గుండు పేలుతుంది.. గూడు చెదురుతోంది
బ్లాస్టింగ్ శబ్దాలతో.. నెర్రలు వాడుతున్న గృహాలు
మైనింగ్ పనులు నిలపాలని.. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రం శివారులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో క్వారీలో భారీ బ్లాస్టింగ్ నిర్వహించడంతో మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూకంపం వచ్చినట్టుగా భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ఇండ్లు ఊయల ఊగాయి. బ్లాస్టింగ్ తీవ్రతకు కొన్ని ఇండ్లు కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల ఇండ్ల గోడలకు పగుళ్లు వచ్చాయని, రోజురోజుకూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని వాపోయారు. హైదరాబాద్ నగరంలోని కాలుష్య సమస్యల నుంచి దూరంగా ప్రశాంత జీవనం కోసం బాలానగర్‌లో ఇళ్లు నిర్మించుకున్నామని.. ఇప్పుడు క్వారీ బ్లాస్టింగ్‌లతో ఇళ్లే ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ క్వారీ నుంచి ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళితో మండల కేంద్రంలో గాలి కాలుష్యం పెరిగిపోయిందని, శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో జరిగే భారీ బ్లాస్టింగ్‌లతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై శనివారం సర్పంచ్ గుమ్మల్ల వెంకటేశ్వర్, టి.పిసిసి సమన్వయకర్త దత్తాత్రేయ, వార్డు సభ్యులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. బ్లాస్టింగ్ శబ్దాలతో మండల కేంద్రంలోని ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారని బ్లాస్టింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.
