తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
– మే 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలి
– బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి శుక్రవారం పాత్రికేయ మిత్రులతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మే 10, 2026న తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పలు ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారని తెలిపారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. త్వరలో ఢిల్లీలో జరిగే సమావేశంలో తెలంగాణకు మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
రైల్వే రంగంలో తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 85,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పలు ప్రాజెక్టులు 90 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. మిగతా పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.
హైదరాబాద్ – యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, భూసేకరణ పూర్తికాగానే పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
అదేవిధంగా సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్ల నిధులను ఆమోదించడం తెలంగాణ గిరిజన సమాజానికి గొప్ప వరమని పేర్కొన్నారు.
చివరగా, మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు, మేధావులు, కార్యకర్తలు, యువత, విద్యావంతులు మరియు అన్ని వర్గాల ప్రజలను కోరారు. భారీ సంఖ్యలో సభకు హాజరై తెలంగాణ అభివృద్ధికి తమ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, జిల్లా ఉప అధ్యక్షులు శీలం రాజు, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు గజబింకర్ చందు, ఊరగొండ రాజు, ఎర్రం విజయ్, వంతడుపుల సుధాకర్, సారంపల్లి ఉపసర్పంచ్ సిరిసిల్ల వంశీ, సందేవేణి రాజు, సురేష్, వంగ అనిల్, భాను కుమార్, అరవింద్ పాల్గొన్నారు.
