్నట్లు కూడా దాఖలాలు లేవు. కాని జిల్లాలకు చేరిన తర్వాత అక్కడక్కడ టాస్స్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించడం పట్టుకోవడం జరుగుతోంది. అయినా అది కూడా అంతంతమాత్రంగానే జరుగుతుండడంతో గుట్కాల అమ్మకాలు ఆగింది లేదు. ప్రభుత్వం నిశేదించిన గుట్కా, పాన్‌ మసాల, అంబర్‌ లాంటివి అధిక ధరలకు విక్రయిస్తూ అలా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. జనం జేబులకు చిల్లు పెట్టడమే కాదు, ప్రాణాలకు కూడా చిల్లులు పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు, ఇతర నగరాల్లో పాతుకుపోయిన కొంత మంది మార్వాడీ వ్యాపారులే ఈ వ్యాపారాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది పేర్లుకూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొద్ది సంవత్సరాలుగా కర్నాకట, రాజస్ధాన్‌, గుజరాత్‌లలో కంపనీలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రహస్యంగా గుట్కాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు కూడా సమాచారం. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు కూడా వున్నాయి. దీని వెనక హీరాలాల్‌ అనే వ్యక్తి వున్నట్లు కూడా తెలుస్తోంది. అతని నుంచి నగరంలోని అనేక మందికి సరఫరా సాగిస్తున్నట్లు సమచారం. ఇటీవల వరంగల్‌ నగర కేంద్రంలో సుమారు రూ.10లక్షల విలువైన గుట్కా పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో కూడా పెద్దఎత్తున కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. సుమారు రూ.76లక్షల రూపాయల విలువైన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను పోలీసులు ఆ మధ్య స్వాదీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేశారు. గుట్కాల మూలంగా ఎంత అనర్ధం జరుగుతుంతో అందరికీ తెలుసు. అయినా దాని వ్యాపారం మాత్రం ఎక్కడా ఆగడం లేదు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా గుట్కాలను నమిలేస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో యువత ఎక్కువగా గుట్కాలకు బానిసలౌతున్నారు. క్షణం పాటు గుట్కా నమలకుండా వుండలేని స్ధితిలోకి వెళ్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో కూడా నోట్లో గుట్కా వేసుకొనే పడుకుంటున్నవాళ్లున్నారు. ఆ గుట్కాల మూలంగా గొంతు క్యాన్సర్ల బారిన కొన్ని లక్షల మంది పడుతున్నారు. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా గుట్కా గప్పు కొడుతూనే వుంది. గుట్కా తినడం వల్ల వచ్చే అనర్ధాల గురించి ప్రచారం చేస్తున్నారు. కాని వాటిని అమ్మకాలను ఎందుకు ఆపలేకపోతున్నారు. ప్రతి కిరాణాషాపులోనూ యదేచ్చగా అమ్మకాలు సాగిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లపై ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారో గుట్కాల విషయంలోనూ అదికారులు అదే వైఖరి అనుసరిస్తున్నారు. ప్లాస్టిక్‌ను కాస్త ఎక్కువ కంట్రోల్‌ చేస్తున్నారే గాని, గుట్కాల అమ్మకాలను అరికట్టలేపోతున్నారు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు హడావుడి చేయడం తప్ప, పెద్దగా దాడులు చేస్తున్నది లేదు. అక్రమ గుట్కాల తరలింపు ఆగడం లేదు. వాటి అమ్మకాలను ఆపుతోంది లేదు. రోడ్ల మీద ఎక్కడ చూసినా గుట్కా రాయుళ్లు చించి పడేసిన ప్యాకెట్లు అడుగడునా దర్శనమిస్తూనేవుంటాయి. పాన్‌ షాపుల నుంచి చెత్త సేకరించే మున్సిపల్‌ వాహనాలలో కూడా ఆ ప్యాకెట్లు కనిపిస్తూనే వుంటాయి. అయినా అదికారులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదు. ఓ వైపు ప్రభుత్వాలు ఎంతో శ్రద్దతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే అదికార యంత్రాంగాలు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. నిజంగా తెలంగాణలోని అధికారులు తల్చుకుంటే ఒక్క గుట్కా పాకెట్‌ అయినా తెలంగాణలోకి రాగలుగుతుందా? అమ్మగలుగురా? బస్సులలో, రైళ్లలో, రద్దీ ప్రదేశాలలో గుట్కా నమిలే వాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు కూడా వున్నారు. అయినా చర్యలు తీసుకునేవారు లేరు. ఇటు మత్తు పదార్ధాలు, అటు గుట్కా లాంటి విష పదార్దాల వల్ల యువత ఎంతో నష్టపోతోంది. తెలంగాణలో ఈ గుట్కా వ్యాపారం ప్రముఖంగా సాగిస్తున్నవారిలో ముందు వరుసలో వున్న వాళ్లంత మార్కాడీలు కావడం వల్లనే అదికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి అనేక వార్తలు కూడా వస్తున్నాయి. అయినా పోలీసులు మాత్రం కదులుతున్నట్లు లేదు. రోడ్డు మీదకు వచ్చిన వాళ్లు ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పితేనే ప్రాణాలకు ప్రమాదమని వారిని శిక్షిస్తున్నారు. కాని కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న గుట్కా దొంగ వ్యాపారులను ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే వాటి వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏమీ లేదు. ప్రజలకు మేలు జరగదు. కేవలం వ్యాపారుల జేబులు నిండుతున్నాయి. వారి ఆస్ధులు కోట్లకు పెరుగుతున్నాయి. జిఎస్టీ లేని వ్యాపారం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారం ఇంత యదేచ్చగా సాగుతుంటే ఆపేదెవరు? అరికట్టేదెవరు? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నవారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి, పల్లెల దాకా నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేసుకొని, జనాన్ని క్యాన్సర్‌ బారిన పడేలా చేస్తున్నవారిని ఎవరు పట్టుకోవాలి? ఓ వైపు మత్తు పదార్ధాలు జాడ దొరుకుతూనే వుంది. అది కూడా పెద్దఎత్తున వ్యాపారంసాగుతూనే వుంది. అయితే అది అందరికీ అందుబాటులో వుండకపోవచ్చు. కాని గుట్కా అనేది ప్రతి సామాన్యుడికి అందుతోంది. మత్తుకు అలవాటు పడిన యువత దాన్ని నమిలి మింగేస్తుంది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. ప్రభుత్వం సీరియస్‌గానే వుంది. కాని అధికార గణమే అలసత్వమే కనిపిస్తోందని అంటున్నారు. గుట్కా వ్యాపారుల చైన్‌ నెట్‌ వర్క్‌పై త్వరలోనే మరిన్ని సమగ్రమైన కథనాలు మీ నేటిధాత్రిలో…వరుసగా…గుట్కాను తెలంగాణ నుంచి తరిమేసేదాకా నేటిధాత్రి అక్షర పోరాటం చేస్తుంది. గుట్కా రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version