ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…
సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం,పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు ఆదివాసులు…
ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఆపాలి…
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి…
అడవి సంరక్షణ సవరణ బిల్లును వ్యతిరేకించాలి…
నేటి ధాత్రి-గార్ల:-
దశాబ్దాల కాలంలో అన్ని దేశాలు పరస్పర సహకారంతో మానవ హక్కులు, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేయాలని నిర్ణయించినప్పటికీ దేశవ్యాప్తంగా నేడు దీనికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ రాష్ట్ర ఫోరం నాయకులు జి. సక్రు అన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి పోరాట దినోత్సవం సందర్భంగా మంగళవారం చిన్నకిష్టాపురం, సత్యనారాయణపురం, గుంపెళ్ళగూడెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సక్రు మాట్లాడుతూ, ఈశాన్యభారతంలో,మధ్య భారతంలో సామ్రాజ్యవాద రూపంలో ఉన్న పాలకులు ఆదివాసులపై యుద్ధం ప్రకటించారని,భారతదేశ మూలవాసులైన ఆదివాసీలను అంతమొందించే చర్యలను చేపట్టారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానంపై విల్లు ఎక్కుపెట్టిన బీర్ షా ముండా, కొమురం భీమ్, రాంజీ గోండుల పోరాటాల ఫలితంగా నాడు రాజ్యాంగంలో ఐదు మరియు ఆరవ షెడ్యూల్ ఏర్పాటు అయితే నేడు ఈ చట్టాల ఊసే లేదని వీటిని నిర్వీర్యం చేయడానికి పాలకులు కొత్త చట్టాలను తీసుకువచ్చారని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో గిరిజన తెగల మధ్య విద్వేషాగ్ని రాజేషి అంతులేని అరాచకాలు కొనసాగిస్తుందని ఆయన అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగు దారులు అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మన చట్టాలను తూట్లు పొడుస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదివాసి వ్యతిరేక చర్యలను వ్యతిరేకించాలని ఇందులో భాగంగా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ను వాడవాడనా, గ్రామ,గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కవిత,ఇందిరా, భారతి, వెంకన్న,సైదులు, సాంబయ్య,ధర్మయ్య,రాధా తదితరులు పాల్గొన్నారు.