పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
• ప్రజల ధన, మాన ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
• పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం లో స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన…జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపియస్.
మహబూబాబాద్/ నేటి ధాత్రి
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… 21 అక్టోబర్ 1959 వ సంవత్సరం లో సి.ఆర్.పి.యఫ్ – ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన ఆర్మీ పై దొంగ దాడి చేసి 10 మందిని జవాన్ లను హతమార్చిందని, ఆ రోజు నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే) గా నిర్వహిస్తున్నం అన్నారు.
ఒక్కొక రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండేవి మన రాష్ట్రంలో గతంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఎంతో మంది జవాన్లను కోల్పోవడం జరిగిందని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్ మరియు అస్సాం వంటి కొన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలోనూ అనేక మంది జవాన్లను కోల్పోవడం జరిగిందన్నారు. జమ్ముకాశ్మీర్ లాంటి రాష్ట్రాలలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులతో ఎంతో మంది పోలీసులు, ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్ర మూకలను హతమార్చి, తమ తనువులను చాలించారని, ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అన్నారు. ఈ సంవత్సరంలో మన దేశంలో విధినిర్వహణలో 191-మంది జవాన్లు వీరమరణం పొందారని, ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 5- మంది ఉన్నారు. వీరమరణం పొందిన వారి ప్రాణత్యాగాలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు.
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే నేడు మనందరం సుఖ:సంతోషాలతో ఉండగలుగుతున్నాం అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడటం జరుగుతుందని, అలాంటి పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయం అన్నారు. గత జూన్ నెలలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిధిలాల క్రింద చిక్కుకు పోయిన మృతదేహాలను వెలికి తీసి, తమ ధైర్య సహసాలను చాటుకున్నారు అన్నారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలను ఉధ్యేశించి మాట్లాడుతూ.. వారి కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను చేకూరేలా, వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని అందించటమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు.
ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకై ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ.. పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. అమరవీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు తిరుపతి రావు, కృష్ణకిషోర్, గండ్రతి మోహన్, ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, సీఐలు, ఆర్.ఐలు ఎస్.ఐ అధికారులు సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.
